మీ కోసం ఆదివాసీలు నిర్వాసితులు కావాలా?
ABN, Publish Date - Dec 18 , 2024 | 02:12 AM
భారతసైన్యాలు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని నారాయణ్ పూర్ జిల్లా, మాడ్ (ప్రభుత్వం, మీడియా ‘అబూజ్’ మాడ్ అనడం పట్ల మాకు అంగీకారం లేదు) ప్రాంతాన్ని తమ బలగాల సైనిక శిక్షణ కోసం కైవసం చేసుకోవడానికి...
భారతసైన్యాలు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని నారాయణ్ పూర్ జిల్లా, మాడ్ (ప్రభుత్వం, మీడియా ‘అబూజ్’ మాడ్ అనడం పట్ల మాకు అంగీకారం లేదు) ప్రాంతాన్ని తమ బలగాల సైనిక శిక్షణ కోసం కైవసం చేసుకోవడానికి ఎడతెరిపి లేకుండా ప్రయత్నిస్తున్నాయి. భారత సైన్యాలు కోరుతున్న ప్రాంతం దాదాపు 55 వేల హెక్టార్ల అటవీ, జనావాస, పంట భూముల ప్రాంతం (1,34,778 ఎకరాలు). ఇది మాడ్ నడిగడ్డన సోన్‌పూర్ నుంచి గార్ప మధ్య గల ప్రాంతం. వారు నిర్దిష్టంగా కోరుతున్న ప్రాంతం అదే అయినప్పటికీ దానికి అనేక రెట్లకు పైగా గ్రామ పంచాయతీల పరిధిలోని భూభాగాన్ని ఖాళీ చేయించడానికి ఆగమేఘాల మీద సర్వే పనులు జరుగుతున్నాయి. 72 గ్రామాలు ఖాళీ చేయాలనే తాఖీదులు చేరుతున్నాయి. ఈ ప్రాంతంలోని ప్రజలకు దూరంగా ఎక్కడో పునరావాసం కల్పిస్తామని అంటున్నారు. కానీ, మాడ్ కొండలలోని బాధిత ప్రజలు మాత్రం తమ అడవులను, భూములను వదలడానికి సిద్ధంగా లేరు. వారు ఇప్పటికే సంబంధిత అధికారులకు విన్నపాలను వినిపించుకుంటున్నారు. కానీ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందుకు ఎంతమాత్రం సిద్ధంగా లేవని వాటి వైఖరి తెలుపుతోంది.
2024 జనవరి నుంచి మొదలై మాడ్‌తో సహా యావత్ దండకారణ్య ప్రాంతంలో కొనసాగుతున్న ఆపరేషన్ కగార్‌లో భాగంగా సైనిక దాడులతో రక్తసిక్తమవుతున్న అడవుల నుంచి ప్రజలను ఖాళీ చేయించే చర్యలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాయపూర్‌లో జరిపిన ఏడు మావోయిస్టు ఉద్యమ రాష్ట్రాల పోలీసు అధికారుల సమావేశం నేపథ్యంలో అర్థం చేసుకోవాలి. దేశంలో మావోయిస్టులను, మావోయిజాన్ని 2026 మార్చ్ నాటికి అంతమొందిస్తామని ఆ సమావేశం ప్రకటించింది. అందుకోసం ప్రస్తుత కగార్ దాడులను రెట్టింపు వేగంతో, తీవ్రతతో కొనసాగించాలనీ నిర్ణయించింది. ఈ దాడులను ‘మాడ్ బచావో’ కేంపెయిన్ పేరుతో కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. వారి లక్ష్యాన్ని చేరడానికి మాడ్ కొండలలో భారత సైన్యాల శిక్షణా శిబిరాన్ని ఏర్పాటు చేయడంతో పాటు, మాడ్ ప్రాంతం నుంచి ప్రజలను బలవంతంగా ఖాళీ చేయించే చర్యలను చేపడుతున్నారు. తిరిగి మూడేళ్లకు మీ ప్రాంతాలకు మీరు చేరుకుంటారనీ ప్రజలను మభ్యపెడుతున్నారు. భారత సైన్యాలు మావోయిస్టు ఆపరేషన్‌లలో పాల్గొనవని కేంద్ర హోంమంత్రి బుకాయిస్తున్నారు కానీ, ఇప్పటికే అనేక సంవత్సరాలుగా వేరు వేరు రూపాలలో భారత సైన్యాలు నక్సల్ వ్యతిరేక ఆపరేషన్‌లలో పాల్గొంటున్న విషయం బహిరంగ రహస్యమే.
