గొప్ప నవలలు రాసినట్టుండవు. పుట్టినట్టు ఉంటాయి.
ABN, Publish Date - Aug 12 , 2024 | 01:25 AM
‘‘శాస్త్రవేత్తలు, చరిత్రకారుల వద్ద లేని ఆయుధాలు సాహిత్య కారుల వద్ద ఉన్నాయి. అవి సృజనాత్మక ఆయుధాలు. అందుకే శాస్త్రవేత్తలు, చరిత్రకారులు చేయలేని పనిని వాళ్ళు సమర్థ వంతంగా చేయగలరు...
నవలా శిల్పం
మధురాంతకం నరేంద్ర
తెలుగు వచన సాహిత్యం గత రెండు దశాబ్దాలుగా కథా ప్రక్రియ చుట్టూనే తిరుగుతున్నప్పటికీ, కొందరు రచయితలు ప్రత్యేకంగా నవల మీద కూడా కృషి చేస్తున్నారు. వారి చేత నవలా రచనలో ఉండే ఆర్ట్ క్రాఫ్ట్ అంశాలపై మాట్లాడించేందుకు ఉద్దేశించినదే ఈ ‘నవలా శిల్పం’ శీర్షిక. వివిధ
‘‘శాస్త్రవేత్తలు, చరిత్రకారుల వద్ద లేని ఆయుధాలు సాహిత్య కారుల వద్ద ఉన్నాయి. అవి సృజనాత్మక ఆయుధాలు. అందుకే శాస్త్రవేత్తలు, చరిత్రకారులు చేయలేని పనిని వాళ్ళు సమర్థ వంతంగా చేయగలరు. తమ రచనల ద్వారా జీవన సత్యాల్ని చెప్పగలరు’’ అంటారు మధురాంతకం నరేంద్ర. ఐదు దశాబ్దాల సాహితీ ప్రయాణంలో కథలు, నవలలు, నాటికలు, వ్యాసాలను సృజించారు. రచయిత కన్నా రచన గొప్పదనే సూత్రాన్ని పాటిస్తూ సాహితీ వ్యాసంగాన్ని కొనసాగిస్తున్నారు. ఇది ఆయన నవలా రచన గురించి జరిపిన సంభాషణ.
ఇన్నేళ్ల సాహితీ ప్రయాణంలో పదుల సంఖ్యలో కథలు రాశారు. నవలలు మాత్రం ఆరే రాశారు. కారణం?
సాహితీ ప్రక్రియల్లో కథ, నవల అక్కచెల్లెళ్ళ లాంటివి. అయితే రెండింటికీ చాలా భేదం ఉంది. 50 ఏళ్లలో 100 దాకా కథలు రాశాను. నవలలు తక్కువ రాయడానికి కారణం సమయం లేక పోవడం. నవల రాయాలంటే రాసే అంశం గురించి చాలా తెలుసు కోవాలి. చాలా ఫోకస్డ్‌గా ఉండాలి. ఆ పాత్రలతోపాటు ప్రయా ణించాలి. మమేకం కావాలి. ఇదంతా కుదిరినప్పుడే నవలా రచన ముందుకు సాగుతుంది. కొన్ని రచనలు యాక్సిడెంటల్‌గా జరుగు తాయి. ‘మనోధర్మపరాగం’ అలాంటిదే! ఆ నవల రాయడానికి ఆరునెలల ముందు అలాంటి నవలను రాయగలనని నాకూ తెలియదు. ఆ నవల రాయడానికి నాకు ఏడాది పట్టింది. ఆ సమయంలో పరిశోధన ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకు న్నాను. అంతేగాదు, నాదైన జీవితంలోంచీ, మా ప్రాంతాన్ని గురించీ విషయాల్ని తోడి తీసుకోగలిగాను. కొత్త కొత్త వివరాలు తెలిసి నప్పుడు చాలా ఆనందపడ్డాను. నవలలోని 30 అపురూపమైన స్త్రీ పాత్రలతో అంతకాలం కలిసి జీవించడమనే అవకాశాన్ని పొందాను.
