ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ధరణి లోపాల ఊసెత్తకుండా కొత్త చట్టమా!?

ABN, Publish Date - Sep 25 , 2024 | 05:03 AM

తెలంగాణ కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకునే ప్రయత్నంలో భాగంగా రైతులు పడుతున్న కష్టాలను గట్టు ఎక్కించడానికి ధరణి పోర్టల్‌ స్థానంలో కొత్త ఆర్‌ఓఆర్‌ చట్టం– 2024ను తీసుకొని వస్తానంటుంది. ధరణిగా పిలవబడే పోర్టల్‌...

తెలంగాణ కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకునే ప్రయత్నంలో భాగంగా రైతులు పడుతున్న కష్టాలను గట్టు ఎక్కించడానికి ధరణి పోర్టల్‌ స్థానంలో కొత్త ఆర్‌ఓఆర్‌ చట్టం– 2024ను తీసుకొని వస్తానంటుంది. ధరణిగా పిలవబడే పోర్టల్‌ 2020 అసెంబ్లీలో చర్చ చేయబడని చట్టం, అది ఒక చట్టం కాని చట్టం. ఈరోజు వరకు కూడా దానివల్ల ప్రజలు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఏ రకమైన స్పందన లేని గత ప్రభుత్వం చివరికి అధికారం కూడా కోల్పోవలసి వచ్చింది. ఈ పోర్టల్‌ను బంగాళాఖాతంలో వేస్తామంటూ ప్రచారం చేసి ప్రజలకు హామీనిస్తూ కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అయితే ఇప్పుడు అందులోని లోటుపాట్లను సవరించకుండా కొత్త ఆర్‌ఓఆర్‌ 2024 చట్టం తెస్తానంటున్నది.

ధరణి పోర్టల్‌ 2020 – కొత్త ఆర్‌.ఓ.ఆర్‌ చట్టం 2024... ఈ రెండింటిని కూడా నల్సార్‌ యూనివర్సిటీ వారు తయారు చేశారు. కొత్త చట్టం ముసాయిదా కూడా తయారు చేశారు. ఈ రెండు చట్టాల్లో కూడా 1971లో వచ్చిన ఆర్‌ఓఆర్‌ చట్టానికి భిన్నమైన సూచనలు ఏమీ లేవు. ఈ చట్టం ఆధారంగానే 1989లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో సీనియర్‌ ఐఏఎస్‌ అధికారుల పర్యవేక్షణలో రూల్స్‌ రూపొంది, అవి అమలు జరుగుతూ వస్తున్నాయి. అప్పటి నుండి 2019 వరకు కూడా సజావుగా జరిగాయి. ప్రజలకు కొన్ని అసౌకర్యాలు ఉన్నప్పటికీ ఆ వ్యవస్థ బాగానే ఉండింది.


ధరణిలో ఉన్న లోపాలను సరి చేయకుండా కొత్త వ్యవస్థ ప్రతిపాదనలు ఎంతవరకు సబబు. 1971 చట్టాన్ని అనుసరించి కొన్ని మార్పులు చేర్పులు చేసి సంస్థాగతమైన నిర్ణయాలు తీసుకుని చట్టం చేసి ఉంటే కొంత మేలు జరిగేది. నిజానికి ఈ రెండు కొత్త చట్టాలకు 1971 చట్టం మూలమైన ఆధారం. ఈ మూడింటిని క్రోడీకరించి ప్రస్తుత పోర్టల్‌లో కరెక్షన్‌ చేసి ఉంటే సరిపోయేది. అంతేగాని కొత్త చట్టం తీసుకురావడం, రూల్స్‌ తయారు చేయడం కాలయాపనే అవుతుంది.

