ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

అన్యమతస్థులతో అన్యోన్య బంధం

ABN, Publish Date - Sep 21 , 2024 | 02:46 AM

భిన్న మతాలకు చెందినవారు శాంతి సామరస్యాలతో కలసికట్టుగా జీవించేలా చేయడమెలా? ఇది, ఆధునిక ప్రపంచం ఎదుర్కొంటున్న మహా సవాళ్లలో ప్రధానమైనది.

భిన్న మతాలకు చెందినవారు శాంతి సామరస్యాలతో కలసికట్టుగా జీవించేలా చేయడమెలా? ఇది, ఆధునిక ప్రపంచం ఎదుర్కొంటున్న మహా సవాళ్లలో ప్రధానమైనది. మత సంబంధమైన అధిక సంఖ్యాక వాదం ప్రాతిపదికన పశ్చిమాసియా, దక్షిణాసియాలలో జాతి–రాజ్యాల ఏర్పాటు, ఐరోపా, ఉత్తర అమెరికా దేశాలకు క్రైస్తవేతరుల వలసలు తీవ్ర కలహాలు, తరచు హింసాత్మక ఘర్షణలకు కారణమయ్యాయి. దురహంకారం, ఆధిక్యతా భావన పదే పదే సహనం, పరస్పర అవగాహనపై విజయం సాధిస్తున్నాయి.

భిన్న మతాల మధ్య మరింత అవగాహనను పెంపొందించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని అమెరికా విద్వజ్ఞుడు థామస్‌ ఆల్బెర్ట్‌ హోవార్డ్‌ తన పుస్తకం ‘The Faith of Others : A History of Interreligious Dialogue’లో ప్రేరణాత్మకంగా స్పష్టపరిచారు. హోవార్డ్‌ పుస్తకం ప్రధానంగా క్రైస్తవంపై దృష్టిని కేంద్రీకరించింది. క్రైస్తవ ధర్మశాస్త్రజ్ఞులు ఒకప్పుడు తమ మతమే నిజమైన మతమని సునిశ్చితంగా విశ్వసించేవారు. ఆ విషయమై గట్టిగా వాదించేవారు. ఇరవయో శతాబ్దంలో ఈ ధోరణి క్రమంగా మారింది. ఆధ్యాత్మిక అహంకారానికి పేరుబడిన రోమన్‌ కేథలిక్‌ చర్చ్‌ 1960లలో ఇతర మతాలను అంగీకరించడం ప్రారంభించింది. 1964లో పోప్‌ జారీ చేసిన ఒక ఆదేశంలో ‘వివిధ క్రైస్తవేతర మతాల నైతిక, ఆధ్యాత్మిక విలువలను గుర్తించి, గౌరవించాలని’ పేర్కొన్నారు.


మతాల మధ్య సంభాషణను ప్రతిపాదించి, ప్రోత్సహించిన ఇద్దరు ప్రముఖ భారతీయుల గురించి హోవార్డ్‌ తన పుస్తకంలో విపులంగా రాశారు. వారిలో మొదటి వ్యక్తి మొగల్‌ చక్రవర్తి అక్బర్. 1952లో ప్రముఖ చరిత్రకారుడు మఖన్‌లాల్‌ రాయచౌధురి రాసిన ‘దీన్‌ ఇ ఇలాహి : అక్బర్‌ మతం’ అనే పుస్తకం ఆధారంగా అక్బర్‌ గురించి హోవార్డ్‌ రాశాడు. ఆయన ఉటంకించిన ఆ చక్రవర్తి లేఖ ఒకటి నన్ను బాగా చకితుడిని చేసింది. తన సమకాలికుడు అయిన స్పెయిన్‌ రాజు రెండవ ఫిలిప్‌కు రాసిన లేఖ అది. యూదులు, ముస్లింలను స్పెయిన్‌ నుంచి బహిష్కరించిన తరువాత ఆ యూరోపియన్ దేశంలో కేథలిక్ క్రైస్తవ మత విశ్వాసాలు, సిద్ధాంతాలలో సంకుచితత్వం పెరగసాగింది. భారత్‌ నుంచి స్పెయిన్ నేర్చుకోవాలని రెండవ ఫిలిప్‌కు రాసిన లేఖలో అక్బర్ సూచించాడు. ‘ఇక్కడ తాను పుట్టి పెరిగిన, జ్ఞానార్జనకు, స్వీయ జీవన రీతులకు ఆలంబనగా ఉన్న మతాన్ని అనుసరించడంలో కారణాల గురించి ఎవరూ విచారణశీలురు కారు. ప్రతి ఒక్కరూ తమ స్వీయ మత మార్గంలో నడుస్తారు. తద్వారా మానవ మేధ ఉత్కృష్ట లక్ష్యమైన సత్యాన్ని తెలుసుకొనే సాధ్యాసాధ్యాలనుంచి తమకు తాము మినహాయింపబడతారు. ఈ కారణంగా మేము మా దేశంలో అన్ని మతాల ఆచార్యులు, విద్వాంసుల సదస్సులు నిర్వహించి, వారి సునిశితమైన చర్చలు, వివేకదాయక ప్రవచనాలు, ఉజ్వల ఆశంసల నుంచి జ్ఞానవంతులమవుతుంటాము’.


