జగమేలే... జగన్నాథుడు
ABN, Publish Date - Dec 08 , 2024 | 11:59 AM
సర్వం జగన్నాథం... అంటారు కదా... నిజమే... ఏ గుడిలో లేనన్ని విశేషాలు పూరీ జగన్నాథ్ ఆలయంలో కనిపిస్తాయి. మూడు రోజుల యాత్రలో (పూరీ, కోణార్క్, భువనేశ్వర్) భాగంగా నేను నా భార్య, కూతురుతో కలిసి విమానంలో గంటన్నర ప్రయాణించి ముందుగా భువనేశ్వర్‌కు చేరుకున్నాం.
సర్వం జగన్నాథం... అంటారు కదా... నిజమే... ఏ గుడిలో లేనన్ని విశేషాలు పూరీ జగన్నాథ్ ఆలయంలో కనిపిస్తాయి. మూడు రోజుల యాత్రలో (పూరీ, కోణార్క్, భువనేశ్వర్) భాగంగా నేను నా భార్య, కూతురుతో కలిసి విమానంలో గంటన్నర ప్రయాణించి ముందుగా భువనేశ్వర్‌కు చేరుకున్నాం. అల్పాహారం తర్వాత అక్కడ చూడాల్సిన పంచదేవాలయాలైన లింగరాజ, ముక్తేశ్వర, పరుశురామేశ్వర, కేదార్‌గౌరీ, రాజారాణి దేవాలయాలను దర్శించుకున్నాం.
వీటిలో లింగరాజ దేవాలయం అతి పెద్దది. ఆలయ సముదాయంలో 108 మందిరాలున్నాయి. జ్యోతిర్లింగ క్షేత్రంలా భావిస్తారక్కడ. ముక్తేశ్వరాలయంలో శివుని ఆరాధిస్తే ముక్తి లభిస్తుందని విశ్వసిస్తారు. సంతానం లేని మహిళలు ఈ ఆలయంలోని ‘మారీచ కుండం’లో రథోత్సవం జరిగే అశోకాష్టమి ముందు రోజు స్నానమాచరిస్తే సంతానం కలుగుతుందనే నమ్మకం ఉంది. రాజారాణి ఆలయ నిర్మాణానికి మడ్డి ఎరుపు, పసుపు ఇసుక రాళ్లను ఉపయోగించారట. ఈ రాళ్లను స్థానికంగా రాజారాణి అని పిలుస్తారు. ఈ దేవాలయం గర్భగుడిలో ప్రస్తుతం ఎలాంటి విగ్రహం లేకపోవడం గమనార్హం. ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక శాఖ ప్రతీ ఏడాది జనవరి 18 నుంచి 20 దాకా ఈ ఆలయంలో రాజారాణి సంగీతోత్సవాలను నిర్వహిస్తుంది.
సాక్షి గోపాల్...
భువనేశ్వర్ నుంచి పూరీకి రోడ్డు మార్గంలో గంటలో చేరుకోవచ్చు. మధ్యాహ్నం ఒంటి గంటకు పూరీ జగన్నాథునికి సమర్పించే ‘కోతోభోగ’ ప్రసాద సమయానికి దర్శనం చేసుకోవాలని భావించాం. శ్రీశైలానికి ముందు సాక్షి గణపతి ఆలయం ఉన్నట్టే, పూరీ జగన్నాథాలయానికి ముందు సాక్షి గోపాల్ ఆలయం ఉంటుంది. శివయ్య దర్శనానికి వచ్చే వారిని గణపతి లెక్కిస్తే, జగన్నాథుడి దర్శనానికి వచ్చేవారిని గోపాల్ లెక్కిస్తాడన్న మాట. అందుకే ఈ ఆలయాన్ని తప్పక దర్శించాల్సిందే. ఇది పూరీ- భువనేశ్వర్ హైవేకు రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.
స్థల పురాణం...
ఒడిశాలోని బంగాళాఖాతం తీరాన ఉన్న పూరీ జగన్నాథ్... కృష్ణుడిని ఆరాధించేవారికి మోక్షదాయకం. ఈ జగన్నాథుడు గిరిజనుల దేవుడని, నీలమాధవుడనే పేరుతో పూజలందుకున్నాడనీ స్థలపురాణం చెబుతుంది. అడవిలోని ఓ రహస్య ప్రదేశంలో ఉన్న జగన్నాథుడిని గిరిజనుల రాజైన విశ్వావసుడు పూజించేవాడట. విషయం తెలుసుకున్న ఇంద్రద్యుమ్న మహారాజు, ఆ రహస్యాన్ని కనిపెట్టడానికి విద్యాపతి అనే యువకుణ్ణి అడవికి పంపుతాడు. విశ్వావసుడి కూతురు లలితను విద్యాపతి ఇష్టపడి మరీ మనువాడతాడు. విగ్రహాన్ని చూపించమని పదే పదే అడుగుతున్న అల్లుడి విన్నపాన్ని కాదనలేని సవర రాజు అతని కళ్లకు గంతలు కట్టి గుడి దగ్గరికి తీసుకెళతాడు. విద్యాపతి తెలివిగా దారిపొడవునా ఆవాలు జార విడుస్తాడు. కొన్నాళ్లకు అవి మొలకెత్తి దారి స్పష్టంగా తెలుస్తుంది.
