ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

అనంత తీరాలకు అపురూప కపోతం

ABN, Publish Date - Nov 03 , 2024 | 12:11 AM

కంభంపాటి సీత అనే సీతగారి గురించి మాట్లాడకుండా శ్రీనివాసరావు గారి గురించి ఎట్లా మాట్లాడలేమో, శ్రీనివాసరావు గురించి మాట్లాడకుండా సీత గురించి కూడా అట్లాగే మాట్లాడలేము. ఈ జంటలో ఒకరి....

కంభంపాటి సీత అనే సీతగారి గురించి మాట్లాడకుండా శ్రీనివాసరావు గారి గురించి ఎట్లా మాట్లాడలేమో, శ్రీనివాసరావు గురించి మాట్లాడకుండా సీత గురించి కూడా అట్లాగే మాట్లాడలేము. ఈ జంటలో ఒకరి వయసు 84 మరొకరి వయసు 74. ఒకరు బోటనీ లెక్చరర్‌గా ఇంకొకరు జువాలజీ లెక్చరర్‌గా రిటైర్ అయ్యారు. ఇటువంటి రిటైర్ అయిన జంటలు కొన్ని ఇళ్లలో అయినా ఉంటూనే ఉన్నాయి. కానీ మనకు చాలా ఇళ్లలో కనిపించే జంటలకు ఈ జంటకు చాలా తేడా ఉంది. ఏ ఇతర పెద్దవాళ్లని కలిసినా వినిపించే మాటలేవీ వీళ్లు మాట్లాడరు. అసలు మాట్లాడటానికి వీళ్లు దొరకరు కూడా. వర్షాకాలం 4 నెలలు మినహాయిస్తే ఏడాదికి ఎనిమిది నెలలు వాళ్లు పిట్టల్ని వెతుకుతూ ప్రపంచమంతా తిరుగుతుంటారు. వరవరరావు గారు అన్నట్లు వీళ్లు జంట కపోతాలు. ఈ జంటలో ఒక కపోతం నాలుగు రోజుల క్రితం ఎగిరిపోయింది. ఎగిరిపోయిన కపోతం సీత గారు.


ఈ మధ్యలో కొంత మంది రిటైరయిన జంటలు పిల్లలు బాగా సెటిల్ అయి వాళ్లు ఏర్పాటు చేస్తే ఏడాదికి రెండో మూడో ఇలా ప్రయాణాలు చేస్తున్న వాళ్లని చూస్తున్నాం. కానీ వీళ్లు అలా కాదు. గత నలభై ఏళ్లుగా వాళ్లు ఇలా ప్రయాణాలు చేస్తున్నారు. ఆ ప్రయాణాలు తీర్థయాత్రలు కావు. ఆ ప్రయాణాల్లో వాళ్లు ఇప్పుడు కూడా చేసే పనులు చాలామంది 40ల్లో 50ల్లో ఉన్నవాళ్లు కూడా చెయ్యటానికి వెనకాడుతూ ఉంటారు. చెరో ఏడెనిమిది కిలోల బరువున్న కెమెరాలు వేసుకుని బ్యాక్ పాక్‌లో బిస్కట్ పాకెట్లు, మంచినీళ్లు వేసుకుని ఏ మంచు పర్వత సానువుల్లోనో, దట్టమైన కీకారణ్యాల్లోనో పెద్దగా టూరిస్టులు తిరగని ప్రాంతాల్లో గంటల తరబడి ఓపిగ్గా తిరుగుతూ అరుదైన పక్షుల ఫోటోలు తీస్తూ ఉంటారు. కావాలనుకున్న పిట్ట ఫోటో దొరికే దాకా ఒకే స్థలానికి ఎన్నిసార్లైనా వెళ్తూనే ఉంటారు.

