ముసుగుల్ని సహించని అక్షరం
ABN, Publish Date - Aug 26 , 2024 | 12:51 AM
కథలు, కవితలు, స్మృతి వ్యాసాలూ కూడా రాసినా గానీ కాశీభట్ల వేణుగోపాల్‌ను ప్రధానంగా నవలా రచయిత గానే పాఠకులు గుర్తుంచుకుంటారనుకుంటాను. ఆ నవలలు అలాంటి ఇతివృత్తాలతో, అలాంటి శైలితో...
కథలు, కవితలు, స్మృతి వ్యాసాలూ కూడా రాసినా గానీ కాశీభట్ల వేణుగోపాల్‌ను ప్రధానంగా నవలా రచయిత గానే పాఠకులు గుర్తుంచుకుంటారనుకుంటాను. ఆ నవలలు అలాంటి ఇతివృత్తాలతో, అలాంటి శైలితో తెలుగులో ఆయనొక్కరి దగ్గరే దొరుకుతాయి. ‘నేనూ–చీకటి’, ‘దిగంతం’, ‘తపన’, ‘తెరవని తలుపులు’, ‘మంచు పూవు’ లాంటి నవలలు తెలుగు సాహిత్యంలో ఆయన ప్రత్యేక సంతకంగా నిలుస్తాయి. ‘నవలా శిల్పం’ అన్న ఈ శీర్షిక కోసం కాశీభట్లను మాట్లాడించాలని జూలై నెలలో ఫోన్ చేశాను. ఆయన ప్రశ్నలు పంపమన్నారు. కానీ పంపిన ప్రశ్నలకు దేనికది జవాబు ఇవ్వకుండా అంతా కలిపి ఒకే చిన్న వ్యాసంలా రాశారు. అందులో కూడా నేను అడిగిన ప్రశ్నలన్నింటికీ జవాబులు లేవు. తర్వాత ఫోన్ చేసి వాటి గురించి అడిగాను. ఆ సంభాషణలో కూడా ఆయన్నుంచి పెద్దగా జవాబులు రప్పించలేకపోయాను. దాదాపు ఐదేళ్ళ గాప్ తర్వాత నేను చేసిన ఈ ఫోన్ కాల్స్‌లో ఆయన గొంతు చాలా మారిపోయి వినపడింది. పదం పదం కూడబలుక్కున్నట్టు మాట్లాడుతున్నారు. దరిదాపుల్లో పొంచి ఉన్న మరణమే ఆ అలసటకి కారణమేమో. ఏదేమైనా ఆయన్ని నవలా రచన మీద మాట్లాడిద్దాం అన్న నా ప్రయత్నం అసంపూర్తిగా మిగిలింది. ఆగస్ట్ 19న ఆయన వెళ్ళిపోయారు.
కాశీభట్ల ఈ నిష్క్రమణ కోసం చాలా కాలం నుంచే పెట్టే బేడా సర్దుకుని సిద్ధంగా ఉన్నారేమో అనిపిస్తుంది. అంటే జీవితం పట్ల ఏదో నిరాశతో కాదు. ‘మళ్ళీ ఎగరాలని...’ ఆశ ఎప్పుడూ ఉంది. కానీ అప్పటిదాకా ఎలా పడితే అలా వాడిన శరీరం త్వరలోనే పగ తీర్చుకుంటుందని ఆయనకి తెలుసు. 2013లో ఒక వెబ్‌మేగజైన్ కోసం ఆయన్ని ఇంటర్వ్యూ చేశాను. ఆ సంభాషణలో ఆయన ‘‘ఇదే నా చివరి ఇంటర్వ్యూ అవుతుందేమో’’ అన్నారు. ఆ తర్వాత అనారోగ్యాలతో చేతనైనంత యుద్ధం చేస్తూ, మరణాన్ని వీలైనంత వాయిదా వేసి, పదేళ్ళ తర్వాత, ఇలా చివరి ఇంటర్వ్యూ మళ్ళీ నాకే ఇచ్చి వెళ్ళిపోయారు. ఆ అసంపూర్ణమైన ఇంటర్వ్యూనే ఇక్కడ ఇస్తు న్నాను. ఇది నేను అనుకున్నట్టు నవలల మీద సాగలేదు. ఐతే 1997లో నా పదిహేనేళ్ళ వయసులో ఆయన అక్షరంతో మొదటి పరిచయం అయినదగ్గర్నుంచీ ఇరవై ఎనిమిదేళ్ళ వయస్సులో 2010లో స్వయంగా ఆయనతో పరిచయం అయ్యేదాకా ఒక పాఠకుడిగా నాకు ఆయన నవలలతో, శైలితో దగ్గరి పరిచయం ఉంది. నవలా రచన మీద కాశీభట్ల అభిప్రాయాలేమిటో నాకు తెలుసు.
