ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

సునామీని మించిపోయిన ఏపీ ఎన్నికలు!

ABN, Publish Date - Jun 06 , 2024 | 03:19 AM

ఆంధ్రప్రదేశ్ ప్రజలు వైయస్ జగన్ మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించేశారు. అధికార పార్టీ మీద ప్రజల్లో సహజంగానే కొంత వ్యతిరేకత ఉంటుంది. కానీ ఇంతటి వ్యతిరేకత ఉందని...

ఆంధ్రప్రదేశ్ ప్రజలు వైయస్ జగన్ మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించేశారు. అధికార పార్టీ మీద ప్రజల్లో సహజంగానే కొంత వ్యతిరేకత ఉంటుంది. కానీ ఇంతటి వ్యతిరేకత ఉందని విపక్ష పార్టీలు కూడ ఊహించి ఉండవు. 2019లో వైసీపీకి 151 స్థానాలిచ్చిన ప్రజలు ఐదేళ్ళు తిరగ్గానే 11 స్థానాలకు దించేశారు. ఇది ఓటమి మాత్రమే కాదు; ఘోర పరాజయం.

జగన్ ఓటమి మీద రెండు రకాల నేరేటివ్స్ బలంగా వినిపిస్తున్నాయి. జగన్ తన నియంతృత్వ పోకడలవల్ల, ఫ్యాక్షనిస్టు మనస్తత్వంవల్ల, వ్యవస్థల్ని ఓవర్ యూజ్ కాదు; అబ్యూజ్ చేయడం మూలంగా ఓడిపోయారు అనేది మొదటి నేరేటివ్. తెలుగులో దీన్ని ‘‘క్రూరంగా చెరచడం’’ అనవచ్చు. సంక్షేమ పథకాలు – ఉచితాలవల్ల ఓడిపోయారు అనేది రెండవ నేరేటివ్. మొదటి నేరేటివ్‌తో ఎవరికీ అభ్యంతరం ఉండాల్సిన పనిలేదు. కానీ, రెండో నేరేటివ్ మీద కొంత వివేకంతో నిర్ణయాలు తీసుకోవాలి.

అవకాశాలు ఉన్నోళ్ళు అవకాశాలు లేనోళ్ళు కలిసి ఉండే సమాజాల్లో అవకాశాలు లేనోళ్ల మీద ప్రభుత్వాలు అదనపు ప్రేమను చూపించాల్సి ఉంటుంది. దీన్ని వివక్షగా చిత్రించి విమర్శించేవాళ్ళూ సమాజంలో ఉంటారు. వాళ్ళు వీటిని ‘ఉచితాలు’ అంటూ ఎద్దేవా చేస్తుంటారు. అవకాశాలు ఎక్కువగా ఉన్నోళ్ళు సాధారణంగా ఇలాంటి వాదనలు చేస్తుంటారు. అవకాశాలు లేనోళ్ళను ఆదుకోవడానికి ‘సానుకూల వివక్ష’ (Positive Discrimination)ను పాటించడం అవసరం. జగన్ ఓటమి కారణంగా భవిష్యత్తులో ‘సానుకూల వివక్ష’ అనే విధానం మాసిపోకూడదు. ఎలాగూ చంద్రబాబు సూపర్ సిక్స్ పేరుతో మరిన్ని సంక్షేపథకాలు ప్రకటించారు. సంక్షేమం కొనసాగుతుంది. కొనసాగాలి కూడా.


గత ఏడాది జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ ఓడిపోయినపుడు, ఆయన్ని అభిమానించే ఓ పత్రికాధిపతి నాకు ఫోన్ చేశారు. ‘అనేక రకాల సంక్షేమ పథకాలతో అన్నివిధాలా ఆదుకున్న కేసీఆర్‌ను ప్రజలు ఓడించారు’ అనే కాన్సెప్ట్‌తో ఒక వ్యాసం రాసిపంపమన్నారు. ‘కేసీఆర్ ఓడిపోవడానికి కారణం సంక్షేమ పథకాలు, నీటిపారుదల ప్రాజెక్టులు కాదు; ఆయన అహంకారం, నిరంకుశత్వం, కుటుంబ పాలన ఆయన్ను ఓడించింది’ అన్నాను.

