ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

గురువర్యుడు

ABN, Publish Date - Sep 02 , 2024 | 03:03 AM

మంగళూరు నుంచి వొచ్చిన రామారావు గారు అన్నారు, ‘‘మద్రాసులో నేను చదువుకునేప్పుడు, కాకినాడ కాలేజీ ప్రిన్సిపాలు వెంకటరత్నం గారిని నేనే చూడలేదు. కాని ఆయన శిష్యుల్లో ప్రతివారిలో ఆయన్ని చూస్తున్నాను. నాలుగు నిమిషాల్లో...

మంగళూరు నుంచి వొచ్చిన రామారావు గారు అన్నారు, ‘‘మద్రాసులో నేను చదువుకునేప్పుడు, కాకినాడ కాలేజీ ప్రిన్సిపాలు వెంకటరత్నం గారిని నేనే చూడలేదు. కాని ఆయన శిష్యుల్లో ప్రతివారిలో ఆయన్ని చూస్తున్నాను. నాలుగు నిమిషాల్లో తెలుస్తుంది ఇతడు వెంకటరత్నంగారి శిష్యుడని.’’

అంతకన్న గొప్ప పొగడ్త అధ్యాపకుడికి ఎక్కడా వుండదు. సమాజంపైన తమ ప్రభావాన్ని ముద్రించి పోయేవారు రెండు విధాలైనవాళ్ళు. చాలామంది తాము చేసిన రాజకీయ, సాంఘిక, కళా రంగాలలో తాము తెచ్చిన మార్పుల వల్లా, పనుల వల్లా, విప్లవం వల్లా, నూతన శకారంభకులై చిరస్మరణీయులవుతారు. రెండో తరగతివారు ప్రత్యేక వ్యక్తుల స్వభావాలపై ఉద్దేశ్య పూర్వకంగా గానీ, రహితంగా గానీ, తాము తెచ్చిన ఔన్నత్యం వల్ల జ్ఞాపకముంటారు. ఈ రెండు విధాల ప్రతిభలు కలిసివుండే గాంధీగారి వంటి మహాత్ములు అరుదుగా జన్మిస్తారు.

ఓ పాతికేళ్ళు తెలుగుదేశం అమితంగా ద్వేషించినవారు – సంఘ పారిశుద్ధ్యంకి పోరాడిన వీరేశలింగంగారూ, వెంకట రత్నంగారూ. వీరేశలింగంగారెంత కర్మవీరుడో నాయుడుగారంత నిష్కర్మవీరుడు. విద్యార్థులూ, ప్రజలూ వీరేశలింగం గారి ఉద్యమాన్నీ, సాహసాన్నీ, చూసి ఆయన్ని అనుకరించారు. విద్యార్థులూ, ప్రజలూ ముందు వెంకటరత్నం నాయుడుగార్ని చూసి ప్రేమించి, తరువాత ఆయన ఉద్యమంలో విశ్వసించేవారు. మనసులో నిష్కారణ ద్వేషాలూ, వైషమ్యాలూ భయాలూ పూని, అహంకారపూరితులైన వారికి తప్ప తక్కినవారికి నాయుడుగారి ఆత్మమాధుర్యాన్నించి తప్పుకోవడం దుర్ఘటమయ్యేది.


To meet him was to be impressed with him and to be impressed was to adore him.

ఏ అరమరికలూ లేకుండా లేత హృదయాన్ని ఆయన పాదాక్రాంతం చేసి ఆరాధించి ప్రేమించినవారిలో నేనొకణ్ణి. ఆయన మూలాన (ఆయన నాతో ఏమీ ఆ విధంగా ప్రస్తావించకుండానే) చదువూ, పెళ్ళీ, ఉద్యోగం, పిల్లలూ, అనే ఆత్మవినాశకరమైన గాడి నించి నా జీవితం పూర్తిగా పట్టాలు తప్పింది. అవన్నీ జరగలేదని కాదు. కాని వాటిలో వొక్కటీ నన్ను బంధించి వుంచలేకపోయింది. వాటికన్న భిన్నమైన విలువలకి నా కళ్ళు తెరుచుకున్నాయి, నాయుడుగారి సామీప్యం వల్ల. సజీవమైన ఈశ్వరునిలో సజీవమైన విశ్వాసమంటే ఏమిటో నాకు మొదట నేర్పింది నాయుడుగారు. భగవాన్‌ రమణని దర్శించిన నిమిషాన ఆయన నాకు ఆధ్యాత్మిక గురువని నాకు తెలీకుండానే గుర్తించ గలిగానంటే దాంట్లో చిన్నతనపు ఆరాధనా ప్రభావం తప్పకుండా వుంది. నా జీవితంలో సత్యదీక్ష, సాహసం, ప్రజల అభిప్రాయాల పట్ల నిర్లక్ష్యతా, నమ్మినదాని కోసం కష్టాలకీ అపవాదులకీ జంకక నిలబడడం, దుమ్ము నించీ, డబ్బు నించీ ఎత్తయిన దృష్టీ ఇవన్నీ నాలో కలిగినా, అవి నాయుడుగారు నాకు ప్రసాదించిన వరాలు. నాలో ఒక అంతరాత్మ వుందని తెలుసుకున్నాను ఆయన దయ వల్ల.


