ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

సువర్ణముఖి ఒడ్డున ఇసక బొమ్మల గూడు

ABN, Publish Date - Jul 15 , 2024 | 02:07 AM

ఆధునిక తెలుగు సాహిత్యం చాలావరకు మిడిల్‌ క్లాస్‌ వ్యవహారం లానే నడిచింది. పంతొమ్మిదొందల ఎనభైలూ తొంభైల దాకా కూడా అది మిడిల్‌ క్లాస్‌ చేత, మిడిల్‌ క్లాస్‌ కోసం, మిడిల్‌ క్లాస్‌ థీమ్స్‌తో రాయబడిందే...

ఆధునిక తెలుగు సాహిత్యం చాలావరకు మిడిల్‌ క్లాస్‌ వ్యవహారం లానే నడిచింది. పంతొమ్మిదొందల ఎనభైలూ తొంభైల దాకా కూడా అది మిడిల్‌ క్లాస్‌ చేత, మిడిల్‌ క్లాస్‌ కోసం, మిడిల్‌ క్లాస్‌ థీమ్స్‌తో రాయబడిందే. దాన్ని బేరీజు వేసింది కూడా అదే క్లాసు. పేద వర్గాల నుంచి ప్రతిభావంతులైన రచయితలు రావడం మొదలైంది ఎనభైలూ తొంభైల తర్వాతే (అప్పటిదాకా కులం, దాన్నంటుకునే ఉన్న పేదరికం వాళ్ళని చదువుల దాకా రానివ్వక). నాగప్పగారి సుందర్రాజు లాంటి రచయితల తర్వాత తెలుగు సాహిత్యపు సెంటర్‌ మిడిల్‌ క్లాస్‌ నుంచి పక్కకు జరుగుతూ వచ్చింది. ఇక్కడ మిడిల్‌ క్లాస్‌ అంటే జేబు తాహతు మాత్రమే కాదు, అదొక మనస్తత్వం కూడా.

ఇప్పటికీ ఎనభైల ముందే తెలుగులో గొప్ప సాహిత్యం అంతా వచ్చేసిందీ, ఇక ఆ తర్వాతంతా వేస్ట్‌లాండ్సే అన్న అభిప్రాయంతో చాలామంది ఉన్నారు. సాహిత్యాన్ని బేరీజు చేసే వ్యవస్థను ఇంకా మిడిల్‌ క్లాస్‌ మనస్తత్వమే ఆక్రమించుకుని ఉండటం దీనికి ముఖ్య కారణమనుకోవాలి. ఈ మెంటాల్టీ ఉన్నవాళ్ళు ఇప్పుడు అనేక అస్తిత్వాల నుంచి, వర్గాల నుంచి విరివిగా వస్తున్న సాహిత్యాన్ని నొస్టాల్జియా సాహిత్యం కేటగిరీలోకో, లేదంటే ఊళ్ళ పేర్లు పెట్టుకుని రాసే కతలు అనో పక్కకు తోసేస్తారు. అదీకాదంటే ఉదారంగా అథోజగత్‌ సహోదరుల కథలు అని దీవిస్తారు. వీళ్ళ ఉద్దేశంలో ‘అథోజగత్‌’ అంటే వీళ్ళకి కింద ఉన్న ప్రపంచం, మరి వీళ్ళెక్కడయ్యా అంటే- మిడిల్‌ క్లాస్‌! ఒకవేళ వీళ్ళు ఈ సాహిత్యాన్ని ఒప్పుకున్నా ఆ లెక్కలు వేరే ఉంటాయి. ఆయా సామాజిక వర్గాల అస్తిత్వాలకు సంబంధించిన సోషల్‌ డాక్యుమెంట్లలాగ మాత్రమే ఈ సాహిత్యానికి విలువ ఇస్తారు. దీనికి తగ్గట్టే కొంతమంది రచయితలు ఊరిలో బాల్య జీవితాల్నీ పేదరికాన్నీ మిడిల్‌ క్లాస్‌ టేస్ట్‌కు నప్పేట్టు, వాళ్ళకు నొప్పెట్టనంత సున్నితంగానూ కంఫర్టబుల్‌గానూ, మ్యూజియంలో అద్దాల వెనక ప్రదర్శనల్లాగా చేసి చూపించేవాళ్ళూ ఉన్నారు. ఇలాంటి ప్రదర్శనాభిలాష లేకుండా, ‘‘మా జీవితాలు మీ లివింగ్‌ రూముల్లోకి వచ్చి మీ సోఫాల్లో కూర్చోవు, చూడదల్చుకుంటే మీరే అంబేద్కర్‌ బొమ్మ దాటి మా వాడల్లోకి వచ్చి ఇక్కడ నిలబడి చూడండి!’’ అని ఎసెర్టివ్‌గా రాసే వాళ్ళు అరుదు. అలాంటి అరుదైన రచయితల వరసకు గొప్ప చేర్పు సొలోమోన్‌ విజయ్‌ కుమార్‌. రచయితగా ఆయన వయసు రెండు పుస్తకాలు. మొదటిది ‘మునికాంతపల్లి కతలు’ కథా సంఫుటి, రెండోది ‘సన్‌ ఆఫ్‌ జోజప్ప’ నవల.


