అమెరికా అంటే డాలర్లే కాదు, పుస్తకాలు కూడా!
ABN, Publish Date - Nov 20 , 2024 | 02:05 AM
ప్రతి సంవత్సరమూ నవంబర్‌లో తెలుగు రాష్ట్రాలలో గ్రంథాలయ వారోత్సవాలు జరుగుతాయి. ఇందులో భాగంగా పుస్తకాలతో సంబంధం లేని కార్యక్రమాలను మాత్రమే నిర్వహిస్తున్నారు. ముగ్గుల పోటీలు...
ప్రతి సంవత్సరమూ నవంబర్‌లో తెలుగు రాష్ట్రాలలో గ్రంథాలయ వారోత్సవాలు జరుగుతాయి. ఇందులో భాగంగా పుస్తకాలతో సంబంధం లేని కార్యక్రమాలను మాత్రమే నిర్వహిస్తున్నారు. ముగ్గుల పోటీలు, క్విజ్, డ్రాయింగ్ పోటీలు, కవి సమ్మేళనాలు, అష్టావధానాలు, సన్మానసత్కార సభలు వంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. వాస్తవానికి ఈ వారం రోజులైనా పుస్తకం విలువ తెలియజేసే కార్యక్రమాలు జరిగితే బాగుంటుంది. గ్రంథాలయంలో ఉన్న పుస్తకాల ప్రదర్శన జరగాలి. గ్రంథాలయ పుస్తకాలను కొత్తతరానికి పరిచయం చేసే విధంగా స్కూల్ పిల్లలను, కాలేజీ యువకులను గ్రంథాలయాలకు రప్పించాలి. పిల్లల పుస్తకాలను పిల్లలకు చూపించాలి. కానీ ఇవేమీ జరగటం లేదు.
ప్రతి సంవత్సరం గ్రంథాలయాలలో వేసవి శిబిరాలు జరుగుతున్నాయి. అక్కడ కూడా పుస్తకాలకు సంబంధించిన కార్యక్రమాలు మినహాయించి మిగిలిన అన్ని రకాల విద్యలు నేర్పిస్తున్నారు. గ్రంథాలయాలలో ప్రతి ఆదివారం ‘వీ లవ్ రీడింగ్’ ప్రోగ్రామ్ జరుగుతుంది. ఈ కార్యక్రమంలో నిజానికి పిల్లల చేత పుస్తకాలు చదివించడం పుస్తకాలకు సంబంధించిన పోటీలు నిర్వహించడం చేయాలి కానీ మొక్కుబడిగా ఫోటోలు తీసి పంపిస్తున్నారు. నిజానికి పాఠశాలల్లో కూడా ఈ వారోత్సవాలు నిర్వహిస్తే ఎంతో బాగుంటుంది. కానీ చెప్పేదేముంది, పాఠశాలల్లో జరగాల్సిన కార్యక్రమాలే జరపలేకపోతున్నారు, ఇక ఈ గ్రంథాలయ వారోత్సవాలను వారెందుకు పట్టించుకుంటారు.
మేము ‘మరో గ్రంథాలయ ఉద్యమం’ మొదలుపెట్టినప్పటి నుంచి రాష్ట్ర గ్రంథాలయశాఖ డైరెక్టర్ నుంచి జిల్లా గ్రంథాలయ అధికారుల వరకు అందరినీ కలిశాం. పాఠశాలలను గ్రంథాలయాలకు అనుసంధానం చేసి పిల్లలను పుస్తకాల వైపు ఎలా ఆకర్షించాలో వివరంగా తెలిపే మెమొరాండంను ఆయా అధికారులకు ఇచ్చాం. కానీ దానికి ఎలాంటి ప్రతిస్పందనా లేదు. స్థానిక గ్రంథాలయ ఉద్యోగులు పాఠకులకు సంబంధించిన ఎలాంటి కార్యక్రమాలను చేపట్టకపోగా ప్రభుత్వం నిర్ణయించిన కార్యక్రమాలను కూడా తూతూ మంత్రంగా చేస్తున్నారు.
