Kartika Masam 2024: కార్తీక మాసంలో జ్వాలా తోరణం ఎందుకు చేస్తారు.. పిల్లలున్న వారు కచ్చితంగా ఇలా చేయండి
ABN, Publish Date - Nov 12 , 2024 | 02:27 PM
మహత్తరమైన విశేషాలున్న జ్వాలా తోరణం అసలు ఎందుకు చేస్తారు.. దీని నుంచి వచ్చే భస్మాన్ని ధరించడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో తెలుసుకుందాం..
పవిత్రమైన కార్తీక మాసం ఎన్నో విశిష్టతలకు నెలవు. ఈ మాసమంతా ప్రతి రోజూ ఓ పర్వదినమే. ఇక కార్తీక పౌర్ణమి నాడు ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతుంటాయి. అదే రోజున ఆలయాల్లో జ్వాలా తోరణం నిర్వహిస్తారు. దీనిని కళ్లతో దర్శంచినంతనే సకల పాపాలు నశిస్తాయంటారు. ఎంతో మహత్తరమైన విశేషాలున్న జ్వాలా తోరణం అసలు ఎందుకు చేస్తారు.. దీని నుంచి వచ్చే భస్మాన్ని ధరించడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో తెలుసుకుందాం..
కార్తీక పౌర్ణమినాడు శివాలయాల ముందు రెండు కర్రలు నిలువుగా పాతి ఉంచుతారు. వాటికి ఇంకో కర్రను అడ్డుగా పెడతారు. దీనికి గడ్డిని చుట్టి ద్వారంలా తయారు చేస్తారు. దీనినే యమద్వారం అంటారు. దీనిపై నెయ్యిని వేసి మంట పెడతారు. ఈ మంట కింద నుంచి దేవుడి ప్రతిమను ఊరేగిస్తారు. దీనినే అగ్ని తోరణం అని కూడా అంటారు. పూర్వ కాలం నుంచి ఈ ఆచారం కొనసాగుతూ వస్తోంది. మండుతున్న ఈ తరోణం నుంచి మూడు సార్లు అటూ ఇటూ నడుస్తారు. ఇలా చేయడం వెనకాల ఆసక్తికర కథ ప్రచారంలో ఉంది.
యమద్వారం చూడకుండానే..
ప్రతి మానవుడు మరణించిన తర్వాత పాప పుణ్యాల ఫలితంగా యమ ద్వారం నుంచి వెళ్లవలసి ఉంటుందట. అందులో మొదటగా మానవుడి ఆత్మ అగ్ని తోరణం అనే ఘట్టాన్ని దాటాల్సి ఉంటుంది. ఎవరైతే భూలోకంలో కార్తీక పౌర్ణమి నాడు జ్వాలా తోరణాన్ని దర్శించుకుంటారో వారు యమలోకంలో ఈ శిక్ష నుంచి తప్పించుకోవచ్చని, వారికి యమద్వారం చూడాల్సిన అవసరం రాదని ఆధ్యాత్మిక గురువులు అంటున్నారు. ఇక పరమేశ్వరుడి అనుగ్రహం కోరుకునే వారు కూడా కార్తీక మాసంలో కచ్చితంగా ఈ తోరణం దాటుతుంటారు.
భూత ప్రేతాలను తరిమి కొట్టే భస్మం..
జ్వాలా తోరణాన్ని వెలిగించిన తర్వాత దాని నుంచి వచ్చే భస్మం ఎంతో శక్తివంతమైనదని చెప్తారు. దీనిని ఇంటికి రక్షగా ఉంచడం వల్ల ఎలాంటి ప్రేత భయాలు దరిచేరవు. అలాగే చిన్న పిల్లలు ఉన్న వారింట ఈ భస్మాన్ని ఉంచుకుంటారు. నర దిష్టి, ఇతర నెగిటివ్ ఎనర్జీ నుంచి ఈ భస్మం రక్షిస్తుంది. కాలిపోయిన తోరణంలో మిగిలి పోయిన గడ్డిని ఇంటి చూరుకు, గడ్డవాములో, ధాన్యాగారంలో ఉంచుకుంటారు. దీని వల్ల వారింట సుఖ శాంతులు వెల్లివిరిస్తాయని నమ్ముతారు.
Today Horoscope : ఈ రాశి వారికి కుటుంబ వ్యవహారాల్లో మంచి పరిణామాలు జరుగుతాయి.
Updated Date - Nov 12 , 2024 | 02:27 PM