జగన్ విషయంలోనూ సరిగ్గా అదే జరిగింది. రాజశేఖరరెడ్డి హయాంలో మంత్రివర్గంలో గొప్ప టీం ఉండేది. ఆర్థికమంత్రి రోశయ్య, హోంమంత్రి జానారెడ్డి, వ్యవసాయశాఖామంత్రి రఘువీరారెడ్డి, రెవెన్యూమంత్రి ధర్మాన ప్రసాదరావు, మునిసిపల్ శాఖామంత్రి కోనేరు రంగారావు, దేవాదాయ శాఖామంత్రి జె.సి.దివాకర్ రెడ్డి, నీటిపారుదలాశాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, ఎం.ఎస్.సత్యనారాయణ, డి. శ్రీనివాస్, సబితా ఇంద్రారెడ్డి, నేదురుమల్లి రాజ్యలక్ష్మి, గీతారెడ్డి... ఇలా ఎవరికి వారు తమ శాఖల విషయాల్లో చాలా అప్‌డేట్‌గా ఉండేవారు. డి.శ్రీనివాస్, ఎం.ఎస్. సత్యనారాయణ, జె.సి. దివాకర్ రెడ్డి, మర్రి శశిధర్ రెడ్డి తదితరులు అప్పుడప్పుడు విలేకరుల ముందే వైయస్ మీద కొంత అసంతృప్తిని వ్యక్తం చేస్తుండేవారు. అది వైయస్‌కు కూడ తెలుసు. కానీ అందరూ టీమ్ ధర్మాన్ని పాటించేవారు. అందుకే, విపక్షాలు మహాకూటమి కట్టినా వైయస్ టీం 2009 ఎన్నికల్లో మళ్ళీ గెలిచింది. ఆ టీమ్ వారసత్వం జగన్‌కు లేదు, రాలేదు. జగన్ ఎన్నడూ బహువచనం కాదు, ఏకవచనం.

ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ ప్రధాన రాష్ట్రం. ప్రభుత్వంలో వ్యవసాయ, నీటిపారుదల శాఖలు ప్రాణం వంటివి. వ్యవసాయశాఖామంత్రి వ్యవసాయం గురించి మాట్లాడడం, నీటిపారుదల శాఖామంత్రి నీటి ప్రాజెక్టుల గురించి మాట్లాడడం గత ఐదేళ్లలో మనం వినిఉండం. జగన్ కేబినేట్‌లో సకల శాఖలకు ఒకరే మంత్రి– సజ్జల రామకృష్ణారెడ్డి. ఇది ప్రజలకు ఏ మాత్రం నచ్చలేదు. తెలంగాణలో కేటీఆర్, కవిత కలిసి కేసీఆర్‌ను ఓడించినట్టు ఏపీలో సజ్జల రామకృష్ణారెడ్డి ఒంటి చేతి మీద జగన్‍ను ఓడించారు.


జగన్ నిర్మూలన మీద పెట్టినంత శ్రద్ధను నిర్మాణం మీద పెట్టలేదు. ‘వాళ్ళ ఇల్లు కూలగొట్టారు, వీళ్ల ఇళ్ళు కూలగొట్టారు’ అనే తరహా వార్తలు తప్ప ఆ ప్రాజెక్టు కట్టించారు, ఈ రోడ్డు వేయించారు అనే వార్తలు ఎక్కడా వినిపించలేదు. చంద్రబాబును అరెస్టు చేయడం దీనికి పరాకాష్ఠ. అప్పట్లో జగన్‌ను అరెస్టు చేయడంవల్ల సానుభూతి పెరిగినట్టు ఇప్పుడు చంద్రబాబు మీద సానుభూతి పెరిగింది. ఈ చిన్న లాజిక్‌ను జగన్ ఎలా మరిచారో?

వై.యస్. రాజశేఖర రెడ్డి తన మీద ఫ్యాక్షనిస్ట్ ముద్రపడకుండ జాగ్రత్తలు పడేవారు. జగన్ ఫ్యాక్షనిస్టుగా గుర్తింపు పొందడానికి ఉత్సాహం చూపారు. వారు సాగించిన ప్రతీకార చర్యలు ప్రజలకు నచ్చలేదు. ఆయన ‘నవరత్నాల’ లబ్ధిదారులు సహితం జగన్‌కు వ్యతిరేకంగా ఓటేశారు. కులంలేదు మతంలేదు ప్రాంతంలేదు అందరిదీ సింగిల్ పాయింట్ ప్రోగ్రాం– జగన్‌ను దించేయడం. అందరిదీ అంటే అతిశయోక్తి కావచ్చుగానీ, రాష్ట్రంలో కనీసం 60 శాతం మంది జగన్‌ను కచ్చితంగా ఓడించాలనుకున్నారు!

