భాషను బతికించేది సంభాషణం!
ABN, Publish Date - Jun 03 , 2024 | 06:02 AM
మన దేశంలో రకరకాల భాషలు ఆయా ప్రాంతాలలో ప్రధాన భాషలుగా ఉన్నాయి. ఆ ప్రధాన భాషలకు అనుబంధంగా మాండలిక భాషలు మరెన్నో ఉన్నాయి. భారత రాజ్యాంగం లోని 8వ షెడ్యూల్లో గుర్తించిన 24 భాషలు...
మన దేశంలో రకరకాల భాషలు ఆయా ప్రాంతాలలో ప్రధాన భాషలుగా ఉన్నాయి. ఆ ప్రధాన భాషలకు అనుబంధంగా మాండలిక భాషలు మరెన్నో ఉన్నాయి. భారత రాజ్యాంగం లోని 8వ షెడ్యూల్లో గుర్తించిన 24 భాషలు మాత్రమే కాక, ప్రజల మధ్య సంబంధ బాంధవ్యాలకు, సమాచార చేరవేతకు అనువైన భాషలుగా 542 పైగా ఇతర భాషలు వాడుకలో కొనసాగుతున్నాయి. వీటికి తోడు అంతగా గుర్తింపు లేని భాషలు కూడా మరెన్నో ఉన్నాయి. భారతదేశంలోని భాషా సంప్రదాయాలను, వాటిలోని శాస్త్రీయతను, పదోత్పత్తిని, సామ్యతలను, పోలికలను ఆసరా చేసుకుని భాషా శాస్త్రవేత్తలు భాషలను నాలుగు రకాలుగా వర్గీకరించారు. అవి: 1) ఇండో ఆర్యన్ (ఇండో యూరోపియన్) భాషా కుటుంబం. భారతీయులలో 77శాతం మంది ఈ భాషా కుటుంబంలోని భాషలలోనే మాట్లాడు తున్నారు. 2) ద్రవిడియన్ భాషా కుటుంబం. దక్షిణ భారత దేశానికి చెందిన 20.6శాతంమంది ఈ కుటుంబానికి చెందిన తమిళ, మలయాళ, కన్నడ, తెలుగు భాషలలో మాట్లాడతారు. 3) ఆస్ట్రో - ఆసియాటిక్ భాషా కుటుంబంలో 1.2శాతం మంది, 4) సైనో - టిబెటన్ భాషా కుటుంబంలో 0.8శాతం మంది ప్రజలు మాట్లాడుతారు.
ఇవే కాక భారతదేశంలోని భాషలను లిపి (Script) ఆధారంగా స్థూలంగా మూడు రకాలుగా వర్గీకరించవచ్చు. 1) లిపిలేని భాషలు, 2) లిపి ఉన్న భాషలు, 3) లిపి లేకున్నా ప్రజా వ్యవహారంలో వాడుకలో ఉండి, ఇతర ప్రధాన భాషల లిపితో రాయబడే భాషలు. ప్రజల నాలుకల మీద నడయాడే ఈ భాషలు, స్థానిక సంప్రదాయాలు, వృత్తుల ఆధారంగా మరిన్ని మాండలిక పదాలతో కలిసి వాడుకలోని భాషలుగా కొనసాగుతున్నాయి.
అంతర్జాతీయంగా భాషల పైన, భాషలోని వైవిధ్యంపైన పరిశోధన చేసి పరిశీలన చేసి సూచనలు చేసే యునెస్కో లాంటి సంస్థలు భాషల పరిణామక్రమాన్ని, భాషల విస్తృతిని, వాడుకను అనుసరించి భాష ఏదైనా నిత్యగతిశీలతతో, నిరంతరం మార్పు చెందుతూ ఉంటుందని చెబుతాయి. ఎందుకంటే ఆఫ్రికా, ఆసియా, లాటిన్ అమెరికా, ఆస్ట్రేలియా ఖండాలలోని తొలితరం భాషలకు ఇప్పటి భాషలకు మధ్య చాలా తేడాలు క్రమ పరిణామంలో కనిపిస్తున్నాయి. మరొకవైపున ఆ తొలితరం నాటి భాషలు కూడా మధ్యయుగ కాలంలో వివిధ భాషల సంయోగంతో మిళితమై, రూపొంది వెలుగులోకి వచ్చాయి. ప్రస్తుతం బహుభాషా విధానాల (Multilingual) శైలిలో భాషలు, ఆదాన ప్రదానాలతో కొత్త సొబగులను అల్లుకోవడం జరుగుతోంది.
