ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కమల పైచేయి..!

ABN, Publish Date - Sep 14 , 2024 | 04:46 AM

అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో ఉన్న డెమోక్రాటిక్‌ పార్టీ అభ్యర్థి కమలా హారిస్‌తో మరోమారు చర్చకు దిగేది లేదని రిపబ్లికన్‌పార్టీ అభ్యర్థి డోనాల్డ్‌ ట్రంప్‌ తేల్చేశారు.

  • తమసోమా జ్యోతిర్గమయ

మెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో ఉన్న డెమోక్రాటిక్‌ పార్టీ అభ్యర్థి కమలా హారిస్‌తో మరోమారు చర్చకు దిగేది లేదని రిపబ్లికన్‌పార్టీ అభ్యర్థి డోనాల్డ్‌ ట్రంప్‌ తేల్చేశారు. తామిద్దరి మధ్యా ఇటీవల జరిగిన తొలిడిబేట్‌లో కమల ఘోరంగా ఓడిపోయినందున, ఇక మరోమారు ఆమెతో చర్చ అవసరం లేదని ట్రంప్‌ చెబుతున్నారు. ట్రంప్‌ చేసిన ఈ వ్యాఖ్యతో ఆయన కమలను ఢీకొనేందుకు భయపడిపోతున్నారని, మొఖం చాటేస్తున్నారని కొత్త విమర్శలు ఆరంభమైనాయి. ఇటీవలి ఫిలడెల్ఫియా చర్చలో కమలదే పైచేయి అని అత్యధికులు భావిస్తున్నట్టు పలు సర్వేలు చెప్పిన విషయం తెలిసిందే. ఈ చర్చ ఫలితం, ప్రభావం రేపటి ఎన్నికల ఓటింగ్‌ మీద ప్రత్యక్షంగా ఉంటుందో లేదో తెలియదు కానీ, ప్రధానంగా తటస్థ ఓటర్లను కమల బాగా ప్రభావితం చేయగలిగారని, ట్రంప్‌ వీరాభిమానులకు వ్యతిరేకత కాస్తంత తగ్గిందని విశ్లేషణలు సాగుతున్నాయి.

అధ్యక్షబరిలో ఆమెకు ఇది తొలిచర్చ. ఇరువురూ ముఖాముఖి కలుసుకోవడం కూడా ఇదే తొలిసారి. ట్రంప్‌కు ఇప్పటికే అనేకమందిని ఢీకొన్న గతానుభవం ఉన్నది. అందువల్ల, ఆయన ముందు కమల నిలువగలదా అని కొందరు అనుమానపడ్డారు. నిజానికి, ఈ చర్చ ట్రంప్‌– బైడెన్‌ మధ్య జరగాలి. అప్పట్లో వీరిద్దరి మధ్యా జరిగిన తొలి ప్రెసిడెన్షియల్‌ డిబేట్‌ను బాగా ముందుకు జరిపింది కూడా, ట్రంప్‌ వాగ్ధాటి ముందు బైడెన్‌ తప్పిజారి నిలువలేకపోయినా, సరిగ్గా ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ జరిగే మరోచర్చలో పైచేయి సాధించవచ్చుననే. కానీ, ఆ తొలిచర్చలోనే బైడెన్‌ ప్రవర్తన, తడబాటు, మతిమరుపు డెమోక్రాటిక్‌ పార్టీని భయపెట్టాయి. ట్రంప్‌ అసత్యాలు, అర్థసత్యాలు, వెటకారపు వ్యాఖ్యల ముందు బైడెన్‌ నిలవలేకపోయారు. ట్రంప్‌ను సరిగా ఎదుర్కోలేకపోయారన్న విమర్శల నేపథ్యంలో పార్టీనుంచి ఆయనమీద ఒత్తిడిపెరిగింది. మొదట్లో కాస్తంత మొండికేసినా, ఆ తరువాత ఆయనకే అనిపించిందో, మర్యాదగా ఉండదనిపించిందో తెలియదు కానీ, ఎట్టకేలకు పక్కకు తప్పుకున్నారు. ఆయన నిష్క్రమణ పార్టీకి కొత్త ఉత్తేజాన్నిచ్చింది. కమలకు నిధుల వరదతోపాటు, మహామహులంతా వరుసపెట్టి మద్దతు నివ్వడం మొదలైంది. పార్టీ అభ్యర్థిత్వాన్ని స్వీకరిస్తూ ఆమె చేసిన ప్రసంగం కూడా చాలామందికి నచ్చింది. ఆ తరువాత ఆమె ప్రజాదరణకూడా హెచ్చినట్టు సర్వేలు తేల్చాయి.


