ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

బారక్‌పూర్‌లో రగిలిన స్వాతంత్ర్యాగ్ని

ABN, Publish Date - Oct 31 , 2024 | 02:39 AM

ప్రథమ భారత స్వాతంత్య్ర సంగ్రామానికి ముందే అంటే 1824 లోనే మన దేశంలో సిపాయిల తిరుగుబాటుకు బీజం పడింది. బ్రిటిష్‌ అధికారులకు వ్యతిరేకంగా భారతీయ సైనికులు చేసిన తిరుగుబాటు...

ప్రథమ భారత స్వాతంత్య్ర సంగ్రామానికి ముందే అంటే 1824 లోనే మన దేశంలో సిపాయిల తిరుగుబాటుకు బీజం పడింది. బ్రిటిష్‌ అధికారులకు వ్యతిరేకంగా భారతీయ సైనికులు చేసిన తిరుగుబాటు ఇది. ఈస్టిండియా కంపెనీ సైన్యం మొదటి ఆంగ్లో బర్మా యుద్ధంలో పోరాడుతున్నప్పుడు ఇది జరిగింది. ఈ తిరుగుబాటులో 180 మంది సిపాయిలు వీరమరణం పొందారు. 12 మందిని బ్రిటిష్‌ అధికారులు ఉరి తీశారు. ఆంగ్లేయులకు ఎదురు తిరిగి అసువులు బాసిన వారి త్యాగం నిరుపమానమైనది. రెండు శతాబ్దాల తర్వాత కూడ నాటి వీరులను స్మరించుకొని అంజలి ఘటించాల్సి ఉంది. వారి రుణం మనం తీర్చుకోలేనిది.


మొదటి ఆంగ్లో–బర్మా యుద్ధ సమయంలో 1824 అక్టోబరులో బర్మా భూభాగంలోకి ప్రవేశించడం కోసం బెంగాల్‌ స్థానిక పదాతిదళానికి చెందిన మూడు రెజిమెంట్ల సైనికులను 800 కి.మీ. దూరం కవాతు చేయాలని బ్రిటిష్‌ అధికారులు ఆదేశించారు. ఈ రెజిమెంట్లు అప్పటికే దాదాపు 1600 కి.మీ. కవాతు చేసుకొంటూ మధుర నుండి కోల్‌కత సమీపంలోని మిలటరీ కంటోన్మెంట్‌ అయిన బారక్‌పూర్‌ వరకు వచ్చాయి. అక్కడి నుండి తిరిగి మరల చిట్టగాంగ్‌ వరకు కవాతు చేయాలని ఆదేశించడంతో సిపాయిలు ఎదురు తిరిగారు. (పైగా ఈ రెజిమెంట్లలో ఎక్కువగా హిందూ సైనికులు ఉన్నారు.) సముద్ర ప్రయాణం పట్ల కూడ వారికి అభ్యంతరాలు ఉన్నాయి. అప్పటికే అలసిపోయిన సైనికులు, బళ్ళు కూడ లేకపోవడం వల్ల తమ సామానును తామే మోసుకొని తిరిగి బయలుదేరడానికి నిరాకరించారు. వీరి అభ్యంతరాలను పట్టించుకోకుండా కంపెనీ వారు తమ సంచులను వీపు మీద మోసుకెళ్ళాలని ఆదేశించడంతో వారిలో అసహనం పెరిగిపోయింది.


1824 నవంబర్‌ 1న కవాతు మొదలు పెట్టాలని అధికారులు ఆదేశించారు. తమకు బళ్ళను సమకూర్చాలని లేదా రెట్టింపు బత్తా చెల్లించాలని సిపాయిలు డిమాండ్‌ చేశారు. దానికి నిరాకరించిన బ్రిటిష్‌ అధికారి ఎడ్వర్డ్‌ పాగెట్‌ సైనికులు తమ ఆయుధాలను వదిలేయాలని కోరారు. అందుకు సైనికులు ఒప్పుకోకపోవడంతో ఆయన యూరోపియన్‌ దళాలకు చెందిన రెజిమెంట్లను, ఫిరంగులను రప్పించాడు. నవంబరు 2వ తేదీన వెనుక నుండి తిరుగుబాటుదారులపై కాల్పులకు తెగబడ్డారు. ఆంగ్లేయ అధికారులు ఆకస్మికంగా జరిపిన కాల్పులలో సిపాయిలు, పౌరులు... మొత్తం 180 మంది అసువులు బాసారు. తదనంతర పరిణామాలలో తిరుగుబాటు నాయకులైన అనేకమందిని ఉరి తీశారు. ఈ విధంగా ఈస్టిండియా కంపెనీ ప్రభుత్వం దమన నీతిని ప్రదర్శించింది.


బింది తివారీ నాయకత్వంలో జరిగిన ఈ ‘బారక్‌పూర్‌ తిరుగుబాటు’ చరిత్రాత్మకమయినది. నవంబర్‌ 9న బింది తివారీని అరెస్ట్‌ చేసి, మరుసటి రోజు ఉరితీసి ఆయన శరీరాన్ని బహిరంగంగా గొలుసులతో వేలాడదీశారు. ఈ విషయం బయటికి పొక్కకుండా మీడియాలో వార్తలు రాకుండ వలసప్రభుత్వం జాగ్రత్తలు తీసుకొంది. కానీ ఇది జరిగిన 6 నెలల తర్వాత లండన్‌లోని ‘ఓరియంటల్‌ హెరాల్డ్‌’ ఒక కథనం ప్రచురించి, బ్రిటిష్‌ అధికారుల దమననీతిని తీవ్రంగా ఖండించింది. బింది తివారీ భారతీయ సైనికులకు ఒక ఆరాధ్య దైవం అయ్యాడు. ఆరు నెలల తర్వాత ఆయన్ను, ఉరితీసిన ప్రాంతంలో సైనికులు, స్థానికులు కలిసి ఒక ఆలయాన్ని నిర్మించారు. అది ‘బిందిబాబా దేవాలయం’గా ప్రసిద్ధి పొందింది.

ఈ బారక్‌పూర్‌ తిరుగుబాటు జరిగిన 33 సంవత్సరాల తర్వాత 1857 మార్చి 29న ఇదే బారక్‌పూర్‌ కంటోన్మెంట్‌లో సిపాయి మంగళ్‌పాండే నాయకత్వంలో మరో తిరుగుబాటు మొదలైంది. అదే ప్రథమ భారత స్వాతంత్య్ర సంగ్రామంగా ఖ్యాతికెక్కింది. 1857లో బ్రిటిష్‌ అధికారులను భారతీయ సిపాయిలు హతమార్చడానికి బారక్‌పూర్‌ తిరుగుబాటే వారికి ప్రేరణ ఇచ్చింది.

డా. పి.సి.సాయిబాబు

(నవంబరు 2: బారక్‌పూర్‌ తిరుగుబాటుకు రెండు శతాబ్దాలు)

Updated Date - Oct 31 , 2024 | 02:39 AM