ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

తెలుగువారి తరఫున వకాల్తా పుచ్చుకునే అర్హత ఉందా?

ABN, Publish Date - Sep 12 , 2024 | 01:03 AM

కొందరు నేతలు కేవలం ఇతరులను దూషించడం, సంచలనాత్మక వ్యాఖ్యలు చేయడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించాలనుకుంటారు. వారికి వేరే నిర్మాణాత్మకమైన పనులు ఏమీ ఉండవు...

కొందరు నేతలు కేవలం ఇతరులను దూషించడం, సంచలనాత్మక వ్యాఖ్యలు చేయడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించాలనుకుంటారు. వారికి వేరే నిర్మాణాత్మకమైన పనులు ఏమీ ఉండవు. అలాంటి రాజకీయ నిరుద్యోగుల్లో రాహుల్‌గాంధీ ఒకరని చెప్పక తప్పదు.

రాహుల్‌గాంధీ 2004లో రాజకీయాల్లోకి ప్రవేశించారు. అమేథీ నుంచి తొలిసారి లోక్‌సభకు ఎన్నికై లోక్‌సభలో వచ్చీరాని మాటలతో మాట్లాడాలని ప్రయత్నించి హాస్యాస్పదం అయ్యారు. సోనియాగాంధీ ఆయనకు ఏదైనా ఒక పని అప్పజెప్పాలని భావించి 2007లో ఎన్‌ఎస్‌యుఐతో పాటు యువజన కాంగ్రెస్, ఇతర అనుబంధ సంస్థల బాధ్యతలను అప్పగించారు. విషాదం ఏమంటే ఈ అనుబంధ సంస్థల్లో పెద్ద ఎత్తున మార్పులు తీసుకురావాలని, సంస్థాగత ఎన్నికలు జరిపించాలని సంకల్పించి ఆయన విఫలమయ్యారు. 2008లో ఆయన లోక్‌సభలో తొలిసారి ప్రసంగిస్తూ బుందేల్‌ఖండ్‌లో కళావతి అనే పేద మహిళ గురించి మాట్లాడుతూ దేశంలో పేదరికాన్ని ప్రస్తావించారు. కళావతి జీవితం ఏమీ బాగుపడలేదు సరికదా రాహుల్ రాజకీయ జీవితమూ ఎదుగూ బొదుగూ లేకుండా పోయింది. ఆయనను ఆ తర్వాత కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా నియమించారు. 2013లో ఆయన ఢిల్లీ ప్రెస్ క్లబ్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో తన ప్రభుత్వం ఆమోదించిన ఒక ఆర్డినెన్స్‌నే చించేసి వివాదాస్పదం అయ్యారు. 2014లో ఘోర పరాజయం చెందడంతో ప్రధాని కావాలన్న రాహుల్ ఆశలు అడియాసలయ్యాయి. లోక్‌సభలో కన్నుగీటడం, వెకిలిగా నవ్వడం, వేగంగా నడుచుకుంటూ వచ్చి ప్రధానిని కౌగలించుకోవడం వంటి పనులు చేసి నవ్వులపాలయ్యారు.


2019లో బీజేపీ రెండోసారి విజయం సాధించగా, ఆయన స్వంత నియోజకవర్గంలోనే ఓడిపోయారు. 2024లో బీజేపీ మళ్లీ అధికారంలోకి రావడంతో ఆయన లోక్‌సభలో ప్రతిపక్ష హోదాతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 543 సీట్లలో కేవలం 99 సీట్లు గెలిచిన రాహుల్ తానేదో పెద్ద విజయం సాధించినట్లు, మోదీ నేతృత్వంలో బీజేపీ చిత్తుగా ఓడిపోయినట్లు మాట్లాడడం మొదలుపెట్టారు. తాను భారత్ జోడో యాత్ర పేరుతో తిరిగిన పలురాష్ట్రాల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం చెందిన విషయాన్ని కూడా ఆయన మరిచిపోయారు.

