Hyderabad: సెల్‌ఫోన్ కోసం రైల్వేస్టేషన్‌లో ఉన్న ప్రయాణికుడిని పొడిచి చంపేశాడు..
ABN, Publish Date - Jan 12 , 2024 | 11:05 AM
సెల్‌ఫోన్ కోసం రైల్వేస్టేషన్‌లో ఉన్న ప్రయాణికుడిని పొడిచి పారిపోయాడు. జల్సాల కోసం ఆ ఫోన్‌ను రూ.1,700కు విక్రయించి సొమ్ము చేసుకున్నాడు. గాయాలపాలైన బాధితుడు స్టేషన్‌లోనే ప్రాణాలు వదిలాడు.
సికింద్రాబాద్, (ఆంధ్రజ్యోతి): సెల్‌ఫోన్ కోసం రైల్వేస్టేషన్‌లో ఉన్న ప్రయాణికుడిని పొడిచి పారిపోయాడు. జల్సాల కోసం ఆ ఫోన్‌ను రూ.1,700కు విక్రయించి సొమ్ము చేసుకున్నాడు. గాయాలపాలైన బాధితుడు స్టేషన్‌లోనే ప్రాణాలు వదిలాడు. ఈ కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. గురువారం సికింద్రాబాద్ రైల్వే ఎస్పీ కార్యాలయంలో అదనపు డీజీపీ మహేష్ భగవత్, రైల్వే ఎస్పీ సలీమా వివరాలు వెల్లడించారు. మూడు రోజుల క్రితం మలక్‌పేట్ రైల్వేస్టేషన్‌లో వ్యక్తి చనిపోయి ఉన్నాడని సమాచారం అందుకున్న కాచిగూడ రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. చాదర్‌ఘాట్ ఆజంపుర చమాన్‌కు చెందిన సోహెల్(24) హత్య చేసినట్లు గుర్తించారు. నిందితుడిని యాకుత్‌పురలో అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. నిందితుడిపై జీఆర్‌పీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఐదు కేసులు ఉన్నాయి. కేసును ఛేదించిన కాచిగూడ జీఆర్‌పీ పోలీసులను మహేష్ భగవత్ అభినందించారు. నగదు రివార్డులను అందజేశారు.
హత్య జరిగింది ఇలా..
మలక్‌పేట్ రైల్వేస్టేషన్‌లో గుర్తు తెలియని 35 ఏళ్ల ప్రయాణికుడు నిలబడి ఉండగా, అదే సమయంలో సోహెల్ వచ్చి అతడి సెల్‌ఫోన్ లాక్కెళ్లేందుకు ప్రయత్నించాడు. ఇద్దరి మధ్య జరిగిన గొడవ కారణంగా సోహెల్ కత్తితో గాయపరిచి సెల్‌ఫోన్‌ను లాక్కెళ్లి పారిపోయాడు. కత్తిపోటుకు గురైన ఆ వ్యక్తి కింద పడిపోయి చనిపోయాడు. సెల్‌ఫోన్ కాజేసి పారిపోయానని ఇలా జరుగుతుందని అనుకోలేదని నిందితుడు సోహెల్ మీడియా సమావేశంలో తెలిపారు. కాజేసిన సెల్‌ఫోన్‌ను ఇంబ్లిబస్టాండ్‌లో రూ.1,700కు విక్రయించినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. జల్సాలకు అలవాటు పడ్డ ఇతడిపై చాదర్‌ఘాట్, మీర్‌చౌక్, షాయినాజ్‌గంజ్ పోలీస్ స్టేషన్‌లో పలు కేసులు ఉన్నాయి. 13 నెలలు జైల్లో ఉండి వారం రోజుల క్రితం బెయిల్‌పై విడుదలయ్యాడని మహేష్ భగవత్ తెలిపారు.
Updated Date - Jan 12 , 2024 | 11:05 AM