అన్‌స్టాప బుల్
ABN, Publish Date - Jul 02 , 2024 | 01:58 AM
దేశీయ స్టాక్ మార్కెట్లో బుల్ జైత్రయాత్ర కొనసాగుతోంది. ఆసియా, ఐరోపా మార్కెట్ల సానుకూల సంకేతాలతో ఐటీ, బ్యాంకింగ్ రంగ షేర్లలో కొనుగోళ్లు పుంజుకోవడంతో...
సరికొత్త శిఖరాలకు సూచీలు.. 80,000 మైలురాయి దిశగా సెన్సెక్స్
మరో 443 పాయింట్లు పెరిగిన సూచీ
ఆల్‌టైం రికార్డు స్థాయికి బీఎస్‌ఈ స్మాల్‌క్యాప్, మిడ్‌క్యాప్ సూచీలు
రాణించిన ఐటీ, బ్యాంకింగ్ రంగ షేర్లు
రూ.443 లక్షల కోట్లకు మార్కెట్ సంపద
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లో బుల్ జైత్రయాత్ర కొనసాగుతోంది. ఆసియా, ఐరోపా మార్కెట్ల సానుకూల సంకేతాలతో ఐటీ, బ్యాంకింగ్ రంగ షేర్లలో కొనుగోళ్లు పుంజుకోవడంతో భారత ఈక్విటీ సూచీలు సోమవారం సరికొత్త ఉన్నత శిఖరాలను అధిరోహించాయి. సెన్సెక్స్ ఒక దశలో 528.27 పాయింట్లు ఎగబాకి 79,561 వద్ద ఆల్‌టైం ఇంట్రాడే రికార్డును నమోదు చేసింది. చివరికి 443.46 పాయింట్ల లాభంతో 79,476.19 వద్ద స్థిరపడింది. సూచీకిది సరికొత్త జీవితకాల గరిష్ఠ ముగింపు కూడా. నిఫ్టీ సైతం 131.35 పాయింట్ల వృద్ధితో సరికొత్త ఆల్‌టైం గరిష్ఠ స్థాయి 24,141.95 వద్ద ముగిసింది. అమెరికాలో ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టడంతో ఆ దేశ సెంట్రల్ బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ ఈ సెప్టెంబరులోనే ప్రామాణిక వడ్డీ రేట్ల తగ్గింపునకు శ్రీకారం చుట్టవచ్చన్న ఆశలు ప్రపంచ మార్కెట్‌లో ట్రేడింగ్ సెంటిమెంట్‌ను మెరుగుపరిచాయని విశ్లేషకులు పేర్కొన్నారు. మరిన్ని ముఖ్యాంశాలు..
ఈక్విటీ ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎ్‌సఈ నమోదిత కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ దాదాపు రూ.3.9 లక్షల కోట్లు పెరిగి సరికొత్త రికార్డు గరిష్ఠ స్థాయి రూ.443.05 లక్షల కోట్లకు (5.31 లక్షల కోట్ల డాలర్లు) చేరుకుంది.
సెన్సెక్స్‌లోని 30 లిస్టెడ్ కంపెనీల్లో 20 లాభపడ్డాయి. టెక్ మహీంద్రా షేరు 2.98 శాతం వృద్ధితో సూచీ టాప్ గెయినర్‌గా నిలిచింది. బజాజ్ ఫైనాన్స్, అలా్ట్రటెక్ సిమెంట్ కూడా రెండు శాతానికి పైగా పెరిగాయి. టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ ఒక శాతానికి పైగా రాణించాయి. ఎన్‌టీపీసీ షేరు అత్యధికంగా 2.23 శాతం క్షీణించింది.
బ్లూచి్‌పలతో పోలిస్తే, చిన్న, మధ్య స్థాయి కంపెనీల షేర్ల లో జోరుగా కొనుగోళ్లు జరిగాయి. దాంతో బీఎ్‌సఈ స్మాల్‌క్యాప్, మిడ్‌క్యాప్ సూచీలు సరికొత్త రికార్డు గరిష్ఠాలను తాకాయి. స్మాల్‌క్యాప్ సూచీ 1.58 శాతం, మిడ్‌క్యాప్ ఇండెక్స్ 1.11 శాతం వృద్ధిని నమోదు చేశాయి.
రంగాలవారీ సూచీల్లో ఐటీ అత్యధికంగా 1.84 శాతం వృద్ధి చెందగా.. టెక్నాలజీ, కమోడిటీస్, టెలికాం కూడా ఒక శాతానికి పైగా పెరిగాయి.