అబద్ధాలు మాట్లాడడం, దూషించడం వల్ల తనపై కేసులు మోపే అవకాశం ఉన్నదని రాహుల్‌కు తెలుసు. అయినా అలా అయినా వార్తల్లో రావడం ఆయన ధ్యేయం. నేషనల్ హెరాల్డ్ కేసులో బెయిల్‌పై ఉన్న రాహుల్‌గాంధీ ఒకసారి మహాత్మాగాంధీని ఆరెస్సెస్‌ హత్య చేసిందని విమర్శించి పరువు నష్టం దావా ఎదుర్కొన్నారు. దీనిపై ఆయనను సుప్రీంకోర్టు తీవ్రంగా మందలించాల్సి వచ్చింది. బెంగళూర్‌లో గౌరీలంకేష్ హత్యవిషయంలోనూ లేనిపోని ఆరోపణలు చేసినందుకు, మోదీ పేరు గలవారందరూ దొంగలే అన్నందుకు, ఒక బ్యాంకు నోట్ల మార్పిడి చేస్తోందని విమర్శించినందుకు కూడా ఆయన కేసులు ఎదుర్కోవాల్సి వచ్చింది. చివరకు ఒక కేసులో ఆయనకు రెండు సంవత్సరాల జైలు శిక్ష కూడా విధించింది. అయినప్పటికీ రాహుల్ తన వైఖరి మార్చుకోలేదు.


ఇప్పుడు అమెరికా వెళ్ళి భారతదేశంపై, మోదీ, బీజేపీ, ఆరెస్సెస్‌లపై ఇష్టం వచ్చినట్లు వ్యాఖ్యలు చేశారు. ‘‘తెలుగు అంటే ఒక భాష కాదు. ఒక చరిత్ర.. ఒక సంప్రదాయం.. ఒక సంస్కృతి’’ అని ఆయన డల్లాస్‌లో అన్నారు. భారత జాతీయ గీతం అన్ని రాష్ట్రాలను ప్రతిబింబిస్తుందని, కానీ బీజేపీ మాత్రం రాష్ట్రాల పట్ల వివక్ష చూపుతుందని, తెలుగు భాషను విస్మరిస్తోందని రాహుల్ చెప్పారు. రాహుల్‌కు తెలుగు భాష గురించి కానీ, చరిత్ర గురించి కానీ, సంస్కృతి గురించి కానీ ఓనమాలు కూడా తెలిసే అవకాశాలు లేవు. తెలిసి ఉంటే తెలుగు భాషకు దేశంలో గౌరవం తీసుకువచ్చిన నందమూరి తారకరామారావు తెలుగువాడి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ వీధుల్లో పణంగా పెట్టిన కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారన్న విషయం అర్థమయి ఉండేది. కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ప్రతి రోజూ ఢిల్లీలో క్యూలు కట్టి కాంగ్రెస్ అగ్రనేతల దర్శనానికి రోజుల తరబడి వేచి ఉండే సంస్కృతిని ఆ పార్టీ ప్రవేశపెట్టిందని, ఒక వెనుకబడిన వర్గాల ముఖ్యమంత్రిని విమానాశ్రయంలోనే అవమానించారని ఆయన తెలుసుకోవాలి. తెలుగు ప్రజల మనోభావాలు గాయపడ్డందుకే ప్రజలు ఎన్టీఆర్‌కు, తెలుగుదేశానికి పట్టం కట్టారని, అదే ఎన్టీఆర్‌ను కుట్రపూరితంగా గద్దె దించేందుకు తన నాయనమ్మ రాంలాల్ అనే గవర్నర్‌ను ప్రయోగించారని ఆయనకు తెలిసి ఉండదు. ఎన్టీఆర్‌ను తిరిగి అధికారంలోకి తీసుకువచ్చేందుకు జరిగిన ప్రజాస్వామ్య పరిరక్షణోద్యమంలో అటల్ బిహారీ వాజపేయి, లాల్‌కృష్ణ అడ్వాణీ వంటి బీజేపీ హేమాహేమీలు రంగంలోకి దిగారని, నేషనల్ ఫ్రంట్ స్థాపించి కాంగ్రెస్‌కు ముచ్చెమటలు పట్టించారని రాహుల్‌కు ఎవరూ చెప్పి ఉండకపోవచ్చు. తెలుగువారికి తీరని అన్యాయం చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదే అని తెలియని రాహుల్ ఇవాళ తెలుగు భాష, చరిత్ర, సంస్కృతుల గురించి మాట్లాడడం అమాయకత్వమే కాదు, అజ్ఞానం కూడా.

