ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మాతృత్వాన్ని కమ్మిన కట్టుకథలను ఛేదించే ‘యోధ’

ABN, Publish Date - Nov 25 , 2024 | 05:43 AM

పితృస్వామ్య సమాజం మాతృత్వాన్ని చాలా గ్లోరిఫై చేసింది. పిల్లలను కనడం వేరు, మాతృత్వం వేరు. కానీ సమాజం ఈ రెండిటినీ ఒకే కోణంలో చూస్తుంది. పిల్లలను కనడానికి అనువుగా స్త్రీకి ఉన్న శారీరక నిర్మాణాన్ని అలుసుగా తీసుకున్న పురుషుడు...

పితృస్వామ్య సమాజం మాతృత్వాన్ని చాలా గ్లోరిఫై చేసింది. పిల్లలను కనడం వేరు, మాతృత్వం వేరు. కానీ సమాజం ఈ రెండిటినీ ఒకే కోణంలో చూస్తుంది. పిల్లలను కనడానికి అనువుగా స్త్రీకి ఉన్న శారీరక నిర్మాణాన్ని అలుసుగా తీసుకున్న పురుషుడు పిల్లలను పెంచే బాధ్యతను కూడా స్త్రీ పైన మోపాడు. ఆడపిల్ల పెరుగుతున్న క్రమంలోనే మాతృత్వం లోని గ్లోరిఫికేషన్ వలన తనకు తెలియకుండానే పిల్లలను కనడంతోపాటు వాళ్ళను పెంచడం కూడా తన బాధ్యతగా భావిస్తుంది. చాలామంది స్త్రీలు పిల్లల పెంపకం బాధ్యత తమదే అని అనుకోవడానికి ఈ కండిషనింగ్ కారణం. ఇలాంటి నేపథ్యంలో మాతృత్వం కాన్సెప్ట్ మీద భండారు విజయ తన సంపాదకత్వంలో ‘యోధ’ పేరిట ఒక కథా సంకలనాన్ని తీసుకు వచ్చారు. ఈ సందర్భంగా ఆమెతో ముఖాముఖి.


రచయిత అయిన మీకు ప్రచురణ రంగంలోకి రావాలన్న ఆలోచన ఎలా వచ్చింది?

ప్రథమంగా నేను రచయితను. ఒక మహిళా రచయితగా సమాజంలో వివక్షకు గురౌతున్న స్త్రీల పట్ల ఒక లోతైన అధ్యయనం చేస్తూ ఉంటాను. అలాగే మహిళా హక్కుల కార్యకర్తగా స్త్రీలను అనేక విషయాలలో ఎడ్యుకేట్ చేయాలన్న దృఢ సంకల్పం నాకు ఉంది. చిన్నప్పటి నుంచి నాకు ఇతర స్త్రీల కన్నా భిన్నంగా, కొత్తగా ఏదైనా ప్రయోగాలు చేయడం అంటే చాలా ఇష్టం. ఆ భిన్న వ్యక్తీకరణ నుంచి వచ్చిందే ఈ ప్రచురణ కర్త హోదా. ఒకప్పుడు రచయితలు రాసిన ఏ పుస్తకాలనైనా ప్రచురించాలంటే ప్రముఖ ప్రచురణ సంస్థలు చాలా ఉండేవి. అలాంటి పేరున్న సంస్థలు ఇప్పుడు ఎక్కడా కనబడటం లేదు. కొత్తగా కొన్ని ప్రచురణ సంస్థలు వచ్చినప్పటికి, వాటికి కొన్ని పరిమితులు (ఆర్థిక, హార్దిక) ఉండడం వలన వాటి జోలికి రచయితలు వెళ్ళలేకపోతున్నారు. ప్రస్తుత పరి స్థితుల్లో రచయితలు తమ పుస్తకాలను తామే ప్రచురణ చేసుకునే ట్రెండ్ ఎక్కువైంది. నేను 1984లో ‘దీపిక’, 2016లో ‘తడియారని దుఃఖం’ కవితా సంపుటాలను నా మిత్రుల ప్రచురణ సంస్థల ద్వారా ప్రచురించాను. 2015లో వరంగల్ మిత్రులందరం కలిసి ‘రుద్రమ’ ప్రచురణ సంస్థను స్థాపించాము. ఆ సంస్థలో నేను సహసంపాదకు రాలిగా 7, 8 పుస్తకాలకు పని చేసాను. 2017లో రుద్రమ ప్రచురణల నుంచి నేను బయటకు వచ్చి, 2018లో హస్మిత ప్రచురణ సంస్థను స్థాపించాను. మొదట్లో నా పుస్తకాలను మాత్రమే ప్రచురించాను. తర్వాత రచనలను ముద్రించుకోవడంలో నానా అవస్థలు పడుతున్న రచయితలకు నా సంస్థ ద్వారా అవకాశం ఇస్తే బాగుంటుందన్న ఆలోచన వచ్చింది. అందులో భాగంగా 2023లో ‘స్వయంసిద్ధ’ ఒంటరి మహిళల జీవన గాథల పేరిట 40 మంది కొత్త, పాత రచయితలను కలుపుకొని వారితో కొత్త కథలు రాయించి ఒక కథా సంకలనాన్ని విజయవంతంగా తీసుకొని వచ్చాను. ఆ పుస్తకం ఏడాదిలోనే ద్వితీయ ముద్రణ కూడా వచ్చింది. అదే ఉత్సాహంతో ఇప్పుడు ‘యోధ’ మాతృత్వం భిన్నవ్యక్తీకరణల పేరిట తీసుకు వచ్చాను.


