ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

వంద వత్సరాల ‘పరిణయ రహస్యము’

ABN, Publish Date - Jun 16 , 2024 | 04:38 AM

మహాకవి శ్రీశ్రీ ముద్రిత రచనల్లో లభిస్తున్న వాటిల్లో మొదటిది ‘పరిణయ రహస్యము’ అనే నవలిక. ఇది 1924లో ముద్రితమైంది. అంటే నూరు సంవత్సరాలు అవుతున్నది. 1910 ఏప్రిల్‌, 30న జన్మించిన శ్రీశ్రీకి...

మహాకవి శ్రీశ్రీ ముద్రిత రచనల్లో లభిస్తున్న వాటిల్లో మొదటిది ‘పరిణయ రహస్యము’ అనే నవలిక. ఇది 1924లో ముద్రితమైంది. అంటే నూరు సంవత్సరాలు అవుతున్నది. 1910 ఏప్రిల్‌, 30న జన్మించిన శ్రీశ్రీకి ఈ రచన నాటికి కేవలం పద్నాలుగు సంవత్సరాలు మాత్రమే. సుమారు తొమ్మిదేళ్ళ ప్రాయానికే ఆయన కందం లాంటి పద్య రచన చేశాడు. ఆ తర్వాత ‘దివ్య లోచనములు’ శీర్షికతో రాసిన పద్యాలు పురిపండా అప్పలస్వామి సంపాదకత్వంలో వెలువడుతున్న ‘స్వశక్తి’ పత్రికలో ముద్రితమయ్యాయి. అచ్చులో ఇదే శ్రీశ్రీ తొలి రచన. కవిత్వంతో పాటు వచన రచనలూ విరివిగానే చదువుతున్న (‘‘... ఎక్కువగా వచనం, ముఖ్యంగా డిటెక్టివ్‌ నవలలు చదువుతుండే నాకు...’’ పుట–35, అనంతం) వాటిలో నవలలు, అందునా డిటెక్టివ్‌ నవలలూ బాగా చదువుతున్న ప్రభావంతో ‘గోకులాయి’ డిటెక్టివ్‌ నవల, వీరసింహ విజయసింహులు అనే దేశభక్తి పూర్వక నవలా రాశాడు శ్రీశ్రీ. ఇవన్నీ ప్రస్తుతం అలభ్యం. సుమారు అదే సమయంలో ‘పరిణయ రహస్యం’ అనే డిటెక్టివ్‌ నవల రచించాడు. ‘‘పెళ్ళికి ఒకటి, రెండు నెలల క్రిందట నా మొదటి నవలిక పరిణయ రహస్యము అచ్చువేయించాను మా నాన్న డబ్బివ్వగా’’ (పుట–46, అనంతం) అని చెప్పుకున్నా దీన్ని 1924లో విశాఖపట్టణంలోని ఆంధ్ర సంజీవినీ గ్రంథమాల ప్రచురించింది.


ఈ పుస్తకం గురించి శ్రీశ్రీ తన జీవిత చరిత్రను 1975లో రాస్తూ ‘‘... నా పరిణయ రహస్యము (అపరాధ పరిశోధక నవలిక) ఇప్పుడెక్కడా దొరకదు. దీనికోసం ఎందరో మిత్రులు గాలిస్తున్నారు. దొరుకుతుందనే ఆశలేదు’’ (పుట–250, అనంతం) అని తెలిపారు. శ్రీశ్రీ మరణానంతరం 1991లో ఇది లభించింది. ఇందులోని మొదటి ప్రకరణం ‘తూర్పుసీమ’ అనే మాసపత్రిక జూలై 1991 సంచికలో ముద్రించారు. దీని గురించి ‘‘... అదృష్టవశాత్తు ఇటీవల శిథిలావస్థలో ఒకచోట బయటపడింది. ఆ పుస్తకంలోని కొన్ని పుటలు తూర్పుసీమ పత్రికా ముఖంగా తెలుగు పాఠకుల ముందుంచగల్గుతున్నాము’’ (పుట–5) అని దాని సంపాదకులు మండా సూర్యనారాయణ (మసూనా) వివరించారు. 1994 ఏప్రిల్‌ 10, 17, 24 తేదీల్లో ఈ నవలను ఆంధ్రజ్యోతి దినపత్రికలో ముద్రించారు. దీనిని డిసెంబర్‌, 2009లో ‘శ్రీశ్రీ సాహిత్య నిధి’ వారు సింగంపల్లి అశోక్‌కుమార్‌ కూర్పరిగా ప్రత్యేక పుస్తకంగా తీసుకొచ్చారు. శ్రీశ్రీ శతజయంతి సంవత్సరమైన 2010, ఏప్రిల్‌ 30న ‘మనసు ఫౌండేషన్‌’ వారు శ్రీశ్రీ లభ్య రచనలన్నింటినీ చలసాని ప్రసాద్‌, ఎం.వి. రాయుడు కూర్పరులుగా మూడు సంపుటాలుగా తెచ్చిన వాటిల్లో రెండవ సంపుటిలో ఈ ‘పరిణయ రహస్యము’ ముద్రితమైంది. ఈ నవలలో ఉన్న విషయం, భాష మొదలైనవి చూద్దాం.