సామ్యవాద, మతసామరస్య భావాలు కలిగిన పౌరసమాజం కూడ ఏపీ ఎన్నికల్లో సైద్ధాంతిక గందరగోళంలో పడిపోయింది. వర్తమాన భారత సమాజంలో పౌరసమాజం ఎదుర్కొనే ప్రధాన సమస్య గుజరాత్ ఆధిపత్య బీజేపీ. మహారాష్ట్ర ఆధిపత్య ఆరెస్సెస్ కన్నా గుజరాత్ ఆధిపత్య బీజేపీ మరింత ప్రమాదకారి అని పౌర సమాజం భావిస్తోంది.


కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో వెలుగులోనికి వచ్చిన ‘ఎద్దేలు కర్ణాటక’ (మేలుకో కర్ణాటక) ఉద్యమం అక్కడ అధికార బీజేపీని ఓడించడంలో సఫలం అయింది. దానికి కొనసాగింపుగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పనిచేసిన ‘జాగో తెలంగాణ’ కూడ ప్రభుత్వాన్ని మార్చడంలో తనవంతు పాత్రను పోషించింది.

చంద్రబాబు అరెస్టు వెనుక కేంద్రం హస్తం కూడ ఉందనే మాట బలంగా వినిపించినపుడు ఏపీ పౌర సమాజం ఆలోచనల్లో పడింది. చంద్రబాబును సమర్థించే ప్రధాన మీడియా, సోషల్ మీడియాలు ప్రధాని నరేంద్ర మోదీ మీద కూడ విమర్శలు మొదలెట్టాయి. కర్ణాటక, తెలంగాణ మోడల్‌లో ఏపీలో అధికార వైసీపీకి వ్యతిరేకంగా ప్రతిపక్ష టీడీపీ పక్షం వహించాలనే ఆలోచనలు పౌరసమాజంలో మొదలయ్యాయి. కాంగ్రెస్ నాయకత్వంలోని ఇండియా కూటమి జాతీయ ప్రత్యామ్నాయంగా ఎలాగూ ఉంది. చంద్రబాబు ఇండియా కూటమికి దగ్గర కావచ్చనే ఊహాగానాలు కూడా చెలరేగాయి. పౌరసమాజానికి అలా ఒక సమర్థన దొరికింది.

అయితే, చంద్రబాబు నేరుగా బీజేపీతో ఎన్నికల పొత్తు కుదుర్చుకోవడంతో సన్నివేశం మళ్ళీ మారిపోయింది. మోదీజీ ఎన్నికల ప్రచారంలో ముస్లింల మీద విపరీతమైన ద్వేషాన్ని వెళ్ళగక్కారు. ‘ఎక్కువ మంది పిల్లల్ని కనేవారు’ వంటి వాఖ్యలు మొదలుపెట్టి ‘టోపీవాలే’, ‘చొరబాటుదార్లు’ (ఘూస్ పైఠియే), ‘మదరసా’, ‘ముల్లా’, ‘మాఫియా’, ‘ముజ్రా’ వరకు ఏ పదాన్నీ వదలలేదు. ఈ స్థితిలో, అన్యమనస్కంగానే అయినా సరే, చంద్రబాబును కాదని జగన్‌ను సమర్థించక తప్పదనే ప్రతిపాదనను ముస్లిం సమాజంలోని కొందరు ముందుకు తెచ్చారు.


విధేయులను తప్ప ముస్లిం సమాజంలో కొంచెం గౌరవమర్యాదలు వ్యక్తిత్వం ఉన్న వారెవర్నీ జగన్ గుర్తించలేదు. పైగా, వై.యస్. రాజశేఖర రెడ్డి ఇచ్చిన 4 శాతం రిజర్వేషన్లను కొనసాగించడం తప్ప కొత్తగా ముస్లింల శ్రేయస్సు కోసం చేసిందేమీ లేదు. జగన్ మీద అసంతృప్తితో ఉన్న ముస్లిం సమాజం ఏపీ ముస్లిం ప్రముఖులు ఇచ్చిన ప్రకటనను పట్టించుకోలేదు. మరోవైపు, బీజేపీతో జతకట్టినా సరే ముస్లింల ప్రయోజనాలనూ కాపాడుతానని చంద్రబాబు ఇచ్చిన హామీ ఆ సమాజం మీద బాగా పనిచేసింది. వాళ్ళు సహితం అటు మొగ్గారు. సునామీ వచ్చినపుడు ఏదీ ఆగదు. ప్రస్తుత ఏపీ ఎన్నికలు సునామీని మించిపోయాయి.

డానీ

సమాజ విశ్లేషకులు

Updated Date - Jun 06 , 2024 | 03:19 AM

Advertising
Advertising