కువైత్‌కు తెలుగు రాష్ట్రాల సేద్య ఉత్పత్తులు
ABN, Publish Date - Dec 25 , 2024 | 05:53 AM
ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వ పనితీరు వివిధ రంగాలలో ఏ విధంగా ఉన్నప్పటికీ జాతి ప్రయోజనాల దృష్ట్యా కీలకమైన గల్ఫ్ అరబ్బు దేశాలతో మైత్రీ పటిష్ఠత విషయంలో మాత్రం....
ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వ పనితీరు వివిధ రంగాలలో ఏ విధంగా ఉన్నప్పటికీ జాతి ప్రయోజనాల దృష్ట్యా కీలకమైన గల్ఫ్ అరబ్బు దేశాలతో మైత్రీ పటిష్ఠత విషయంలో మాత్రం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. మోదీ ఇటీవల జరిపిన కువైత్ పర్యటనతో, గల్ఫ్ కూటమిలోని ఆరు దేశాలనూ పర్యటించిన భారతీయ నేతగా నిలిచారు.
విశిష్ట స్వభావం కల్గిన ఎడారి అరబ్బులతో మైత్రి లేదా శత్రుత్వం రెండు కూడ అంత సులువు కాదు. పైగా కఠోర వహాబీ ఇస్లామిక్ ధార్మిక విధానాన్ని అనుసరించే ఎడారి అరబ్బు దేశాలలో సనాతన హిందూ ధర్మాన్ని ప్రొత్సహిస్తున్న మోదీ సర్కారు బలీయమైన మైత్రీ విధానాన్ని అనుసరిస్తూ ముందుకు సాగుతోంది. గల్ఫ్‌లోని అన్ని దేశాలతోనూ ఈ రోజు భారతదేశ సంబంధాలు సంప్రదాయక ద్వైపాక్షిక స్ధాయిని దాటి వ్యూహాత్మక ఆర్థిక, భద్రత అంశాల వైపు విజయవంతంగా పురోగమిస్తున్నాయి. ఈ పరిణామాన్ని గతంలో అయితే ఉహించడం కూడా కష్టతరంగా ఉండేది. ఇది కేవలం నరేంద్ర మోదీ వ్యక్తిగత శ్రద్ధతో మాత్రమే సాధ్యమయింది అంటే అతియోశక్తి కాదు. కాంగ్రెస్ ప్రభుత్వాలు తమ సుదీర్ఘ కాలంలో అరబ్బు దేశాలలో సాధించని దౌత్య విజయాన్ని మోదీ తన దశాబ్ద కాలంలో సాధించారు.
భారతీయ విదేశాంగ విధాన రూపకల్పనలో సంబంధిత మంత్రి కంటే ప్రధానమంత్రి, జాతీయ భద్రత సలహాదారు అయిన అజిత్ దోవల్ కీలక పాత్ర వహిస్తారు. ప్రస్తుతం కువైత్ పర్యటనలో గానీ అంతకు ముందు గానీ గల్ఫ్‌లోని ఏ రాజుతోనైనా మోదీ సమావేశమైతే మోదీ ప్రక్కన ఉండేది అజిత్ దోవల్ మాత్రమే.
గల్ఫ్ ప్రాంతంలో ప్రజాస్వామ్య స్ఫూర్తితో పని చేస్తూ ప్రజాగళం వినిపించే పార్లమెంటు ఉన్న దేశం కువైత్. ఈ కారణాన కువైత్ ప్రజా ప్రతినిధులు భారతదేశంలోని మోదీ సర్కారు తీసకున్న కొన్ని నిర్ణయాలు, చేసిన వ్యాఖ్యలను గతంలో తీవ్రంగా విమర్శించారు. కువైత్ పార్లమెంటేరియన్ల కారణాన కొన్నిసార్లు భారత విదేశాంగ శాఖ సంకట పరిస్ధితిని ఎదుర్కొన్నది. ఈ నేపథ్యంలో కువైత్ అత్యున్నత పురస్కారమైన ముబారక్ అల్ కబీర్‌ను ప్రధాని మోదీకి ప్రదానం చేయడం మామూలు విషయం కాదు. ఇది నిస్సందేహాంగా భారత్‌కు దౌత్యపరమైన విజయం.
కువైత్‌ను ఇరాఖ్ దురాక్రమణ చేయడాన్ని భారత్ ఖండించకపోవడంతో ఈ గల్ఫ్ దేశం భారత్‌పై అసంతృప్తి వ్యక్తం చేసింది. అంతటితో ఆగక కువైత్ సిటీలో అక్రమంగా నిర్మించిన గురుద్వారాను సిక్కు ధార్మిక వ్యక్తి భారతీయ రాయబారిగా ఉన్న హయాంలోనే కూల్చివేసింది. భారతీయ ఇంజినీర్ల విద్యార్హతల గుర్తింపును ప్రశ్నించింది. కువైత్‌లో నివసిస్తున్న విదేశీయుల సంఖ్యపై జాతుల వారిగా పరిమితి విధించే ప్రతిపాదన తదితర అంశాలకు తోడుగా హిజాబ్ వివాదం, ప్రవక్త మొహమ్మద్‌పై అనుచిత వ్యాఖ్యల విషయమై కువైత్ పార్లమెంటు సభ్యుల అక్షేపణ మొదలైన సున్నిత అంశాల కారణాన ఇరు దేశాల మధ్య కొంతవరకు ఆగాధం ఏర్పడింది.
సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఏమిరేట్స్, ఖతర్ దేశాలతో పోల్చితే కువైత్‌లో వాణిజ్య రంగ అభివృద్ధి అంతగా లేదు. కీలకమైన నిర్మాణ రంగంలో సైతం మిగిలిన మూడు దేశాల కంటే కూడా వెనుకబడి ఉంది. ప్రవాసుల సంఖ్య పరంగా పరిశీలిస్తే, కువైత్‌లో నివసిస్తున్న జనాభాలో కువైతీల తర్వాయి స్ధానంలో భారతీయులు ఉన్నారు. కువైత్‌లో నివసిస్తున్న విదేశీయులు అందరిలోనూ భారతీయులు సంఖ్యపరంగా అగ్రగాములు. పది లక్షల మంది భారతీయులు కువైత్‌లో నివసిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే, కువైత్‌లోని భారతీయులలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాయలసీమ జిల్లాలకు చెందిన వారు ప్రభావదాయక సంఖ్యలో ఉన్నారు. కువైతీ దినారు ఉమ్మడి కడప, చిత్తూరు జిల్లాల సామాజిక, ఆర్ధిక జీవన స్రవంతిలో ముఖ్యపాత్ర వహిస్తోంది మరి.
సాధారణంగా రెండు దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేసేందుకై ఇరు దేశాల ఉన్నతాధికారులతో కూడిన సంయుక్త బృందాలు నిరంతరం పని చేస్తుంటాయి. ఆ విధంగా కువైత్ – భారత్ దేశాల మధ్య ఇప్పటి వరకు కార్మిక, ఉద్యోగ నియామకాలు, చమురు, ఆరోగ్య రంగాలకు సంబంధించి మూడు సంయుక్త కార్యాచరణ బృందాలు మాత్రమే ఉండగా, వాణిజ్యం, పెట్టుబడులు, విద్య, నైపుణ్యాభివృద్ధి, శాస్త్ర సాంకేతికాభివృద్ధి, వ్యవసాయం, సాంస్కృతిక రంగాలతో పాటు భద్రత, కౌంటర్ టెర్రరిజం మొదలైన కీలకంశాలపై కూడా ఉభయ దేశాల మధ్య సంయుక్త కార్యాచరణ బృందాలను నెలకొల్పడానికి తాజాగా మోదీ జరిపిన పర్యటనలో నిర్ణయించారు.
స్వీయ ఆహార భద్రతకై భారత్‌లో తాము సంకల్పించిన పెట్టుబడులకు అనుమతించాలని ప్రధాని మోదీని కువైత్ ప్రభుత్వం కోరింది. ప్రస్తుతం ఉభయ తెలుగు రాష్ట్రాలలో ప్రధానమంత్రి కిసాన్ సంపద యోజన పథకం క్రింద ఫుడ్ పార్కులు ఉన్నాయి. వాటిలోని వ్యవసాయోత్పత్తులను కువైత్ తదితర దేశాలకు ఎగుమతి చేసే విధంగా ప్రయత్నిస్తే రైతులు కూడా విశేషంగా లబ్ధి పొందుతారు. అలాగే భారత్, కువైత్ దేశాల మధ్య పెండింగ్‌లో ఉన్న విమాన సీట్ల సంఖ్య పెంపుదల అంశాన్ని సాధ్యమైనంత వరకు పరిష్కరించుకోవాలని ఇరు దేశాలు నిర్ణయించుకున్నాయి. దీనికి పరిష్కారం లభిస్తే ప్రతిపాదిత తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయం స్వప్నం ఫలిస్తుంది. అదే విధంగా విజయవాడ, విశాఖపట్టణం విమానాశ్రయాలకు అంతర్జాతీయ అనుసంధానం పెరుగుతుంది. ప్రధాని లేదా కేంద్రమంత్రులు అధికారికంగా విదేశీ పర్యటనలు చేసినప్పుడల్లా ఆ పర్యటనలలో తమ రాష్ట్రాలకు గరిష్ఠ ప్రయోజనం లభించే విధంగా తెలుగు రాష్ట్రాలు వ్యూహాత్మకంగా వ్యవహరించాలి.
మొహమ్మద్ ఇర్ఫాన్
(ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి)
Updated Date - Dec 25 , 2024 | 05:53 AM