ఒక్కసారైనా హిమాలయాలకు, సాహసికులైతే లెహ్ లడక్‌కు, భక్తులైతే వైష్ణోదేవి ఆలయానికి వెళ్లాలని అనుకుంటారు. అలాటి హిమాలయాలకు వాళ్లు కనీసం ముప్పైసార్లు వెళ్లారు. టూరిస్టులు వెళ్లని తోవలకు, ఆక్సిజన్ అందని మంచు కొండల మీదకు వాళ్లు ఎడతెగని ప్రయాణాలు చేసారు. ఒక గంట సేపు మామూలు కొండ ఎక్కటమే చాలామందికి కష్టం అందులోనూ సరైన దారి లేని చోట ట్రెక్కింగ్ అంటే ఇంకా కష్టం. కానీ వీళ్లు సరిగా ఆక్సిజన్ అందని మంచుకొండల్లో కూడా తమ డెబ్బైల్లో ఎనభైల్లో కూడా ఆరేసి, ఎనిమిదేసి గంటలు ట్రెక్కింగ్ చేస్తూ పోతుంటారు. ఎందుకలా అంటే మొదటిసారి వెళ్లివచ్చినప్పుడు అక్కడేదో పోగొట్టుకున్న ఫీలింగ్ వచ్చింది. అప్పటినుంచి అదేంటో తెలియకున్నా దాన్ని వెతుక్కుంటూ పోతున్నాం అంటారు సీత గల గలా నవ్వుతూ.


మంచు కొండల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి అక్కడ సీత చేసిన ఒళ్లు గగుర్పొడిచే సాహసాల గురించి చెప్పాలి. ఒక ఉదయం లేచి హిమాలయాల్లో ఆరుగంటల ట్రెక్ చేసి వాళ్లు అనుకున్న ప్రదేశానికి చేరుకోగానే మంచు తుఫాన్ వచ్చింది. వాళ్లను నిలబెట్టి కొట్టిన తుఫాను వెలిసేసరికి చీకటయింది. వెళ్లే దారి కనపడని స్థితి. అప్పడు వాళ్లకు దూరంగా కొండ కింద ఒక దీపం కనిపించింది. ఆ దీపం గుర్తుగా కొండల మీద నుంచి జారుతూ జారుతూ అక్కడికి చేరుకున్నారట. అది ఒక గొర్రెల కాపరి వేసుకున్న టెంట్. ఆ రాత్రి అక్కడ ఉండి ఉదయం బయలుదేరి తమ బస వైపు నడుస్తుంటే, మంచు తుఫాన్‌లో చిక్కుకుని కనపడకుండా పోయిన వ్యక్తుల శరీరాలను వెతికే బాడీ సెర్చ్ టీమ్‌తో బస యజమాని ఎదురుపడి వీళ్లను చూసి ఆశ్చర్యపోయారట. అప్పుడు వాళ్ల వయసు ఒకరికి 67 ఇంకొకరిది 77. ఇదే ఒక సాహసం అనుకుంటే అంతకు మించిన సాహసం సీతది.

కొండల్లోంచి జారటం వల్ల శరీరానికి తగిలిన దెబ్బలు నుంచి తేరుకోటానికి మిగిలిన ప్రోగ్రాం రద్దు చేసుకుని హోటల్లో కూర్చుని రికవర్ అవుతుండగా సీతని ఎదురుగా ఉన్న తీర్థన్ నది పిలవటం మొదలు పెట్టింది. సీత 65 ఏళ్ల వయసులో ఈత నేర్చుకున్నారు. నీళ్లు చూస్తే ఈత కొట్టెయ్యాలన్న ఉత్సాహం ఉండేదనుకుంటాను. తీర్థన్ నది ఈదితే ఎలా ఉంటుంది అంటే అక్కడ అందరూ ఆమెను వారించారు. అది మంచు కరిగి ప్రవహించే నది, నీళ్లు అతి చల్లన. నదిలో విపరీతంగా బండరాళ్లు. ఈ రెండు కారణాల వాల్ల స్థానికులు కూడా నది ఈదే సాహసం చెయ్యరు. కానీ ఈవిడ వినకుండా ఇటునుంచి అటు మాత్రమే కాదు అటు నుంచి ఇటు కూడా ఈదారట. ఈ సాహసం గురించి విన్న ఆ ఊరివాళ్లు మాత్రమే కాదు, అక్కడికి వచ్చిన టూరిస్టులు కూడా నదికి రెండు వైపులా నిలబడి ఈ చోద్యం చూశారు. 65 ఏళ్ల వయసులో ఈత నేర్చుకున్న సీత అప్పటి నించి ఈత పోటీలకు వెళ్లటం మాత్రమే కాదు ఇప్పటికీ పాతికో ముప్పయ్యో పథకాలు కూడా గెలుచుకున్నారు. ఒక్కోసారి నాలుగో ఐదో గెలుచుకుని వాటిని మెడలో వేసుకుని చిన్న పిల్లలా సంతోషపడుతుంటారు.


