ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

విభజన గాయంతో గుల్జార్‌ అక్షరాలాపన

ABN, Publish Date - Jun 17 , 2024 | 03:41 AM

మార్గరెట్‌ బూర్కీ వైట్‌ దేశ విభజన వేళ తీసిన ఫొటోలు ఆ విషాదాన్ని మన కళ్లకు కడతాయి. చెట్టుకొమ్మకు పట్టిన వరస తేనెపట్టుల్లా రైలు బోగీలకు వేలాడుతూ కనిపించే మనుషులు, కావళ్లలో వృద్ధులూ పిల్లల బరువునీ, ముఖంలో శ్రమనీ మోసుకువచ్చేవారు...

విభజన గాయంతో గుల్జార్‌ అక్షరాలాపన

మార్గరెట్‌ బూర్కీ వైట్‌ దేశ విభజన వేళ తీసిన ఫొటోలు ఆ విషాదాన్ని మన కళ్లకు కడతాయి. చెట్టుకొమ్మకు పట్టిన వరస తేనెపట్టుల్లా రైలు బోగీలకు వేలాడుతూ కనిపించే మనుషులు, కావళ్లలో వృద్ధులూ పిల్లల బరువునీ, ముఖంలో శ్రమనీ మోసుకువచ్చేవారు.. ఆ ఫోటోలన్నీ టైమ్‌ మేగజైన్‌ కోసం మార్గరెట్‌ ఆనాడు తీశారు. గుల్జార్‌ అక్షరాలు ఆనాటి దుఃఖంతో ప్రతిధ్వనిస్తూ ఉంటాయి. ‘‘1947లో దేశ విభజనను సమీపంగా చూసిన వాణ్ణి. అది నన్నెంతో గాయపరిచింది. బాధపెట్టింది. ఆ బాధను, భయాన్ని నాలోనించి తొలగించుకోవడం కోసం ఆ నేపథ్యంతో కథలు రాశాను’’ అని చెప్పుకున్నారు గుల్జార్‌. దేశ విభజన రక్తపాత దృశ్యాలూ, కన్నీటి ప్రయాణాలూ, వెండితెర గీతాల జలపాతాల సమ్మేళనమే గుల్జార్‌ (అసలు పేరు సంపూరణ్‌ సింగ్‌ కాల్రా).

విభజన విషాదం, చరిత్ర పంజాబీలదో, బెంగాలీలదో అనుకోవడం వల్ల సానుభూతినీ, సంఘీభావాన్నీ ప్రకటించే బాధ్యతను మిగిలిన దేశం విస్మరించింది. వందేమాతరం ఉద్యమాన్నీ, నినాదాన్నీ మిగిలిన భారతావని సొంతం చేసుకున్నట్టు విభజన విషాదపు లోతులను స్వీకరించలేదు. ఒక గొప్ప సాహిత్య ధోరణితోనే దేశం ఆ అనుభవాలను పలకరించగలిగింది. అదే దేశ విభజన నాటి సాహిత్యం. అమృతా ప్రీతమ్‌, కుష్వంత్‌ సింగ్‌, సాదత్‌ హసన్‌ మంటో, భీష్మ సహానీ వంటి వారెందరో నాటి గాథలను అక్షరీకరించారు. గుల్జార్‌ వారిలో ఒకరే అయినా, ఆయన వ్యక్తీకరణ వేరు.


