ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

జీఎస్‌టీలో ఫారమ్‌ డీఆర్‌సీ-03ఏ అంటే..?

ABN, Publish Date - Nov 10 , 2024 | 01:51 AM

మహిమ ఇండస్ట్రీస్‌ తయారీ రంగంలో ఉన్న కంపెనీ. కొన్ని ఉల్లంఘనలకు సంబంధించి సదరు కంపెనీకి డిపార్ట్‌మెంట్‌ ఒక నోటీస్‌ ఇవ్వటం జరిగింది. దీని ఆధారంగా రూ.లక్షకు గాను ఆర్డర్‌ జారీ చేశారు. దీంతోపాటుగా వడ్డీ, పెనాల్టీ కట్టాల్సిందిగా అదే ఆర్డర్‌లో...

మహిమ ఇండస్ట్రీస్‌ తయారీ రంగంలో ఉన్న కంపెనీ. కొన్ని ఉల్లంఘనలకు సంబంధించి సదరు కంపెనీకి డిపార్ట్‌మెంట్‌ ఒక నోటీస్‌ ఇవ్వటం జరిగింది. దీని ఆధారంగా రూ.లక్షకు గాను ఆర్డర్‌ జారీ చేశారు. దీంతోపాటుగా వడ్డీ, పెనాల్టీ కట్టాల్సిందిగా అదే ఆర్డర్‌లో ఇవ్వటం జరిగింది. ఇప్పుడు మహిమ ఇండస్ట్రీస్‌ ముందు రెండు దారులు ఉన్నాయి. ఒకటి ఆర్డర్‌లో ఉన్న మొత్తం ప్రభుత్వానికి చెల్లించటం కాగా, రెండోది ఆ ఆర్డర్‌ను సవాల్‌ చేస్తూ అప్పీల్‌ దాఖలు చేయటం. అయితే, కంపెనీ ఆడిటర్‌ సల హా మేరకు అప్పీల్‌ చేయకుండా ఆర్డర్‌లో మొత్తాన్ని డీఆర్‌సీ-03 ద్వారా చెల్లించింది. కొంతకాలం తర్వాత జీఎస్‌టీ పోర్టల్‌ (కామన్‌ పోర్టల్‌)లో చూస్తే ఇంకా రూ.లక్ష.. వడ్డీ, జరిమానాతో సహా బాకీ ఉన్నట్లుగా తన లయబిలిటీ లెడ్జర్‌లో కనబడింది. తాము చెల్లించాల్సిన మొత్తం చెల్లించిన తర్వాత కూడా ఇంకా బకాయి ఉండటం ఏమిటి?


ఇది అర్ధం చేసుకోవటానికి ముందుగా అసలు డీఆర్‌సీ-03 అంటే ఏమిటి? దీన్ని ఎప్పుడు ఉపయోగించాలి? వివరాలు మీకోసం. ఒక పన్ను చెల్లింపుదారుడు, తాను చెల్లించాల్సిన పన్నును ఎప్పటికప్పుడు రిటర్న్‌ దాఖలు చేయటం ద్వారా చేయాలి. ఇది అందరికీ తెలిసిందే. అలాకాకుండా, తాను అప్పటి వరకు కట్టాల్సిన దాని కంటే తక్కువ కట్టినట్లు భావిస్తే ఆ తేడా మొత్తాన్ని డీఆర్‌సీ-03 ద్వారా చెల్లించాలి. ఉదాహరణకు ఒక వ్యక్తి 18 శాతం పన్ను కట్టాల్సి ఉండగా అవగాహనా లోపంతో లేదా ఏదేనీ కారణంతో తక్కువ పన్ను అంటే 12 శాతమో, 5 శాతమో కట్టారనుకుందాం. ఈ తేడాను కొంతకాలం తర్వాత తమంతట తామో లేదా డిపార్ట్‌మెంట్‌ ఆడిట్‌ లేదా స్ర్కూటినీ ద్వారా తెలిసినప్పుడు ఆ మొత్తాన్ని డీఆర్‌సీ-03 చెల్లించాలి. అంటే రిటర్న్‌లో చూపిన మొత్తాన్ని కాకుండా ప్రభుత్వానికి అదనంగా చెల్లించాల్సింది ఏమైనా ఉంటే ఆ మొత్తాన్ని డీఆర్‌సీ-03 ద్వారా కట్టాల్సి ఉంటుంది.


