బాలగోపాల్ సంస్మరణ సదస్సు
ABN, Publish Date - Oct 05 , 2024 | 04:12 AM
సంక్లిష్టమైన భారత సామాజిక జీవితంలో అసమానతలు భిన్నపాయలుగా పెనవేసుకుపోయిన స్థితిలో, వాటిని రూపుమాపటానికి మనం చేయవలసిన కృషిని తన జీవితాచరణ ద్వారా మనకు మార్గదర్శనం చేశాడు....
సంక్లిష్టమైన భారత సామాజిక జీవితంలో అసమానతలు భిన్నపాయలుగా పెనవేసుకుపోయిన స్థితిలో, వాటిని రూపుమాపటానికి మనం చేయవలసిన కృషిని తన జీవితాచరణ ద్వారా మనకు మార్గదర్శనం చేశాడు బాలగోపాల్. అంతరాలు నిండిన, అసమానతలతో కూడుకున్న సమాజం మనుషులకు వైకల్యంతో కూడిన ప్రాపంచిక దృక్పథాన్ని మాత్రమే అందించగలదని, మనుషులను మనుషులుగా చూడగలిగే మానవీయ దృక్కోణాన్ని సంకల్పపూర్వకంగా అలవర్చుకోవలసినదిగా, దానికి వైయక్తిక సంకల్పమే కాదు, సామాజిక ఆచరణ కూడా అంతే అవసరం అని చెప్పినవాడు బాలగోపాల్. ఈ సమానత్వ ప్రాపంచిక దృక్కోణాన్ని, మానవ ఆచరణను, సామాజిక నీతి నియమాలు, నిబంధనలు ఎంతగా ప్రభావితం చేస్తాయో కూడా తన రచనల ద్వారా ఆయన వివరించాడు.
ఒక్క మానవ తాత్వికతను మాత్రమే కాదు, దాని సామాజిక చలన సూత్రాలను, సామాజిక ఉద్యమాలలో దాని మూలాలను విశ్లేషించి విడదీయరాని సంబంధాన్ని నెలకొల్పిన ఉద్యమకారుడు కూడా ఆయనే. తన జీవితాన్ని ఈ సామాజిక తాత్విక దృక్పథానికి ఒక తిరుగులేని ప్రయోగశాలగా మార్చిన అతి అరుదైన వ్యక్తి ఆయన. మరణించి (8 అక్టోబర్, 2009) పదిహేనేళ్ళు గడుస్తున్నా అతని ప్రాసంగికత ఇప్పటికీ స్థిరంగా ఉన్నది. ఆయన ఈ రోజు లేకపోవచ్చు కానీ, అందించిన తాత్విక దృక్పథం రచనల ద్వారా అందుబాటులోనే ఉన్నది. తెలుగు సమాజం ఇప్పుడు ఎదుర్కొంటున్న అనేక సామాజిక, సాంస్కృతిక, పర్యావరణ సమస్యలకు ఆయన రచనలలో పరిష్కారాలు లభిస్తాయి.
అక్టోబర్ 6, ఆదివారం హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మానవ హక్కుల వేదిక ఆధ్వర్యంలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 వరకూ బాలగోపాల్ 15వ సంస్మరణ సదస్సు జరుగుతుంది. ఈ సందర్భంగా మూడు ప్రసంగ కార్యక్రమాలు–పాలస్తీనాలో ఇజ్రాయిల్ నరమేధం మీద రచయిత అచిన్ వనైక్ ప్రసంగం, ప్రజా ఉద్యమాల్లో క్వీర్ భాగస్వామ్యంపై క్వీర్ రైట్స్ యాక్టివిస్ట్ తాషీ ఖోడెప్ ప్రసంగం, డిజిటల్ మీడియా సెన్సార్‌షిప్–నియంత్రణల మీద ఇంటర్నెట్ ఫ్రీడమ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు అపర్ గుప్తా ప్రసంగం– ఉంటాయి.
అలాగే, హ్యూమన్‌రైట్స్ ఫోరమ్ ప్రచురించిన మూడు పుస్తకాలు– ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై బాలగోపాల్ తెలుగు–ఇంగ్లిష్ వ్యాసాల సంకలనం, బీలకోసం–బతుకుకోసం– సోంపేట ఉద్యమచరిత్ర, చత్తీస్‌గఢ్ బస్తర్ డివిజన్‌లో పరిస్థితులపై సిటిజన్ రిపోర్ట్–ఆవిష్కరణలు జరుగుతాయి. వీటితోపాటు ఉమర్ ఖాలీద్–ఇతర తోటి రాజకీయ ఖైదీలపై లలిత్ వచానీ రూపొందించిన డాక్యుమెంటరీ ‘ప్రిజనర్ నం.626710 ఈజ్ ప్రెజెంట్’ ప్రదర్శన ఉంటుంది.
– టి.హరికృష్ణ (మానవ హక్కుల వేదిక)
Updated Date - Oct 05 , 2024 | 04:12 AM