ఫారెక్స్ మార్కెట్ విషయానికొస్తే, డాలర్‌తో రూపాయి మారకం విలువ 10 పైసలు క్షీణించి 83.44 వద్ద ముగిసింది. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్ ముడిచమురు పీపా ధర ఒకదశలో 0.51ు పెరిగి 85.43 డాలర్ల వద్ద ట్రేడైంది.
ఐపీఓకు నివ బుపా హెల్త్ ఇన్సూరెన్స్
నివ బుపా హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (గతంలో మ్యాక్స్ బుపా హెల్త్ ఇన్సూరెన్స్) పబ్లిక్ ఇష్యూ (ఐపీఓ)కు రానుంది. ఇందుకు అనుమతి కోరుతూ సెబీకి ప్రాథమిక ముసాయిదా పత్రాలు (డీఆర్‌హెచ్‌పీ) సమర్పించింది. ఐపీఓలో భాగంగా కంపెనీ రూ.800 కోట్ల తాజా ఈక్విటీ జారీతో పాటు ప్రస్తుత ప్రమోటర్లు, ఇన్వెస్టర్లకు చెందిన రూ.2,200 కోట్ల షేర్లను ఆఫర్ సేల్ పద్ధతిన విక్రయించనుంది. తద్వారా కంపెనీ మొత్తం రూ.3,000 కోట్లు సమీకరించనుంది.
పిల్లల వస్త్రాలను విక్రయించే ఆన్‌లైన్ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫస్ట్‌క్రై మాతృసంస్థ బ్రెయిన్‌బీ్‌స సొల్యూషన్స్ లిమిటెడ్ ఐపీఓకు సెబీ ఆమోదం తెలిపింది. ఐపీఓలో భాగంగా కంపెనీ రూ.1,816 కోట్ల తాజా ఈక్విటీ జారీతో పాటు ప్రస్తుత వాటాదారులకు చెందిన 5.44 కోట్ల షేర్లను ఆఫర్ ఫర్ సేల్ పద్ధతిన విక్రయించాలనుకుంటోంది.
ప్రెసిషన్ ఇంజనీరింగ్ సేవల కంపెనీ శివాలిక్ ఇంజనీరింగ్ ఇండస్ట్రీస్ ఐపీఓకు వచ్చేందుకు సెబీకి డీఆర్‌హెచ్‌పీ సమర్పించింది. ఐపీఓ ద్వారా కంపెనీ రూ.335 కోట్ల తాజా ఈక్విటీ జారీతో పాటు ప్రస్తుత ప్రమోటర్లు, వాటాదారులకు చెందిన 41.3 లక్షల ఈక్విటీ షేర్లను విక్రయించనుంది.
టెక్నాలజీ ఆధారిత సేవలందించే సజిలిటీ ఇండియా లిమిటెడ్ సైతం సెబీకి ఐపీఓ పత్రాలు సమర్పించింది. బెంగళూరుకు చెందిన ఈ కంపెనీ ఐపీఓ ద్వారా ప్రమోటర్‌కు చెందిన 98.44 కోట్ల షేర్లను ఆఫర్ ఫర్ సేల్ పద్ధతిన విక్రయించాలని భావిస్తోంది.
మురుగు శుద్ధి ప్లాంట్లు, ప్రాజెక్టులను టర్న్‌కీ పద్ధతిన అభివృద్ధి చేసే ఎన్విరో ఇన్‌ఫ్రా ఇంజనీర్స్ కూడా సెబీ వద్ద డీఆర్‌హెచ్‌పీ ఫైల్ చేసింది. ఐపీఓ ద్వారా సంస్థ 4.42 కోట్ల తాజా ఈక్విటీ జారీతో పాటు ప్రమోటర్‌కు చెందిన 52.68 లక్షల షేర్లను కూడా అమ్మకానికి పెట్టనుంది.
ఆగ్రోకెమికల్స్ తయారీదారు అంబే ల్యాబ్స్ ఐపీఓ ఈ నెల 4న ప్రారంభమై 8న ముగియనుంది. ఐపీఓ ధరల శ్రేణిని కంపెనీ రూ.65-68గా నిర్ణయించింది. పబ్లిక్ ఇష్యూ ద్వారా కంపెనీ రూ.44.68 కోట్ల వరకు సమీకరించే అవకాశం ఉంది. ఐపీఓ అనంతరం కంపెనీ షేర్లను ఎన్‌ఎ్‌సఈ ఎమర్జ్ ప్లాట్‌ఫామ్‌లో లిస్ట్ చేయనుంది.
Updated Date - Jul 02 , 2024 | 01:58 AM