జీవితంలో ఆత్మవికాసం పొందినవారు తక్కినవారి మల్లేనే జీవిస్తారు. చరిస్తారు. కాని –

చూడ చూడ వారి

రుచుల జాడ వేరు.

నాయుడుగారు టెన్నిసన్‌, మిల్టన్‌, షేక్స్‌పియర్‌ పాఠాలు చెపుతూ వుంటే ప్రసిద్ధికెక్కిన తక్కిన లెక్చరర్ల కన్న ఆధిక్యత ప్రత్యేకంగా కనపడకపోతే పోవొచ్చు. కాని ఆయన మాట్లాడే విధం, ఆయన చూపు, గంభీరమైన కంఠధ్వని, కొన్ని పాయింట్స్‌ మీద ఆయన ఇచ్చే స్ట్రెసెస్‌, అందానికి ముఖ్యం, నీతిలోని, భక్తిలోని అందాలకి ఆయన యిచ్చే ప్రాధాన్యం, ఇవన్నీ మా అంతరాంతరాల్లో తెలీకండా మార్పును తెచ్చి, జీవితానికే కొత్త విలువల్ని చూపి మా దృష్టిని మార్చేవి. నాయుడుగారు ఆనాడు యిచ్చిన sermons ఈనాడు అచ్చులో చదివితే ఆ మాటల్లో ఏ విశేషమూ కనపడదు. కాని ఆ మాటల్నే ఆయన పెదవుల నించి విన్న రోజుల్లో అవి ఎంతగా మమ్మల్ని ఉజ్వలపరిచేవో యెట్లా తెలుస్తుంది? గొప్ప పర్సనాలిటీ లక్షణమే అది. నొబిలిటీ, హృదయవైశాల్యమూ, ప్రతివారినీ ప్రేమాలింగనంలోకి తీసుకునే లోతూ, కలుషానీ, లోపాన్ని, దీనత్వాన్నీ, నిస్సహాయత్వాన్నీ అర్థం చేసుకుని ఆదరించే ఆర్ద్రత్వమూ, ఒకరిలో కలిగాయంటే అవి ఏవో పుటక వల్లనో, యాక్సిడెంట్‌ వల్లనో, ఓ ట్రిక్‌ వల్లనో, డెలిబరేట్‌ విల్‌ వల్లనో కలిగేవి కావు. ధనానికీ పదవులకీ ఆశించకపోవడం, కీర్తి సుఖాలకై దేవుళ్ళాడకపోవడం, అధికారధూర్తుల ముందు తల వంచకపోవడం, కీర్తి అపకీర్తులకి లక్ష్యం లేకపోవడం, ముందు కాలంలో తన గతి ఏం కాబోతోంది అనే యోచన లేకపోవడం, ఇలాంటి గుణాలు తలుచుకున్నంత మాత్రాన ఒక్క రోజులో తెచ్చుకునేవి కావు. నితంతరనిర్నిద్ర, ఇంద్రియ నిగ్రహం, శమదమ నియమ తీవ్ర కృషి ఫలితంగా ఈశ్వరానుగ్రహం తోడుకావడం చేత పరిణమించే వరాలవి. సైనిక విజయాన్ని సాధించడం, దుర్గమ పర్వతాల నెక్కడం, ధ్రువాల అంతు కనుక్కోడం, ఇవన్నీ గొప్ప సాహసకృత్యాలే. కాని ఎవరి కంటికీ తెలియకుండా దినదినమూ నిమిష నిమిషమూ, తమ అహాన్ని కోసుకుని నిత్యాగ్నిహోత్రంలో ఆహుతి చేసుకునే ఈ మహాయోగుల తీవ్ర త్యాగం ఎవరూ ఎరగనిది. పర్యవసానం వారి ముఖాల వర్చస్సులో వారి పెదవులమీది కరుణలో, ప్రేమాశ్రువులు చిందే వారి నేత్రాలలో గోచరమౌతుంది. వారి చుట్టూ ఓ నిర్మల తేజోవంతమైన ‘ఆరా’ వెలుగుతో వుంటుంది.


అదే ఉత్తములకి ప్రేమాస్పదమైనదీ, దుష్టులకీ, కుచ్ఛితులకీ ద్వేష కారణమౌతుంది. ఈ భూత ప్రేత పిశాచ రాబందు గణాలకింక శాంతి వుండదు. మాటలో, అచ్చులో, పనులలో ఆ జ్యోతి నార్పిందాకా. ఈ ఉదాత్తులు బ్రతికివున్నంత కాలమూ వారిపైన అసహ్య మైన అపవాదులు రేగుతూనే వుంటాయి. వారు చచ్చిపొయ్యాక ఒక నిట్టూర్పు విడిచి వారిని మరచిపోయి సుఖంగా నిద్రిస్తుంది లోకం. వారు చేసే సంస్కారమంతా వారి స్వభావంలోనే కాని బైట మెటీరియల్‌గా కనబడకపోవడం చాత వారిని జ్ఞాపకం చేసేందుకు ఏదీ మిగలదు. మిగిలేదల్లా వారిని ప్రేమించి అనుసరించిన శిష్యుల లోని శాశ్వత పరివర్తన. ఆ విధంగా ఈ నాటికీ జీవించివున్నారు, రఘుపతి వెంకట రత్నం నాయుడుగారు.

