ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మెచ్చుకున్నాడో, తిట్టాడో అర్థం కాలేదు!

ABN, Publish Date - Dec 02 , 2024 | 04:38 AM

నా మొదటి కవితా సంకలనం సందిగ్ధ సంధ్య 1988లో వచ్చింది. అందులో 15 కవితలున్నాయి. ‘ఒక్క నేనే ఇన్ని ముక్కలు’, ‘హలోలు’, ‘ముల్లు’ లాంటి కవితలు జనం లోకి బాగా వెళ్ళాయి. ‘ఈ సంప్రదాయం మాకొద్దు’ అనే కవితకి...

నా మొదటి పుస్తకం

నా మొదటి కవితా సంకలనం సందిగ్ధ సంధ్య 1988లో వచ్చింది. అందులో 15 కవితలున్నాయి. ‘ఒక్క నేనే ఇన్ని ముక్కలు’, ‘హలోలు’, ‘ముల్లు’ లాంటి కవితలు జనం లోకి బాగా వెళ్ళాయి. ‘ఈ సంప్రదాయం మాకొద్దు’ అనే కవితకి తాపీ ధర్మారావు అవార్డు వచ్చింది. అయినా కానీ సంకలనం వేసే ఆలోచన, చొరవా నాకు రాలేదు. ‘‘పుస్తకం వెయ్యాల్సిందే’’ అన్న ప్రతిపాదన తెచ్చింది పోనుగోటి కృష్ణారెడ్డి. ప్రచురణ బాధ్యత కూడా అతనే తీసుకున్నాడు. ఆరోజు అతను పట్టుబట్టి వుండకపోతే నాకున్న సంశయాలకి, బద్ధకానికి మొదటి పుస్తకం ఎన్నాళ్ళకి వచ్చేదో తెలియదు. సరే, పుస్తకం పేరు మొదట ‘అల’ అని అనుకున్నాం. ‘‘బాలేదు మరీ ఫ్లాట్‌గా వుంది’’ అన్నాడు అఫ్సర్. ముందుమాట ఎవరు రాయాలి అని ఆలోచన వచ్చేసరికి వేగుంట మోహన ప్రసాద్ గుర్తొచ్చారు. ఒక మిట్ట మధ్యాహ్నం ఎండలో వాళ్ళింటికి వెళ్ళి, పుస్తకం చేతిలో పెట్టి వచ్చేస్తుంటే, ‘‘ఆగమ్మా, ఆ ఫేన్‌ కింద కూచో? కవిత్వానికి అంత చెమట పడితే ఎలా’’ అని మందలించి కూచో పెట్టారు.


మొహమాటంగా కూచు న్నాను. పుస్తకంలో కొన్ని పేజీలు తిరగేసి, ‘‘ఓహో, బాగా రాస్తున్నావు కంటిన్యూ చెయ్యి’’ అనగానే అంత పెద్ద కవి మెచ్చుకున్నాడన్న సంతోషమో కంగారో ఏమిటో గాని చేతిలో నీళ్ళ గ్లాసు ఒలికిపోయింది. ‘‘సారీ సారీ సారీ’’ అంటూ తల వెనక్కి తిప్ప కుండా వచ్చేశాను. వారం రోజుల కల్లా ‘మో’ ఒక పెద్ద వ్యాసం అధివాస్తవిక ధోరణిలో రాశారు. ‘‘ఈయన తిడుతున్నారో, మెచ్చు కున్నారో చెప్పవా?’’ అని కొంత మందిని అడిగాను. ‘‘దటీజ్ మో’’ అన్నారు అందరూ. తిరువూరులో ఉన్న నేను పుస్తకం పని కోసం హైదరాబాద్‌ వచ్చినప్పుడల్లా ఆంధ్ర జ్యోతిలో కలిసే వాళ్ళం. కృష్ణారెడ్డి, అఫ్సర్, నేను, ఘంటసాల నిర్మల కలిసి ప్రూఫ్ రీడింగ్ చేశాం. కవర్ పేజీ కోసం చేతికి దొరికిన ఒక సముద్రం బొమ్మ సెలక్ట్ చేశాం. సముద్రం మీద వున్న సంధ్య ఉదయం అయితే బావుంటుందా సాయంత్రం అయితే బావుంటుందా అని మళ్ళీ సందేహం. చివరికి ‘సందిగ్ధ సంధ్య’ అని పెట్టేసాను.


విజయవాడ బస్టాండ్‌ దగ్గర మమతా హోటల్‌లో ఆవిష్కరణ. సభకి పిలవడానికి పురాణం సుబ్రహ్మణ్య శర్మ దగ్గరికి వెడితే ఆయన ఎడా పెడా మెచ్చుకుని తను మాట్లాడతానని ప్రకటించారు. సభలో నండూరి సుబ్బారావు, పురాణం, పన్నాల సుబ్రహ్మణ్యం, తుర్లపాటి కుటుంబరావు గార్లు మాట్లాడారు. తర్వాత ఒకసారి ఏదో సభలో మో గారు కనిపించి ‘‘ఆ పుస్తకం పేరు భలే పెట్టావే, కవిత్వం కంటే నీకే బాగా మ్యాచవుతుంది’’ అన్నారు. అది కూడా పొగడ్తా తెగడ్తా అనేది అర్థం కాలేదు. మొత్తానికి ఆ చిన్న పుస్తకం చాలా గుర్తింపు తెచ్చిపెట్టింది. దాని స్ఫూర్తితో రెండేళ్లలోనే ‘నడిచే గాయాలు’ వేశాను.

కొండేపూడి నిర్మల

Updated Date - Dec 02 , 2024 | 04:38 AM