నూతన శిశువు బోసినవ్వు లాంటి పుస్తకం
ABN, Publish Date - Nov 04 , 2024 | 12:35 AM
‘రాయడం అనేది సిగ్గు విడిచి చేసే ప్రక్రియ’ అంటాడు ధీరజ్. విమర్శ మరీ సిగ్గు విడిచిన ప్రక్రియ అంటాను నేను. ‘క్షణికాలు’ అనే ఈ పుస్తకం చాల కొత్తగా ఉంది అని చెప్పడానికి...
‘రాయడం అనేది సిగ్గు విడిచి చేసే ప్రక్రియ’ అంటాడు ధీరజ్. విమర్శ మరీ సిగ్గు విడిచిన ప్రక్రియ అంటాను నేను. ‘క్షణికాలు’ అనే ఈ పుస్తకం చాల కొత్తగా ఉంది అని చెప్పడానికి నేనేం సిగ్గు పడడం లేదు. ధీరజ్ ఒక తాజా రచయిత. ఇప్పుడిప్పుడే పుట్టిన పాపాయి బోసి నవ్వు ఈ రచనల సంపుటి.
సస్పెన్స్ అనిపించని సస్పెన్స్, సంఘస్పృహ అనిపించని సంఘస్పృహ ఈ రచయిత ప్రత్యేకత. ఆ రెండు లక్షణాలకు మచ్చుగా ఆయన అందించిన మొదటి రెండు కథలు చాలు. మిగతా అన్నిటిదీ అదే కోవ. ఆవు బొమ్మ గీసి కింద ఆవు అని రాస్తే తప్ప తృప్తిపడని సందేశాత్మకుడు కాదు ధీరజ్. మౌనానికి, ధ్యానానికి చోటు ఇచ్చే రచయిత.
మొదటి కథ ఉత్తమ పురుషలో ఉంటుంది. చెప్పే మనిషి పేరేందో తెలిసిపోతుంది గాని, ఈయన పేరు అదేనా, ఈ ‘ఉత్తమ పురుషుడు’ మరెవరిదో కథను ఇలా చెబుతున్నాడా అని ఒక రకం సస్పెన్స్ కథను చివరి కంటా చదివిస్తుంది. ఏతత్పురుషుడి మామ పెంచిన కుక్కల్లో ఒకదానికి ఇతడి పేరే పెట్టేరని క్లూ. ఆ కుక్క పేరు దత్తు. కథలో ఉన్నది అతగాడి బాల్య మని కథ శీర్షికలోనే ఉంది. మరి, మన ‘ఉత్తమ పురుషుడి’ పేరేంటబ్బా అని అడగాలనిపిస్తుంది ఒక్క క్షణం. ‘సంజీవరెడ్డీ నీ కులమేమిటని అడుగుతా వేంట్రా’ అని ‘రక్తకన్నీరు’ నాటకంలో నాగభూషణం డైలాగు గుర్తుకొస్తుంది, లోలో విరిసే చిరునవ్వుతో పాటు. సో, మనోడి పేరు దత్తుగాడు అన్నమాట అనుకుంటాం, ఏదో పేద్ద సస్పెన్సు తొలగినట్టు. ఈలోగా కథలో కదిలే తెలంగాణ భాష సొగసు ఓ మంచి అనుపానం.
రెండో కథ ‘సంభాషణ’. ‘ఆయమ్మ’ ఒక పేదరాలు. అంత పేదరికంలో తన రోగిష్టి మొగున్ని చక్కగా చూసుకుంటున్న ఆమె గొప్పదనాన్ని, అలాగని ఏ సతీ సావిత్రో కాకుండా ‘గలీజు’ అని అయినోళ్లతో అనిపించు కున్న ఆమె ఆడతనాన్ని చాల హృద్యంగా బొమ్మలు కట్టిందీ కథ. కథ ఎక్కడా బండగా అనిపించదు. కాలేజీ టీచర్స్ డే ఉత్సవాల ముగింపులో, రూములో చివరికి మిగిలిన ఇద్దరు టీచర్లు, ప్లస్ అక్కడికి ఊడవడానికి వొచ్చిన ఆయమ్మ... వీళ్ల మధ్య సంభాషణ... సరదాగా మొదలై మెల్లగా చాల నొప్పి కలిగించే బతుకు వాస్తవాలలోకి మనల్ని లాక్కుపోతుంది. ఆయమ్మ ముసలిదైంది. ఏమాత్రం డబ్బున్నా ఇంట్లో విశ్రాంతి తీసుకోవలసిన వయసు. కాలేజీలో కసవులూడ్చి శుభ్రాలు చెయ్యడం వంటి అలసట కలిగించే పనులకు వయసు కాదు. భర్త కడుపులో గడ్డతో మంచం దిగలేని స్థితిలో తిండి తినడానికి కూడా ఆయమ్మ సాయం కోసం ఎదురు చూస్తూ ఇంట్లో. అయితే ఏం చేయాలి? పోరాడాలి! ఎవరి మీద? ఆమెను గదమాయించే సార్లూ మేడమ్‌ల మీదనా, పనికి బొటాబొటి కూలీ, చేయని రోజుకు ఏమీ ఇవ్వని పీనాసి యజమానుల మీదనా, ఆమెను గలీజు మనిషి అనేసి తప్పుకునే దగ్గరివాళ్ల మీదనా, కథలో మన ఇద్దరు సార్లు వాళ్ల మనస్సులలో చేసినట్లు మన మీద మనమే పోరాడాలా? అన్నీ సరైన సమాధానాలే. అన్నిటికి తలుపులు తెరిచి ఉంచే సవినయ కథనం ‘సంభాషణ’.