మునికాంతపల్లి అనే ఊరు ఎక్కడా లేదు. అది సొలోమోన్‌ విజయ్‌ కుమార్‌ సువర్ణముఖి నది ఒడ్డున తనకు తెలిసిన మనుషుల్నీ, కథల్నీ సాహిత్యం చేసేందుకు కల్పించుకున్న ఊరు. విజయ్‌ కుమార్‌ తనకు జరిగిన అనుభవాల్ని, తనకు తెలిసిన మనుషుల్నే కథలుగా చెప్తున్నా నంటారు. ఆయన శైలి ఆ కథల్ని ఆపకుండా చదివిస్తుంది. కథ మొదలు పెట్టడమే ఒక సంఘటనతో మొదలుపెట్టి రెండు మూడు వాక్యాల్లోనే పాఠకుడ్ని కథ మధ్యలోకి తెచ్చి పడేస్తారు. తేరుకునే లోగానే రెండు మూడు పేజీల్లో ముగించేస్తారు. తన కవిత్వ నేపథ్యం తనను ఇలాంటి క్లుప్తతవైపు నడిపించిందని ఆయన చెప్తారు. కథేం లేదూ అనుకున్న చోట కథ పుట్టించడంలో సోలోమోన్‌ విజయ్‌ కుమార్‌ది ప్రత్యేక ప్రతిభ. ఈ కథలు చదివితే మనం మన చుట్టూ ఉన్న ఇన్ని కథల్ని చూడనే లేకుండా మిస్‌ అవుతున్నామా అనిపిస్తుంది.

