ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కారా మాస్టారి కథ కాని కథ

ABN, Publish Date - Nov 11 , 2024 | 01:52 AM

‘కుట్ర’ కథకి ఒక విశిష్టత ఉంది. కాళీపట్నం రామారావు కథా ప్రపంచంలో మొదటి దశ 1948లో ‘ప్లాటుఫారమో’ అన్న కథతో మొదలై 1955లో రాసిన ‘అశిక్ష–-అవిద్య’ అన్న కథతో ముగు స్తుంది. 1956 నుంచి 1963 వరకు మాస్టారు కథ...

‘కుట్ర’ కథకి ఒక విశిష్టత ఉంది. కాళీపట్నం రామారావు కథా ప్రపంచంలో మొదటి దశ 1948లో ‘ప్లాటుఫారమో’ అన్న కథతో మొదలై 1955లో రాసిన ‘అశిక్ష–-అవిద్య’ అన్న కథతో ముగు స్తుంది. 1956 నుంచి 1963 వరకు మాస్టారు కథ రాయలేదు. మళ్లీ 1964 నుంచి 1972 వరకు, అనగా ‘తీర్పు’ కథతో మొదలుపెట్టి ‘కుట్ర’ కథ వరకు, 16 కథలు రాసేరు. ఇది రెండో దశ. చాలా పరిణతి చెందిన కథలు ఈ దశలో వచ్చాయి. పీడితుల పక్షం తీసుకుంటూ, రాజకీయ సామాజిక ఆర్థిక అంశాలను చర్చించే కథలు ఈ రెండో దశ లోనే ప్రధానంగా వచ్చాయి. ‘యజ్ఞం’ లాంటి గొప్ప కథ కూడా ఈ దశలోదే. ఈ దశలో వచ్చిన కథల్లో చివరి కథే ‘కుట్ర’. కారా మాస్టారు తన దృక్పథాన్ని చాలా స్పష్టంగా సూటిగా ప్రకటించిన కథ ఇది.

అందుకే ‘కుట్ర’ కథని గురించి ప్రముఖ కథ, నవల విమ ర్శకులు వల్లంపాటి వెంకట సుబ్బయ్య ఇలా అంటారు-– ‘‘తాను ఇన్ని కథలు రాసినా తన ప్రాపంచిక దృక్పథం అతి గోప్యంగా ఉండిపోయిందేమో, పాఠకులకు అందలేదేమో అన్న సంశయంతో కాబోలు ‘కుట్ర’ అన్న కథ కాని కథను రాసి రచన మానేశాడు. ‘కుట్ర’ కథేనా, అందులో కథాంగాలు ఉండవలసిన చోట, ఉండ వలసిన తీరులో ఉన్నాయా అని ఆలోచించి ప్రయోజనం లేదు. ‘కుట్ర’ కథగా ప్రారంభమై రచయిత మానసిక అలసత్వం వల్లనో, అసమర్థత వల్లనో అలా ఉపన్యాసంలా అయిపోలేదు. ఇప్పుడు ఉన్నదే రచయిత ఎంచుకున్న రూపం. కాబట్టి మనం అందులోని భావజాలానికి, ప్రాపంచిక దృక్పథానికే ప్రాధాన్యత ఇచ్చి ఆలోచిం చడం మంచిది. అప్పుడు ఆలోచనపరుడుగా కారా ఎదిగిన ఎత్తులు తెలుస్తాయి.’’


నిబద్ధుడైన కథకుడు కారా. ఈ మాట నేను ఎందుకంటున్నా నంటే 1972లో మాస్టారు ఈ ‘కుట్ర’ కథను రాసేరు. 1970-–76 మధ్య విచారణ జరిగి 140 మంది ముద్దాయిలు, 897 మంది సాక్షులు ఉన్న, ప్రపంచంలోనే అతిపెద్ద కేసైన, పార్వతీపురం కుట్ర కేసు ఈ కథకు భూమిక. అక్కడ నుంచి మొదలుపెట్టి– కుట్ర అని అసలు దేనిని అంటారో, కుట్ర ఎక్కడ జరిగిందో జరుగుతున్నదో విశదపరిచే ఎత్తుకు ఎదిగింది ఈ కథ. కారా మాస్టారు 1972 నుంచి 1992 వరకు మరొక్క కథ రాయలేదు. 1972 తర్వాత శ్రీకాకుళ గిరిజన విప్లవోద్యమం సెట్ బ్యాక్‌కి గురైన తర్వాత ఇరవై ఏళ్ల పాటు మాస్టారి నుంచి కథ రాలేదు. మాస్టారు- విప్లవోద్యమ కాలంతో ఎంతగా పెన వేసుకుపోయారన్నది ఈ సెట్ బ్యాక్‌ని గమనంలో ఉంచుకుని మనం ఒక నిర్ధారణకు రావొచ్చు. తర్వాత 1992 అక్టోబర్‌లో ‘రచన’ సచిత్ర మాసపత్రికలో ‘సంకల్పం’ అనే కథ అచ్చైంది. తర్వాత 2006లో శ్రీకాకుళ సాహితి మిత్రులు తెచ్చిన ‘జంఝావతి కథల సంకలనం’లో వచ్చిన ‘అన్నెమ్మ నాయురాలు’ కథే కారా మాస్టారి చివరి కథ.