భారత్‌-పాకిస్తాన్‌ విభజన కేవల భౌగోళిక విభజన కాదు. ఒక నాగరికత నిలువుకోత. ‘రావి నదికి ఆవల’ (‘రావి పార్‌’) కథలో గుల్జార్‌ ఇదే చెప్పారు. దర్శన్‌సింగ్‌, అతడి భార్య శాహిని, వారి నవజాత కవలల కథ ఇది. దేశానికి స్వాతంత్య్రం వచ్చిందని తెలుసు కానీ, అది వీరి లాయల్‌పూర్‌కు ఎప్పుడు వస్తుందో తెలియదంటారు రచయిత. దర్శన్‌సింగ్‌ తండ్రి చనిపోయాడు. గ్రామంలో మత కల్లోలాలు పెచ్చరిల్లడంతోనే హిందువులు, సిక్కులు అంతా గురుద్వారాలో తలదాచుకున్నారు. అక్కడే శాహిని కవలలకు జన్మనిచ్చింది. అందులో ఒక బిడ్డ బలహీనంగా ఉంది. బతికే ఆశ కనిపించదు కూడా. ఇంటిని వీడిన దర్శన్‌ అంతవరకు తనకు ధైర్యం చెప్పిన పెదనాన్న కూడా ఓ రాత్రి ‘గొడ్డలి మీద పడి’ చనిపోవడంతో, అసలు పాక్‌ భూభాగాన్నే విడిచిపోవాలని నిశ్చయించుకున్నాడు. తల్లి రాలేనని చెప్పేసింది. ‘కాందిశీకుల కోసం ప్రత్యేక రైలు’ వెళుతుంటే అందులో ఎక్కాలని దర్శన్‌ నిశ్చయించుకున్నాడు. ఐదురోజుల క్రితం ఇక్కడ నుంచే వెళ్లిన రైలులో ఆవగింజకు కూడా చోటు లేదట. ఇప్పుడూ అంతే. బాలింత శాహిని చూసి కొందరు దయాళువులు చోటిచ్చారు, రైలు కప్పుమీద. కవలలలో ఒక శిశువు ఆ రాపిడికి అడపాదడపా ఏడ్చినా రెండో శిశువులో చలనం ఉండదు. రైలెక్కిన కొన్ని క్షణాలకే దర్శన్‌కి అర్థమైంది, ఆ శిశువు చనిపోయింది. చుట్టూ ఉన్నవారు ఆ విగతజీవిని లాక్కుని అక్కడే పడేయాలని అనుకున్నా, తల్లిప్రాణం ఒప్పుకోదు. అన్న లేకుండా ఆ రెండోవాడు పాలు తాగడు అన్నది ఆమె వాదన. చాలాసార్లు ఆగినా, ఎట్టకేలకు రైలు ఖైరాబాద్‌ చేరింది. ఇక వచ్చేది గుజ్రన్‌వాలా, ఆపై గంటలోనే హిందుస్తాన్‌లో సురక్షితంగా ప్రవేశిస్తాం అనుకుంటూ ప్రాణాల మీద ఆశ పెంచుకుంటారు. రైలు ఒక వంతెన మీదకు చేరుకుంది. ఎవరో అరిచారు ‘రావి నది’ అని. అప్పుడే ఎవరో సలహా ఇచ్చారు దర్శన్‌సింగ్‌కి. చనిపోయిన శిశువును ఆ నదిలో పారేస్తే పుణ్యలోకాలు దక్కుతాయి కదా అని. అందుకే దర్శన్‌ తన భార్య చేతిలో నుంచి పోత్తిళ్లలోని ఆ శిశువును తన చేతుల్లోకి తీసుకుని ఆ నిశిరాత్రి నదిలోకి విసిరేశాడు. ఆ నీళ్లలో ఓ పసి ఆక్రందన. రైలు కప్పు మీద శాహిని మృత శిశువును గుండెలకు హత్తుకుని రోదిస్తున్నది. రైలు వంతెన దాటుతున్నందుకు జనం కొడుతున్న కేరింతలలో ఆ గొంతులు వినిపించలేదు.


విభజనతో వదులుకోవలసిన వచ్చినది ఉమ్మడి వారసత్వమే. మతంతో ప్రమేయం లేకుండా ఎందరో నమ్మిన సత్యమిదే. ఈ పరిణామం వెనుక నేపథ్యం, దారి తీసిన పరిస్థితులు గుల్జార్‌ గొప్పగా గమనించారు. ఒక కవితలో అంటారు:

‘‘అది ఇప్పటికీ నా జన్మభూమే.