మతాల మధ్య సంభాషణను ప్రతిపాదించిన రెండవ మహోన్నత భారతీయుడు స్వామి వివేకానంద. అక్బర్‌కు కొన్ని శతాబ్దాల తరువాత జీవించిన వివేకానంద గురించి హోవార్డ్‌ సుదీర్ఘంగా రాశారు. 1893లో షికాగోలో జరిగిన సర్వ మత ప్రతినిధి సభలో వివేకానంద ప్రసంగానికి ప్రాధాన్యమిచ్చారు. తొలుత ఆ సభ లక్ష్యాలను ప్రస్తావించి వివేకానంద ప్రసంగ భాగాలను ఉటంకించారు. వాటిలో మొదటిది : ‘సకల ప్రపంచానికి సహనాన్ని, విశ్వజనీనతను బోధించే ఒక శ్రేష్టమైన మతానికి చెందినవాడినని నా గురించి చెప్పుకోవడం నాకు ఎంతో గర్వంగా ఉంది. విశ్వ విశాలమైన సహనాన్నే కాక, మేము సమస్త మతాలూ సత్యమైనవే అని ఆమోదిస్తాము. ఈ సమస్త ధాత్రిపైన అసహనానికీ, హింసకు గురి అయిన అన్ని మతాల వారినీ, అన్ని దేశాలకు చెందిన వారిని, వారు శరణార్థులై వచ్చినప్పుడు ఆదరించి, వారికి భద్రత కలిపించిన ఉదారమయమైన మతం మాది అని చెప్పుకోవడానికి నేను గర్విస్తున్నాను’. రెండో ఉటంకింపు మరింత ముఖ్యమైనది: ‘మత వైషమ్యం, అంధ విశ్వాసం. దీని భయంకర ప్రవృత్తి అయిన మత విద్వేష మాత్సర్యం ఈ సుందరమైన ధరిత్రిని ఎంతకాలంగానో అంటి పెట్టుకొని ఉండనే ఉన్నాయి. ఇవాళ ఉదయం ఈ మత మహాసభ గౌరవార్థం మోగిన ఘంటా నాదం అన్నిరకాల మత మూర్ఖత్వాన్ని, మత పరమైన హింసాపరత్వాన్ని కత్తితోనో లేదా కలంతోనో సాగించే మత దౌర్జన్యాన్ని, ఒక గమ్యాన్ని ఆశించి గమించే వారి మధ్య వైమనస్యాన్ని తుదముట్టించే మృత్యుఘంటిక అవుతుందని ఆశిద్దాం’.


మహాత్మాగాంధీని కదాచిత్తుగా హోవార్డ్‌ ప్రస్తావించారు. ఆయన మత చింతనను లోతుగా పరామర్శించలేదు. వాస్తవానికి గాంధీ ఒక మత బహుళత్వ వాది. అక్బర్‌, వివేకానంద కంటే మరింత ప్రగాఢమైన, మౌలికంగా భిన్నమైన మత చింతకుడు. హిందూయేతర మతాలతో ఆయన తన సంభాషణను సాగించడమే కాదు ఒక సామాజిక కార్యక్రమంగా కూడా దాన్ని ఆచరించారు. దక్షిణాఫ్రికాలోను భారత్‌లోను ఆయన నిర్వహించిన సత్యాగ్రహాలు సమస్త ప్రపంచ మతాలకు చెందిన వారిని తమ ప్రభావశీల పరిధిలోకి తీసుకురావడానికి ప్రయత్నించాయి. ఆయన ఆశ్రమాలలో భిన్న మతాలకు చెందినవారు ఉండేవారు. నిరంతరం సన్నిహితంగా, పరస్పర గౌరవాదరాలతో కలసిమెలసి ఉండేవారు. గాంధీ ఆశ్రమాలలో రోజూ జరిగే సర్వ మత ప్రార్థనా సమావేశంలో భిన్న మతాల పవిత్ర గ్రంథాల నుంచి గీతాలు, శ్లోకాలు, సూక్తులు చదివేవారు, గానం చేసేవారు. ఇదొక వినూత్న, మత అనుష్ఠానం. యుద్ధాలతో సంక్షుభితమవుతున్న నేటి ప్రపంచానికి ఆ మానవీయ మతాచరణ ఉపయుక్తత ఎంతో ఉంది.