ఊళ్ళో అన్ని సందులూ, అందరు మనుషులూ తెలిసినవాడొకడు ఫ్రెండ్‌ లాగా మన భుజం మీద చేయేసి ఆ ఊరి వీధులమ్మటా మనల్ని నడిపిస్తూ దార్లో కనపడిన ప్రతి మనిషినీ చూపించి ‘యీడి గురించి నీకోటి చెప్పాలిరా’ అనో ‘ఈమె భలే మనిషిరా’ అనో వాళ్ళ కథలు చెప్తూ తీసుకెళ్తున్నట్టు ఉంటుంది. విజయ్‌ కుమార్‌కి సృష్టిలో మనుషులకంటే, వాళ్ళ కథలకంటే ముఖ్యమైందేదీ లేదు. ఒక కథలో దేశదిమ్మరి కాశయ్య ఎక్కడెక్కడో తిరిగొచ్చి ఓ రోజు ఊళ్ళో చెట్టు కింద తన పక్కనే కూలబడి, ‘అడవుల్లోని సల్లదనవూ, బచ్చదనవూ, కొండల కాడ గాలీ..’ అంటా ఉంటే, అదంతా వద్దు కథకుడికి. కాశయ్య ఎప్పుడో యవ్వనంలో పెళ్ళి చేస్కుని వదిలేసినామె కథే కావాలి. ‘మల్లమ్మని జేసుకున్నానంటివే, యేవైనాదావే?’ అంటాడు. ఆ ఊళ్ళో ఉన్న ప్రతి మనిషి కథ పట్లా ఈ ‘ఇళ్ల బుచ్చోడి’కి ఉన్న కుతూహలమే, తరగని దాహమే ఇందులోని ప్రతి కథనీ చేయిపట్టి నడిపిస్తుంది! ‘సిన్నప్పుడు వాకిటికొక కతా, మనిషికొక కళా గెవణిస్తా తిరిగినాను కాబట్టే ఇన్ని సంవొచ్చరాలు గడిసినాక ఈ పిడికిడు సిట్టిపొట్టి కతల్ని రాయగలిగానని అనుకుం టుండాను’ అని చివరిమాటలో చెప్తాడు. ‘మునికాంతపల్లి మనుసుల్ని సొర్ణముకి యేటి ఇస్కతో జేసినట్టుండారు. పొడిసక ఎంత తేలిగ్గా యాళ్ల సందల్నుంచి జారిపోతాదో తడిసక అంత బొరువు’ అంటాడు. ఆ బరువైన తడి ఇసకతో చేసిన బొమ్మల చుట్టూ మెత్తిన ఇసక గూడు ఈ కథల పుస్తకం. చదువుతుంటే కరిగి నీరైపోయే మన మనసు లోనే ఆ బొమ్మలన్నీ కరిగి కలిసిపోతాయి.


ఈ కథలు చెప్పటానికి విజయ్‌ కుమార్‌ అచ్చంగా ‘చెప్పే’ శైలినే ఎంచుకున్నాడు. అంటే పుస్తకంలో అక్షరాల రూపంలో కనిపిస్తున్న ప్పటికీ ఇవి ‘రాయబడిన’ కథలు కావు. పాత్రల సంభాషణల్ని వేరు చేస్తూ కొటేషన్‌ గుర్తులు కూడా లేకపోవటం ఇందుకు ఒక రుజువను కోవచ్చు. చెప్పటంలో ఏ విషయాన్ని ఎలా దాచి ఎక్కడ చెప్తే ఆ కథ రక్తి కడుతుందో ఆ శిల్పం విజయ్‌ కుమార్‌కి తెలుసు. దేవగన్నిక సిత్ర ఆడా మగా కానివాడని ఎక్కడ చెప్పాలో, చివరకి చెరువులో తేలే ఎంగిలోడికి కుష్టురోగముందని ఎక్కడ చెప్పాలో అక్కడే చెప్తాడు. ఈ కథల్లో బూతుల్ని ఎక్కువ వాడతాడు, కానీ ఏ మాటా రచయిత తెచ్చి ఆ పాత్రల నోట పెట్టినట్టు ఉండదు. పాత్రలే వచ్చి రచయిత చెవిలో కూర్చుని చెప్పి రాయించుకున్నట్టు ఉంటాయి.