మాతృత్వం కాన్సెప్ట్ మీద కథా సంకలనం తీసుక రావాలన్న ఆలోచన ఎలా వచ్చింది?

ఒంటరి మహిళలుగా స్త్రీలు ఈ సమాజంలో ఎదుర్కొంటున్న అనేక సమస్యలను క్రోడీకరించి, వారి విజయ గాథలను ‘స్వయం సిద్ధ’ రూపంలో కథా సంకలనంగా తెచ్చాము. ఒంటరితనం తరువాత స్త్రీలు సమాజంలోను, కుటుంబంలోను ఎక్కువగా ఎదుర్కొనే ముఖ్య మైన సమస్య శారీరక హింస, అందులో ఒక భాగమే మాతృత్వం. ఆ హింసను పరోక్షంగా బలపరిచేది పితృస్వామిక వ్యవస్థ, దాని భావజాలం. ఆ భావజాలం స్త్రీలకు బానిసత్వాన్ని ఇంజెక్ట్ చేసింది. కుటుంబంలో తల్లి స్థానాన్ని గ్లోరిఫై చేస్తూ అనేక విధాలుగా స్త్రీలపై అధికారాన్ని మనువాదం స్థిరపరచుకుంది. ముఖ్యంగా స్త్రీలు మాతృత్వం పేరిట కుటుంబంలో అనేక రూపాల్లో వివక్ష, అణచివేత లతోపాటు వివిధ మానసిక, శారీరక హింసలకు లోనుకా వడం నన్ను బాగా కలవర పరచిన విషయం. మాతృత్వం అనేది ఒక భ్రమ మాత్రమే అనేది నా నమ్మకం. పితృ స్వామిక భావజాలం మాత్రం ‘మాతృత్వం’ అనే అంశాన్ని స్త్రీల చుట్టూ మెలికలు తిప్పుతూ అనేక కట్టుకథలను అల్లి, ఇంకా నమ్మించే ప్రయ త్నం చేయడం దురదృష్టకరం. మాతృత్వం స్త్రీలను జీవితాంతం నిద్ర పుచ్చే ఒక మత్తుమందు లాంటిది. దానిని గ్లోరిపై చేయ డమే ఈ సమాజ ఉద్దేశం. అన్ని భావనల లాగా మాతృత్వం, తల్లితనం అనేది ఒక మానసిక భావన మాత్రమే అన్నది 80వ దశకం నుంచి స్త్రీవాదులు చేస్తున్న వాదనే. స్త్రీ పురుషుల సమానత్వం కోరుకుంటున్న సమాజ పరిణామ క్రమంలో వంటిల్లూ, పిల్లల బాధ్యతా కేవలం స్త్రీలదే అని వాదించడం మూర్ఖత్వం. చలం ఏనాడో చెప్పాడు. స్త్రీకి మెదడు ఉంది, దానికి ఆలోచన ఉంటుంది అని. ఆ ఆలోచన లోంచి పుట్టిందే ‘యోధ’. ముందుగా ‘మాతృత్వం – విభిన్న కోణాలు’ పేరిట ఒక అవగాహన సదస్సును ఏర్పాటు చేశాను. అందులో దాదాపు 70 మంది రచయిత్రులు పాల్గొన్నారు. ఆ సదస్సులో మాట్లాడిన వక్తల ఆలోచనల నుండి 70మంది రచయితలు కథలు రాశారు. అందులో 53 మంది రచయితల రచనలు మాత్రమే ఈ సంకలనంలో చోటు చేసుకున్నాయి.


