ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ప్రజాజీవితం, కళావిలువల మేళవింపు నా ‘భూమిస్వప్నం’

ABN, Publish Date - Nov 11 , 2024 | 01:43 AM

ప్రతి కవి ప్రయాణంలో మొదటి పుస్తకం కలల తీపి గుర్తు. రచయితగా నిలబడటానికి దోహదపడే ముఖ్య భూమిక. నా మొదటి కవితా సంపుటి ‘భూమి స్వప్నం’. 1987 మార్చిలో వెలుగు చూసింది. 1976–86 మధ్య కాలంలో...

నా మొదటి పుస్తకం

ప్రతి కవి ప్రయాణంలో మొదటి పుస్తకం కలల తీపి గుర్తు. రచయితగా నిలబడటానికి దోహదపడే ముఖ్య భూమిక. నా మొదటి కవితా సంపుటి ‘భూమి స్వప్నం’. 1987 మార్చిలో వెలుగు చూసింది. 1976–86 మధ్య కాలంలో రచించిన కవితల లోంచి ఎంపిక చేసిన కవితల సంపుటి. ఆ పదేళ్ల కాలం నా నవయౌవన కాలం. ఎప్పుడూ ఉత్సాహం. ఏదో తపన. కవిత్వ మోహం. విరివిగా పోటీపడి రాసేవాళ్లం. పత్రికలు అనేకం. ప్రచురణావకాశాలు అనేకం. కవిగా, రచయితగా గుర్తింపు పొందిన తర్వాతనే పుస్తకం వేసుకోవాలన్న భావన బలంగా ఉండేది. నిరుద్యోగం, ఆర్థిక లేమి ఒక కారణం. ప్రాచుర్యం పొందిన తర్వాత పుస్తకం వస్తేనే సాహిత్య లోకం పట్టించుకుంటుందన్న మా ముందుతరం కవుల అనుభవం మరో కారణం. అట్లా కల, కలగా ఉంటూ, వాయిదా పడుతూ కవితలు సంపుటిగా వస్తేనే తూచటానికి, అంచనా వెయ్యటానికి వీలవుతుందన్న సలహాలు ఎదురయ్యేదాకా తొందరపడలేదు.


చుట్టూ విస్తరిస్తున్న విప్లవ వాతావరణం నా కవిత్వానికి ప్రేరణ. శిల్పం పట్ల శ్రద్ధ వహించాలని అప్పట్లో తరచూ జరిగిన చర్చల సారం నా సృజనకు పూరణ. ‘‘మా మౌనం మూగతనం కాదు, గోడకు వేలాడే తుపాకీ కూడా మౌనంగా ఉంటుంది’’ అంటూ విప్లవోద్యమంలో నా కవితా పాదాల్ని గోడల మీద నినాదాలుగా రాసిన క్రమం గొప్ప ఉద్వేగం.

1986 సంవత్సరం పుస్తకం తేవాలని ప్రయత్నం మొదలుపెట్టాను. అప్పటికి ప్రచురించబడిన కవితలే రెండు వందల పైనున్నాయి. అన్నిటి మీదా సహజ ప్రేమ ఉన్నా నిర్దాక్షిణ్యంగా వడబోస్తే వంద తేలాయి. మరోసారి వస్త్రగాలం పడితే మరో సగం యాభై. అన్నింట్లో మార్గదర్శి శివారెడ్డే. 33 ఎంపిక చేశాం. మొదటి సంపుటి కదా, పేరు బాగుండాలి. అది పెద్ద సమస్య. అప్పటిదాకా నేననుకున్నది ‘రుతుపవనం’. శివారెడ్డి తల ఊపలేదు. నెల దాటింది. దీర్ఘకవిత శీర్షిక ‘ఆకురాలు అరణ్యం’ చెప్పాను. ఆమోదం లేదు. మరో నెల. కొత్త కవిత రాశాను. శీర్షిక ‘భూమిస్వప్నం’. శివారెడ్డికీ, దేవిప్రియకు, శీలావీర్రాజుకూ నచ్చింది. టైటిల్‌ ఫైనల్‌ అయింది. పుస్తకం పేరు ‘భూమిస్వప్నం’.