పోనీ దక్షిణాది పట్ల అయినా కాంగ్రెస్‌కు ఏమైనా మమకారం ఉన్నదా? ఎన్నో దశాబ్దాల క్రితమే దక్షిణాదిలో ప్రజలు కాంగ్రెస్ పార్టీని తిరస్కరించారు. కేరళలో 1957లోనే కాంగ్రెస్ ఓటమి ఎదుర్కొంటే ఆ తర్వాత పదేళ్లకు తమిళనాడు ప్రజలు కాంగ్రెస్‌ను పూర్తిగా తరిమికొట్టారు. 83లో ఆంధ్రప్రదేశ్‌తో పాటు కర్ణాటకలో కూడా తొలి కాంగ్రెసేతర ప్రభుత్వం ఏర్పడింది. కేరళలో 1959లో ఈఎంఎస్ నంబూద్రిపాద్ ప్రభుత్వాన్ని, కర్ణాటకలో 1989లో బొమ్మయి ప్రభుత్వాన్ని, తమిళనాడులో 1976లో కరుణానిధి ప్రభుత్వాన్ని, 1980లో ఎంజిఆర్ ప్రభుత్వాన్ని, 1984లో ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని రద్దు చేసింది కాంగ్రెస్ నాయకత్వమే కాదా? ప్రజలు ప్రజాస్వామికంగా ఎన్నుకున్న ప్రభుత్వాలను రద్దు చేయడం ద్వారా వారి మనోభావాలను గాయపరిచినట్లు అప్పుడు కాంగ్రెస్‌ నాయకత్వానికి తెలియదా? దక్షిణాది పట్ల కాంగ్రెస్‌కు ఏ మాత్రం ప్రేమ లేదని ప్రజలందరికీ తెలుసు. 2019లో కేరళలోని వాయనాడు నుంచి గెలిచిన రాహుల్‌గాంధీ 2024లో రాయబరేలీలో విజయం సాధించగానే వాయనాడును వదుల్చుకున్నారు. ఓటమి ఎదురైనప్పుడే కాంగ్రెస్ ఢిల్లీ నేతలకు దక్షిణాది గుర్తుకు వస్తుంది.


అమెరికాలో రాహుల్ భారతదేశాన్ని అవమానించే విధంగా చేసిన వ్యాఖ్యలు గర్హనీయమైనవి. భారతదేశం తన ఉత్పాదకరంగాన్ని చైనాకు అప్పగించి నిరుద్యోగాన్ని పెంచిందని ఆయన ప్రకటించారు. ఇవాళ మన జీడీపీలో 17 శాతం ఉత్పాదక రంగానిదే వాటా. ప్రధానమంత్రి మోదీ అధికారంలోకి వచ్చిన కొద్ది నెలల్లోనే మేక్ఇన్ ఇండియా కార్యక్రమాన్ని చేపట్టారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి భారత ఉత్పాదక రంగం ట్రిలియన్ డాలర్లకు చేరుకోనున్నది. భారత్‌లో కంటే ఎన్నో రెట్లు ఎక్కువగా చైనాలో రికార్డు స్థాయిలో దాదాపు 17శాతం నిరుద్యోగం ఉన్నదన్న విషయం రాహుల్‌కు తెలియకపోవడం విషాదకరం. మోదీ పట్ల వ్యతిరేకతతో రాహుల్‌ కమ్యూనిస్టుల కంటే ఎక్కువగా చైనా భక్తుడు అయినట్లున్నారు.

అన్ని ప్రాంతాల సంస్కృతులను, సంప్రదాయాలను బీజేపీ గౌరవించదని రాహుల్‌కు ఎవరు చెప్పారు? ఈ బహుళత్వాన్నే భారతీయతగా బీజేపీ భావిస్తుందని ఆయనకు తెలియదు. బీజేపీ భిన్నత్వంలో ఏకత్వాన్ని చూస్తుంది కాని ఏ ఒక్క సంస్కృతినీ ఇతరులపై రుద్దదు. మన భారతదేశంలో శ్రీరాముడి మందిరం అడుగడుగునా కనపడుతుంది. మహాభారతం గురించి ప్రతి ఇంటిలో కథలు కథలుగా చెప్పుకుంటారు. మన పౌరాణిక పురుషులు, స్త్రీల గాథలు అందరికీ తెలుసు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా అడుగడుగునా మన భారతీయత ఉట్టిపడుతూ ఉంటుంది. ఈ దేశాన్ని విభజించి పాలించాలన్న దృక్పథం కాంగ్రెస్‌ది మాత్రమే. అందుకే కులాలను, మతాలను, ప్రాంతాలను, భాషలను రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలని చూస్తోంది.

వై.సత్యకుమార్

రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ వైద్య విద్యామంత్రి

Updated Date - Sep 12 , 2024 | 01:03 AM

Advertising
Advertising