VVV

1970 నాటి తిరుగుబాటు ఆలోచనలు నిర్మించుకున్న చరిత్రకు సాక్షీభూతం ‘కుట్ర’ కథ. అక్షరాలా 897మంది సాక్షుల సమక్షంలో, 140మంది ప్రభుత్వాన్ని కూల్చేసే కుట్రని పన్నారని ప్రభుత్వం ఆరోపణ చేసిన నేపథ్యంలో, ప్రభుత్వాన్ని బోనులో నిలబెట్టిన విస్పష్ట కథగా ‘కుట్ర’ని పేర్కొనవచ్చు.


ఈ కథలో కుట్ర నిజస్వరూపాన్ని చెప్తారు కాళీపట్నం. రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నట్టు భ్రమింప చేస్తూ- పెట్టుబడి దారులు దోపిడీ విధానాలను అమలు చేసే క్రమాన్ని ఇందులో చెబుతారు. ఆ కథాకాలంలో మొదలైన దోపిడీ ఇప్పుడు ఎంత లోతులకు చొరబడిందో మనకు తెలిసిందే. సంపద కేంద్రీకరణ తీరు కళ్ల ముందు కనిపిస్తున్నదే. ఆ విధంగా వర్తమానానికి అనువర్తించబడ్డ కథ ‘కుట్ర’. వాస్తవ దోపిడీ వాతావరణ నిజస్థితిని డొక్క చింపి చూపెట్టిన కథ ‘కుట్ర’.

‘‘పట్నంలోయేదో కేసౌతోందట- యిన్నావా?’’ అని ఇద్దరు స్నేహితుల మధ్య సంభాషణతో మొదలౌతుంది కథ. ‘‘దగ్గిర దగ్గిర నూటేభై మంది ముద్దాయిలూ.. వెయ్యిమంది సాక్షులూ...’’ ఈ మాటలతో వారు పార్వతీపురం కుట్రకేసు గురించే మాట్లాడుకుంటున్నారని మనకు రూఢీ అవుతుంది. ఇద్దరు స్నేహితుల్లో ఒకరంటారు. ‘‘కుట్రంటే– ఇద్దరో ముగ్గురో మధ్య రహస్యంగా ఏదైనా జరిగితే అది కుట్ర. నూర్నూటేభైమంది జనమేటి, ఆళ్ళ పక్షాన కాదు, నీ పక్షాన పలకడానికొచ్చినోళ్ళే వెయ్యిమంది సాక్షులు! అంత సాక్షింలో జరిగిందీ అంటే అది పబ్లిగ్గా జరిగిందన్నమాట. అలాటిది ఏటన్నా కావచ్చు గాని కుట్రనడానికి మాత్రం కాదు. నన్నడిగితే దాన్ని కుట్రనడమే ఓ పెద్ద కుట్రంటాను. ఏటి– తిరుగుబాటనడానికి నీకు నామోషీ దేనికి?’’


ఈ సంభాషణ నుంచి కథ నెమ్మదిగా కథకుడి వద్దకు వెళ్లి, దేశ రాజకీయార్థిక అవగాహన లోంచి, దృక్పథ చైతన్యం లోంచి ఒక మోనోలాగ్‌లా, ఒక ఉపన్యాసంలా నడుస్తుంది. అసలు కుట్ర ఏదో తేటపరుస్తుంది కాబట్టి కథ అనుకున్న గమ్యాన్నే చేరింది. కారా రాసిన ప్రధానమైన కొన్ని కథల్లాగే ఈ కథ కూడా వర్గదృష్టి ఉన్న కథే.

కథలో ఒక దగ్గర–- ‘‘నన్నడిగితే కుట్రనదగ్గదేదేనా జరిగితే రాజ్యాంగం రాసినకాడే జరిగుండాల. పంచవర్ష ప్రణాళికలు ఏసిన్నాడు డెఫినెట్‌గా జరిగింది. జరిగిందనడానికి దాఖలా లున్నాయి- మన కళ్ళముందే. అసలు కుట్ర అది,’’ అంటుంది కథ చెప్తున్న పాత్ర. ఇది రచయిత దృక్కోణంగా మనకు తెలియకనే తెలుస్తుంది.