నాస్తికుల వలే కాకుండా మానవ అవగాహనాశక్తికి అతీతమైన ఒక సర్వోన్నత శక్తి, ఒక ఉత్కృష్ట స్ఫూర్తి ఉందని గాంధీ అంగీకరించేవారు. మత విశ్వాసుల వలే కాకుండా తన మతమే భగవంతుడికి ఒక ప్రత్యేక, ఉన్నతోన్నతమైన బాట నిర్మించిందని గాంధీ ఎన్నడూ విశ్వసించలేదు. 1924లో ‘భగవంతుడు ఒక్కడే’ అన్న వ్యాసంలో ఆయన ఇలా పేర్కొన్నారు: భారతావని నుంచి ఇస్లాం, క్రైస్తవంను తొలగించాలని హిందువులు ఆశించడం ఒక పనికిమాలిన విషయం, అదొక వ్యర్థ వ్యవహారం మాత్రమే అవుతుంది.. అలాగే ముస్లింలు తాము విశ్వసించే ఇస్లాం మాత్రమే ఈ ప్రపంచాన్ని ఏలాలని కోరుకోవడమూ వ్యర్థమే... సత్యం ఏ ఒక్క మతం, ఏ ఒక్క మత గ్రంథం సొంత సొత్తుకాదు. అటువంటి సంకుచితత్వాలను తిరస్కరించిన ఉదాత్తుడు కనుకనే మత మార్పిడులను ఏ మతస్థుడు చేపట్టినా దాని ప్రయోజనాన్ని గాంధీ సంశయించేవారు. ‘మిషనరీ కార్యకలాపాల మూల కారణంలో తాము విశ్వసించే మతం తమకే కాదు యావత్ప్రంచానికి నిజమైనది, ఏకైక మోక్ష ప్రదాయిని’ అన్న భావన ఉంటుంది. అయితే భగవంతుడు లక్షలాది మార్గాలలో మనకు సామీప్యంలో ఉన్నాడనేదే సత్యం. దీన్ని మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. ఈ దృష్ట్యా మిషనరీ కార్యకలాపాలలో నిజమైన వినయం అనేది కొరవడింది. తన గురించి గాంధీ ఇలా చెప్పుకున్నారు: ‘ఒక ఆదివాసీ కంటే నేను ఆధ్యాత్మికంగా సమున్నతుడిననే భావన నాకు లేదు. ఆధ్యాత్మిక ఆధిక్యతా భావం చాలా ప్రమాదకరమైనది’. తన సొంత మతానితో పాటు ఇతర మతాలనూ గౌరవించడం, భిన్న మతాల ప్రజలతో స్నేహపూరితంగా ఉండడం అనేది కేవలం గాంధీ వ్యక్తిగత అభీష్టం కాదు అదొక రాజకీయ అనివార్యత కూడా. 1941లో కాంగ్రెస్‌ సభ్యులు ప్రతి ఒక్కరూ అనుసరించి తీరవల్సిన ‘నిర్మాణ కార్యక్రమం’ నొకదాన్ని గాంధీ ప్రతిపాదించారు. ఒక చిన్న పుస్తకంలో దాన్ని వివరించారు. ఆ పుస్తకంలో ఆయన ప్రస్తావించిన అంశాలలో అస్పృశ్యత రద్దు, ఖాదీ ప్రచారం, మహిళాభ్యున్నతి, ఆర్థిక సమానత్వాన్ని సాధించడం మొదలైనవి ఉన్నాయి. మరింత ముఖ్యమైన విషయమేమిటంటే ఈ నిర్మాణ కార్యక్రమంలో మొదటి ప్రాథమికాంశం ‘మత సమైక్యత. మత సామరస్యాన్ని సాధించేందుకు మొట్టమొదటి ఆవశ్యకం ప్రతి కాంగ్రెస్‌వాది తన మతం ఏమైనప్పటికీ హిందూ, ముస్లిం, క్రైస్తవ, జోరాష్ట్రియన్‌ మతాల ప్రతినిధిగా భాసించాలి. భారత్‌లోని కోట్లాది ప్రజల అస్తిత్వంతో మమేకమవ్వాలి. ప్రతి హిందువు, హిందూయేతరుడు ఆ విధంగా ప్రవర్తించాలి. ఇందుకు ప్రతి కాంగ్రెస్‌వాది తన వ్యక్తిగత స్నేహ సంబంధాలలో తన సొంత మతస్థులతో పాటు అన్య మతస్థులను కూడా విధిగా భాగస్వాములుగా చేసుకోవాలి. తన సొంత మతం పట్ల చూపుతున్న గౌరవాన్నే ఇతర మతాల పట్ల కూడా చూపాలి.