ఈ నవలికలో పది ప్రకరణాలున్నాయి. వాటికి పరిణయ ప్రసంగము, పరిణయ నిశ్చయము, పరిణయ భంగము, రాజమహేంద్రవర ప్రయాణము, ఆలోచనము, కామేశ్వరరావు, రహస్య ప్రకాశనము, సంభాషణము, స్వర్ణాభరణము, నిరూపణము అనే పేర్లు క్రమంగా ఉన్నాయి. ఇవి ఆయా ప్రకరణాల ప్రధాన ఇతివృత్తాన్ని సూచించే విధంగా రచయిత పెట్టాడు. ఇందులో నారాయణరావు, కృష్ణారావు, రాఘవయ్య, బంగారమ్మ (పద్మనాభరావు), రాఘవయ్య భార్య, పేదవాడు, రామమోహనరావు, కామేశ్వరరావు, కాంతమ్మ, పురోహితులు, పెళ్ళికి వచ్చిన బంధు, మిత్ర పరివారము, దత్తు, ఆనందరావు, పోలీసులు ఇత్యాది పాత్రలు ఉన్నాయి. ఈ కథ విశాఖపట్టణము, సింహాచల క్షేత్రం, రాజమహేంద్రవరము, నరసీపట్టణము, కోర్టు, పోలీసు స్టేషన్‌, రైల్వే స్టేషన్‌, బస్‌స్టాండ్‌ మొదలైన చోట్ల సాగుతుంది.

కథాపరంగా చూస్తే– నారాయణరావు అనే బ్రాహ్మణ న్యాయవాది విశాఖలో ఉంటాడు. ఇతని ఒక్కగానొక్క సంతానం కృష్ణారావు. ఈతని పెళ్ళికై అమ్మాయిలను వెదకడం మొదలెడతాడు తండ్రి. రాఘవయ్య అనే అతను తన ఏకైక కూతురు బంగారమ్మ చదువులోను, రూపంలోనూ మీకు సరిపోయే విధంగా ఉంటుందని చెప్పి వారికి ఫోటోను ఇచ్చి వెళతాడు. ఈ అమ్మాయి కృష్ణారావుకు నచ్చుతుంది. అమ్మాయి తండ్రి మంచి ముహూర్తాల గురించి చెబుతాడు. అబ్బాయి వాళ్ళు పెళ్ళి స్థలమైన సింహాచలంకు ఒక రోజు ముందే చేరుకుని విడిదిలో బసచేసి, పెళ్ళి రోజు తెల్లవారుఝామునే నిద్రలేచి చూస్తే అమ్మాయి వాళ్ళెవరూ కనిపించరు. పెళ్ళిలో అమ్మాయికి పెట్టాల్సిన నగల పెట్టె అగుపించక దుఃఖిస్తుంటే... బంధువులు ఓదార్చి, విశాఖపట్టణంలోని అపరాధ పరిశోధకుడు రామమోహనరావును కలిస్తే సమస్య పరిష్కారమవుతుందని చెబుతారు. దాంతో విశాఖకు వెళ్ళి జరిగినదంతా రామమోహనరావుకు చెప్పాక, నేర పరిశోధనకు అంగీకరించిన ఆయన, తాను రేపు రాజమండ్రిలో ఓ పెళ్ళికి వెళ్లొచ్చాక మొదలెడతానంటాడు. అక్కడే తనకు కోర్టు పని ఉన్నందున తాను కూడా వస్తానని నారాయణరావు అంటాడు. రాజమహేంద్రవరంలో కామేశ్వరరావు పరమధార్మికుడైన ధనిక బ్రాహ్మణుడు. ఇతనికి పద్మనాభరావు, కాంతమ్మ అనే ఇద్దరు పిల్లలు. కామేశ్వరరావు భార్య మరణించినందువల్ల ఒక వంటల వాడిని పెట్టుకుంటాడు. ఈ వంటలవాడు యజమాని కొడుకు పద్మనాభరావును అపహరిస్తాడు. కొడుకు జాడ ఎంత వెదికినా అతనికి దొరకదు. తన కూతురు కాంతమ్మ పెళ్ళికి పూనుకుంటాడు కామేశ్వరరావు. ఈ పెళ్ళికే రామమోహనరావు, నారాయణరావు వస్తున్నారు. అంతలో ఒక పేదవాడు వచ్చి కామేశ్వరరావును కలిసి దొరికిన అతని కొడుకు (పద్మనాభరావు) గురించి చెప్పి, తనకు వెయ్యి రూపాయలిస్తే అతన్ని అప్పచెబుతానంటాడు.


