భావజాలాన్ని ఎన్‌కౌంటర్ చేయలేరు!
ABN, Publish Date - Nov 07 , 2024 | 03:12 AM
నరేంద్ర మోదీ, అమిత్ షాలు వామపక్ష పార్టీలను ప్రధాన బద్దశత్రువుగా చూస్తున్నారు. వామపక్ష భావాలు కలిగిన వారిపై ఊపా, రాజద్రోహం కేసులు పెడుతూ బెయిల్ రాకుండా సంవత్సరాల తరబడి జైళ్ళల్లోనే...
నరేంద్ర మోదీ, అమిత్ షాలు వామపక్ష పార్టీలను ప్రధాన బద్దశత్రువుగా చూస్తున్నారు. వామపక్ష భావాలు కలిగిన వారిపై ఊపా, రాజద్రోహం కేసులు పెడుతూ బెయిల్ రాకుండా సంవత్సరాల తరబడి జైళ్ళల్లోనే మగ్గేట్టు చేస్తున్నారు. గొంతెత్తి మాట్లాడే వారి గొంతులను అక్రమ అరెస్టులతో నొక్కుతున్నారు. అర్బన్ నక్సలైట్‌లు అని ముద్రవేస్తున్నారు. ఇప్పుడు మావోయిస్టు ఏరివేత లక్ష్యంగా వందలాది మంది మావోయిస్టులను బలికొన్నారు. వచ్చే ఏడాదికి నక్సలైట్‌లను నిర్మూలిస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటనలు ఇస్తున్నారు. దీనికి కారణం భారతదేశంలో వామపక్ష పార్టీలు లేకుండా చేయాలన్న దుర్బుద్ధి తప్ప మరొకటి కాదు. మతోన్మాదాన్ని ప్రేరేపిస్తూ ప్రజల మధ్యన చిచ్చుపెట్టే ఆరెస్సెస్ ఆడిస్తున్న నాటకంలో బీజేపీ పాత్ర వహిస్తున్నది.
కమ్యూనిస్టులు వామపక్ష పోరాటాల ద్వారా ప్రభుత్వం ఏర్పాటు చేసి ప్రజాస్వామ్య పద్ధతులలో హక్కులను పొందాలని ప్రయత్నిస్తున్నారు. కమ్యూనిస్టు పార్టీలలో రకరకాల ఆలోచనలు ఉన్నాయి. మావోయిస్టులు తుపాకి గొట్టం ద్వారానే మన హక్కులను సాధించుకుంటామనే ఆలోచనతో పోరాటం చేస్తున్నారు. వారు చేస్తున్న పోరాటం తప్పు కావచ్చు. కానీ భార్యాపిల్లలను వదలి ప్రాణాలకు తెగించి ఎప్పుడు ఎక్కడ తింటారో, నిద్రిస్తారో తెలియని అగమ్యగోచర పరిస్థితులలో సమాజ శ్రేయస్సు కోసమే వారు పోరాడుతున్నారు. దోపిడి వర్గాల అణచివేతలను అరికట్టాలన్న లక్ష్యంతో వారు ఆ పంథాను ఎంచుకున్నారు.
పార్లమెంట్ పంథాలో పనిచేస్తున్న వామపక్షాలు కూడా అనేక ఆటుపోట్లను ఎదుర్కొంటున్నాయి. ఎన్నికలు ఐదేళ్ళకు ఒకసారి జరుగుతాయి. ఆ ఎన్నికలతో దేశ ప్రజల జీవన ప్రమాణాలలో మార్పులు రావాలి. కానీ ప్రజాస్వామ్యంలో కీలకమైన ఓట్ల కోసం నాయకులు అడ్డమైన దారులు తొక్కుతూ డబ్బు, మద్యం, సంక్షేమ పథకాల ఎర చూపి ఓటర్లకు అరచేతిలో స్వర్గం చూపిస్తున్నారు. ఈ క్రమంలో ప్రజాసేవకులు కనుమరుగై, హంతకులు, గూండాలు, కార్పొరేట్ సంస్థల అధిపతుల నుంచి రియలెస్టేట్ వ్యాపారుల వరకు ఎంపీలూ ఎమ్మెల్యేలుగా గెలుస్తున్నారు. ప్రజలు గెలవాల్సిన ప్రజాస్వామ్యంలో దోపిడి శక్తులూ, వారికి అండగా నిలిచే మతోన్మాద శక్తులూ గెలిచి అధికారాన్ని హస్తగతం చేసుకుంటున్నాయి. కార్మిక వర్గాలు, బడుగు బలహీన వర్గాలు అణచివేతకు గురవుతున్నాయి. ఎక్కడ అణచివేత, దోపిడీ ఉంటుందో అక్కడ వామపక్ష పార్టీలు ఉంటాయి.