కార్పొరేట్ వర్గాల ప్రయోజనాల కోసం వివిధ ప్రాజెక్ట్‌ల పేరుతో దేశంలో నిర్వాసితులైన వారిలో ఆదివాసీలే అధిక సంఖ్యలో ఉన్నారు. దండకారణ్యంలో 1970లలో చేపట్టిన కిరండాల్ తవ్వకాలతో పెద్ద ఎత్తున ఆదివాసీలు నిర్వాసితులయ్యారు. ఇంచుమించు అదే సమయంలో మార్డూంలో అత్యంత రహస్యంగా భారత రక్షణరంగ యూనిట్‌ను నిర్మించినపుడు ఆదివాసీలు నిర్వాసితులయ్యారు. 1980ల నాటికి మాడ్ కొండలపై నుండి ఆదివాసీలను మైదాన ప్రాంతాలకు తరమడానికి అన్ని సన్నాహాలు జరిగాయి. అడవుల నుంచి మనుషులను తరిమివేసి పులులను పెంచి పోషించే ప్రభుత్వ విధానాలతో 1980లలోనే వర్తమాన బీజాపుర్ జిల్లా నేషనల్ పార్క్ ఏరియా నుంచి పదుల గ్రామాలను ఖాళీ చేయించ పూనుకున్న పరిస్థితులలో ఆదివాసీలు సంఘటితంగా దానిని ఎదుర్కొన్నారు. తిరిగి ఇపుడు వారికి తమ గ్రామాలను ఖాళీ చేయాలనే ఆదేశాలు జారీ అయ్యాయి.
గత నాలుగేళ్ల నుంచి అనేక కార్పొరేట్ వర్గాల ప్రయోజనాల కోసం వేగంగా కొనసాగిస్తున్న గనుల తవ్వకాలతో బృహత్ బస్తర్‌లో, గడ్‌చిరోలీలో కాలుష్యం ప్రబలుతూ ప్రజల పంట భూములు వల్లకాడై పోతున్నాయి. జనావాసాలు నివాసయోగ్యం కాకుండా పోతున్నాయి. పచ్చని అడవులు నాశనమవుతున్నాయి. 2030 నాటికి గడ్‌చిరోలీ జిల్లాను పారిశ్రామిక జిల్లాగా మారుస్తామని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ శిందే ప్రకటించాడు. ఈ పరిణామాలతో ఈ ప్రాంతాలలోని ఆదివాసీలు ఏ పట్టణాలకో, ఏ నగరాలకో, ఏ మురికివాడల జీవితాలకో బలి కానున్నారు. చాలా బాధాకరమైన విషయం ఏమంటే, ఈ ప్రాంతాలలోని ఆదివాసీ తెగలు భారత రాజ్యాంగం ప్రకారం అంతరించిపోతున్న తెగల జాబితా లోకి వస్తారు. కార్పొరేట్ల ప్రయోజనాల కోసం ఆదివాసీల జీవితాన్ని పణంగా పెడుతూ వారి అస్తిత్వాన్నే ధ్వంసం చేస్తున్నారు.
గతంలో ఫాసిస్ట్ సల్వాజుడుం సమయంలో సుక్మా, దంతెవాడ, బీజాపుర్ జిల్లాల్లోని వేలాదిమంది ప్రజలను తమ అడవుల నుంచి, గ్రామాల నుంచి తరిమి ‘సహాయశిబిరాల’ పేరుతో రోడ్డుపక్కన నిర్మించిన ‘షెల్టర్’లలోకి తరలించారు. ఆ షెల్టర్లన్నీ నరక కూపాలే. వాస్తవంగా అవన్నీ కాన్‌సెంట్రేషన్ క్యాంపులే. అక్కడ ప్రజలకు ఎలాంటి అవకాశాలు ఉండవు. మహిళల జీవితాలలో కనీస భద్రత కరువైంది. అడవులలో స్వేచ్ఛగా తిరుగుతూ తమ దైనందిన అవసరాలను తీర్చుకునే ఆదివాసీలకు ‘సహాయ శిబిరాల’ జీవితాలు మృత్యు కుహరాల్లాంటివే. బలవంతంగా ఆ శిబిరాలకు తరలించబడిన ప్రజలు అక్కడ ఉండలేక వివిధ రూపాలలో తిరిగి తమ అడవులకు, గ్రామాలకు చేరుకున్నారు. వారికి విప్లవోద్యమంతో సహా అనేకమంది ప్రజాస్వామికవాదులు, ఆదివాసీ శ్రేయోభిలాషులు సహకరించారు.