పరోక్షంలో ట్రంప్‌ను విమర్శించడం వేరు, కీలకమైన అంశాలమీద నిర్దిష్టమైన, విలువైన, లోతైన చర్చచేస్తూ, ఆయనను నేరుగా ఢీకొనడం వేరు. ఎంతో అపారమైన అనుభవమూ, దాడిసామర్థ్యం ఉన్న ట్రంప్‌ ఈ చర్చలో వెనక్కుపోయారని, మాటతీరుకు తోడుగా ఆమె ముఖకవళికలు, ఆత్మవిశ్వాసం అనేకులను ఆకట్టుకున్నాయని సర్వేలు విశ్లేషిస్తున్నాయి. ఆమెరికా ఏవో కష్టాలు, అరిష్టాలతో బాధపడుతున్నట్టుగా ట్రంప్‌ వ్యాఖ్యలన్నీ ఉన్నాయని, ఇందుకు భిన్నంగా ఎంతో సానుకూల దృక్పథంతో కమల మాట్లాడారని అంటున్నారు. ఒకదశ దాటిన తరువాత ట్రంప్‌ ఆత్మరక్షణలో పడ్డారని, పైచేయి కోసం అసత్యాలకు తోడు అసంబద్ధమైన వ్యాఖ్యలు చేశారని, అసహనం ప్రదర్శించారని అమెరికన్ మీడియా వ్యాఖ్యానిస్తోంది. కమల పుట్టుక, మూలాల మీద దాడిచేయడం ట్రంప్‌కు కొత్తేమీ కాదు. భారతీయ మూలాలున్న ఆమెకు తండ్రి వైపునుంచి ఆఫ్రో అమెరికన్ల మద్దతు కూడా విశేషంగా దక్కుతోందని, డెబ్బైశాతం మంది ఓటర్లు ఆమె పక్షాన ఉన్నారని వార్తలు వస్తున్నాయి. ఈ కారణంగా ఆమె ఆఫ్రో అమెరికన్‌ కాదని ప్రచారం చేసేందుకు ట్రంప్‌ ప్రయత్నిస్తుంటారు. ఆమె తండ్రిని దృష్టిలో పెట్టుకొని కాబోలు, ఈమెను మార్క్సిస్టుగా అభివర్ణిస్తుంటారు.

తొంభైనిముషాల పాటు జరిగిన ఈ చర్చలో ఇరువురూ అబార్షన్ల నుంచి యుద్ధాలవరకూ అనేక అంశాలను ప్రస్తావించారు. ప్రధానంగా ఎదురుదాడితప్ప ఈ చర్చలో వీరిద్దరూ అతిముఖ్యమైన అంశాలకు సైతం తమ పరిష్కారమేమిటో ప్రతిపాదించలేకపోయారన్న విమర్శ లేకపోలేదు. ముఖ్యంగా గాజా యుద్ధం ముగింపు విషయంలో నిర్దిష్టమైన హామీ ఏమీ లేదు. పైగా, ఇజ్రాయెల్‌ మీద కమల కక్షకట్టారనీ, ఆమె అధికారంలోకి వస్తే ఆ దేశానికి కష్టాలు తప్పవని వ్యాఖ్యానించడం ద్వారా ట్రంప్‌ యూదుశక్తిని తనవైపు తిప్పుకొనే ప్రయత్నం చేశారు. ఈ చర్చ తరువాత కమల రేటింగ్‌ మరికాస్తంత పెరిగింది. సర్వేల్లో ఆమె పట్ల కనిపిస్తున్న సానుకూలత అధ్యక్ష ఎన్నికల వరకూ నిలిచి, ఇంకాస్తంత పెరిగి, ఓటింగ్‌లో కూడా ప్రతిఫలిస్తుందో లేదో చూడాలి.

Updated Date - Sep 14 , 2024 | 07:31 AM

Advertising
Advertising