రచన అనేది బుద్ధిపూర్వకంగా, ఆద్యంతం అంతా తెలిసి చేసే పని అని ఆయన ఎప్పుడూ అనుకోలేదు. పెన్ పుచ్చుకొని ఖాళీ కాయితం ముందు కూర్చుని ఏదైనా రాయటానికి పూనుకోవటం అంటే– ఆయన దృష్టిలో– అది తెలీనిదేన్నో వెతుక్కుంటూ మొదలుపెట్టే ప్రయాణం (‘‘a journey in seach of an unknown’’). ఆ వెతుకులాట కూడా నింపాదిగా సాగేది కాదు. అందులో ఒక తొందర, తరుముడు ఉంటుంది, ముగింపు చేరాకే ఊపిరాడుతుందన్న వేగం ఉంటుంది. ‘‘నా పుస్తకాలేవీ వందపేజీలు దాటవు. నేను చెప్పదల్చుకున్నది అంతా కండెన్స్‌డ్‌గా ఉంటుంది. I hurry towards the end. చివరి వాక్యం కోసం పరిగెడు తుంటాను. అక్కడికి వచ్చాకా ‘ఆహ్’ అన్న రిలీఫ్’’ అంటారు. అప్పట్లో నేను పనిచేస్తున్న వెబ్‌మేగజైన్‌కి ఒక కథ పంపితే ఆయన చేతి రాతని మొదటి సారి చూశాను. స్కూలు పిల్లలు వాడే లాంటి సింగిల్ రూల్ నోట్ బుక్‌లో ఎరుపు బాల్ పాయింట్ పెన్‌తో మూడేసి చుక్కల పంక్చువేషన్ ఎడా పెడా వెదజల్లుతూ రాశారు. అది ఎన్నో డ్రాఫ్ట్ అని అడిగితే ‘‘మొదటి డ్రాఫ్ట్’’ అన్నారు.
ఆయనకు రచయితగా చాలా ఆలస్యంగా గుర్తింపు వచ్చింది. నలభై మూడేళ్ళ వయస్సులో ఆయన మొదటి నవల ‘నేనూ – చీకటి’ ఆంధ్ర ప్రభలో సీరియలైజ్ అయ్యింది. ఎప్పుడో ఇరవై ఏళ్ళ వయస్సులో ఉండగా రాసిన ‘రంగనాయకి లేచిపోయింది’ అన్న మొదటి కథ పబ్లిష్ ఐనప్పుడు అది చదివి ఆయన గురువు దావూద్ సాహెబ్ అన్న మాటలే కాశీభట్లను ఆ తర్వాత పాతికేళ్ళ పాటు ఏమీ పబ్లిష్ చేయకుండా చేశాయి: ‘‘ఒరే నువ్వు చాలా బాగా రాస్తున్నావు. కానీ నీ మెదడింకా ఎదగాల్సి వుంది. దానికి నీకు పుస్తకాలకంటే మనుషులెక్కువ పని చేస్తారు. ప్రపంచాన్ని విస్తృతంగా పర్యటించటానికి ప్రయత్నించు. అధ్యయనం చేయి. రాసిన వాక్యాన్ని సపోర్ట్ చేసుకోగలవూ అన్నప్పుడే ఒక వాక్యాన్ని రాయి. పదిమంది పది ప్రశ్నలేస్తే ఆ పదిమందినీ కన్విన్స్ చేసేట్టు ఆ వాక్యం ఉండాలి. లేదంటే ఆ వాక్యాన్ని నీకై నువ్వు సపోర్ట్ చేసుకునేట్టుగా ఐనా ఉండాలి. అంతవరకూ రాయద్దురా,’’ అన్నాడట. గురువు మాటని అక్షరాలా పాటించాడాయన. సైకిలెక్కి దేశమంతా తిరిగాడు. ప్రతి వాక్యం వెనుకా బలంగా నిలబడగలనన్న నమ్మకం వచ్చేదాకా రాయలేదు. అలా పాతికేళ్ళ పాటు దేన్నీ పబ్లిష్ చేయ కుండా నిశ్శబ్దంగా ఉండిపోయి, నలభై మూడో ఏట ఒకేసారి ‘నేనూ–చీకటి’ ప్రచురించేసరికి, తెలుగు సాహిత్య లోకం ఉలిక్కి పడింది. శేషేంద్ర శర్మ ఆ నవలని ‘‘బౌద్ధిక భూకంపం’’ అన్నారు.