ఇవన్నీ విని వాళ్లను చూస్తే ఈ పనులు చేస్తుంది వీళ్లేనా అనిపించకమానదు. ముఖ్యంగా సీత. మంచి నూలు చీరలు కట్టుకుని మొహం మీద చెరగని చిరునవ్వుతో చాలా హాయిగా, మెత్తగా ఉంటారు. మామూలుగా ట్రావెలర్స్ అని మనం అనుకుని ఊహించుకునే దానికి పూర్తి భిన్నంగా ఉంటారు ఇద్దరూ కూడా.

ఇవన్నీ ఎవరికి తెలియకుండా పోయే ఒక అపాయం తప్పింది సీత ట్రావెలాగ్‌ల వల్ల. వందల్లో ప్రయాణాలు చేసినా అప్పుడప్పుడూ వాటిలో కొన్ని మాత్రం సీత ట్రావెలాగ్‌లా రాసేవారు. వాటిని పుస్తకంగా వెయ్యాలన్న ఆలోచన వచ్చినప్పుడు ఆ పనిలో భాగంగా వాళ్ల పరిచయం అయింది. ఆవిడ రాసిన ట్రావెలాగ్‌లు చదివి, అందులో రాయని అనేక విషయాలు విని నిర్ఘాంతపోయాను. చాలామంది ఊహించటానికి కూడా సాహసించని ఒక కలని వాళ్లు జీవించారు. ఆ ట్రావెలాగ్‌కు విశ్వ విహారం అని వారి చిరకాల కుటుంబ మిత్రులు వరవరరావు పేరుపెట్టారు. కానీ ఆ కథలు చదివితే అది ఉత్త విహారం కాదు స్వైర విహారం అనిపించక మానదు. దానికి వాడుకలో ఉన్న అర్థంలో కాదు. అ వయసులో వాళ్లు చేసిన సాహసాల వల్ల.


దాంతో పాటుగా వాళ్లు తీసిన అరుదైన పక్షుల ఫోటోలతో వేసిన బర్డ్స్ బ్యూటిఫుల్ అనే పుస్తకం ప్రెస్ వర్క్ జరుగుతున్నప్పుడు చూసిన ప్రముఖ ఫోటోగ్రాఫర్ శ్రీనివాసరెడ్డి కూడా అలాగే నిర్ఘాంతపోయారు. ఇలాంటి ఫోటోలు తీసిన వీళ్లు ఇంతకాలం అజ్ఞాతంగా ఉండిపోయారా అని. ఆయన పూనుకుని అప్లై చేసిస్తే ఇండియా ఇంటర్నేషనల్ ఫోటోగ్రఫిక్ కౌన్సిల్ గుర్తింపు వచ్చింది. ది రాయల్ ఫోటోగ్రఫీ సొసైటీ గుర్తింపు ఇంకా రావాల్సి ఉంది. ఆరు నెలల కింద ‘సంచార సహచరులు’ పేరుతో ఆంధ్రజ్యోతి ఆదివారం సంచిక కవర్ మీద ఎక్కారు. కెన్యా, టాంజానియాల మధ్య ప్రతి ఏడు జరిగే లక్షలాది జంతువుల గ్రేట్ మైగ్రేషన్ చూడటం కోసం, ఫోటోలు తియ్యటం కోసం మూడుసార్లు వెళ్లి వచ్చిన అనుభవాలు, ఫోటోలతో కాల్ ఆఫ్ ది వైల్డ్ పేరుతో ఒక పుస్తం వేశారు. ఈ మూడు పుస్తకాల వల్ల ఈ ఏడాదిగా కొందరికైనా వాళ్ల గురించి తెలుసుకునే అవకాశం దొరికింది.

చేతినిండా పుష్కలంగా డబ్బులు ఉండి వాళ్లు హాబీగా ఈ పని చెయ్యలేదు, లెక్చరర్లుగా ఉద్యోగాలు చేసి దాచుకున్న డబ్బులతో, ఆస్తులు కూడపెట్టాలన్న తాపత్రయం లేకుండా ఈ ప్రయాణాలు చేసారు. అబ్బురపరిచే జీవితం, నాలాంటి కొంతమందికి అసూయ కూడా కలిగించే జీవితం ఈ జంట జీవించింది.

సి. వనజ

సీనియర్‌ జర్నలిస్ట్‌

Updated Date - Nov 03 , 2024 | 12:11 AM