Jasmine Oil: కష్టాల కడలిని దాటించే మల్లె నూనె దీపం.. ఏ దేవుడికి వెలిగించాలి..
ABN, Publish Date - Nov 18 , 2024 | 08:15 PM
ఒక్కో రకమైన నూనెతో చేసే దీపారాధన ఒక్కో విధమైన ఫలితాన్ని ఇస్తుంది. ఏ నూనెతో భగవంతుడిని పూజిస్తే ఎలాంటి ఫలితం ఉంటుందో తెలుసా..
భారతీయ సంస్కృతిలో దీపారాధనకు ఎంతో ప్రత్యేకత ఉంది. పెద్ద పెద్ద పూజలు, వ్రతాలు చేసే సమయం, స్థోమత లేనివారు సైతం నిత్యం ఇంట్లో రెండు దీపాలను వెలిగించుకోవాలని పెద్దలు చెప్తారు. ఇలా చేయడం వల్ల ఆ ఇంటికి నరదిష్టి ప్రభావం ఉండదు. అలాగే మానసిక శాంతి, లక్షీ కటాక్షం, సౌభాగ్య వృద్ధి జరుగుతాయని నమ్ముతారు. అయితే దీపారాధనకు ఎన్నో రకాల నూనెలను వాడి భగవంతుడి కృపను కోరుకుంటారు. అలాంటి కొన్ని రకాల నూనెలు, వాటితో ఏ దేవుడిని పూజిస్తే ఎలాంటి ఫలితం ఉంటుందే విషయాలు తెలుసుకుందాం..
సంపదనిచ్చే మల్లె నూనె..
ప్రతి ఇంట్లో ప్రేమానురాగాలు వెల్లి విరియాలన్నా.. పాజిటివ్ ఎనర్జీని ఇంట్లో నిలపాలన్నా మల్లె నూనె లాంటి సుగంధ దీపం వెలిగించాలి. ఇది సంపద, విజయం, ఆనందాన్ని ప్రసాదిస్తుందని చెప్తారు. నైరుతి మూలలో మల్లె నూనెతో దీపాన్ని వెలిగించడం వల్ల ఆ ఇంట్లో మానసిక ప్రశాంతత ఉంటుందని కుటుంబ సభ్యులు, భార్యా భర్తల మధ్య అనుబంధం పదిలంగా ఉంటుందని నమ్మిక. హనుమంతుడిని ప్రసన్నం చేసుకునేందుకు మల్లెనూనె దీపం వెలిగించాలని పండితులు చెబుతున్నారు.
గ్రహ బాధలకు నువ్వుల నూనె
రాహు-కేతు ప్రభావం నుంచి విముక్తి పొందుడానికి నువ్వుల నూనె దీపాన్ని వెలిగించడం శుభప్రదంగా భావిస్తారు. నువ్వుల నూనె దీపాన్ని వెలిగించడం వల్ల శనిగ్రహ బాధ నుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే అన్ని నూనెల్లోకెల్లా నువ్వుల నూనెతో వెలిగించే దీపం ఎంతో శ్రేష్టమని భావిస్తారు. అందుకే ఇంట్లో ఎటువంటి కార్యానికైనా ఈ నూనెను ఉపయోగిస్తారు.
ఆవనూనె దీపం
శని దేవుడికి ఆవనూనె దీపాన్ని వెలిగించడం శుభప్రదంగా భావిస్తారు. ఎందుకంటే శని దేవుడికి ఆవ నూనె అంటే చాలా ప్రీతి అట. జీవితంలో ఎన్నో సమస్యలతో సతమతమవుతున్నవారు ఈ నూనెతో దీపం పెడితే అడ్డంకులు తొలగిపోతాయి. అలాగే మీ ప్రతి పనిలో విజయం సాధిస్తారు. భైరవ దేవత ఆరాధనకు కూడా ఆవనూనె దీపాన్ని వెలిగిస్తారు.
నెయ్యి దీపం
లక్ష్మీదేవికి పూజలో ముఖ్యంగా నెయ్యి దీపాన్నే పెట్టడం వెనుక అనేక కారణాలు ఉన్నాయి. నెయ్యి దీపాన్ని వెలిగించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం పొందుతారు. ఆవు స్వచ్ఛమైన జంతువు. దాని నుంచి వచ్చే నెయ్యితో దీపాన్ని వెలిగిస్తే లక్ష్మీదేవి సంతోషిస్తుంది. అలాగే మీ ఇంట్లో నెగిటీవ్ ఎనర్జీ పోతుంది. ఈ దీపం వాస్తు దోషాన్ని కూడా పోగొడుతుంది. అందుకే దీపావళి సాయంత్రం పూట ఇంటి ప్రధాన ద్వారం దగ్గర నెయ్యి దీపాన్ని వెలిగిస్తుంటారు.
Updated Date - Nov 18 , 2024 | 08:15 PM