ఆ నవలలోనూ, ఆ తర్వాత రాసిన ప్రతి నవలలోనూ– బైట సమాజానికి కనపడని మనిషిలోని చీకటి తావుల గురించి ఎక్కువ రాశారు. ఆ చీకట్లను దాచుకోవటానికి మనిషి తొడిగే ముసుగుల గురించి రాశారు. మననం చేసుకోవటానికి కూడా మనమే సిగ్గుపడే ఆలోచనలకి నిర్మొహమాటమైన అక్షరాల్ని ఇచ్చారు.
వీటి గురించే ఎందుకు రాయాలని అడిగితే ఆయన చెప్పిన జవాబు: ‘‘మామూలు విషయాలు చెప్పటానికి చాలామంది ఉన్నారు. జీవితాన్నీ ప్రపంచాన్నీ సౌందర్యవంతం చేయటానికీ, మనసును చల్లబరచటానికీ, ఉపశమనంగా రాయటానికీ కోట్లాది మంది రచయితలున్నారు. నాలాంటి వాడు మధ్యలో ఎక్కడో ఉంటే తప్పేం లేదు కదా. ఇప్పుడు కాదు, ఇంకెన్ని రాసినా నేను డార్కర్ సైడ్ ఆఫ్ లైఫ్ గురించే రాస్తాను. ఈ లాబరింత్ (labyrinth)ను నేను ఎక్స్‌ప్లోర్ చేస్తూనే వెళ్తున్నాను. బయటకు దారి దొరుకుతుందేమో తెలియదు. దొరకదేమో కూడా. By the time I’ll be dead. నేను చచ్చిపోయింతర్వాత ఏమవుతా నన్నది అస్తిత్వవాదం ప్రకారం నాకు సంబంధం లేదు. నా రచనలన్నీ నేను బతికుండగానే తగలబెట్టి ఎవడన్నా దాని మీద ఒంటేలుకు పోయినా కూడా నాకేం ప్రోబ్లెం లేదు. I wanted to speak out my inner self.’’
ఆయన మాటల్లో– ‘నేనూ చీకటి’లో కవిత్వ శైలి గురించి:
నా సాహితీ ప్రస్థానం కవిత్వంతోనే మొదలైంది. అసలు మొదటి నవలగా పిలవబడుతున్న ‘నేనూ చీకటి’ మొదటి వాక్యాలు కవితా వాక్యాలే... తరవాత అందులోకి కథ ప్రవేశించింది. మెల్లగా కథ దాన్ని ముందుకు లాక్కుపోయింది. అందుకే అందులో కొన్ని వ్యక్తిగత జీవితంలోని చాలా ఘటనలు నిర్మొహమాటంగా ప్రవేశించాయి.
కవిత్వమన్నది పూర్తి వ్యక్తిగతమైందని నేను నిష్కర్షగా నమ్ము తాను. ఏ సంఘటననైనా కవితగా రాయొచ్చు అని నేననుకోను. కవిత్వానికి భాష ప్రత్యేకమైంది కావాలి, ఉపమలూ ఉత్ప్రేక్షలూ వుండాలి, భాషలో సాంద్రత అవసరం... కొద్దిగా మ్లిష్టత కూడా వుండాలి. ఆ మ్లిష్టతపాలు మరీ ఎక్కువై ‘నేనూ–చీకటి’ ఎక్కువమంది పాఠకులకు అందలేదు... ‘నేనూ–చీకటి’లో కథ ఉంది. ఆ కథ పాఠకులకు అర్థం కావాలి అని నేననుకున్నాను. కానీ కాలేదని అర్థమైంది. ఆ విషయం గ్రహించాను. కాబట్టి పాఠకులకేమైనా అర్థం కావాలనుకుని నేను రాస్తే అది ‘నేనూ – చీకటి’కి భిన్నంగా వుండాలని అనుకున్నాను. అందుకనే అదే కాలంలో మొదలుపెట్టి కంప్లీట్ చేసిన ‘తపన’లో మ్లిష్టతని చాలామటుకు తగ్గించేశాను.
