కూలిన ఒంటినిట్టాడి గుడిసె
ABN, Publish Date - Sep 12 , 2024 | 12:56 AM
‘‘నాకు సాహిత్యమంటే పిచ్చి/ అప్పుడప్పుడూ రాస్తుంటాను/ కనపడ్డ పుస్తకాల్ని కొంటూ వుంటాను/ చిన్న గ్రంథాలయం నా ఇంట్లో/ పుస్తకాలు నా మరోప్రపంచం’’... నా ఇష్టాలు అనే కవితలో ఈ మాటలు...
‘‘నాకు సాహిత్యమంటే పిచ్చి/ అప్పుడప్పుడూ రాస్తుంటాను/ కనపడ్డ పుస్తకాల్ని కొంటూ వుంటాను/ చిన్న గ్రంథాలయం నా ఇంట్లో/ పుస్తకాలు నా మరోప్రపంచం’’... నా ఇష్టాలు అనే కవితలో ఈ మాటలు రాసుకున్నది సెప్టెంబర్ మూడున హైదరాబాద్‌లో తీవ్ర అనారోగ్యంతో కన్నుమూసిన కొప్పోలు మోహనరావు. ప్రకాశం జిల్లా కందుకూరు సమీపగ్రామం అయిన చౌటపాలెంలో 22 సెప్టెంబరు 1955లో మోహనరావు జన్మించారు. తల్లిదండ్రులు కొప్పోలు వెంకట సుబ్బమ్మ, మాలకొండయ్య. విద్యార్థిగా చిన్న చిన్న ప్రేమ కవితలు రాసుకున్న మోహనరావు, డిగ్రీ చదువుల కోసం కావలి జవహర్ భారతి కొచ్చాక సాహిత్యం పట్ల మరింత మక్కువ పెంచుకున్నారు. వారం వారం బొటానికల్ గార్డెన్‌లో జరిగే ‘తెలుగు సాహితి’ కార్యక్రమాల్లో ఆసక్తిగా పాల్గొనేవాడు. ప్రతీ ఏడాది కాలేజీ మేగజైన్‌లో కవితలు అచ్చయ్యేవి. ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి, భుజంగరాయశర్మ, కెవియార్, మధునాపంతుల వంటి ఉద్దండ పండితులు పనిచేసే కాలేజీ జవహర్ భారతి.
శ్రీశ్రీ, కెవియార్, శివసాగర్, చెరబండరాజుల ప్రభావంతో తొలిరోజుల్లో వామపక్ష భావాలతో కవితలు రాసినప్పటికీ, తర్వాతి కాలంలో అంబేడ్కరిజం వైపు మళ్లాడు. డిగ్రీ తర్వాత ఎం.కాం. చదువుతుండగానే కెనరా బ్యాంకులో ఉద్యోగం వచ్చింది. దాంతో దేశాలు పట్టి తిరగడంతో కవిత్వ సృజన వెనకపట్టింది. అయితే ఎక్కడున్నా డైరీలో కవితలు రాయడం మానలేదు. 1996లో హైదరాబాద్‌కు బదిలీ అయి వచ్చాక మోహనరావులోని నివురుకప్పిన కవిత్వపు నిప్పు జ్వలించడం మొదలుపెట్టింది. 2005 మే 12–15 తేదీలలో కవిసంధ్య దళిత రచయితల వేదిక సంయుక్తంగా నిర్వహించిన దళిత రచయితల శిక్షణా శిబిరంలో కీలకపాత్ర పోషించడమే కాక కో–కన్వీనర్‌గా వ్యవహరించారు. దానితో ఎన్నాళ్ళనుంచో అణగారి వున్న కవిత్వ స్పృహ, దళిత చైతన్యం ఒక్కసారిగా విజృంభించింది. దాని ఫలితమే 2020లో మోహనరావు వెలువరించిన ‘ఒంటినిట్టాడి గుడిసె’ దళిత కవితా సంకలనం. దీనికి కొలకలూరి భగీరథి కవిత్వ పురస్కారం 2021లోనూ, కవిసంధ్య ప్రతిభా పురస్కారం 2020లోనూ లభించింది. ఆంధ్రప్రభ, నేటినిజం, సాహితీ స్రవంతి, బహుజన కెరటాలు, కవిసంధ్య వంటి పత్రికల్లో మోహనరావు రచనలు అచ్చయ్యాయి. ‘‘నా కవితలు నా భావావేశం నుండి పుట్టుకొచ్చినవి. సామాజికంగా జరిగే అన్యాయాలను ప్రశ్నిస్తూ, స్పందిస్తూ, రాసాను’’ అని మోహనరావే చెప్పుకున్నారు.
అంబేడ్కరిస్టుగా ‘బోధివృక్షం, దళితుడి వాంగ్మూలం’ వంటి కవితలు రాసిన మోహనరావు, వరవరరావుని ఉపా చట్టం కింద అక్రమ అరెస్టు చేసినప్పుడు ‘‘కవిని కష్టపెట్టకండర్రా! కాస్త స్వేచ్ఛనివ్వండి/ రేపటి ఉషోదయాన్ని తాను/ భూపాల రాగమై మేల్కొలుపుతాడు’ అని రాసాడు. ఒక్క సంపుటే వెలువరించినా మోహనరావు దళిత కవిత్వంలో సాధించింది తన స్థానీయతను నమోదుచేయడం, అతడి యాసను కవిత్వం చేయడం. కవిత్వ రచనలో గొప్ప మూలమలుపులో వున్నప్పుడు మోహనరావు నిష్క్రమించడంతో ఒంటి నిట్టాడి గుడిసె నిలువునా కూలిపోయినట్టయింది. ఖాజా అన్నట్టు ‘‘ఎండాకాలపు వొడుస్తున్న కొత్త నీటికుండ’’ మోహనరావు కవిత్వం! మోహనరావుకు దళిత రచయితల వేదిక అశ్రునివాళి!
డా. శిఖామణి
Updated Date - Sep 12 , 2024 | 12:56 AM