VVV


ఈ కథ వర్తమానంలో ఏఏ కోణాలకు వర్తిస్తుంది? అని ప్రశ్న వేసుకుంటే– ఈ కథ 1972 లో అచ్చయింది, పార్వతీపురం కుట్ర కేసు 1976లో ముగిసింది, ఇప్పుడు మనం 2024లో ఉన్నాం– ఈ ఏభై ఏళ్లలో దేశం మొత్తం మీద ఎన్నో అబద్ధాల కుట్ర కేసులను చూస్తున్నాం. అందుకు సాయిబాబా కేసు ఒక పెద్ద ఉదాహరణ. మతం గురించి కూడా కథ లోని పాత్ర మాట్లాడుతుంది. ఇది కూడా వర్తమానానికి వర్తించేదే. ఇది– ఈ కథ ద్వారా తక్షణం చర్చించాల్సిన కొత్తకోణం అని ఇప్పటి మతోన్మాద సందర్భంలో నేను అనుకుంటున్నాను. కథ లోనే ఆ చర్చకు ఆస్కారం ఉంది కూడా.

మన దేశానిది కేపిటలిస్టు ఎకానమీనా, సోషలిస్టు ఎకానమీనా అని చర్చ లాంటిది ఒకటి పెడతాడు ఈ కథలోని పాత్ర ద్వారా రచయిత. ప్రభుత్వం చేసే ట్రిక్కుని బయటపెడతాడు. ఆ ట్రిక్కు ఇలా వుంటుంది: ‘‘మొదట్నుండీ మన నాయకుల ఆలోచనా ధోరణీ, జాతికి ఆళ్ళు నేర్పి పెట్టిన ఆలోచనా పద్ధతీ, ఒకటుంది గదా! మాటొరసకి– బ్రిటిష్ వాళ్ళు మన మిత్రులా? కాదు కాదు. అయితే శత్రువులా? అబ్బెబ్బే ఎంత మాత్రం కాదు. హిందూ మతాచారాలు మంచివా చెడ్డవా? చెడ్డవే చెడ్డవే. కాని వాటిల్లో మూఢత్వాన్ని తొలగిస్తే, ప్రపంచం మొత్తం మీద ఆ మత విశ్వాసమంత గొప్పది మరింకోటి లేదు.’’


ఇక్కడ మతానికి సంబంధించిన మాటలు- వర్తమాన సందర్భానికి అనువర్తించుకోదగ్గవే. కథ లోని ఈ పాయింట్ ప్రస్తుతం చర్చించదగ్గ పాయింట్ అని అనుకుంటున్నాను.

‘‘గాంధీగారి కోతులు కళ్ళూ చెవులూ నోరూ మూసీసుకో వాలనీ, మూసీసుకోండని చెప్పి యింకా వినప్పోతే బలవంతాన మూసీడానికి ప్రయత్నించొచ్చు. కానీ–’’ అన్న అసంపూర్ణ వాక్యంతో కథ ముగుస్తుంది. ‘‘కానీ’’ తర్వాత వుండేది ‘తిరుగుబాటే’ అని కథకుని ఉద్దేశం-. అన్యాయంపై అధర్మంపై ప్రజ ఎలుగెత్తక తప్పదని ఆయన ఉద్దేశం. అది వాస్తవం కూడా. కథ ప్రారంభంలో ఒక డైలాగ్ ఉంటుంది. ‘‘నన్నడిగితే దాన్ని కుట్రనడమే ఓ పెద్ద కుట్రంటాను. ఏటి- తిరుగుబాటనడానికి నీకు నామోషీ దేనికి?’’ అని. ఈ వాక్యాన్ని బలంగా నిరూపించడానికి కథకుడు ఈ కథని చెప్పాడని నేను భావిస్తున్నాను. జాగ్రత్తగా గమనిస్తే ఈ కథలో ఒక వలయం ఉంది. కథ ప్రారంభంలో తిరుగుబాటును కాంక్షించి, కథ ముగింపులో తిరుగుబాటు జరిగి తీరుతుందని చెప్పడం,- అదే పరిణామసూత్రం అని ప్రకటించడం. ఇది నిస్సందేహంగా శిల్ప రహస్యమే. కథకుని సృజనాత్మక నిర్మాణ చాతుర్యమే. విప్లవ కథకి ఉండాల్సిన పురోగామి లక్షణాలతో ‘కుట్ర’ కథని ఒక వైవిధ్యమైన విప్లవ కథగా నేను నిర్ధారిస్తున్నాను.

బాలసుధాకర్

96764 93680

Updated Date - Nov 11 , 2024 | 01:52 AM