అప్పుడే అక్కడికి వచ్చిన రామమోహనరావుకు, అపహరించబడిన కామేశ్వరరావు అబ్బాయి పద్మనాభరావే స్త్రీ వేషంలో ఉండి పారిపోయిన పెళ్ళికూతురు బంగారమ్మ అనే విషయం అర్థమై, పోలీసులకు అప్పజెప్పుతాడు. మోసం బయటపడుతుంది. ఈ మోసగాళ్ళు నరసీపట్టణంలో ఉన్న తమ మిత్రుడు ఆనందరావు దగ్గర ఉన్న నగలను అమ్ముదామనుకున్న సంగతిని రామమోహనరావు, నారాయణరావులు పసిగడతారు. వారు ఆనందరావును పట్టుకోవడానికి నరసీపట్నం చేరుకొని మారువేషంలో తిరుగుతుండగా, నగలు అమ్ముతున్న ఓ వ్యక్తి (ఆనందరావు) తారసపడడంతో తాము కొంటామని చెప్పి... ఇంకా నగలను చూపించమంటారు. అతడు తన ఇంటికి తీసుకెళ్ళి నగలన్నీ చూపించగానే... అవన్నీ తమవే అని నారాయణరావు చెప్పడంతో, ఆనందరావును బంధించి పోలీసులకు అప్పచెబుతాడు రామమోహనరావు. ఆ తర్వాత దొరికిన రాఘవయ్యను కూడా పోలీసులు విశాఖకు తరలిస్తారు. మోసం చేసిన వారికి శిక్ష పడుతుంది. పోయిన నగలు, డబ్బు దొరుకుతాయి. అనంతరం కృష్ణారావు పెళ్ళి జరిగి కథ సుఖాంతమవుతుంది. ఇదీ ఇందులోని ఇతివృత్తం.

లోకంలో అమ్మాయిలకు వరుణ్ణి వెదకడం సర్వసాధారణం అనే విషయం ఈ నవలిక రచయిత శ్రీరంగం శ్రీనివాసరావు (శ్రీశ్రీ) పద్నాలుగేళ్ళ ప్రాయానికే గుర్తించడం గమనిస్తాం. లోకంలో అమ్మాయి పక్షం వాళ్ళు వరుణ్ణి వెదకడం ఆచారం. కానీ దానికి భిన్నంగా అబ్బాయివాళ్ళే వధువును వెదకడం చూస్తాం. ఇందులోని కథను మలుపు తిప్పిన తీరును గమనిస్తే పద్నాలుగేళ్ళకే చేయితిరిగిన రచయితలా కనిపిస్తాడు శ్రీశ్రీ.


ఈ పుస్తకంలో లేఖనానికి సంబంధించి వలపల గిలక ప్రయోగింపబడింది. ‘వో’ అనే అక్షరాన్ని మరో రకంగా ముద్రించారు. ఇలా నేటి ముద్రణకు, లేఖనానికి భిన్నమైన పూర్వరూపాలు గమనిస్తాం. ఇందులో ‘‘అంతట నప్పురుషుడు తన పేరు రాఘవయ్య యనియు, దానాతని దూరపు బంధువుడననియు, వరుసకు బావ నగుదుననియు దన్నెఱింగించుకొని తన నివాస స్థలము చీపురుపల్లి యని వచించెను’’ (పుటలు–2, 3, ఆంధ్ర సంజీవనీ గ్రంథమాల ప్రచురించిన పరిణయ రహస్యము) అనే రీతిగా గ్రాంథిక ప్రయోగమే ఎక్కువగా ఉంటుంది. పద్నాలుగేళ్ళ ప్రాయానికే ‘పరిణయ రహస్యము’ నవలికను ఎంతో పరిణతితో రచించాడు శ్రీశ్రీ.

డా. రాపోలు సుదర్శన్‌

ప్రధాన కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర అరసం

Updated Date - Jun 16 , 2024 | 04:38 AM

Advertising
Advertising