మాతృత్వం కాన్సెప్ట్‌తో వచ్చిన కథా సంకలనానికి ‘యోధ’ అని పేరు పెట్టడంలో ఉద్దేశ్యం?

‘యోధ’ అంటేనే పోరాట పటిమ కలిగి ఉండడం. ప్రతి విషయం లోనూ పోరాటం తర్వాతే విజయం ఉంటుంది. ప్రతి మనిషి రోజువారీ జీవితంలో కూడా అనేక పోరాటాలు చేయాల్సి ఉంటుంది. అది హద్దుల కోసం కావచ్చు, హక్కుల కోసం కావొచ్చు, మరే విషయంలోనైనా కావచ్చు. అలాగే కుటుంబంలో ప్రతి స్త్రీ ఎన్నో పోరాటాలు చేస్తేనే అనుకున్నది సాధించగలుగుతుంది. శతాబ్దాలుగా స్త్రీలపై నిత్యం పడుతున్న అదనపు భారం మాతృత్వం. అమ్మ అనిపించుకుంటేనే ఆడజన్మ సార్థకం అన్న నానుడి, పితృస్వామిక భావజాలం కలగలిపి స్త్రీలను కుటుంబ వ్యవస్థలో కట్టు బానిసలుగా మార్చివేసాయి. ఆ బానిసత్వం వెనుక ఉన్న కుట్రలను చదువుకున్న నేటి ఆధునిక స్త్రీలు గుర్తెరిగారు. మాతృత్వం అన్న దానిలో ప్రత్యేకత ఏమీ లేదనీ, అన్ని అనుభూతుల లాగే అదీ ఒక అనుభూతి అనీ తెలుసుకున్నారు. సమాజంలోనూ కుటుంబం లోనూ పురుషులతో ఏ సమానత్వ హక్కునైతే ఈనాడు స్త్రీలు కోరుకుంటున్నారో, అదే సమాన బాధ్యతను పిల్లల పెంపకం, వారి ఆలనా పాలనా విషయంలో కూడా అడుగుతున్నారు. ఆడవాళ్ళ భ్రమలు తొలగిపోయి మాతృత్వం అనేది స్త్రీ పురుషులిద్దరూ కలిసి మోయాల్సిన బాధ్యత అని ఇప్పుడు ఎలుగెత్తి అంటున్నారు. మాతృత్వం మాటున దాగిన దగాకోరుతనాన్ని ఒకవైపు నిలదీస్తూ మరోవైపు అందులోని డొల్లతనాన్ని ప్రశ్నిస్తూ నిరంతరం పురుష స్వామ్యంతో పోరాడుతున్నారు. అందుకే వారిని నేను ‘యోధ’లుగా చూస్తున్నాను. అందుకే ‘యోధ’ అనే పేరును మాతృత్వం భిన్న వ్యక్తీకరణలకు సూచనగా పెట్టాను.

ఇంటర్వ్యూ : గిరిజ పైడిమర్రి

99494 43414

Updated Date - Nov 25 , 2024 | 05:43 AM