దిద్దుబాటల్ని చూపే వేళ్లు
ABN, Publish Date - Sep 05 , 2024 | 01:32 AM
ఆదిమ కాలపు గురుకులాలైనా ఆధునిక యుగంలో హంగుల నెలవులైనా బడిలో అడుగుపెట్టే ప్రతిరోజూ మీ గురుస్థానం మీకు మరో బాల్యం...
ఆదిమ కాలపు గురుకులాలైనా
ఆధునిక యుగంలో హంగుల నెలవులైనా
బడిలో అడుగుపెట్టే ప్రతిరోజూ
మీ గురుస్థానం మీకు మరో బాల్యం
బోధించేది ఆదికాండమైనా ఆఖరి పర్వమైనా
పాఠం మొదలుపెట్టే ప్రతిసారీ
మీది అక్షరమాల వల్లెవేసిన నాటి శ్రద్ధ!
పండ్లచెట్టు కింద ఫలాలు రాలినట్టు
మీ మునివేళ్ళ నుండి
ముచ్చటగా బొమ్మలు రాల్తాయి
మీ గొంతులో మాటలూ పాటలూ కథలూ
పరుగుపందెంలా పోటీ పడతాయి
చాత్రోపాధ్యాయ శిక్షణలో
ఎన్ని వాత్సల్య సూత్రాలు
మీ చెవిలో ఊది ఉంటారో..
నిదురించే పాపాయి మోములో
సన్నగా చిర్నవ్వురేఖ మురిసినట్లు
పిల్లల ముందు మీదెంత ప్రశాంత వదనం!
విద్యార్థులు వినయంగా పుస్తకాలై
మీ చెయ్యందుకోవాలేగాని
వారి బతుకులోంచి సగం చీకట్లు మాయం
మీ చూపుడువేళ్ల వెంట దిద్దుబాటల్లో నడిస్తే
అనునిత్యం ముట్టడించాలని చూసే
ఏ అసురసంధ్యలైనా మటుమాయం
మీలాంటి నిస్వార్థ ఉపాధ్యాయ లోకం
జాతి శ్రేయస్సును కోరుతుంది
విలువలూ విజ్ఞానం అతుల్య సంపదలుగా
కొత్త తరాలకు పంచిపెడుతుంది
మీ తరగతి గది స్వప్నాల వెలుగులోనే
ఈ దేశం పచ్చగా శ్వాసిస్తుంది
కంచరాన భుజంగరావు
Updated Date - Sep 05 , 2024 | 01:32 AM