సృజనశీలతలో నవ తరంగం
ABN, Publish Date - Oct 30 , 2024 | 05:19 AM
అసలు కృత్రిమ మేధ అంటే ఏమిటి? కృత్రిమ మేధకు సంబంధించి ప్రస్తుతం ప్రపంచంలో వస్తున్న మార్పులు ఏమిటి? ఆ మార్పుల ప్రభావం ఉద్యోగాలపై ఎలా ఉంటోంది?...
‘కృత్రిమ మేధ వలన కార్మికుల ఆదాయాలలో కోత పడింది. ఈ ఆదాయ క్షీణతకు ప్రధాన కారణం కృత్రిమ మేధ సంబంధించిన ఆటోమేషన్ -ఆధారిత ఆవిష్కరణలు’
అంతర్జాతీయ కార్మిక సంస్థ World Employment and Social Outlook 2024 నివేదిక.
అసలు కృత్రిమ మేధ అంటే ఏమిటి? కృత్రిమ మేధకు సంబంధించి ప్రస్తుతం ప్రపంచంలో వస్తున్న మార్పులు ఏమిటి? ఆ మార్పుల ప్రభావం ఉద్యోగాలపై ఎలా ఉంటోంది? తదితర అంశాలను ఈ సందర్భంగా చర్చించాల్సిన అవసరమున్నది.
కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్– ఎఐ) మన రోజువారి జీవితంలో ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. ఉదాహరణకు, మీరు సిరి లేదా గూగుల్ అసిస్టెంట్ లాంటి వాయిస్ అసిస్టెంట్‌ని ఉపయోగించి, ‘ఈ రోజు వాతావరణం ఎలా ఉంది?’ అని అడిగితే, ఎఐ మీ ప్రశ్నను అర్థం చేసుకుని సమాధానం ఇస్తుంది. అలానే మీరు కంప్యూటర్ కానీ మొబైల్ ఫోన్‌లో కానీ పదాలను టైప్ చేస్తూ తప్పు చేస్తే, అక్షర దోషాలను ఎత్తిచూపడం, లేదా ఆటో -కరెక్ట్ చేయడం కూడా ఎఐ పని. మీరు ఫోన్‌లో యూట్యూబ్‌లో మీకు నచ్చిన వీడియోలు చూసినప్పుడు, ఎఐ వాటిని గుర్తించి, మీకు నచ్చే ఇతర వీడియోలను సిఫారసు చేస్తుంది. అలాగే, గూగుల్ మ్యాప్స్ లాంటి నావిగేషన్ యాప్‌లు మీకు అత్యంత సులభమైన దారి చూపించడం కూడా ఎఐ పుణ్యమే. ఇవన్నీ సాధారణ ఎఐ మన నిత్య జీవితంలో మన పనిని ఎలా సులభతరం చేస్తుందో చెప్పే ఉదాహరణలు.
అయితే ఇప్పుడు ఈ సాంకేతికత మరొక అడుగు ముందుకువేసింది. సాధారణ ఎఐలో ఒక పాయ మరింత అభివృద్ధి చెంది జెనరేటివ్ ఎఐ(జెన్ ఎఐ) ఏర్పడింది. జెన్ ఎఐ అనేది ఒక ప్రత్యేకమైన సృజనాత్మక మేధస్సు. ఉదాహరణకు, మీరు జెన్ ఎఐకి ‘ఒక రాజు గారు- –ఏడుగురు కొడుకుల కథ’ అనే అంశం ఇచ్చి కథ రాయమంటే చిటికెలో ఒక కథని సృష్టించగలదు. మీరు చిత్రాన్ని వేయాలని అడిగి, కొన్ని సూచనలు ఇస్తే, మీకు కావలసినట్లుగా ఒక అందమైన బొమ్మను గీయగలదు. మీరు కొత్త పాట రాయాలనుకుంటే, జెన్ ఎఐ మీకు ఆసక్తి ఉన్న సంగీత శైలుల ఆధారంగా ఒక కొత్త పాటను సృష్టించగలదు.