కొత్త చట్టం ముసాయిదా రెడీ అయ్యింది. తెలంగాణ ప్రభుత్వం దీన్ని చర్చ కోసం, ప్రజాభిప్రాయం కోసం ప్రజలు ముందుకు తీసుకొచ్చింది. ఈ బిల్లు కాపీలను అన్ని ప్రతిపక్షాలకు, అన్ని రాజకీయ పార్టీలకు, రైతు సంఘాలకు, రిటైర్డ్‌ కలెక్టర్లకు, రిటైర్డ్‌ రెవెన్యూ ఉద్యోగ సంఘాలకు ఇచ్చారు. బిల్లు కాపీలను ప్రజాక్షేత్రంలో పెడుతూ అందరి సలహాలు సూచనలు కోరారు. అన్ని జిల్లాల కలెక్టర్‌ కార్యాలయాల్లో కూడా సమావేశాలు నిర్వహించి రైతులు, రాజకీయ నాయకులు జిల్లాల వారీగా ఉన్న ముఖ్య నాయకుల సమక్షంలో సమావేశాలు నిర్వహించారు. ప్రజల నుండి వస్తున్న సూచనలను, సలహాలను పరిగణనలోకి తీసుకొని ముందుకెళ్లాలని ప్రభుత్వం సూచించింది.


ఇక్కడ అనుభవజ్ఞులైన రెవెన్యూ సిబ్బంది, కొన్ని రైతు సంఘాలు చేసిన సూచన ప్రకారం 1971లో వచ్చిన ఆర్‌ఓఆర్‌ చట్టం ఒక శాస్త్రీయ దృక్పథంతో చేయబడింది. ప్రస్తుత ధరణిలో ఉన్న మార్పులు చేర్పులు చేసి యథాతథంగా కొనసాగిస్తే సరిపోతుంది. అనుభవదారు లేదా కాస్తు కాలమ్‌లో సాగు రైతు పేరు ఉండాలని సూచనలు వచ్చాయి. యాభై సంవత్సరాలుగా కౌలు చేసుకుంటున్న భూములను ప్రభుత్వం కొనుగోలు చేసి ఇచ్చి ఉంటే రైతులకు మేలు జరిగేది. గత ప్రభుత్వం దళితులకు మూడు ఎకరాల వాగ్దానం నెరవేరేది. భూమిని కొని ఇవ్వకపోగా కౌలు చేసుకుంటున్న భూములకు, కౌలు రైతులకు ప్రభుత్వం నుంచి అందవలసిన సహాయం అందకుండా పోయింది. ప్రస్తుతం చేస్తున్న మార్పులు చేర్పులలో వారికి కొన్ని రక్షణలు కల్పించాలి.

వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని గత ప్రభుత్వం 2020లో కౌలు రైతుల హక్కులను గుర్తించకుండా అనుభవదారుని గడిని తొలగించారు. దీనివలన వందలు వేల ఎకరాల పట్టాదారులు లేదా భూస్వాములు వాటిని అమ్ముకోవడం కొనుగోలు చేయడం సులభతరం అయ్యింది. కేసీఆర్‌ లక్ష్యం నెరవేరింది. ఈ వాస్తవాలు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఆలస్యంగా అర్థం అయ్యాయి. ఇప్పుడు కొత్త చట్టం పేరుతో కాంగ్రెస్‌ ప్రభుత్వ ముందుకు వస్తోంది. కానీ మెజారిటీగా ఉన్న బడుగు బలహీనుల, చిన్న సన్నకారు రైతుల, ప్రజా ప్రయోజనాలకు వాస్తవ రూపాన్ని ఇచ్చేలా కొత్త చట్టం ఉండాలి.