కానీ నా దేశం ఎప్పటికీ కాదు

అక్కడికి వెళ్లాలంటే రెండు ప్రభుత్వాలవీ

అనేక కార్యాలయాల చుట్టూ నేను ప్రదక్షిణలు చేయాలి

నా కలలకు రుజువులు చూపించడానికి

ఈ ముఖానికో ముద్ర వేయించుకోవాలి’’ అని.

నిజానికి ‘రావి నది ఆవల’ కథలో సజీవంగా నదీగర్భంలోకి చేరిన బిడ్డ, గర్భశోకంతో ఆ తల్లిల నిస్సహాయ రోదనను రైలు ప్రయాణికులు వినలేకపోయారు. అదే రోదన ఈ కవితలో ధ్వనింప చేశారు గుల్జార్‌. మూగరోదనలకు గొంతు నివ్వడమే కదా కవి పని!

గుల్జార్‌ పుట్టిన గడ్డ ప్రస్తుతం పాకిస్తాన్‌లోనే ఉంది (జీలమ్‌ జిల్లా, దీనా గ్రామం/ఆగస్ట్‌ 18, 1934). దేశ విభజనతో వారి కటుంబం చెల్లాచెదురైంది. అక్కడ నుంచి బొంబాయి (నేటి ముంబై) చేరుకున్నారు వారు. అంతకు ముందు వారి కుటుంబం అమృత్‌సర్‌, ఢిల్లీలలోని శరణార్థి శిబిరాలలో తలదాచుకున్నారు. ఢిల్లీలో ఒక కూరల మార్కెట్‌ దగ్గర వారు ఉండేవారు. తండ్రి కుమారుడిని చదివించలేకపోయాడు. దీనితో గుల్జార్‌ ఒక పెట్రోల్‌ బంకులో పనిచేశారు. ఆ తరువాతే తన భవిష్యత్తును భవ్యంగా తీర్చిన బొంబాయి చేరుకున్నారు. అక్కడే ఆయనకు సాహిత్యవేత్తలతో పరిచయం కలిగింది. కలం పట్టాలన్న తృష్ణ అంకురించింది. సాహిత్య సభలలోనే ఒకసారి నాటి ప్రఖ్యాత చలనచిత్ర గాయకుడు శైలేంద్రతో పరిచయం ఏర్పడింది. బిమల్‌రాయ్‌ చిత్రాలకు పని చేసే అవకాశం వచ్చింది. గుల్జార్‌ జీవితంలో గొప్ప లక్షణం, చలనచిత్ర పరిశ్రమకు ఎంత సన్నిహితమైనా ప్రధాన స్రవంతి సాహిత్యరంగానికి దూరం కాలేదు.


గుల్జార్‌కు దేశ విభజన దుఃఖంతో పాటు, వ్యక్తిగత జీవితంలో ఒక ఎడబాటు ఉంది. ఆయన పసితనంలోనే తల్లి కన్నుమూశారు. మారుటితల్లి సరిగా చూసేది కాదు. దీనితో తండ్రి మఖన్‌సింగ్‌ నడిపే చిన్న దుకాణంలోనే ఎక్కువ సమయం గడుపుతూ ఉండేవారు. పాఠ్య పుస్తకాలంటే నిరాసక్తత. రవీంద్రనాథ్‌ టాగూర్‌, శరత్‌చంద్ర సాహిత్యం ఆయనను బాగా ప్రభావితం చేశాయి. మొదట్లో ఉర్దూ, పంజాబీ భాషలలో కవిత్వం రాసేవారు. కవిగానే కాకుండా, వచన రచయితగా ఆయనకు ఖ్యాతి ఉంది. ‘రెండు’ ఆయన నవల. ఇందులో ఇతివృత్తం దేశ విభజన నాటి విషాదమే.