మొదట విద్యార్ధిగా, తరువాత కాలేజీ ట్యూటరుగా నాయుడుగారితో సన్నిహితత్వం నాకు అయిదేళ్ళపాటు లభించింది. అంతే కాదు, బ్రహ్మసమాజానికి ఆయన అధ్యక్షుడూ, నేను (అ)కార్యదర్శినీ. ఈ బైట సంబంధం కాక మా ఇద్దరి మధ్య అంతరంగికమైన గురుశిష్య సంబంధం వుండనే వుంది.


నేను విద్యార్థిగా చేరేటప్పటికే నాయుడుగారు మనుష్యుల నుంచి దూరమౌతున్నారు. ఆయన హృదయం అతి మార్దవం కాబట్టే ఆయన ప్రేమించిన వారి నించి గాయాలూ, డిసప్పాయింట్‌మెంట్‌ సహించలేక ఆయన క్రమంగా ఓ షెల్‌ లోకి వెళ్ళారనిపిస్తుంది. త్వరలోనే నా ప్రవర్తన వల్ల, నాలో రేగుతున్న నైతిక సందేహాల వల్ల, సంఘంపై తిరగబాటు ప్రోద్బలం వల్ల నేను అన్నేళ్ళు నా కాలాన్నంతా అర్పించిన బ్రహ్మసమాజం నుంచి దూరం కావడంతో నాయుడు గారి నుంచీ దూరమైనాను. ఆయన తన ప్రాణమంతటి లోనూ విశ్వసించి బోధించిన నీతి నిర్మలత్వాల అనుష్టానంపైనే, దాంపత్య సంబంధంలోని పవిత్రతమీదే నాకు సందేహాలు రేగాయి. వాటికి నాలోని బలహీనాలూ బలాలూ తోడ్పడ్డాయి. నా గురువుని చాలా లోతుగా గాయం చేసాను. మా యిద్దరి మధ్యా అనుల్లంఘనీయ అఘాతం ఏర్పడింది. నాయుడుగారి ప్రేమను పోగొట్టుకున్నందుకు నేనెంతో బాధ పడ్డాను. నాకు ఆయన ప్రేమ లేకుండాపోయింది అనేదానికన్న నా తిరగబాటువల్ల ఆయనెంత బాధపడ్డారో అని నాకు ఎంతో తపన కలిగేది. నేనెరుగుదును ఆయన నన్ను ప్రేమించారనీ, ఆయన వెలుగును నిలుపుకుని ప్రచారం చేయగల శిష్యుల్లో నేనొకడనని ఆయన ఆశించారనీ. కాని తిరిగి ఆయనను సమీపించడం వల్ల ప్రయోజనం లేదనీ, నా నూతన దృక్పథాన్ని ఆయనకి విశదీకరించి, నా సిన్సియారిటీలో ఆయనకి నమ్మకం కలిగించగలననే ఆశ పోయింది నాకు.

ఓసారి నాయుడుగారన్నారు ‘‘ఏ పబ్లిసిటీ లేకుండా నేనొకసారి కలకత్తా వెళ్ళి శివనాధ శాస్త్రి గారి ముందు ‘వీడు రఘుపతి వెంకటరత్నం’ అని చెప్పి నమస్కరించి వొచ్చెయ్యగలిగితే బావుండుననిపిస్తుంది’’ నాకు.


నాయుడుగారి చివరి కాలంలో ఆయన చూపు బలం తగ్గి నన్ను చూడడం వల్ల ఆయనకి బాధ కలగదు గనక ఆయన ముందు చేతులు జోడించి నిలబడి ‘‘నేను వెంకటాచలాన్ని, నా సిన్సియర్‌ కన్విక్షన్స్‌ వల్ల నేను మీ నుంచి యెంత దూరమైనా, నా ఆరాధన మిమ్మల్ని వీడదు. నేను చీకట్లో ఐతే, నేను కాంతిని చూడాలని ఆశీర్వదించండి’’ అని అడగాలన్పించేది.

కాని మనసులో ఆ కల్పనా దృశ్యాన్ని భావించుకున్నంత మాత్రాన నా ఎమోషన్స్‌ నన్ను వుక్కిరిబిక్కిరి చేసేవి. తీరా వెళ్ళి చూస్తే ఏం ప్రయోజనం వుండదనే నా భయం వల్ల అది జరగలేదనే చింత ఏనాటికీ నన్ను విడువదు.

చలం

(సేకరణ బి.ఆర్. బాపూజీ)

Updated Date - Sep 02 , 2024 | 03:03 AM

Advertising
Advertising