షరతులు వర్తించవు
ABN, Publish Date - Sep 05 , 2024 | 01:35 AM
కొన్ని అవసరాలూ కొన్ని అనవసరాలూ అయిన నిబంధనల బంధనాల ఈ ప్రపంచ వలయంలో షరతులు వర్తించని/ మానవీయ క్షేత్రాలు రెండు ఒకటి అమ్మ ఒడి/ మరొకటి చదువుల బడి...
కొన్ని అవసరాలూ
కొన్ని అనవసరాలూ అయిన
నిబంధనల బంధనాల
ఈ ప్రపంచ వలయంలో
షరతులు వర్తించని/ మానవీయ క్షేత్రాలు రెండు
ఒకటి అమ్మ ఒడి/ మరొకటి చదువుల బడి
తన కడుపులో శిశువు
రూపుదాల్చిందన్న ఊహ విరిస్తేచాలు
ఆ అమ్మతనం ఆనందాల ఆర్ణవం
ప్రాణాన్ని పణంగా పెట్టిన ప్రసవ వేదనసైతం
ఆ పురిటికేకతో ఓ ఆశల ఏరువాక
పసి ఆశను ప్రపంచశ్వాసగా
అందిస్తున్న ఆ పవిత్ర బాధ్యతలో
తల్లి తన ప్రపంచాన్ని పక్కకు నెడుతుంది
తానొక నవజాత చైతన్యకేతనమవుతుంది
అది అమ్మ ఒడి/ షరతుల ఛాయసైతం లేని
మమతల గుడి
తన తరగతి గదియే
తన ప్రపంచంగా మలచుకొని
తన మేధను మధియించి
తన గుండెను కరిగించి
ఆ లేత హృదయాలలో ఒదిగిపోతాడు
నలువైపులా జ్ఞానకిరణాల్ని ప్రసరింపచేస్తాడు
ప్రపంచాన్ని ఒక ఆశావహ వేదికగా
ముస్తాబు చేస్తాడు ఉపాధ్యాయుడు
పసిపాప కేరింతల్లో/ తల్లి మనసు పులకరించినట్లే
తన విద్యార్థి వికసనంలో
ఉపాధ్యాయ హృదయం పరవశిస్తుంది
తనకంటూ ఏమీ దాచుకోని అమ్మలాగే
తన విద్యార్థులలోనే విశ్వాన్ని దర్శిస్తాడు.
అమ్మఒడి మానవజాతి గర్భగుడి
తరగతిగది మానవనీతి గర్భగుడి
మనిషిని పెంచిన అమ్మతనానికి మాతృదేవోభవ
మనసును పంచిన ఉపాధ్యాయుడికి ఆచార్యదేవోభవ!
మడిపల్లి దక్షిణామూర్తి
Updated Date - Sep 05 , 2024 | 01:35 AM