Paytm: పేటీఎం యూపీఐ సేవల విషయంలో కీలక నిర్ణయం.. ఎన్‌పీసీఐ సహాయం కోరిన ఆర్బీఐ!
ABN, Publish Date - Feb 23 , 2024 | 05:47 PM
పేటీఎం యూపీఐ సేవల విషయంలో సహాయం చేయాల్సిందిగా నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI)ను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుక్రవారం కోరింది.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆంక్షల నేపథ్యంలో పేటీఏం (Paytm) భవితవ్యంపై నీలి నీడలు కమ్ముకున్నాయి. మార్చి 15, 2024 తర్వాత పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ (Paytm Payments Bank) అకౌంట్, వ్యాలెట్ కొత్త డిపాజిట్లను స్వీకరించకుండా, క్రెడిట్ లావాదేవీలను అనుమతించకుండా నిషేధాన్ని విధిస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌పై నిషేధం కారణంగా పేటీఎంతో లింక్ అయిన యూపీఐ (UPI) సర్వీసులు పనిచేస్తాయా లేదా? అనే గందరగోళం నెలకొంది.
పేటీఎం యూపీఐ సేవల విషయంలో సహాయం చేయాల్సిందిగా నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI)ను ఆర్బీఐ శుక్రవారం కోరింది. పేటీఎం యాప్ యూపీఐ కార్యకలాపాలను కొనసాగించడానికి థర్డ్ పార్టీ అప్లికేషన్ ప్రొవైడర్‌గా మారే అవకాశాన్ని పరిశీలించాల్సిందిగా ఎన్‌పీసీఐని ఆర్బీఐ కోరింది. పేటీఎం మాతృసంస్థ అయిన వన్97 కమ్యూనికేషన్ లిమిటెడ్ (OCL) ద్వారా ఈ అభ్యర్థన చేసినట్లు ఆర్బీఐ తెలిపింది. పేటీఎం యాప్ కార్యకలాపాలను కొనసాగించడానికి, 4-5 బ్యాంకులకు పేటీఎం హ్యాండిల్స్‌ను సులభతరం చేయడానికి యూపీఐ ఛానెల్‌ని ఉపయోగించడాన్ని పరిశీలించాలని కోరింది.
పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ జారీ చేసిన కార్డ్‌ని మార్చి 15, 2024 తర్వాత రీఛార్జ్ చేయలేరు. అలాగే అకౌంట్లలో డబ్బును క్రెడిట్ చేయలేరు. అయితే ఇప్పటికే అకౌంట్లలో ఉన్న మొత్తాన్ని వాడుకోవచ్చు. గడువు తర్వాత కూడా ఖాతా నుంచి డబ్బును తీసుకోవచ్చు. కాగా, పేటీఎంపై ఆర్బీఐ విధించిన నిషేధం కారణంగా ఆ సంస్థ షేర్లు దారుణంగా పడిపోయాయి.
Updated Date - Feb 23 , 2024 | 06:31 PM