ఇది గాంధీ సునిశ్చిత విశ్వాసం. దాన్ని ఆయన అంతః ప్రేరణ, చిత్తశుద్ధితో అనుష్ఠానించారు. ఆయన స్నేహితులు, సహచరులలో హిందువులు కానివారు పెద్ద సంఖ్యలో ఉన్నారు. వారి జాబితాను చూడండి. ముస్లింలు: అబ్దుల్‌ కడెర్‌ బావాజీర్‌, ఎ.ఎమ్‌. సచాలియా, అబుల్‌ కలామ్ ఆజాద్‌, జకీర్‌ హుస్సేన్‌, అసఫ్‌ అలీ, రైహ్న త్యాబ్జీ; క్రైస్తవులు: జోసయ్య ఓల్డ్‌ ఫీల్డ్‌, జోసెఫ్‌ డోక్‌, సిఎప్‌ ఆండ్ర్యూస్‌, జె.సి. కుమారప్ప; మరియెల్‌ లెస్టర్‌, రాజ్‌ కుమారి అమృత్‌ కౌర్‌; పార్శీలు: దాదా భాయి నౌరోజీ, జీవాన్జీ రుస్తోమ్జీ, ఖుర్షీద్‌ నౌరోజీ; యూదులు: హెర్మన్‌ కాలెన్‌ బాఖ్‌, సోంజా షెల్సిన్‌, హెన్రీ పోలక్‌, ఎల్‌డబ్ల్యు రిట్స్‌; జైనులు: ప్రాణ్‌ జీవన్‌ మెహతా, రాయిచంద్‌; నాస్తికులు: గోరా (గోపరాజు రామచంద్రరావు).

హిందూ పాకిస్థాన్‌ను సృష్టించడానికి ఆరాటపడుతున్న హిందూత్వ సంపూర్ణ పెత్తనం చెలాయించలేకపోతున్నప్పటికీ క్రమంగా ప్రబలమవుతోంది. గాంధీ ప్రబోధించిన, ఆచరించిన మత సమైక్యతా మార్గ స్ఫూర్తిని భారతీయులు పునరుద్ధరించుకోవలసిన అవసరమున్నది. ఇది వారి తక్షణ కర్యవ్యం. మతం పేరిట సొంత దేశాన్ని సాధించుకున్న పాకిస్థానీయులు ఇస్లామిక్‌ మెజారిటేరియనిజంకు ప్రాధాన్యమివ్వడం ద్వారా మరింత శాంతి కాముకులు అయ్యారా? కనీసం మరింత సంపద్వంతులూ కాలేకపోయారు. శ్రీలంకలోనూ బౌద్ధుల ఆధిపత్య వాదం శాంతి సామరస్యాలకు దారితీయలేదు. ఈ వాస్తవాలను దృష్టిలో ఉంచుకుని రాజకీయవేత్తలే కాదు సామాన్య పౌరులు సైతం అన్య మతాల వారితో స్నేహ సంబంధాలను పెంపొందించుకోవడం మన ప్రజాస్వామిక గణతంత్ర రాజ్యం సమున్నత విలువలు, సంప్రదాయాల పునరుద్ధరణకు తప్పనిసరైన తొలి అడుగు అవగలదు.

రామచంద్ర గుహ

(వ్యాసకర్త చరిత్రకారుడు)

Updated Date - Sep 22 , 2024 | 12:47 AM