ప్రపంచ యుద్ధాలు, నియంతృత్వాలు, ఘోర దుర్భిక్షాలు కాలం మీద సుదీర్ఘంగా వాటి నీడను పరిచాయి. 1947 నాటి దేశ విభజన విషాదం జాడ కూడా కాలం మీద ఎంతో సుదీర్ఘంగా ఉంది. గుల్జార్‌ రచనలలో ఆ నీడ, జాడ గమనిస్తాం. అవన్నీ ‘ఫుట్‌ప్రింట్స్‌ ఆన్‌ జీరో లైన్‌: రైటింగ్‌ ఆన్‌ ది పార్టిషన్‌’ పేరుతో సంకలనంగా వెలువరించారు. ఒకటి వాస్తవం. ఆ చరిత్ర మిగిల్చిన ఆ విషాదానికి ప్రత్యక్ష సాక్షులు లేదా బాధితులు ఆ జ్ఞాపకాలని తుడిచివేయాలని అనుకున్నా సులభం కాదు. ఆ విషాదం ఇతివృత్తంగా ఉన్న కథలు చదివిన వాళ్లలో మరొకసారి ఆ బాధ మరొకసారి గుర్తుకు రాకూడదని గుల్జార్‌ ప్రగాఢంగా వాంఛించారు. చరిత్ర చేసిన గాయం సాధ్యపడనివ్వలేదు. ఈ గుంజాటనకి అక్షరరూపమే ‘విభజన’ కథ.


సంపూరణ్‌సింగ్‌ అంటే మరెవరో కాదు విభజన సమయంలో విడిపోయిన తమ కుమారుడేనని హర్భజన్‌సింగ్‌ అనే ఆయన, ఆయన భార్య గట్టి నమ్మకం. గుల్జార్‌కు ఆ మేరకు ఉత్తరాలు కూడా రాశారు. అంతటితో ఆగకుండా ఈ విషయం నిర్ధారించుకునే పనిలో సాయపడేందుకు ఆ దంపతులు కొందరు ప్రముఖులను ఆశ్రయించారు. బాలివుడ్‌ ప్రముఖులు సాయి పరాంజపే, అమోల్‌ పాలేకర్‌, జనతా పార్టీ ప్రముఖుడు మధు దండావతే భార్య వారిలో ఉన్నారు. మొత్తానికి ఆ దంపతులను గుల్జార్‌ కలుసుకున్నారు. నీవు ఆనాడు తప్పిపోయిన మా అబ్బాయి ఇక్బాల్‌సింగ్‌వేననీ, పేరు మార్చుకున్నావనీ వాదిస్తారు వారు. ఈ కథలోనే విభజన నాటి అంతటి విద్వేషంలోను అక్కడక్కడా విరిసిన మత సామరస్యం గురించి చెబుతారు గుల్జార్‌. ఆఖరికి, నీవు ఎక్కడున్నా ఫరవాలేదు, మతం మారినా పట్టించుకోను. కానీ నీవు నా కొడుకువే అన్న సంగతి మరచిపోవద్దు అంటుంది ఆ తల్లి. చాలా రోజులకి హర్భజన్‌ మరణించినట్టు సమాచారం వస్తుంది. మనసులో ఏదో మూల రోదన. ఇలా ముగించారీ కథ (అనువాదం: సి. మృణాళిని).

‘‘కళ్లకు వీసాలతో పనిలేదు/ స్వప్నాలు సరిహద్దులెరుగవు

నేను మూసిన కళ్లతో నిత్యం/ సరిహద్దులు దాటతాను

మెహిదీ హసన్‌ను కలుసుకోవడానికి!’’


ఈ కవితలో గుల్జార్‌ ప్రస్తావించిన మెహిదీ హసన్‌ రాజస్థాన్‌ వాసి. గొప్ప గజల్‌ గాయకుడు. ఆయన 1947లో పాకిస్తాన్‌ వలస వెళ్లిపోయారు. పాకిస్తాన్‌ నుంచి గుల్జార్‌ భారత్‌కు వలస వచ్చారు. ఇదొక వైచిత్రి. తరువాత తాను భారత్‌కు వెళతానంటే పాకిస్తాన్‌ వీసా నిరాకరించిందని హసన్‌ వాపోయారు. పైగా ఒకనాడు కరాచీ నగరాన్నీ, బొంబాయి నగరాన్నీ అక్కచెల్లెళ్ల వంటివని పిలిచేవారు. ఎందుకంటే రెండూ సాగరతీరాలే. ఎన్నో పోలికలు వాటి మధ్య. విభజనలో నాయకులు మరచిపోయిన ఉమ్మడి వారసత్వం గురించి ఎందరో వ్యథ చెందేవారు. ఒక కవితలో గుల్జార్‌ ఆ వ్యథనే ఎంతో గొప్పగా చిత్రించారు. ‘‘మీ నగరంలో పడి ఉన్న శవాల మీద గద్దలు ఎగురుతున్నాయి, ఇక్కడ మా నగరంలోని కూడళ్లలోనూ (అంటే ముంబై) అదే దృశ్యం’’ అన్నారాయన.

