Diwali 2024: దీపావళికి స్వస్తిక్ గుర్తు వేయడం వెనుక ఇంత స్టోరీ ఉందా..
ABN, Publish Date - Oct 28 , 2024 | 02:18 PM
దీపావళికి చేసే లక్ష్మీ పూజలో ఎంతో పవిత్రమైనదిగా భావించి శుభ్, లాభ్, స్వస్తిక్ గుర్తులను వేస్తుంటారు. అసలు ఈ ఆచారం వెనుక అసలు కథ ఏంటి.. డబ్బులకు ఈ గుర్తులకు ఉన్న సంబంధం ఏంటంటే..
హిందువులు ఎంతో పవిత్రంగా జరుపుకునే దీపావళి నాడు లక్ష్మీ పూజ ఎంతో ప్రత్యేకం. ఒక్కో ప్రాంతంలో ఒక్కో ఆచారం, సంప్రదాయం ప్రకారం ఈ పండుగను జరుపుకుంటారు. ఆరోజు పూజ గదితో పాటు ఇంటిని కూడా పువ్వులు, దీపాలతో అందంగా అలంకరించుకోవడానికి ఇష్టపడుతుంటారు. గుమ్మానికి ఇరువైపులా స్వస్తిక్ ముద్ర వేసి శుభ్, లాభ్ అనే చిహ్నాలను పసుపు, గంధం, కుంకుమలతో గీస్తుంటారు. మరికొందరు అమ్మవారి పాద ముద్రలను వేస్తుంటారు. అయితే, ఈ ఆచారం వెనుక పెద్ద స్టోరీనే ఉంది.
డబ్బులు నిలవాలంటే..
ఈ గుర్తులు వేసి లక్ష్మీ దేవిని ఇంట్లోకి ఆహ్వానం పలుకుతున్నట్టుగా భావిస్తారు. ఇళ్లలోనే కాకుండా, శుభకార్యాలు, వ్యాపార స్థలం, కార్యాలయాల్లో కూడా లక్ష్మీ పూజలో ఇదే విధంగా అలంకరణ చేస్తుంటారు. విఘ్నాలను తొలగించే వినాయకుడికి, ఐశ్వర్య ప్రాప్తిని, శుభాలను కలుగజేసే అమ్మవారికి ఈ చిహ్నాలు ప్రతిరూపాలు. స్వస్తిక్ గుర్తును అదృష్టాన్ని మోసుకొచ్చేదిగా భావిస్తారు. గణేషుడి కుమారులే శుభం, లాభంగా చెప్తారు. ఈ చిహ్నాలను ఇంటి ముందు ఉంచడం ద్వారా సిరి సంపదలు, విజయం, శ్రేయస్సు కలుగుతాయని చెప్తారు. ఇవి ఉన్న చోట సానుకూల వాతావరణం ఏర్పడుతుందని, డబ్బు స్థిరంగా ఉంటుందని అంటారు.
ఈ తప్పులు చేయకండి..
శుభ్, లాభ్ చిహ్నాలను వేయడం వల్ల అమ్మవారితో పాటు వినాయకుడి అనుగ్రహం కూడా కలుగుతుందనేది అనాదిగా వస్తున్న నమ్మకం. ఈ రెండు చిహ్నాలను ఎల్లప్పుడూ పక్కపక్కనే రాయాలి. ఒకే సైజులో ఉండేలా చూసుకోవాలి. వీటిని రాయడానికి ఉంగరం వేలు ఉపయోగించడం మంచిది.
స్వస్తిక్ గుర్తును కొందరు తెలియక అపసవ్య దిశలో గీస్తుంటారు. స్వస్తిక్ లోని నాలుగు కోణాలు మానవ ఉనికికి మూల స్తంభాలైన మోక్షం, కామం, అర్థం, ధర్మం అనే నాలుగు విషయాలను సూచిస్తాయని హిందువులు నమ్ముతారు. పూజ గది, క్యాష్ కౌంటర్, అకౌంట్ పుస్తకాలు, బీరువా, లాకర్లు ఉండే చోట వీటిని శుభానికి గుర్తుగా రాయొచ్చు.
ఒక పసుపు రంగు కాగితం మీద దానిమ్మ బెరడుతో తయారు చేసిన పెన్నుతో ఈ మూడు చిహ్నాలు రాసి డబ్బులు దాచుకునే చోట, లాకర్లలో ఈ పేపర్ ను ఉంచడం ద్వారా ధనాదాయం పెరుగుతందని కొందరి విశ్వాసం. పసుపుతో చేసిన స్వస్తిక్ శుభాలను కలుగజేస్తుందని ప్రతీతి.
లక్ష్మీ దేవి పాద ముద్రలను వేసేందుకు బియ్యం పిండిని గానీ, పారాణి రంగును గానీ ఉపయోగించాలి. పాదాలను ఎప్పుడు లోపలికి అడుగులు వేస్తున్న దిశలో వేయాలి. బయటకు వెళ్తున్నట్టుగా వేయడం వల్ల లక్ష్మిని బయటకు పంపుతున్న అర్థం వస్తుంది.
దీపావళి జరుపుకోవడానికి ఒక్కో ప్రాంతంలో ఒక్కో కారణం.. ఆశ్చకరమైన నిజాలు ఇవే
Updated Date - Oct 28 , 2024 | 02:20 PM