రచయిత రెండో పుస్తకం ‘సన్‌ ఆఫ్‌ జోజప్ప’కి వచ్చేసరికి, ముందొచ్చిన కతల పుస్తకం కేవలం నెట్‌ ప్రాక్టీస్‌ లాగా అనిపిస్తుంది. కథలకీ, నవలకీ పోలిక తేలేం నిజమేగానీ ఇంతకుముందు కథల్లో అక్కడక్కడా కన్పించిన మొదలుపెట్టాకా ఎటుపోవాలో తెలీనితనం, రెండు మూడు థీమ్స్‌ మధ్య తన్నకలాడటం లాంటివి ఈ నవల్లో లేవు. ఒకే థీమ్‌ని పట్టుకుని చాలా అందంగా, ధైర్యంగా చెప్పిన నవల ఇది. ఒకానొక హోమోసెక్సువల్‌ ‘పిల్లాడి’ కథ (ఆ కేరెక్టర్‌ పేరు పిల్లోడే). వాడి బాల్యం నుంచి మొదలుకొని, వాడు తన సెక్సువాలిటీ ఇదీ అని అర్థం చేసుకునే క్షణాల మీదుగా, ఆ తర్వాత వాడు దారీతెన్నూ తెలియక తొక్కే చీకటి దారుల గూండా, చివరికి వాడు ఎక్కడకొచ్చి తేలాడో, అదెలాంటి ఒంటరితనమో మనకి అనుభవానికి తెస్తాడు రచయిత. హోమో సెక్సువల్‌ అంటే అదేదో వేరే జీవి అన్నట్టూ, అలాంటి అనుభవాలు వేరే జీవితం అన్నట్టూ కాకుండా, మన అందరికీ ఉన్న కామమే కాస్త అటు దిశ మార్చుకుంటే, దాన్ని ఒప్పుకునే సమాజం చుట్టూ లేనప్పుడు, అది ఎంత కష్టమైన జీవితం కాగలదో, మనకి అర్థమయ్యేలా చూపిస్తాడు. అలాంటి మనుషుల పట్ల వెక్కిరింతే ఉన్న ప్రపంచంలో మనల్ని ఆ మనిషి మనసు లోకి తీసుకెళ్తాడు, వాడ్ని మనం మన గుండె లోకి తీసుకునేలాగ చేస్తాడు. ఒకరకంగా ఇది భయానక అనుభవాల సంపుటి. చాలా బాధపెట్టే కథ.


రాసేవాడు తన తాతగారి వంశపారంపర్య పడక్కుర్చీలో ఒద్దిగ్గా కూర్చుని రాస్తున్నాడా, తడి బారిన గోడల మధ్య వెలుతురు రాని గదిలో చింకి చాప మీద పడుకుని రాస్తున్నాడా అన్న దాంతో సంబంధం లేకుండా, వాడు రాసే రాతలో ఏం పణంగా పెడుతున్నాడూ, ఏ చీకటి మూలల్ని పందెం ఒడ్డుతున్నాడూ అన్నది కూడా లెక్కలోకి వస్తుందంటే- రచయిత ఇక్కడ చాలా పెద్ద పందెం ఒడ్డి ఈ నవల రాశాడు. ధైర్యాన్ని కూడా సాహిత్యానికి ఒక గుణం అని చెప్పగలిగితే ఇది తెలుగులో అత్యంత ధైర్యం గల పుస్తకమని చెప్పొచ్చు. తెలుగు సాహిత్యం మొహమాటం మొహమాటంగా దాటుకుపోయిన ఇతివృత్తాన్ని, ఏదో తెగించి అందర్నీ అఫెండ్‌ చేయటానికి రాస్తున్నా అన్నట్టు కాకుండా, అలాంటి జీవితాల్ని అత్యంత కరుణతో చదివినవారికి అర్థం చేయించేలాగ ఈ కథ చెప్పారు సోలోమోన్‌ విజయ్‌ కుమార్‌.

ఈ రెండు పుస్తకాలూ తెలుగు సాహిత్యం ఎల్లల్ని మరింత విశాలం చేసే పుస్తకాలు. మిడిల్‌ క్లాస్‌ మెంటాల్టీ పక్కనపెట్టి చూస్తే, తెలుగు సాహిత్యానికి ఇప్పుడు నడుస్తున్నవీ, ఇక ముందు రానున్నవీ ఎంతో మంచి రోజులే అనిపించేట్టు చేసే పుస్తకాలు.

ఎమ్‌. ఈశ్వర్‌ ప్రసాద్‌

Updated Date - Jul 15 , 2024 | 02:07 AM

Advertising
Advertising
<