నవల, కథ.. రెండింటిలో ఏది రాయడంలో మీకు సంతృప్తి?
నవలైనా, కథైనా జీవితం కరుణిస్తేనే రాయగలం. జీవితం ముందు మనమెంత? నాకు కథ రాయడం శ్రమ. రాసేసిన తర్వాత గొప్ప రిలీఫ్ దొరుకుతుంది. నవల రాసేటప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది. నవల రాస్తున్నంతసేపూ విశాల మైదానంలో అరేబియన్ గుర్రం ఎక్కి దౌడు తీసినట్టుగా ఉంటుంది. అయితే ఆ గుర్రం పక్కదారులు పట్టకుండా సరైన దారిలో ప్రయాణించేలా చూసుకోవడం రచయిత పని. రచయిత ప్రాథమిక బాధ్యత కథ చెప్పడం. కథ సరిగ్గా చెప్తున్నామా, ఎక్కడైనా దారి తప్పుతోందా అనే స్పృహ రచయితకు ఉండాలి.
మీరు రాసిన ‘భూచక్రం’ ‘కొండకింద కొత్తూరు’ లాంటి నవలల్లో అంశాలు సార్వజనీనమైనవి, కథ మాత్రం చిత్తూరు జిల్లాలోనే నడుస్తుంది. ఎందుకలా?
అదేమీ కొత్త విషయం కాదు. అనేకమంది రచయితలు చేసిందే! ప్రపంచంలోని ప్రతి రచయితా ప్రాంతీయ రచయితే. టాల్‌స్టాయ్, దోస్తోవ్‌స్కీ, హెమ్మింగ్వే లాంటి వాళ్ల రచనల్లోకూడా వాళ్ల ప్రాంతీయతే కనిపిస్తుంది. ఆ రచనలే విశ్వవ్యాప్తం అవుతాయి. సృజనాత్మక రచయితకు ప్రాంతీయత బలం. Provincialism is a Strength to Writer.
గొప్ప నవల ఎలా ఉండాలని మీ అభిప్రాయం?
నేను చదివిన గొప్ప నవలలన్నీ రాసినట్టుండవు. పుట్టినట్టు ఉంటాయి. శరత్ నవలలు ఇందుకు మంచి ఉదాహరణ. ఆయన ఏ రచనా నిరుపయోగంగా రాయలేదు. తెన్నేటి సూరి రాసిన ‘చంఘీజ్‌ఖాన్’, వడ్డెర చండీదాస్ ‘హిమజ్వాల’, చలం ‘జీవితాదర్శం’, కేశవరెడ్డి ‘మూగవాని పిల్లనగ్రోవి’ నవలలు రాసినట్టు ఉండవు, పుట్టినట్టు అనిపిస్తాయి. గొప్ప క్లాసిక్‌గా మిగిలే పుస్తకాలు ఒక మీడియంగా మారి, మనల్ని మనం పరిశీలించుకునేందుకు ఉప యోగపడతాయి. ఒక్కోసారి గొప్ప నవల రాసేసిన రచయిత ఆ తర్వాత మళ్లీ అంత స్థాయిలో రాయలేక ఇబ్బంది పడే అవకాశం కూడా ఉంది. William Golding అనే రచయిత ‘Lord of the Flies’ అనే నవల రాశారు. అది ఆయన తొలి నవల. దానికే ఆయనకు నోబెల్ బహుమానం వచ్చింది. ఆ తర్వాత మళ్లీ ఆ స్థాయిలో మరో నవల రాయలేక ఆయన చాలా ఇబ్బందిపడ్డారు.
ఇటీవల విడుదలైన మీ నవల ‘దాయాదుల తోట’కు నేపథ్యం ఏమిటి?
నేను పుట్టి పెరిగిన ప్రాంతంలోని సామాజిక జీవనం గురించి చెప్పాలని ఒక కథ రాశాను. చెప్పవలసిన అంశాలు కథలో ఇమడకపోవడంతో దాన్ని విస్తృతం చేయవలసి వచ్చింది. ముందుగా సర్వసాక్షి కోణంలో నవల రాశాను. పూర్తయ్యాక చదివితే వస్తువిస్తృతి పెరిగిపోయి కొంత కలగాపులగంగా కూడా తోచింది. ఆ తర్వాత మళ్లీ మొత్తం భిన్నమైన దృక్కోణంలో తిరగరాశాను. నవలలో మొత్తం 10 పాత్రలు. ఎవరి కథ వాళ్ళు చెప్పుకుంటారు.