సాధారణ ఎఐకు జెన్ ఎఐకు తేడా చెప్పాలంటే సాధారణ ఎఐ అనేది ఒక తెలివైన రోబో లాంటిది, ఇది మనం ఇచ్చిన సూచనలు పాటిస్తూ ప్రశ్నలకు సమాధానాలు చెప్పడం, గణిత సమస్యలు పరిష్కరించడం, సినిమాలు సూచించడం లాంటి నిర్దిష్ట పనులు చేస్తుంది. కానీ సొంతంగా అలోచించి కొత్తగా దేన్నీ సృష్టించలేదు. జెన్ ఎఐ మాత్రం, చాలా క్రియేటివ్ రోబో లాంటిది. ఇది చూసి, నేర్చుకున్న వాటిని ఉపయోగించి కొత్త విషయాలను సృష్టించగలదు. స్థూలంగా చెప్పాలంటే, సాధారణ ఎఐ మనం ఇచ్చిన నియమాలను పాటిస్తూ పనిచేస్తే, జెన్ ఎఐ తాను నేర్చుకున్న జ్ఞానాన్ని ఉపయోగించి కొత్త విషయాలను సృష్టిస్తుంది! అంటే సాధారణ ఎఐ పాత వంటగాడు లాంటిది: తనకు ఇప్పటికే తెలిసిన వంటకాలను మాత్రమే తయారుచేయగలదు. మీరు ఈ చెఫ్‌కు చికెన్, మసాలా దినుసులు, బియ్యం, పంచదార ఇస్తే, బహుశా ఈ దినుసులతో ఎలాంటి వంటకం సాధ్యం కాదు అనొచ్చు. కానీ జెన్ ఎఐ మాత్రం ఇప్పటివరకూ ఎవరికీ తెలియని తీపి వంటకాన్ని సృష్టించగలదు.
అసలు కృత్రిమ మేధ అనే భావన మొదట, 1950ల మధ్యలో శాస్త్రజ్ఞులు ఊహించారు. 1956లో, జరిగిన ‘డార్ట్‌మౌత్ సదస్సు’లో ‘కృత్రిమ మేధస్సు’ అనే పదం పుట్టింది. అప్పటి నుండి కంప్యూటర్లు మానవ మేధస్సు చేయగలిగిన పనులు చేయగలవని కలలు కనడం మొదలయ్యింది. 1980వ దశకంలో, కొన్ని కొత్త కంప్యూటర్ ప్రోగ్రామ్‌లు ఎఐ రంగంలో కొంత అభివృద్ధిని తీసుకువచ్చినప్పటికీ, కొన్ని సమస్యలు కూడా ఎదురయ్యాయి. ఉదాహరణకు, ఎఐకు శిక్షణ ఇవ్వడానికి అవసరమైన పెద్ద డేటా సెట్లు అందుబాటులో లేకపోవడం, అభివృద్ధికి కావాల్సిన కంప్యూటర్ సామర్థ్యం తక్కువగా ఉండడం వలన ఎఐ అభివృద్ధి నెమ్మదించింది. ఈ కారణంగా, ఈ కాలాన్ని ‘ఎఐ శీతాకాలం’ అని పిలుస్తారు.