దిగంబర కవులు తమ రచనలను వచన పద్యాలని అననివ్వం, ‘దిక్కు’లు అంటామన్నారు. ఇక్కడ తన పుస్తకంలో రచనలకు ‘కొన్ని కథలు’, ‘కొన్ని క్షణాలు’, ‘కొన్ని తారలు’, ‘కాసింత శూన్యం’... అని సరదా పేర్లు పెట్టారు ధీరజ్. పఠన సౌలభ్యం కోసం కథలు, మ్యూజింగ్స్, కవితలు అని పేరు పెట్టుకుని చదువు కోవచ్చు. పుస్తకం శీర్షిక సూచించినట్టు అన్నీ ‘క్షణికాలే’. అంటే రచయిత అనుభవించిన స్థలకాల శకలాలే. ‘‘పాడుతాతీయగాలాంటి ప్రోగ్రాం ఏదో వచ్చి వెళ్లిపోయే ముందు, మనుషుల మీదుగా టైటిల్స్ పోతూ ఉంటే వీళ్లకు గుల్-గుల్ ఎందుకు అవ్వట్లేదు అని నోరెళ్లబెట్టి ఆశ్చర్యపడ్డ జ్ఞాపకం’’ అంటాడొక చోట. ఇలాంటి చిన్న చిన్న జ్ఞాపకాల సమాహారమే జీవితం. చాల అణువులు కలిసి ఒక దేహం, ఒక విశ్వ గోళం. చాల క్షణాలతో కలిసి జీవితం. ప్రతి క్షణాన్నీ జీవించాలి. ఆ క్షణంలోనే జీవించాలి. మునుపటి క్షణం మీద నిలబడిన ఇప్పటి క్షణమే మరు క్షణానికి పునాది.
ఇప్పటి తరం మునుపటి తరాల కన్న మెరుగ్గానే జీవిస్తోంది. అలా నడు ఇలా మాట్టాడు ఆ చిరుగుల టైట్ ప్యాంట్లేంటి, ఆ తెలుగుమీరిన ఇంగ్లీషేంటి అని మునుపటి తరాలు గొణగుతాయి. ఇవాళ ఉన్నవన్నీ మాండలికాలే. కొత్త తరం ఇంగ్లీషులో ఆలోచించి తెలుగులో మాట్లాడు తోంది. కొత్త తెలుగు తయారవుతోంది. తప్పు కాదు. ఈ వ్యవహారాల్లోంచి పుట్టుకొచ్చే భాషే వ్యావహారిక భాష. ఈ పుస్తకంలో చాల చోట్ల ధీరజ్ ఇంగ్లీషులో ఆలోచించి తెలుగులో మాట్లాడుతున్నాడని అనిపించింది. అది సహజం అనిపించింది కూడా. ‘‘...కొత్త ఉదయాల్లో ఉండే అర్థం కాని వెచ్చదనానికి ప్రతిచర్య పడదామని ఇదంతా’’ అంటాడు ‘ఒక చిన్న సంగతి’ అనే పుస్తక ప్రవేశికలో. ‘రియాక్ట్ అవుదామ’ని ఆంగ్లంలో ఆలోచించిన తెలుగిది. మునుపు విద్యావంతులు సంస్కృతంలో ఆలోచించి తెలుగులో పద్యాలు రాశారు. ఆదికవులయి, కాలాన్ని వెలిగించారు. ఇప్పటి రచయితలు ఇంగ్లీషులో ఆలోచించి తెలుగు మాట్లాడుతున్నారు. ఇక్కడ ఇచ్చిన ఉదాహరణ మరీ గహనంగా ఉంది గాని, ఈ భాష ఆహ్వానిచదగినదే. ఈ చర్నింగ్‌లోంచే కొత్త జీవితానికి అవసరమైన, అనుగుణ మైన భాష తయారవుతుంది. ఈ చర్నింగ్ ప్రాసెస్‌కు చక్కని ఉదాహరణ ధీరజ్ కశ్యప్ వేముగంటి.
హెచ్చార్కె
95023 45716
Updated Date - Nov 04 , 2024 | 12:35 AM