అయితే, నోటీస్‌ ఇచ్చి ఆర్డర్‌ ద్వారా డిమాండ్‌ చేసిన మొత్తం ఏమైనా ఉంటే డీఆర్‌సీ-03 ద్వారా కాకుండా కామన్‌ పోర్టల్‌లో సంబంధిత డిమాండ్‌ దగ్గర క్లిక్‌ చేసి అందులోని సూచనల మేరకు చెల్లించాలి. అప్పుడు మాత్రమే ఆ బకాయి మొత్తం చెల్లించినట్లుగా పరిగణించి సిస్టమ్‌ పెండింగ్‌ బకాయిని సున్నాగా చూపిస్తుంది. ఇక్కడ మహిమ ఇండస్ట్రీస్‌ చేసిన పొరపాటు ఏమిటంటే.. కామన్‌ పోర్టల్‌లో బకాయి సెక్షన్‌లోకి వెళ్లి చెల్లించే బదులుగా డీఆర్‌సీ-03 ద్వారా పన్ను చెల్లించారు. దీనివల్ల సిస్టమ్‌ లో ఆ మేరకు సర్దుబాటు జరగలేదు. దీన్ని సరిదిద్దటానికి అధికారుల దగ్గర కూడా ఎలాంటి అవకాశం లేదు. ఈ ఇబ్బంది ఒక్క మహిమ ఇండస్ట్రీ్‌సకు మాత్రమే కాదు. చాలా మంది పన్ను చెల్లింపుదారులు ఎదుర్కొంటున్నారు. ఈ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఇటీవల డీఆర్‌సీ-03ఏ ఫారమ్‌ ప్రవేశపెట్టింది.


ఈ డీఆర్‌సీ-03ఏ అనేది ఇప్పటి వరకు తాము డీఆర్‌సీ-03 ద్వారా చెల్లించిన మొత్తాన్ని పెండింగ్‌ బకాయితో సర్దుబాటు చేసుకోవటానికి ఉపయోగపడుతుంది. ఈ విధంగా సర్దుబాటు చేయటానికి తొలుత కామన్‌ పోర్టల్‌లోకి లాగిన్‌ అయ్యి వరుసగా ‘సర్వీసెస్‌’, ‘యూజర్‌ సర్వీసెస్‌’, ‘మై అప్లికేషన్స్‌’, ఫారమ్‌ జీఎ్‌సటీ డీఆర్‌సీ-03ఏ క్లిక్‌ చేసి తాము ఏ డీఆర్‌సీ-03 ద్వారా పన్ను చెల్లించారో దాని వివరాలు.. సర్దుబాటు చేయాల్సిన వివరాలు, సర్దుబాటు చేయాల్సిన మొత్తం తదితర వివరాలు దాఖలు చేయటం ద్వారా ఇంతకుముందు డీఆర్‌సీ-03తో చెల్లించిన మొత్తాన్ని సర్దుబాటు చేయవచ్చు. అయితే ఇక్కడ కింది విషయాలు గుర్తు పెట్టుకోవాలి.


ఒక్క డీఆర్‌సీ-03 ద్వారా చెల్లించిన మొత్తాన్ని ఒకటి కంటే ఎక్కువ ఆర్డర్స్‌కు లేదా ఒకటి కంటే ఎక్కువ డీఆర్‌సీ-03 లను ఒక్క ఆర్డర్‌కు వాడవచ్చు. అయితే ప్రతి డీఆర్‌సీ-03కి ఒక్కొక్క డీఆర్‌సీ-03ఏ వాడాలి. ఆర్డర్‌లోని బకాయు కోసం కాకుండా వేరే నిమిత్తం చెల్లించిన డీఆర్‌సీ-03లోని మొత్తాన్ని ఆర్డర్‌లోని బకాయి కోసం ఉపయోగించకూడదు. అంటే, ఉదాహరణకు ఆడిట్‌ జరిగే సమయంలో ఒక వ్యక్తి రూ.2 లక్షలు పన్ను తక్కువ కట్టినట్లుగా గుర్తించారనుకుందాం. ఆడిట్‌ జరిగే సమయంలోనే సదరు వ్యక్తి రూ.లక్ష డీఆర్‌సీ-03 ద్వారా చెల్లించాడు. ఆ మొత్తాన్ని ఆర్డర్‌లో సర్దుబాటు చేసి మిగతా రూ.లక్షకు ఆర్డర్‌ ఇచ్చారనుకుందాం. ఇప్పుడు మొదట చెల్లించిన రూ.లక్షను బకాయి ఉన్న రూ.లక్షకు సర్దుబాటు చేయకూడదు. ఎందుకంటే రూ.లక్ష... అధికారులే సర్దుబాటు చేసి ఆర్డర్‌ ఇచ్చారు కాబట్టి.

రాంబాబు గొండాల

గమనిక: కేవలం అవగాహన కల్పించటం కోసం మాత్రమే ఇందులో కొన్ని ముఖ్య విషయాలను ప్రస్తావించటం జరిగింది. పూర్తి వివరాలకు సంబంధిత చట్టాలను క్షుణ్ణంగా పరిశీలించాలి.

Updated Date - Nov 10 , 2024 | 01:51 AM