2000ల తరువాత, సూపర్ కంప్యూటర్ల ఆగమనం, వాటికి శిక్షణ ఇవ్వడానికి పెద్ద డేటా సెట్లు అందుబాటులోకి రావడం వలన ఎఐ మళ్ళీ పుంజుకుంది. 2010లలో కృత్రిమ నరాలు అధునాతన దశకు చేరుకున్నాయి. ఈ నరాలు మానవ మేధస్సు ఎలా పనిచేస్తుందో అర్ధం చేసుకుని వాటిని అనుకరించడానికి సహాయపడతాయి. 2014లో, ‘జనరేటివ్ అడ్వర్సేరియల్ నెట్వర్క్స్’ (GANs) అనే ఒక ప్రత్యేకమైన ఎఐ మోడల్ వచ్చింది. ఇది రెండు భాగాలుగా ఉంటుంది: ఒక భాగం కొత్త విషయాలు సృష్టించడానికి ప్రయత్నిస్తే, మరొక భాగం ఆ విషయాల ప్రామాణికతను తనిఖీ చేస్తుంది. అంటే ఉదాహరణకు మొదటి భాగం పిల్లి బొమ్మను గీస్తే రెండవ భాగం ఆ బొమ్మ నిజమైన పిల్లికి దగ్గరగా ఉందా లేదా అని చూసి మొదటి భాగానికి ఫీడ్ బ్యాక్ ఇవ్వడం ద్వారా తనను మెరుగుపరచుకోవడానికి తోడ్పడుతుంది. తర్వాత 2017లో, ‘ట్రాన్స్‌ఫార్మర్’ అనే కొత్త టెక్నాలజీ వచ్చింది. ఇది ఎఐని మంచి కథలు, గీతాలు లాంటివి సృష్టించడంలో సహాయపడుతుంది. ఒకరకంగా ఈ టెక్నాలజీ జనరేటివ్ ఎఐకి పునాది లాంటిది.
జెన్ ఎఐ మానవుల్లా ఆలోచించగలిగే శక్తి వలన చాలా ఉపయోగాలు ఉన్నాయి. విసుగు విరామం లేకుండా పదే పదే చేయాల్సిన పనులను జెన్ ఎఐ automate చేయగలదు, కంటెంట్‌ను వేగంగా సృష్టించగలదు, కొత్త ఆలోచనలను ప్రేరేపించగలదు. ప్రస్తుతానికి జెన్ ఎఐ ట్యూమర్ డిటెక్షన్, మెడిసిన్/డ్రగ్ ట్రయల్స్, విద్యార్థుల కోసం వ్యక్తిగతంగా వారికి అనుమానాలు తీర్చడానికి పలు పాశ్చాత్య దేశాలలో వాడుతున్నారు. ఎలాంటి సంక్లిష్టమైన భావనను ఐనా సరళమైన భాషలో విడమర్చి చెప్పే శక్తి జెన్ ఎఐ సొంతం. అంతే కాకుండా సంక్లిష్టమైన సాఫ్ట్‌వేర్ కోడ్ రాయడం, డేటా విశ్లేషించడం తదితర సంక్లిష్టమైన పనుల్ని మనుష్యుల కంటే వందల రెట్లు వేగంగా చేయగలదు. అలానే ఎఐ వినియోగం వల్ల, గుమస్తా పనులు, డిజైనర్, సృజనాత్మక రంగాల్లో పలు పనులు సులభతరం అవుతాయి. ఇక స్థానిక భాషలలో జెన్ ఎఐ వినియోగంలోకి రావడం సాంకేతికత ప్రజాస్వామ్యీకరణలో ఒక పెద్ద అడుగు.
ఇవన్నీ బానే ఉన్నా జెన్ ఎఐ ప్రతికూల ప్రభావాలు కూడా ఎక్కువే. గత రెండు దశాబ్దాలుగా, ఎఐలో పురోగతితో సహా సాంకేతిక ఆవిష్కరణలు కార్మిక ఉత్పాదకత, ఆర్థిక ఉత్పత్తిలో నిరంతర పెరుగుదలకు దారితీశాయని, అయితే, ఈ ఆవిష్కరణలు ఏకకాలంలో కార్మికుల ఆదాయం వాటా క్షీణతకు దారి తీశాయని ఇటీవల విడుదల అయిన World Employment and Social Outlook –2024 నివేదిక వెల్లడించింది.