ఉగ్రవాద చర్యలను సామాజిక, ఆర్థిక అంశంగా గుర్తించి పరిష్కరించే బదులుగా శాంతిభద్రతల సమస్యగా పరిగణించి ఎన్‌కౌంటర్‌లే ప్రధానమని గతంలో భావించారు. ఇప్పటికీ మోదీ ప్రభుత్వం ఇదే ధోరణిని అవలంబిస్తూ ఉగ్రవాదాన్ని నిర్మూలిస్తామంటున్నారు. మావోయిస్టు ఉద్యమం తాత్కాలికంగా అణచివేయబడినప్పటికీ అంతరాలు లేని, దోపిడీ రహిత సమాజం ఏర్పడే వరకు దాని ఉనికి ప్రభావం అలా ఉంటూనే ఉంటుంది.
వామపక్ష తీవ్రవాదానికి ప్రజల పునాది ఉన్నదనే విషయాన్ని ప్రభుత్వం గుర్తించాలి. అలాగే ప్రజలు కూడా ప్రజాస్వామ్య ఫలాలు పొందడానికి చైతన్యవంతం కావాలి. పాలకులను ఆలోచింపచేసే విధంగా ప్రజా చైతన్యాన్ని ప్రదర్శించాలి. ఇటీవల ప్రొఫెసర్ సాయిబాబా అకాల మరణం చెందారు. ఇందుకు పాలకులే కారణం. అన్యాయంగా ఊపా కేసులు మోపి 90శాతం కదలలేని స్థితిలో ఉన్న మేధావిని పదేళ్ళు అండా సెల్‌లో బంధించారు. చివరకు కోర్టు నిర్దోషిగా తేల్చింది. హర్యానా ఎన్నికల్లో ఓట్ల కోసం డేరా సచ్ఛా సౌదా గురువు రాం రహీమ్ సింగ్‌కు బీజేపీ ప్రభుత్వం పెరోల్ ఇచ్చింది. కానీ, ప్రొఫెసర్ సాయిబాబా తల్లి చనిపోయినప్పుడు చూసేందుకు పెరోల్ ఇవ్వలేదు. చివరికి ఆయన నిర్దోషి అని తేలింది. ఏమి లాభం? జైలులో పడిన అష్టకష్టాలతో బైటికి వచ్చిన నెలల్లోనే అనారోగ్యంతో అకాల మృత్యువుకు గురయ్యారు. కేవలం వామపక్ష భావజాలం కలిగి ఉన్నారనే ఒకే ఒక్క కారణంతో ఆయనను బంధించి. మానసికంగా హింసించడమే కాకుండా, చివరికి ఆయన మరణానికి కూడా పాలకులు కారణమయ్యారు.
కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఆపరేషన్ గ్రీన్ హంట్, ఆపరేషన్ కగార్ పేర్లతో మావోయిస్టుల అంతానికి పంతం పట్టింది. వారి ఉద్దేశం ఛత్తీస్‌గఢ్ ఇతర అటవీ ప్రాంతాలలో ఆదివాసీల అభిమానాన్ని చూరగొన్న మావోయిస్టులను నిర్మూలించి, ఆ పచ్చని అడవిలోని వనరులనూ, గనులనూ తమ వందిమాగధ కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టేందుకే అన్న మాట ప్రచారంలో ఉంది.
ఇలాంటి తరుణంలో మావోయిస్టులు కూడా అంతర్మథనం చేసుకుంటూ ప్రత్యామ్నాయ ఆలోచనలకు పదును పెట్టాలి. ప్రజాస్వామ్య పద్ధతులలోనే ప్రభుత్వం అనుసరిస్తున్న చర్యలను తిప్పికొట్టాలి. చావుకు చావు అనే సిద్ధాంతం నుండి వైదొలగి కమ్యూనిస్టులతో కలిసి ఐక్యపోరాటం చేసి వర్గరహిత సమాజాన్ని నిర్మించాలి.
వివిధ పార్టీలుగా చీలిపోయిన కమ్యూనిస్టులు, మావోయిస్టులు, ఇతర వామపక్ష శక్తుల మధ్య అనుసరించే మార్గంపై భిన్నాభిప్రాయాలు వుండవచ్చే తప్పా సమసమాజ స్థాపనే అందరి అంతిమ లక్ష్యం. మితవాద, మతవాద శక్తుల నుంచి దేశం తీవ్ర ప్రమాదం ఎదుర్కొంటున్న ఈ దశలో వామపక్ష, ప్రజాతంత్ర, ప్రగతిశీల శక్తులన్నీ ఐక్యంగా దానిని తిప్పికొట్టాలి.
చాడ వెంకటరెడ్డి
సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు
Updated Date - Nov 07 , 2024 | 03:12 AM