సీతాకోకల మరణం
ABN, Publish Date - May 27 , 2024 | 12:35 AM
ఈ రాతిరిని కాసేపు అలానే ఉండనివ్వండి వీలు కుదిరితే ఏ మత్తో మందో చల్లి గాఢంగా నిద్రపుచ్చండి వేకువైతే ఏ తూటా ఆ పసి దేహాలను చిదిమేస్తుందో...
ఈ రాతిరిని
కాసేపు అలానే ఉండనివ్వండి
వీలు కుదిరితే
ఏ మత్తో మందో చల్లి గాఢంగా నిద్రపుచ్చండి
వేకువైతే
ఏ తూటా ఆ పసి దేహాలను చిదిమేస్తుందో
ఏ ఫిరంగిమోత ఆ లేత గుండెలను
బద్దలు చేస్తుందో తెలియదు
కొంచెంసేపైనా వాళ్ళను కునుకు తీయనివ్వండి
కళ్ళలో కొన్ని స్వప్నాలైనా మొలకెత్తనివ్వండి
ఏమాత్రం అలజడి చేయకండి
జోల పాడేందుకు అమ్మ లేదు
అసలే బెదరనివ్వకండి
ధైర్యం చెప్పేందుకు నాన్న రాలేడు
ఏ పరుపో పానుపో
పరచడానికి సిద్ధం కాకండి
బాల్యం మట్టిలో దాచుకుంది
ఆ జ్ఞాపకాల్లోంచి కాస్త ఊపిరిని తీసుకోనివ్వండి
దయచేసి
ఆ చెంపలపై జారుతున్న నెత్తుటి చారికలను
తుడిచేయకండి
యుద్ధభూమిలో సీతాకోకల మరణం
ఏ స్వేచ్ఛకు పునాదిగా నిలబడుతుందో
చరిత్రకు తెలియజెప్పాలి.
బిల్ల మహేందర్
91776 04430
Updated Date - May 27 , 2024 | 12:35 AM