ఈ క్షీణతకు ముఖ్య కారణాలలో ఆటోమేషన్- ఆధారిత సాంకేతిక పురోగతి ఒకటి అని నివేదిక పేర్కొంది. ఎఐ ఒకవైపు ఉత్పాదకతను పెంచుతూ, మరొకవైపు మానవ శ్రమకు డిమాండ్‌ను తగ్గిస్తుందని, ఈ పరిస్థితిని మార్చడానికి బలమైన విధాన జోక్యాలు అవసరమని నివేదిక తెలిపింది. అలానే 2004 నుండి 2024 వరకు, కార్మిక ఆదాయం వాటా 1.6 శాతం పాయింట్లు తగ్గిందని, దీని ఫలితంగా ప్రపంచ వ్యాప్తంగా వారి ఆదాయంలో $ 2.4 ట్రిలియన్ క్షీణత నమోదు అయ్యిందని కూడా నివేదిక తేల్చింది. ఎఐ ఆధారిత ఆటోమేషన్, ఎఐ ఆధారిత ఆవిష్కరణలు ఈ క్షీణతకు కారణమయ్యాయని ఆ నివేదిక తెలిపింది.
అలానే కార్మిక ఆదాయంలో తగ్గుదలతో పాటు, మూలధన ఆదాయం పెరగడం వలన ఆదాయ అసమానతలు మరింత ఎక్కువవుతున్నాయి. మూలధన ఆదాయం కొంతమంది దగ్గరే కేంద్రీకృతం కావడం వలన అసమానతలు మరింత పెరుగుతున్నాయి.
సాంకేతిక పురోగతులు దీర్ఘకాల ఆర్థిక వృద్ధికి లాభదాయకమైనప్పటికీ, తాత్కాలికంగా కార్మిక విభాగాల్లో మాత్రం సంక్షోభ స్థితికి దారితీసే పరిస్థితులు ఉన్నాయని ఆ నివేదిక హెచ్చరించింది. అలానే జెన్ ఎఐ సాంకేతికత మొత్తం గూగుల్, మైక్రోసాఫ్ట్ తదితర బహుళజాతి కంపెనీల గుత్తాధిపత్యంలో ఉండడం ఆందోళనకరం. ఈ గుత్తాధిపత్యానికి వ్యతిరేకంగా, ఓపెన్ సోర్స్ ప్రత్యామ్నాయాలను ప్రోత్సహించడం, న్యాయమైన పోటీకి అవకాశం కల్పించడంతో పాటు విభిన్న ఆవిష్కరణలకు మద్దతు ఇవ్వడం చాలా ముఖ్యం. అలానే జెన్ ఎఐ శిక్షణ కోసం అనుమతి లేకుండా కాపీరైట్- మెటీరియల్‌ను ఉపయోగించారనే ఆరోపణలు ఆందోళన కలిగిస్తున్నాయి.
చివరిగా సాంకేతికత మన జీవితాలను లోతుగా ప్రభావితం చేస్తున్న ఈ యుగంలో, జెన్ ఎఐకి అందుబాటు అందరికీ హక్కుగా పరిగణించబడాలి. మెరుగైన జీవన ప్రమాణాలకు స్వచ్ఛమైన నీరు, విద్యుత్ సేవలు ఎంత కీలకమో, ఆవిష్కరణ, విద్య, వ్యక్తిగత అభివృద్ధికి జెన్ ఎఐని ఉపయోగించుకునే సామర్థ్యమూ అంతే ముఖ్యం అనే ఎరుక అవసరం. జెన్ ఎఐ ఫలాలు అందరికీ అందుబాటులోకి తీసుకురావడం అంటే మానవ నాగరికత సమసమాజ స్థాపన అనే విలువ దిశగా ఒక అడుగు వేసినట్లే.
రణధీర్ మళ్ల
పీహెచ్‌డీ విద్యార్థి, ఎక్సెటర్ యూనివర్సిటీ, ఇంగ్లాండు
చక్రధర్ బుద్ధ
సీనియర్ పరిశోధకులు, లిబ్‌టెక్ ఇండియా
Updated Date - Oct 30 , 2024 | 05:19 AM