రాష్ట్ర స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు భాషాపరంగానూ పుస్తక పఠనపరంగానూ మన స్థాయి అంతకంతకూ దిగజారిపోతున్నా పట్టించుకునే నాథుడు లేకుండా పోయాడు. పై అధికారుల నుంచి జిల్లా గ్రంథాలయ అధికారుల వరకు అవినీతి ఊబిలో కూరుకుపోయారు. గ్రంథాలయాలను కూడా ఆదాయ మార్గాలుగా చేసుకుని చందాలు పోగు చేసుకుంటున్నారు. ఉద్యోగాన్ని నిమిత్తమాత్రంగా మాత్రమే చేస్తున్నారు. గ్రంథాలయ ఉద్యోగ విలువలను పూర్తిగా మర్చిపోయారు. అన్ని శాఖల్లాగే ఈ శాఖలో కూడా అవినీతి పేరుకుపోయింది. ప్రభుత్వాలకు పట్టించుకునే అవసరం ఎలాగూ లేదు. పోనీ మేధావులు, విద్యావంతులు, భాషాభిమానులు కూడా గ్రంథాలయాల ఊసే పట్టించుకోవడం లేదు.
మనం మన పిల్లలు బాగా చదువుకుని అమెరికాకు వెళ్ళి డాలర్లు సంపాదించుకోవాలని కలలు కంటున్నాము. కానీ అదే అమెరికాలో ప్రభుత్వం గ్రంథాలయాలకు ఎంతో గొప్ప ప్రాధాన్యతను ఇస్తుంది. ప్రభుత్వ నిధులతోపాటు, ప్రజల నుంచి కూడా వచ్చే విరాళాలతో ఎంతో అద్భుతంగా అమెరికాలోని గ్రంథాలయాలు పని చేస్తున్నాయి. అక్కడ పిల్లల కోసం అనేక రకాల కార్యక్రమాలు జరుగుతున్నాయి. తల్లిదండ్రులు రకరకాల పిల్లల పుస్తకాలను ఇంటికి తీసుకువెళ్ళి పిల్లలకు చదివి వినిపిస్తున్నారు. పుస్తకాల షాపులలో స్టోరీ టెల్లింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. పాఠశాలల్లోనూ పిల్లలకు పుస్తకాలు చదివించే అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నారు. పిల్లలు తప్పనిసరిగా పుస్తకాలు చదివి వాటిని గురించి థీసిస్ రాయాలి. మనం అమెరికా దేశాన్ని డబ్బు సంపాయించడానికి ఒక ఆదర్శంగా మాత్రమే చూస్తున్నాం. కానీ విజ్ఞానాభివృద్ధి కోసం అక్కడ జరుగుతున్న కార్యక్రమాలను ఇసుమంతైనా ఆదర్శంగా తీసుకోలేకపోతున్నాము.
అమెరికాలో ఉండే వివిధ తెలుగు సంస్థలు పలు తెలుగు భాషా కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. కానీ అవి కూడా అమెరికాలోని పుస్తక పఠన సంస్కృతిని ఆంధ్రా తెలంగాణ ప్రాంతాలకు తెచ్చేందుకు ఏమీ చెయ్యలేకపోతున్నాయి. అమెరికా దాకా అక్కర్లేదు. కనీసం మన దక్షిణాది రాష్ట్రాలు కేరళ, తమిళనాడు, కర్ణాటకలనైనా ఆదర్శంగా తీసుకుని గ్రంథాలయాల గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరముంది. లేదంటే మన పిల్లలు సెల్‌ఫోన్, సోషల్ మీడియా, డ్రగ్స్ దుష్ప్రభావాలకు బలవుతూనే ఉంటారు.
మంచికంటి
Updated Date - Nov 20 , 2024 | 02:05 AM