ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

శ్రమ వెలిగించిన అక్షరం

ABN, Publish Date - Oct 21 , 2024 | 12:46 AM

తె లుగు సాహిత్యంలో చెరగని మహోన్నత చరిత్ర శారద. సరిగ్గా వంద సంవత్సరాల క్రితం తెలీని తేదీన తమిళ నాడులోని పుదుకోట్టైలో పుట్టిన ఎస్. నటరాజన్ 88 ఏళ్ళ క్రితం 1937లో ఒక చలికాలం ఉదయం...

తె లుగు సాహిత్యంలో చెరగని మహోన్నత చరిత్ర శారద. సరిగ్గా వంద సంవత్సరాల క్రితం తెలీని తేదీన తమిళ నాడులోని పుదుకోట్టైలో పుట్టిన ఎస్. నటరాజన్ 88 ఏళ్ళ క్రితం 1937లో ఒక చలికాలం ఉదయం కడుపు చేత పట్టుకుని తెనాలిలో కాలుమోపాడు. అప్పుటికే ఆంధ్రా ప్యారిస్‌గా ప్రసిద్ధి చెందిన తెనాలి శారదకి కూడా హోటల్ పనివాడిగా ఓ దారి చూపింది. ఆసక్తితో తెలుగు నేర్చు కున్నాడు. అనురక్తితో అభ్యుదయ సాహిత్యం చదువు కున్నాడు. అలా ఎందరో మిత్రుల్ని అక్కున చేర్చుకు న్నాడు. స్వశక్తితో కలం పట్టి సగటు మనిషి పక్షం చేరాడు. ప్రజాపక్ష రచయితగా వందకి పైబడి కథలు, పదుల సంఖ్యలో నవలలు రాశాడు శారద అనబడే ఎస్. నటరాజన్.


తమిళనాడు ప్రభావంతో తెనాలిలో అప్పుడప్పుడే వెలుస్తున్న కాఫీ హోటెళ్ళలో పనివాడిగా మొదలుపెట్టి అనేక అవతారాలు ఎత్తాడు. సర్వర్‌గా, వంట పనివాడిగా ప్రారంభించి ప్రెస్ వర్కర్‌గా పత్రికలు, పుస్తకాలు అమ్మడం; గారెల దుకాణం; మజ్జిగ వ్యాపారం వరకూ ఎన్నో పనులు చేసాడు. అంతేనా, ‘ప్రజావాణి’ పత్రిక నుంచి ‘చంద్రిక’ పత్రిక స్థాపన దాకా పాత్రికేయుడిగా సాహితీ ద్రష్టగా రూపొందాడు. అల్లూరి సీతారామరాజు, కన్నెగంటి హనుమంతుల జీవిత ఆదర్శాలతో ఏకంగా సినిమాలు తీయాలని తపించాడు. మొట్ట మొదటి హోటల్ వర్కర్ల సంఘం వ్యవస్థాపకుల్లో ఒకరయ్యాడు. కాంగ్రెస్‌తో మొదలై సోషలిస్టు, రాడికల్ హ్యూమనిస్టు ధోరణులను కూడా ప్రత్యక్షంగా చూసి స్వతంత్ర ఆలోచనా పరుడిగా కమ్యూనిజాన్ని ఎంచుకున్నాడు. తెలుగులో శ్రమజీవి వైపు నిల్చే రచనా వ్యాసంగాన్ని సృష్టించిన విశిష్టమైన దార్శనికుడిగా ఎదిగాడు.

రోజుకి పద్దెనిమిది గంటలు వంచిన నడుము ఎత్తకుండా పనిచేస్తూ శక్తిని హోటల్‌ పనికే ధారపోసిన ఆ భావుకుడు, పుట్టిన తర్వాత సరైన తిండీ, గుడ్డా ఎరగనని రాసుకున్నాడు. స్వతంత్రం వచ్చాక ఇలాగ ఉండదని ఆశించానని వాపోయాడు. కాఫీలు, బీడీలతోనే బతికిన శారద చిట్టచివరి వరకూ తన శక్తినీ, రక్తాన్నీ తెలుగు సాహిత్యం కోసమే ధారపోశాడు. ఇంతా చేసి అతడు బతికింది ముప్పై సంవ త్సరాలు మాత్రమే. అందులోనూ అతడి రచనలు చేసిన కాలం మొత్తం ఏడేళ్ళే. అంత చిన్న వయసులో ఒకవైపు నిత్యం బతకడానికి పోరాటం చేస్తూనే మరోవైపు తెలుగు భాషా సాహిత్య సారస్వ తాల్ని శ్రామిక వర్గ దృక్ప థంతో నిరంతరం సుసం పన్నం చేసిన రచయిత మరొకరు లేరు.


అప్పటికే పాత్రికేయుడిగా తండ్రి వారసత్వం, తమిళ నాట వెలువడిన ఆంగ్ల అనువాద ప్రగతిశీల సాహిత్య ప్రభావం శారద మీద ఉంది. జీవితం నేర్పిన అసంఖ్యాక చేదు అనుభవాలు ఉన్నాయి. అదీకాక చలం, కుటుంబరావు తదితర అభ్యుదయ రచయితల పుస్తకాలనీ చదివాడు. ఆ స్పూర్తితోనే ‘ప్రపంచానికి జబ్బు చేసింది’ అనే తొలి రచనతో ప్రజాశక్తిలో కలాన్ని ఝుళిపించి తనదైన గొంతుకతో నినదించిన శారద తన శరీరాన్ని తొలిచేస్తున్న మూర్ఛ జబ్బుకి బలై పోయాడు. అభ్యుదయ రచయితల సంఘంలో ‘‘రచనకు తగిన పారితోషికం పొందడం రచయిత హక్కు’’ అంటూ బహుశా మొట్టమొదటిసారిగా తీర్మానం పెట్టిన శారద అవే ఆర్థిక బాధలతో అస్తవ్యస్త సమాజంలో అసహాయంగా అశువులు బాసాడు.