రాసే భాషపై సంస్కృత ప్రభావం
బ్రాహ్మణ కుటుంబంలో పుట్టడం, రోజూ సంస్కృతంలో మంత్రాలు వినడం, తండ్రి పురోహితుడు కావడం, అమ్మ కూడా పురోహిత కుటుంబీకురాలు కావడం... ప్రతీ ఉదయం నామలింగా నుశాసనం అనబడే అమరకోశం వల్లె వేయడం... ఇలాంటి కారణాల వల్ల సంస్కృతంలా బరువైన తెలుగు భాష వాడటం అలవాటు చేసుకున్నా (‘నేనూ–చీకటి’కి మాత్రం). తర్వాత ఇమ్మీడియెట్‌గా సంస్కృతం వాడటాన్ని తగ్గించేసా.
నవలలన్నీ ఫస్ట్ పెర్సన్‌లోనే ఎందుకు
నేను రాసిన నవలలు చాలామటుకు నిజ జీవితాన్ని రిఫ్లెక్ట్ చేస్తూ వుంటాయి, సంభాషణలతో సహా... కాబట్టి ఆ ఆ జీవితాలు నాకు అత్యంత పరిచయమైనవిగా వుండాలి. నేను రాస్తున్నా కాబట్టి, నాకు తెలిసిన కథలు కాబట్టి ‘నేను’ చెబుతాను. అదొక్కటే కాదులెండి. అదొక సిగ్నేచర్ కూడా.
రాయటానికి ఇబ్బంది పెట్టిన నవల
‘తెరవని తలుపులు’. ఎందుకంటే అది నాకస్సలు పరిచయం లేని వ్యక్తుల గురించి రాసింది కాబట్టి. నా చేత ఆ నవల అడిగి రాయించుకున్న వ్యక్తి అందులోని మిగతా వ్యక్తుల గురించి చిన్న చిన్న డీటైల్స్ కూడా నాకు చెప్పడంలో కష్టపడ్డాడు. చాలా చిన్న నవల (నావన్నీ చిన్నవే). కానీ రాయడానికి నాకు పట్టిన సమయం మూడున్నరేళ్లు! అంతగా ఇంకే నవల రాయడానికి కష్టపడలేదు.
ఏది కథ, ఏది నవల
కథ అన్నది ఒక ఇన్సిడెంట్. నవల కొన్ని ఇన్సిడెంట్స్ కలిపి రాసేది. ఇది నేను ఇచ్చుకున్న అర్థం.
రీరైటింగ్? రివిజన్?
నేను ఇంతవరకు ఏదీ రీరైట్ చేయలేదు. ప్రూఫ్ రీడ్ చేసేట ప్పుడు అచ్చుతప్పులు సరి చేస్తాను, ఎక్కడైనా పదాలు మార్చా లంటే మారుస్తాను. ఇన్ని గంటలు అని పెట్టుకుని రాయడం నాకు చేత కాదు. ఒక్కోసారి కొన్ని వారాల పాటు దాని జోలికి వెళ్లను. నా రచన ఇంటెన్స్ గా కనపడుతుందేమో గానీ నేను చాలా లేజీ రైటర్‌ని.
ఎక్కువ చదవటం తప్పనిసరి రచయితన్నవాడు మంచి పాఠకుడు కావాలి. ఒకరిద్దరిని కాదు. ఎంతమందిని వీలైతే అంతమంది రచయితల్ని చదవాలి. మంచి స్టాండర్డ్ ఉన్న రచయితల్ని ఎన్నుకుని చదవాలి. ప్రపంచ సాహిత్యం చాలామటుకు ఇంగ్లీష్‌లోకి అనువాదమై ఉంది కాబట్టి ఎక్కువ చదవడం కోసం మనకు ఇంగ్లీష్ వచ్చుండాలి.
ఇంటర్వ్యూ : మెహెర్
Updated Date - Aug 26 , 2024 | 12:51 AM