దాంతో వెంటనే ఇంద్రద్యుమ్న మహారాజుకు కబురు పెడతాడు. రాజు అడవికి చేరుకునేలోగానే విగ్రహాలు మాయమవుతాయి. ఇంద్రద్యుమ్నుడు నిరాశతో ఉండగా జగన్నాథుడు కలలో కనిపించి సముద్రతీరంలో చాంకీనది ముఖ ద్వారానికి వేపకొయ్యలు కొట్టుకొస్తాయనీ, వాటితో విగ్రహాలు చేయించమనీ ఆదేశిస్తాడు. కొయ్యలైతే కొట్టుకొచ్చాయి కానీ, విగ్రహ నిర్మాణానికి ఎవరూ ముందుకు రాలేదు. ఏంచేయాలా? అని రాజు ఆలోచిస్తున్న సమయంలో దేవశిల్పి విశ్వకర్మ వికలాంగుడి రూపంలో వస్తాడు. తానొక్కడినే రహస్యంగా ఓ గదిలో విగ్రహాలకు రూపకల్పన చేస్తాననీ, ఆ సమయంలో పచ్చి మంచినీళ్లు కూడా ముట్టననీ, ఆ 21 రోజులూ అటువైపు ఎవరూ రాకూడదనీ, తన పనికి ఆటంకం కలగకూడదనీ షరతు విధిస్తాడు. దానికి రాజు అంగీకరిస్తాడు.
రోజులు గడుస్తున్నా గదిలోనుంచి ఎలాంటి శబ్దమూ రాదు. దాంతో రాణి గుండిచాదేవీ తొందర పెట్టడంతో గడువు పూర్తి కాకుండానే రాజు తలుపులు తెరిపిస్తాడు. అయితే శిల్పి కనిపించడు. చేతులూ కాళ్లూ లేని సగం చెక్కిన విగ్రహాలు మాత్రం దర్శనమిస్తాయి. పశ్చాత్తాపంతో రాజు బ్రహ్మ దేవుణ్ణి ప్రార్థిస్తాడు. చతుర్ముఖుడు ప్రత్యక్షమై ఇక మీదట అదే రూపంలో విగ్రహాలు పూజలందు కుంటాయని ఆనతిస్తాడు. తానే స్వయంగా వాటిని ప్రతిష్టిస్తాడు.
పూరీ ఆలయంలో విగ్రహాలకు అభయ హస్తం, వరదహస్తం కనిపించనిది అందుకేనంటారు. చతుర్దశ భువనాలను వీక్షించడానికా అన్నట్లు జగన్నాథునికి పేద్ద కళ్లు మాత్రం ఉంటాయి. ఆదిశంకరాచార్యులు ఇక్కడ గోవర్థన మఠాన్ని స్థాపించారు. దీంతో పాటు రామానుజచార్య, నింబర్కాచార్య మొదలైన వైష్ణవ మతానికి చెందిన అనేక మఠాలు ఇక్కడ చూడవచ్చు. గురునానక్, కబీర్, తులసీదాస్ వంటివారు కూడా ఈ స్థలాన్ని దర్శించినట్టు ఆధారాలున్నాయి. సింగద్వారంగా పిలిచే సింహ ప్రవేశం... ఆలయం లోపలికి వెళ్లడానికి ప్రధాన ప్రవేశ ద్వారమిది. ఇరవై రెండు మెట్ల వరుస ఆలయ భవనంలోకి దారి చూపిస్తుంది. రథయాత్ర మొదలయ్యే ముందు జగన్నాథ్, బలభద్ర, సుభద్రలవిగ్రహాలను ఈ దారిలోనే తీసుకెళ్తారు. ఉత్తర, దక్షిణ, పడమటి దిక్కున ఉండే ద్వారాలను ఏనుగు ద్వారం, పులి ద్వారం, గుర్రం ద్వారం అంటారు.
పూరీ జగన్నాథ క్షేత్రంలోని మూలవిరాట్టులో ఉండే బ్రహ్మ పదార్థాన్ని (గుండె)... కొత్తగా రూపొందించిన దారుశిల్పంలోకి మార్చే ఉత్సవాన్ని ‘బ్రహ్మపరివర్తన వేడుక’ అంటారు. ఇది పన్నెండేళ్లకు ఒకసారి జరుగుతుంది. ఆ రోజున పూరీ పట్టణం మొత్తం అంధకారమవుతుందట. ఎవరూ దీపాలు వెలిగించరట. ఈ బ్రహ్మపదార్థం మార్పిడి పూర్తయితే దారు విగ్రహాలకు జీవం వచ్చినట్టుగా భావిస్తారు.
అక్కడి నుంచి కోణార్క్ సూర్య దేవాలయం, చిలికా సరస్సు, సహజ కళల కుటీర సముదాయం ‘పిపీలి’, ఉదయగిరి ఖందగిరి గుహలను సందర్శించి తిరిగి విమానంలో హైదరాబాద్‌కు చేరుకున్నాం.
- యల్లనూరు వెంకటరమణారెడ్డి,
99516 60005
Updated Date - Dec 08 , 2024 | 11:59 AM