‘‘పత్రికలవారు కథలు రాస్తే ఇచ్చే డబ్బులు నా మూర్ఛ రోగాన్ని నయం చేసుకోడానికన్నా సరిపోతాయేమోనని సంతోషించాను. అదీ వట్టిదై పోయింది. ఈ పద్ధతిలో నేను స్వతంత్ర భారత పౌరుణ్ణని భావించ లేకపోవడంలో నా తప్పేమీ లేదనుకుంటాను’’ అంటూ, సరిగ్గా 75ఏళ్ళ క్రితం 1949 ఫిబ్రవరిలో ‘తెలుగు స్వతంత్ర’ పత్రికలో ‘నాదైన సమస్యలు’ పేరిట శారద రాసుకున్న చివరి వాక్యాలివి. అసలా వ్యాసమే ‘‘నాకు అనిపిస్తుంది అప్పుడప్పుడు. ఈ చాకిరీ చేస్తూ ఇట్లా ఆలోచనలు చేస్తే తొరగా చచ్చిపోతానని,’’ అంటూ ప్రారంభిస్తాడు. చని పోయే నాటికి నిండు గర్భవతియైన భార్యా, ఇద్దరు పిల్లలు ఉన్న శారదకి మరణించిన తర్వాత కూడా తెలుగు సాహిత్యం, పాలకులు ఏమేరకు సముచిత స్థానం ఇచ్చారనేది ప్రశ్నార్థకమే.


వాస్తవ జీవన సమరం కావిస్తూ, దుర్భర దారిద్ర్యంతో సంఘర్షించాడు కనుకనే సమసమాజం కోసం స్వప్నించిన నిబద్ధత కలిగిన విప్లవ స్వాప్నికుడు కాగలిగాడు శారద. అందుకే వ్యవస్థలోని ఆధిపత్య రూపా లన్నింటినీ రచనలుగా మల్చి మానవ సంబంధాల్లోని అసమానతల్ని అక్షరీకరిం చాడు. దైనందిన జీవితంలోని ఒడిదుడుకుల్ని, సామాన్యులకి ఎదురయ్యే సమస్యలను నిజాయితీగా చర్చించాడు. ఒకనాటి తెలుగు సాహిత్య సాంస్కృతిక రాజ కీయార్థిక సమాజానికి ప్రతిబింబంగా నిలిచే ఎన్నో రచనలు చేసాడు.

ప్రస్తుతం శారద సంతానం పెద్ద వాళ్ళయ్యారు. వివిధ ప్రాంతాల్లో స్థిరపడ్డారు. ఆ మధ్య కొందరు ఔత్సాహికులు పూనుకుని శారద రచనలు ప్రచురించారు. కొన్ని విశ్వవిద్యాలయాల్లో శారద రచనలు విద్యార్థులకి పాఠ్యాంశంగా కూడా పెట్టారు. అయితే, తెలుగు భాషపై మక్కువతో తెలుగు సాహిత్యం మీద మమకారంతో తమిళ నాట పుట్టి మూడు పదుల వయసులోనే జీవన యవనిక నుంచి నిష్క్రమించిన ఒక యువ ఆలోచనాపరుడు, తత్వవేత్త, మేధావి, పాత్రికేయుడు, కథకుడు, రచయిత, వ్యాసకర్త, అన్నింటికీమించి తెలుగు భాషను గుండెల్లో పెట్టుకుని ప్రేమించిన నిష్కళంక శ్రమజీవిగానే శారదని గుర్తించడం సబబు. అంతకంటే ముఖ్యంగా, తెలుగు ప్రాంతంలో క్రియాశీల ఆరంభ సామ్యవాదుల్లో ఒకడిగా, కమ్యూనిస్టు కార్యకర్తగా జీవితాన్ని మల్చుకునే క్రమంలో ఆచరణలోనే అక్షర కక్ష్యల్ని చేధించిన అరుదైన యోధుడిగా శారదని స్మరించుకోడమే సముచితం.


శారద పుట్టిన సంవత్సరం 1924 అనీ 1925 అనీ వాదనలు ఉన్నాయి. చనిపోయింది మాత్రం 1955 ఆగష్టులో. ఆలూరి భుజంగరావు గారు రచించిన శారద జీవితచరిత్ర, ఆయన కథలతో కలిపి ‘స్మృతి శకలాలు’ పేరిట మొదటిసారి 40ఏళ్ళ క్రితం 1985లో, రెండోసారి పదిహేనేళ్ళ క్రితం 2009లో తెలుగులో వచ్చింది. ఆయన జీవితం, రచనల గురించి పరిశోధించి పట్టాలు పొందిన వాళ్ళు కూడా ఎందరో ఉన్నారు. అయినప్పటికీ అవిశ్రాంతంగా ఈ నేల మీద ఉవ్వెత్తున ఎగసిన శారద అక్షర ప్రభంజనాన్ని అంచనా వేయాల్సిన బృహత్కార్యం ఇంకా మిగిలే ఉంది.

(శారద శతజయంతి సందర్భంగా)

గౌరవ్

90320 94492

Updated Date - Oct 21 , 2024 | 12:46 AM