‘‘1950లో భారతదేశ ప్రజాస్వామ్యానికి నైతిక పునాది అయిన భారత రాజ్యాంగాన్ని పార్లమెంటు ఆమోదించిన రోజు నిజానికి ఆదివాసులకు దురదృష్టకరమైన రోజు. రాజ్యాంగం వలస విధానాన్నే స్థిరీకరిస్తూ ఆదివాసుల నివాస ప్రాంతాలకు రాజ్యం సంరక్షకురాలిగా ఉంటుందని తేల్చింది. ఉన్నట్టుండి మొత్తం ఆదివాసీ సమూహాలన్నింటినీ వాళ్ల సొంత నేల మీదే పరాయివాళ్లను చేసింది. అటవీ ఉత్పత్తుల మీద వారి సంప్రదాయ హక్కును నిరాకరించి వారి జీవన విధానాన్నే నేరమయం చేసింది. ఓటుహక్కుకు బదులుగా, వాళ్ల జీవించే హక్కును, ఆత్మగౌరవాన్ని లాగేసుకుంది’’ – అని అరుంధతీరాయ్ ‘వాకింగ్ విత్ కామ్రేడ్స్’ పుస్తకంలో సరిగ్గా వ్యాఖ్యానించారు.
ప్రస్తుతం మాడ్ కొండలలోని ప్రజలు కోరుతున్నదేమిటి? వారు తమ ‘కొండలను ఖాళీ చేయం’ అంటున్నారు. వారు తమ భూములను వదలం అంటున్నారు. తమ అడవులను కాపాడుకోవాలంటున్నారు. ప్రకృతి వనరులను దేశం కోసం, ప్రజల కోసం, భవిష్యత్ తరాల కోసం నిలుపుకోవాలంటున్నారు. మాడ్ కొండలలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన అన్ని చర్యలను తక్షణం నిలిపివేయాలని కోరుతున్నారు. మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్‌లలో భారత సైన్యాలు పాల్గొంటాయా, లేదా అనేది వేరే విషయం. దానితో, ఈ అంశాన్ని ముడిపెట్టడం ప్రభుత్వాల మోసకారి విధానమే అవుతుంది.
మధ్య భారత అడవులలో భారత సైన్యాల శిక్షణా శిబిరం ఏర్పాటును ఒక దీర్ఘదృష్టితో వ్యూహాత్మక పథకంతో రూపొందిస్తున్నారు. గత అనేక సంవత్సరాలుగా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన పాలకవర్గాలు దానినుంచి బయటపడడానికి ఒకవైపు దేశంలోని విశాలమైన అడవులలోని విలువైన సంపదలను తరలించుకుపోవడానికి పూనుకుంటూనే, అందుకు వ్యతిరేకంగా ప్రబలుతున్న ప్రజా నిరసనను నిర్దాక్షిణ్యంగా అణచివేయడంలో భాగంగా ముందునుంచే భారత సైన్యాలకు గెరిల్లా యుద్ధ తంత్రంలో శిక్షణను అందిస్తున్నారు. అనేక దేశాలలో ప్రజలు సంక్షోభాలకు వ్యతిరేకంగా వెల్లువెత్తుతున్నారు. వర్తమాన పరిస్థితులలో అలాంటి వెల్లువ భారతదేశంలో కూడా సంభవించడానికి పూర్తి అవకాశాలున్నాయని గ్రహించే ఇలాంటి ముందస్తు చర్యలకు దిగుతున్నారు. ఇలాంటి పరిస్థితులలో, దేశంలోని సమస్త ప్రగతిశీల శక్తులు, విద్యార్థి, మేధావి, కార్మిక, కర్షక శక్తులు, రచయితలు, కళాకారులు మాడ్ ప్రజల న్యాయమైన అస్తిత్వ సమస్యను సమర్థిస్తూ వారికి అండగా నిలువాలనీ, మాడ్ కొండలలో భారత సైన్యాల శిక్షణా శిబిరాన్ని రద్దు చేయడానికి ఉద్యమించాలనీ మా విన్నపం.
కురుసం శంకర్
ఆదివాసీ రచయితల, కళాకారుల ఐక్య వేదిక
(బస్తర్–-గడ్‌చిరోలీ)
Updated Date - Dec 18 , 2024 | 02:12 AM