ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీకేమైనా ఒక పిడికెడు స్వప్నాలు కావాలా?

ABN, Publish Date - Jul 08 , 2024 | 05:50 AM

మీకేమైనా ఓ పిడికెడు స్వప్నాలు కావాలా? ఎందుకో ఒకందుకు వాడుకుందురు ఉచితంగానే ఇచ్చేస్తా ఎందుకలా క్షణంలో నా మీద ఎర్రెర్రని అసూయ వర్షం గుమ్మరిస్తారు..

మీకేమైనా

ఓ పిడికెడు స్వప్నాలు కావాలా?

ఎందుకో ఒకందుకు వాడుకుందురు

ఉచితంగానే ఇచ్చేస్తా

ఎందుకలా క్షణంలో నా మీద

ఎర్రెర్రని అసూయ వర్షం గుమ్మరిస్తారు

సముద్రాలను నింపుకున్న

మేఘపు సంచులు చిరిగినట్టు

నాకేమీ పుట్టుకతో వసంతాలు పట్టం కట్టలేదు

పదపల్లవాలు హరివిల్లు జలపాతాల్లో జలకాలాడి

ఎగిరివచ్చి నా ముంగిట మువ్వన్నెల

రామచిలకలై వాల లేదు

శిశిరాలు చేతులుకట్టుకు తలలు వాల్చి

వినయంగా తమ ఆజ్ఞ అంటూ

విన్నపాలు పంచుకోలేదు

కన్నీటికడలిని వెయ్యిన్నొక్కసార్లు ఈది, మునిగి తేలుతూ

మెరుపుల మాణిక్యాలను ఏరుకున్నాను

కార్చిచ్చు అడవుల్లో పరుగులు తీసి

పిడికెడు నిప్పుకణికలను ఊది ఊది చల్లార్చుకు

కొంగున కట్టుకున్నాను

ఊపిరి దారిని ఎగసిపడే భావోద్వేగాలకు

పుప్పొడి సుగంధాలనద్ది

స్వప్నాలను పరిమళభరితం చేసుకున్నాను

బాధకు చిరునామాగా మారిన ఉనికిని

భాషకు దాసోహం చేసి

నా మనసు కిటికీ పక్కన పారిజాతంగా

నాటుకున్నాను

సమయం విస్మయమై

నా వాకిట రంగుల స్వప్నమయూరమై నర్తిస్తుంది

భళ్ళున పగిలి బద్దలైన ఊహలూ

ఖాళీ లేకుండా రాలిపడిన శుష్క పలవరింతలూ

చిరిగిన గాలిపటాలై నేల బారున

ఎగరలేక సోలిపోయే కథలూ

ముళ్ళకిరీటాలైన మొహమాటాల

చెత్తాచెదారం ఊడ్చిపారేసిన క్షణం

భయసందేహాలు బాధించని

పచ్చని మైదానాలు ఊహల్లో పరచుకున్నాయి


నింగి దిగి వచ్చే రంగురంగుల పిడికెడంత పిట్టలు

సరిగమలను కాచివడబోసి మధుపాత్ర నింపుతాయి

పండి పరిమళిస్తున్న వేకువ చుట్టూ

హరివిల్లు చారలను అతికించి

సీతాకోక చిలుకలు సొగసుల ఊయలలెక్కుతాయి

ఇంటిపక్కనే ఉబికి వస్తున్న స్వప్న ప్రవాహం

జీవనదిగా కదులుతూనే ఉంది

రెల్లుపూలై తూలిసోలే వయ్యారాలు

సుదూరతీరాలకు మోస్తున్న రంగులు

రండి

ఓ పిడికెడు స్వప్నాలు అందుకోండి

మీ మనసు వాకిట అలంకరించుకుందుకైనా.

స్వాతి శ్రీపాద

Updated Date - Jul 08 , 2024 | 05:50 AM

Advertising
Advertising
<