డెలివరీ బాయ్
ABN, Publish Date - Jul 22 , 2024 | 05:09 AM
కాలంతో నువ్వో నీతో కాలమో తెలీదు కానీ మీ పోటీ అబ్బుర పరుస్తుంది సమస్త ప్రపంచాన్ని మోస్తూ నువ్వు సకల వినిమయాన్ని కాంక్షిస్తూ నేను నీ బిడ్డకు పాలు తాగిస్తావో లేదో కానీ...
కాలంతో నువ్వో
నీతో కాలమో
తెలీదు కానీ
మీ పోటీ అబ్బుర పరుస్తుంది
సమస్త ప్రపంచాన్ని మోస్తూ నువ్వు
సకల వినిమయాన్ని కాంక్షిస్తూ నేను
నీ బిడ్డకు పాలు తాగిస్తావో లేదో కానీ
నా సుప్రభాతపు టీ/కాఫీ సేవనంలో
నువ్వు గుబాళిస్తావు
నువ్వు విసిరిన దిన పత్రికలో
ప్రపంచం మొత్తాన్ని దర్శిస్తాను
నీ బతుకు వెతను మాత్రం
పట్టనట్లు ఊరకుంటాను
‘‘30 నిమిషాల్లో డెలివరీ లేకుంటే ఉచితం’’
నా ఆర్డర్ నమోదవడమే ఆలస్యం
నువ్వక్కడ పరుగందుకుంటావు
ట్రాఫిక్ చిక్కుల్ని, రోడ్డు ప్రమాదాల్ని,
వాతావరణ భయాల్ని
ఛేదించే ప్రయత్నంలో నువ్వుంటే
నీ ఆలస్యంతో లభించే
ఉచితపు ఊహల్లో
నేను దొర్లుతుంటాను
నా జీవితపు ప్రతి సంతోష క్షణంలోను
నువ్వు వాహికవవుతావు
ఆహారం నుంచి దుస్తుల వరకు
ఎలకా్ట్రనిక్స్ నుంచి కొత్తిమీరకట్ట వరకు
నా బతుకంతా నీ నెత్తినేసి
నేను బద్దకాన్ని ఆహ్వానిస్తాను
నువ్వేమో బతుకుని కాలానికి కట్టి
గెలిచి నిలవాలని ఉరకలెత్తుతుంటావు
నా మోదం నీ ఖేదాల్ని గుర్తించదు
నీ పేరుతోనో, రూపుతోనో
మతాన్ని గుర్తించి అవమానించేందుకో
కుక్కల్ని వదిలేసి
నీ ప్రాణాలు తీసేందుకో
నేనస్సలు సిగ్గుపడను
నీ బతుకు భయం
మాకో ఆట లాగుంటుంది
కాలంతో జరిగే పోటీలో
నువ్వు జారిపడుతుంటావు
ఆసుపత్రిలోనో, ఆనక మార్చురీలోనో
తెల్లగుడ్డొకటి కప్పుకుంటావు
నువ్వు విద్యార్థివో
డ్రాపౌట్వో
నిరుద్యోగివో
రోగగ్రస్తుడివో
ఉద్యోగం పోగొట్టుకొని
రోడ్డున పడిన వాడివో
సంసార భారం మోసే కుటుంబ రావువో
చెల్లి పెళ్లి కోసమో, తల్లి వైద్యం కోసమో
రోడ్డెక్కిన త్యాగమయుడవో
ఎవరివో.... నువ్వెవరివో...
వి. ఆర్. తూములూరి
97052 07945
Updated Date - Jul 22 , 2024 | 05:09 AM