దీనికి తోడు, ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏటా కొన్ని పదుల భాషలు వాడుక లేని కారణంగా అంతరించిపోతున్నాయని యునెస్కో ఆందోళన వెలిబుచ్చింది. భాషలు కనుమరుగు కావడం అంటే ఆ మేరకు ఆయా మానవుల జాతి చరిత్ర, సంస్కృతి ఈ నేలమీది నుంచి తుడిచిపెట్టుకు పోవడమే అని భావించింది. అందుకే ఈ విషయమై 1992లో కెనడాలో International congress of Linguists (ICL) పేరిట చర్చలు ప్రారంభించి, అదే సంవత్సరం పారిస్‌లో జరిగిన సమావేశంలో నిర్దిష్టమైన ప్రతిపాదన చేసి, ప్రతి ఏటా Red Book of Endangered Languages పేరిట నివేదికను ప్రచురించాలని నిర్ణయించింది. అలా సేకరించిన సమాచారాన్ని అంతా ఒక్కచోట క్రోడీకరించాలనే లక్ష్యంతో 2009లో Atlas of the Endangered Languages అనే పేరుతో నివేదికను ప్రచురించింది. ఇది ప్రపంచ స్థాయిలోని అన్ని భాషల వాడుక, విస్తృతి స్థాయిని 6 రకాలుగా చెప్పింది. అవి: 1) Extinct: మాట్లాడే ప్రజలు ఒక్కరు కూడా లేని భాష. 1950 సంవత్సరం తర్వాత ఏ భాషనైతే మాట్లాడేవారు ఒక్కరు కూడా లేనట్లుగా గుర్తిస్తామో ఆ భాష సంపూర్ణంగా అంతరించిన భాషగా పరిగణించవచ్చు. 2) Critically Endangered: వృద్ధులు, పెద్దవారు మాట్లాడుతూ యువకులు మాత్రం అప్పుడప్పుడూ, మాట్లాడుతూ ఉండే భాష. 3) Severely Endangered: తాతల తరం వాళ్ళు చక్కగా మాట్లాడుతూ, తండ్రుల తరం మాట్లాడకపోయినా ఆ భాషను అర్థం చేసుకోగలిగి ఉండి, యువతరం వారు మాత్రం అసలే మాట్లాడలేని స్థితి కలిగిన భాష ఈ కోవలోనిది. 4) Definitely Endangered: ఇంట్లో మాతృభాషగా కూడా వాడుకలో లేక పిల్లలు నేర్చుకోలేని, మాట్లాడలేని భాష. 5) Vulnerable: పిల్లల తరం వారందరూ చక్కగా మాట్లాడినప్పటికీ, అది కేవలం కొన్ని ప్రాంతాలకు (ఇల్లు) మాత్రమే పరిమితమై కొనసాగే భాషను ఈ స్థితికి చెందినదిగా భావించవచ్చు. 6) Safe/Non-Endangered: అన్ని తరాలవారు మాట్లాడ గలిగి, వారి మధ్య భావవ్యక్తీకరణకు ప్రధాన సాధనంగా ఉండే భాష వాడుక భాషగా, వ్యవహార భాషగా, బోధన భాషగా కొనసాగుతూ జీవద్భాషగా ఉంటుంది.
భాషాభ్యసన సంపూర్ణం అవడానికి నాలుగు ప్రక్రియలలో నైపుణ్యం అవసరం అని చెప్పవచ్చు. 1) శ్రవణం, 2) సంభాషణం, 3) చదవడం, 4) రాయడం. ఈ నాలుగింటిలో శ్రవణం, చదవడం అనేవి passive skills గాను, సంభాషణం, రాయడంను Active skills గానూ వర్ణించవచ్చు.
అయితే ఈ నాలుగింటికి ప్రస్తుత కాస్మో పాలిటన్, గ్లోబల్ యుగంలో పరిమితులెన్నో ఏర్పడ్డాయనేది వాస్తవం. దీనికి ప్రధాన కారణం ప్రస్తుత సమకాలీన మానవుడు ఒకే సంస్కృతి, భాషా వాతావరణంలో జీవించలేకపోవడమే! అందుకని నిర్దిష్టంగా ఒక భాషా సంస్కృతులను నేర్చుకుని ఉండిపోవటం సాధ్యపడటం లేదు. బహు భాషల, బహు సంస్కృతుల సమ్మేళన రూపంగా అత్యాధునిక జీవన శైలి స్థిరపడ్తున్నది.
ఒక భాష అంతర్థానం కావడంలో ‘‘మాట్లాడటం’’ (Speaking) ఎంత ముఖ్యమైనదో, ఆ భాషకు లిపి (Scrpit) ఉండటం, ఆ లిపిని రాయగలడం (Writing) కూడా అంతే ప్రముఖమైనదని చెప్పవచ్చు. అయితే ‘లిపి’ లేకపోయినప్పటికీ చాలా సందర్భాలలో మాట్లాడటం అనే వాడుక వల్ల ప్రజలలో ఆయా భాషలు కొనసాగుతూ ఉండటం విశేషం. ఈ నేపథ్యంలో భాషలు తమ ప్రత్యేకతను, ఉనికిని కొనసాగించాలంటే చదవడం, రాయడం అనే ‘లిపి’పరమైన నైపుణ్యాల కన్నా వినడం, మాట్లాడటం అనే నైపుణ్యాల ఆవశ్యకత అత్యధికంగా ఉంది. ఏదో ఒక వ్యాపార ప్రకటనలో ‘మాట్లాడేవాడే మొనగాడు’ అన్నట్లు, ఇప్పుడు భాషను ఎంత విస్తారంగా మాట్లాడితే, ఆ భాష అంతగా కొనసాగుతుందని, పది కాలాల పాటు మనగలుగుతుంది అని చెప్పవచ్చు. అందుకే ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఆయా మాతృభాషల ప్రేమికులు తమ తమ ‘‘స్వభాషలలో మాట్లాడే ఉద్యమానికి’’ (Speaking own Language movement) మద్దతునిస్తున్నారు. ప్రపంచ దేశాలన్నీ, మాటల వారసత్వాన్ని భాషా పరిరక్షణకు సాధనంగా వాడుతున్నారు. అలాగే వారసత్వ సంపద అంటే కేవలం నిర్మాణాలు అనే నిర్వచనం నుంచి విస్తరించి భాష కూడా అందులో భాగమే అని గుర్తించి, ఆ దిశగా సమాజంలోని అందరూ నడుంకట్టాల్సిన తరుణం ఇదే!
మామిడి హరికృష్ణ
80080 05231
Updated Date - Jun 03 , 2024 | 06:02 AM