చదివినవే మళ్ళీ మళ్ళీ చదువుతూ వుంటాను
ABN, Publish Date - Aug 12 , 2024 | 01:20 AM
ఇటీవలి కాలంలో రకరకాల పుస్తకాలు చదువుతూవున్నాను. వాటిలో, తాడి ప్రకాష్ ‘ఏలూరు రోడ్’ నాకు బాగా నచ్చింది. ఇందులో నాకు నచ్చిన విషయాలు, ప్రకాష్ వచనం చదువరులను మంత్రముగ్ధులను...
చదువు ముచ్చట
ఎం.ఎస్.కె. కృష్ణజ్యోతి
ఆఖరుగా ఏ పుస్తకాన్ని చదివి బాగా ఇష్టపడ్డారు?
ఇటీవలి కాలంలో రకరకాల పుస్తకాలు చదువుతూవున్నాను. వాటిలో, తాడి ప్రకాష్ ‘ఏలూరు రోడ్’ నాకు బాగా నచ్చింది. ఇందులో నాకు నచ్చిన విషయాలు, ప్రకాష్ వచనం చదువరులను మంత్రముగ్ధులను చేస్తుంది. ఈ పుస్తకశీర్షిక, విజయవాడతో పాటు ఏలూరుని కూడా స్ఫురణకు తెస్తుంది. ఈ రెండు ప్రాంతాలతో నాకు అనుబంధం వుండటం రెండో ఆకర్షణ. ఏలూరు నా స్వస్థలం. విజయవాడ నేను కోరిసాధించిన మజిలీ. ఏలూర్ రోడ్, ఒక తరానికి చెందిన చరిత్ర గమనాన్ని సూక్ష్మంగా పట్టి ఇస్తుంది. చరిత్ర అధ్యాపకురాలిగా, ఆ కోణంలో కూడా ఏలూర్ రోడ్ పుస్తకం నాకు బాగా నచ్చింది.
బాల్యంలో మొదటిసారి ఏ పుస్తకాన్ని ఇష్టంగా చదవటం గుర్తుంది?
స్కూల్‌లో చేరకముందు, గురజాడ పుత్తడిబొమ్మా పూర్ణమ్మ విని నేర్చుకున్నాను. రెండో తరగతి పూర్తి అయేపాటికి మా నాన్నగారు చదవడం నేర్పించారు. మూడో తరగతి నుంచీ ఎక్కువ నిడివి వున్న కథలు చదవడం ప్రారంభించాను. నాలుగో తరగతిలో పిల్లల కోసం వచ్చే బుల్లి నవలలు చదివాను. ఎనిమిదో తరగతికి వస్తూనే సీరియస్ సాహిత్యం అంటుకుంది. బాలజ్యోతిలో, ‘తీపి రొట్టెలు’ అని ఒక కథ నాకు బాగా జ్ఞాపకం వున్న నా మొదటి పెద్ద పఠనం. బహుశా అది 1982–-83 మధ్యకాలంలో ఏదో ఒక బాలజ్యోతి పుస్తకంలో ప్రచురితం అయింది. అరబ్ దేశ వ్యాపారి, ఒక అందమైన మంత్రగత్తె, ఆమె దగ్గర చెక్క పెట్టెలో చిన్నచిన్న బొమ్మలు రాత్రిపూట నేలని దున్ని క్షణాల్లో గోధుమలు పండించి రొట్టెలు చెయ్యడం, ఆ రొట్టెలు తిన్న వ్యాపారులు గుర్రాలుగా మారిపోవడం, ఇలా సాగే కథ అది. నాకు భలే అద్భుతంగా అనిపించింది. ఇప్పటికీ ఆ కథ నాకు నచ్చుతుంది. యవ్వనంలో చలం మ్యూజింగ్స్ నిత్య పారాయణ గ్రంథం!
మీ పఠనాభిరుచి కాలంతోపాటు ఎలా మారింది?