రైతులు చేస్తున్న ప్రధాన సూచనలలో భాగంగా తహసీల్దారు నుంచి తొలగించబడిన అధికారాలను పునరుద్ధరించాలి. ఎనభై శాతం పనులు తహసీల్దారు కార్యాలయంలోనే జరగాలి. పాలన వికేంద్రీకరించబడాలి. పరిపాలన సజావుగా జరగాలంటే యాభై మూడు రకాల విధులు నిర్వహించవలసిన రెవెన్యూ శాఖ, పాలకుల ఇష్టానుసారం కాకుండా అవసరమైన క్షేత్రస్థాయి మానవ వనరులు వీఆర్‌ఎ, వీఆర్వోలను, ప్రతి మండలానికి ఒక సర్వేయర్‌ లేదా లైసెన్స్‌ సర్వేయర్‌, పాత తహసీల్దారు కార్యాలయానికి ఒక స్టాటిస్టికల్‌ అధికారిని నియమించేలా చట్టం చేయాలి. తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి అంగుళం భూమిని కొలిచి కమతాల వారీగా ఒక యూనిక్‌ నంబర్‌ ఇవ్వాలి. జాయింట్‌ రిజిస్టర్‌ వద్ద జరిగే వ్యవసాయ భూముల మ్యుటేషన్‌, సక్సెషన్‌ ప్రొసీడింగ్స్‌ ఇచ్చే ముందు పదిహేను రోజుల వ్యవధి ఉండాలి. అభ్యంతరాలు ఏవైనా ఉంటే బయటికి వస్తాయి. తహసీల్దారు ఇచ్చిన ఉత్తర్వులలో ఏవైనా లోపాలు ఉంటే ఆర్డీఓకి అప్పీలు చేసుకునేలా ఉండాలి. ఇక్కడ న్యాయం జరగకపోతే జాయింట్‌ కలెక్టర్‌, చివరగా ల్యాండ్‌ రెవెన్యూ ట్రిబ్యునల్‌ ఏర్పాటు చేసి అన్ని స్థాయిల్లో తొంభై రోజులలో పరిష్కారించేలా చట్టం చేయాలి.


ప్రస్తుతం ఉన్న ధరణి పోర్టల్‌ పుస్తకం లాంటిది, భూదార్‌ కార్డు దానికి ఇవ్వాలని అనుకుంటే ముందు భూదార్‌, టెంపరరీ భూదార్‌, భూదార్‌ కార్డు ఇందుకు ఒక సంపూర్ణమైన నిర్వచనం ఉండేలా చూడాలి. ఇది సమగ్ర సర్వే చేయకుండా ఏ కార్డు ఇచ్చినా ఈ ప్రయోగం నిరర్థకమే. అన్ని భూములను ఒకసారి సర్వే చేయాలి. ఆ పని చేయకుండా ఏ నిర్ణయమైనా సరైన ఫలితాలను ఇవ్వదు. ధరణి స్థానంలో భూమాత అనే పేరు ఉండటం ఎవరికీ అభ్యంతరం ఉండదు. ఈ చట్టంలో ఏజెన్సీ ప్రాంతాల్లోని భూమి బాధిత ఆదివాసీల ప్రస్తావన తీసుకురావాలి. 1/70 చట్టం సరిగ్గా అమలు అయ్యేలా రూపకల్పన చేయాలి. ప్రతి ఏటా పాత పద్ధతిలోనే జమాబందీ చేయాలి. రాష్ట్రంలోని ప్రతి అంగుళం భూమి లెక్క తేలుతుంది. ప్రతి ఏటా భూమాత రికార్డును ఒక ప్రింట్‌ తీసి అన్ని అమెండ్మెంట్లతో ఫస్లీ ఇయర్‌లో తయారు చేయాలి. మ్యుటేషన్‌, సక్సెషన్‌ సమయంలో చట్టబద్ధంగా నియమించబడిన కంప్యూటర్‌ టెక్నీషియన్‌, బాధ్యతాయుతమైన సర్వీస్‌ ప్రొవైడర్‌ (ఎన్‌ఐసి), మీసేవ లాంటి ప్రైవేట్‌ సంస్థలపై కూడా నిఘా ఉండేలా చట్టం చేయాలి. అరవై శాతం గ్రామీణ ప్రజల జీవనాధారం వ్యవసాయం. రైతులు, రైతు కూలీల, రైతు అనుబంధ వృత్తుల వారి దృష్టి కోణంలో పై సలహాలను క్షుణ్ణంగా పరిశీలించి, పారదర్శకమైన సులభతరమైన భాషలో ఒక ప్రగతిశీలమైన కొత్త భూమి హక్కుల రికార్డు చట్టం 2024 తీసుకురావాలి.

వి. బాలరాజు

తహశీల్దారు రిటైర్డు

Updated Date - Sep 25 , 2024 | 05:03 AM