విభజన నాటి రక్తపాతాన్నీ, భయాన్నీ నిర్దేశించినది ఒక్కటే! ‘‘హిందువులు మరింత హిందువులుగానూ, ముస్లింలు మరింత ముస్లింలగానూ ప్రవర్తించడం’’ (‘పొగ’ కథలోని ఒక వాక్యం). ఇదే బొంబాయి నేపథ్యంగా సాగిన కథ ‘భయం’ (కావూఫ్‌) ఇతివృత్తం. యాసిన్‌ అనే ముస్లిం యువకుడు లోకల్‌ ట్రైన్‌లో పొందిన అనుభవం, చేసిన దుర్మార్గం ఇందులో ఇతివృత్తం. అతడికి ప్రతి హిందువూ ఇద్దరుముగ్గురిగా కనిపిస్తారు. ఒక స్టేషన్‌లో మరొక యువకుడు ఎక్కాడు. ఇతడి ముఖానికి మఫ్లర్‌ ఉంది. ‘అతడు హిందువే’ అని తీర్మానించుకున్నాడు యాసిన్‌. అతడితో తనకు ప్రాణహాని ఉందని మరుక్షణంలో నమ్మకానికి వచ్చేశాడు. ఎందుకంటే ఆ అపరిచితుడు జేబులో పెట్టిన చేయి తీయడం లేదు. అంటే ఆయుధంతో సిద్ధమవుతున్నాడు. తనని చంపడానికి ముందే తాను అతడిని చంపాలని నిర్ణయించుకున్నాడు యాసిన్‌. రైలు భయాందర్‌ వంతెన మీదకు వచ్చింది. అతడు బోగీ గుమ్మం దగ్గర ఆదమరచి ఉండగా యాసిన్‌ వెళ్లి బలంగా బయటకు నెట్టేశాడు. మరుక్షణం ఒక ఆక్రందన- ‘అల్లా’ అంటూ! దీనికి ఇలా అనూహ్యమైన ముగింపు ఇచ్చారు గుల్జార్‌. ‘‘అది అలా జరగాల్సి ఉంది మరి! ఏం చేస్తాం!’’ అంటాడు యాసిన్‌ భార్యతో.

ఆరు దశాబ్దాల క్రితం బల్‌రాజ్‌ సహానీ నటించిన కాబూలీవాలా సినిమాతో గుల్జార్‌ వెండితెర ప్రయాణం ప్రారంభమైంది. పాటలతో పాటు, పలు చిత్రాలకు ఆయన సంభాషణలు కూడా కూర్చారు. దర్శకత్వం చేపట్టారు. మాచిస్‌, ఆంధీ, మౌసమ్‌, ఖుష్బూ, పరిచయ్‌, కోషిష్‌, రుడాలి వంటి చిత్రాలకు ఆయన అందించిన గేయాలు ఎంతో ఖ్యాతి గాంచాయి. స్లమ్‌డాగ్‌ మిలియనీర్‌కు ఆస్కార్‌ పురస్కారం లభించింది. గుల్జార్‌ను చలనచిత్ర గేయ రచయితగా మాత్రమే పరిగణించలేం. ఆయనకు ఉర్దూ, హిందీ సాహిత్య ప్రపంచాలలో ప్రత్యేక స్థానం ఉంది.

గోపరాజు నారాయణరావు

Updated Date - Jun 17 , 2024 | 03:42 AM

Advertising
Advertising