నా పఠనాభిరుచి కాలంతోపాటు పెద్దగా మారలేదు. చదివినవే మళ్ళీ మళ్ళీ చదువుతూ వుంటాను. తీపిరొట్టెలు కథ ఎంజాయ్ చేసిన పాపతనమే ఇప్పటికీ వుంది. ఆర్కే నారాయణ్ స్వామీ అండ్ హిస్ ఫ్రెండ్స్, నామిని మిట్టురోడి కథలు, ఖదీర్ పోలేరమ్మ బండలాంటి పిల్లలు ప్రధాన భూమిక పోషించే పుస్తకాలు ఎక్కువ నచ్చుతాయి. సీరియస్ లిటరేచర్ విషయంలో మొదటి నుంచీ క్లాసిక్స్ ఇష్టపడతాను.
మీ నమ్మకాల్ని, దృక్పథాన్ని ప్రభావితం చేసిన రచయిత?
చలం, కొడవటిగంటి కుటుంబ రావు యవ్వనంలో నా ఆలోచనని ప్రభావితం చేశారు. మార్క్ ట్వైన్, ఆస్కార్ వైల్డ్ రచనల ద్వారా మనిషి స్వభావం, పరిమితుల గురించి సాక్షాత్కారం కలిగింది.
సాహిత్యంలో మీకు బాగా నచ్చిన పాత్ర ఏది? ఎందుకు?
హకల్ బెరిఫిన్ నాకు ఎప్పటికీ నచ్చే పాత్ర. తోటి మనిషిని ప్రేమించడం, ఘోర భీకర పరిస్థితులను సైతం ధైర్యంగా ఎదుర్కొని నిలబడటం, మూస మానవ ధోరణికి భిన్నంగా ఆలోచించడం హకల్ బెరిఫిన్ ప్రత్యేకతలు.
ఏ గత కాలం రచయితనైనా కలిసి మాట్లాడగలిగితే ఎవరితో, ఏం మాట్లాడతారు?
టైం మెషీన్‌లో లేదా ఏ ఇతర విధంగానో వెనక్కివెళ్లి మాట్లాడే అవకాశం వస్తే, నేను బెంగాలీ రచయిత శరత్ చంద్రని కలవడానికి ఇష్టపడతాను. అలాంటి రచయిత ఎవరైనా దొరికితే, పెళ్లి చేసేసుకోవాలి అనుకునేదాన్ని చిన్నప్పుడు! సాధారణమైన మధ్యతరగతి కుటుంబ విషయాలని ఆయన ఎంతో ఆసక్తికరమైన కథల్లాగా మౌల్డ్ చేసేవారు. మానవ సంబంధాల గురించి అంత విస్తృతంగా రాయడానికి కావలసిన సరంజామా ఆయన ఎక్కడినుంచి సేకరించారో నాక్కూడా చెప్పమని అడుగుతాను. ప్రేమచంద్‌ను కూడా కలవాలి. ఆయన చేతులు ఒకసారి పట్టుకుని కళ్ళ కద్దుకుని దణ్ణం పెట్టుకోవాలి. ఆయన రచనలు, ఉదాహరణ నిర్మల లాంటివి చదివి ఆ వాతావరణంలోకి మానసికంగా వెళ్ళిపోయి, రెండు మూడు రోజులు తీవ్ర విచారంలో మునిగి పోయేదాన్ని; ఆయన హాస్య కథలు అంతే ఆనందం కలిగించాయి; రెండు పరస్పర విరుద్ధ భావా వేశాలని ఒకే మనిషి ఒకే పెన్నుతో ఎలా సృష్టించారు అని అడిగి వచ్చేస్తాను.
రచన విషయంలో మీకు దొరికిన మంచి సలహా, మీరు ఎప్పుడూ పాటించేది?
ప్రత్యేకంగా ఒక సలహా అని కాదు కానీ, పూర్వ రచనలు, మంచి సమకాలీన రచయితల నుంచి నేను నేర్చుకున్న కిటుకు, చెప్పే విషయం ఏదైనా, సులువైన పదాల్లో, చమత్కారంగా చెప్పాలి. గంభీరంగా వుండే వ్యక్తీకరణలు, వాక్యాలు చదివేవారి ఆసక్తిని చంపేస్తాయి.
Updated Date - Aug 12 , 2024 | 01:20 AM