ఈ నవలలో మీ ప్రాంతంతోపాటు ఇంకా చాలా ప్రాంతాలు వస్తాయి కదా?
నవలలో ఒక ప్రాంతం గురించే రాయాలనుకున్నాను. చిత్తూరు జిల్లా గురించీ, తొండనాడు గురించీ. తిరుపతి గురించి రాయా లంటే చుట్టుపక్కల ప్రాంతాల గురించి రాయాలి. ఇక్కడుండే వారికి మిగిలిన ప్రాంతాలతో తప్పకుండా సంబంధం ఉంటుంది. ముఖ్యంగా కడప జిల్లాతో. అలా నవలలోకి కడప వచ్చింది. ఆ తర్వాత అనంతపురం, కర్నూలు వచ్చాయి. కర్నూలు దాకా వచ్చిన కథ హైదరాబాదును కూడా చేరింది. ఇటువైపు చెన్నై, తిరువణ్ణామలై, బెంగళూరు, హోసూరు ప్రాంతాలు కూడా నవలలోకి వచ్చేశాయి.
తెలుగు సాహితీ విమర్శ గురించి మీ అభిప్రాయం?
Objective Study అనేది లేకపోతే రచయితలకు చాలా ప్రమాదం. విమర్శ అంటే కేవలం తిట్టడం, పొగడటం కాదు, ఒక రచనను విమర్శనాత్మకంగా చూడటం. రవీంద్రనాథ్ ఠాగూర్‌ని విశ్వకవి అంటే సరిపోదు. ఆయన కథకుడిగా, నాటక రచయితగా చాలా గొప్పవాడు. ఆయన రచనలు చదివి ఆ విషయం చెప్పాలి. విదేశాల్లో కొందరు ప్రముఖ రచయితలు బతికుండగానే వాళ్ల రచనల మీద ‘20th Century Interpretations’ అంటూ పుస్తకాలు వచ్చాయి. అక్కడి విమర్శకులు రచయితల్ని పూజించే పీఠంపైన కూర్చోబెట్టరు. వీలైనంతగా వారి రచనల్ని విమర్శించి, మరింత మెరుగ్గా మార్చేందుకు ప్రయత్నిస్తారు. మన దగ్గర అలాంటి సాధన జరగాలి. రచయిత తనకు తెలిసిన సత్యాన్ని రచన ద్వారా ధైర్యంగాచెప్పాలి. ఏమాత్రం మొహమాటం లేకుండా విమర్శను స్వీకరించాలి. దానికి తొందరపడి సమాధానం ఇచ్చేయ కుండా స్థిమితంగా ఆలోచించాలి.
కొత్తగా రాస్తున్నవారు మెరుగ్గా రాయాలంటే?
బాగా చదవాలి. అదే అతి ముఖ్యమైన విషయం. సాగుతున్న జీవితాన్ని అప్రమత్తతో గమనిస్తూ ఉండాలి. సాహిత్యంలో పెద్ద ప్రమాదం ఏంటంటే, చదవకుండా మాట్లాడటం. ఏ రచననైనా ఓపెన్ మైండ్‌తో చదవాలి. చదవకముందే ఏ అభిప్రాయానికీ రాకూడదు. కొన్ని నవలలు ఒక వయసులో అర్థం కావు. మరికొన్ని ఒక వయసు దాటాక అర్థమవుతాయి. మంచి పుస్తకం పాఠకుడి పరిపక్వతను కొలిచే సాధనం. ఒకే పాఠకుడికి అది వివిద దశల్లో వేర్వేరు రకాలుగా అర్థమవుతుంది.
-ఇంటర్వ్యూ: విశీ (వి. సాయివంశీ)
9010866078
Updated Date - Aug 12 , 2024 | 01:25 AM