మొదటి పుస్తకం కదా, ముందుమాట మరో సమస్య. గురువు గారు గనుక సినారెను, విమర్శ కుడు గనుక కె.కె. రంగనాథచారినీ కోరాను. త్వరగానే రాసిచ్చారు. ‘ఆర్ద్రత + తీవ్రత = సిధారెడ్డి కవిత’ అని సినారె రాసింది నచ్చింది. కె.కె.ఆర్‌ పది పేజీలు రాశాడు. ఎక్కడా కవి పేరు గానీ, కవిత పేరు గానీ, పుస్తకం పేరు గానీ లేకుండా ‘నేటి కవి’ అని రాశాడు. ఆందోళన చెందాను. ఇబ్బంది పడుతూనే వెళ్ళి చెప్పాను. మార్పు చేస్తానంటే ఇచ్చాను. మార్చలేదు. అదీ తిరిగి ఇవ్వలేకపోయాడు. ఆందోళన పెరిగింది. తర్వాత శివారెడ్డినీ, దేవిప్రియనూ కోరితే రాశారు. ‘బందారం కనిపెంచిన మందారం’, అంటూ దేవిప్రియ కూర్చిన మాట ఇప్పటికీ ప్రచారంలో ఉంది. బందారం మా ఊరు. ‘రాబోయే పదేళ్ల కాలం సిధారెడ్డి ఏమిటో నిర్ణయిస్తుంద’ని శివారెడ్డి భావించాడు. ముందుమాటలు పుస్తకం చివర ప్రచురించాను. ‘‘కన్నీళ్లూ కత్తులూ అయి జీవించుమనే అవ్వకూ బాపుకూ’’ అంకితమిచ్చాను. ‘అవ్వ’, ‘బాపు’ అని ధైర్యంగా రాశావన్నాడు సినారె.


తర్వాత ముఖచిత్రం కోసం శీలా వీర్రాజుతో కూర్చున్నాను. తృప్తి పడలేదు. అట్లా వెదుకుతున్నప్పుడు ‘ఉదయం’ ఆదివారం సంచికలో ప్రచురించిన ఒక ఫొటో నన్ను బాగా ఆకర్షించింది. ఇసుక తిన్నెల మీద ఆచ్ఛాదన లేని బాలుడు నడిచి వెళ్ళే దృశ్యం. అప్పటి ఆదివారం ఉదయం సంపాదకుడు దాట్ల నారాయణ మూర్తి రాజును కలిసి అడిగాను. ప్రేమతో వెదికి ఫొటో ఇచ్చాడు. ఫొటోగ్రాఫర్‌ పేరు అడిగాను. తెలియదన్నాడు. వీర్రాజు చేతిలో పెట్టాను. ముఖచిత్రం, వెనుక చిత్రం తయారైనాయి. శీలా వీర్రాజు అక్షరాలు శోభ కూర్చాయి. శీలావీ, మిత్రుడు వాసిలి వసంతకుమార్‌ పూనికతో మాస్టర్‌ ఆర్ట్‌ ప్రింటర్స్‌ నుంచి మంజీరా రచయితల సంఘం, మాధురీ పబ్లికేషన్స్‌ సంయుక్త ప్రచురణగా ‘భూమిస్వప్నం’ వెలువడింది. నగర కేంద్ర గ్రంథాలయం చిక్కడపల్లిలో మార్చి 6, 1987న సి. నారాయణ రెడ్డి ‘భూమిస్వప్నం’ను ఆవిష్కరించాడు. నా కవిత్వాన్ని ఇష్టపడే డి. వెంకట్రామయ్య, కె. శివారెడ్డి, దేవిప్రియ మాట్లాడారు. ‘భూమిస్వప్నం’ వెలువడిన ఆ సంవత్సరమే ఫ్రీవర్స్‌ ఫ్రంట్‌ అవార్డు, ఆ తర్వాత 1988 సంవత్సరం ‘ఇందూరు భారతి’ దాశరథి అవార్డు అందుకోవటం ఉత్సాహానికి ఉత్సాహం.


ఆ రోజుల్లో తెలుగు సాహిత్యంలో రెండు ధోరణులు వ్యాప్తిలో ఉండేవి. మా తరాన్ని బలంగా ప్రభావితం చేసిన విప్లవ సాహిత్యం. విప్లవ సాహిత్యంలో శిల్పం లోపించి నినాదాలే చెలామణీ అవుతున్నాయన్న రూపవాదుల ధోరణి. రెంటినీ అన్వయించుకున్నాం. ప్రజాజీవితాన్ని, కళావిలువల్ని మేళవించిన సమన్వయ కవితా సృజన ‘భూమిస్వప్నం’. ఇప్పటికీ నేను విశ్వసించేది అదే. ఇష్టమైన వాక్యం– ‘కవిత్వం వేడుక కాదు. గాయాల గొంతుక’.

నందిని సిధారెడ్డి

Updated Date - Nov 11 , 2024 | 01:43 AM