ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

నచ్చకపోతే చింపేసేంత కోపం ఉండేది!

ABN, Publish Date - Nov 18 , 2024 | 05:47 AM

అరవింద్ అడిగ రాసిన ‘ది వైట్ టైగర్’. భరించనలవికాని శోకాన్ని వ్యంగ్యంగా ఒకింత నవ్విస్తూ చెప్పడానికి చాలా నేర్పరితనం ఉండాలి రచయితకి. ఒక అణచివేయబడ్డ కులంలో పుట్టిన నిరుపేద వ్యక్తి అసమానతలను...

చదువు ముచ్చట

ఆఖరుగా ఏ పుస్తకాన్ని చదివి బాగా ఇష్టపడ్డారు?

అరవింద్ అడిగ రాసిన ‘ది వైట్ టైగర్’. భరించనలవికాని శోకాన్ని వ్యంగ్యంగా ఒకింత నవ్విస్తూ చెప్పడానికి చాలా నేర్పరితనం ఉండాలి రచయితకి. ఒక అణచివేయబడ్డ కులంలో పుట్టిన నిరుపేద వ్యక్తి అసమానతలను, అవినీతిని దాటి ఎలా ఎదిగాడన్నదే కథ. పీడితుల స్వరాన్ని దీనంగా వినిపించే సంప్రదాయానికి స్వస్తి పలికి చాలా కొత్త రకమైన టెక్నిక్‌తో పాఠకుడ్ని ఆకట్టు కుంటుంది ఈ నవల. నెట్‌ ఫ్లిక్స్‌లో సినిమాగా తీసారు కానీ నాకు పుస్తకమే ఎక్కువ నచ్చింది.


మొదటిసారి ఏ పుస్తకాన్ని ఇష్టంగా చదివారు?

నా చిన్నతనంలో అకడెమిక్ బుక్స్ కాకుండా న్యూస్‌పేపర్లు తప్ప వేరే పుస్తకాలు చదివిన జ్ఞాపకం లేదు. కానీ నేను ఏడవ తరగతిలో ఒక పాఠంగా చదువుకున్న శ్రీశ్రీ ‘శైశవగీతి’ కవిత బాగా నచ్చి ‘మహాప్రస్థానం’ కొనుక్కున్నాను. ఆ పుస్తకం, నాకు గుర్తున్నంత వరకు, నేను చదివిన మొట్టమొదటి సీరియస్ సాహిత్యం. ‘‘మీదే మీదే అనంత విశ్వం మీరే రేపటి భాగ్యవిధాతలు’’ అని గుంటల్ని పొగిడిన మొట్టమొదటి మహాకవి శ్రీశ్రీ!

మీరు ఎక్కువసార్లు చదివిన పుస్తకాలు?

పీవీ నరసింహారావు ‘ద ఇన్‌సైడర్’, తిలక్ ‘అమృతం కురిసిన రాత్రి’, సి. నారాయణరెడ్డి ‘విశ్వంభర’.


ఒకప్పటికీ ఇప్పటికీ మీరు చదివే పద్ధతి ఎలా మారింది?

ఒకప్పుడు నేను చదివింది నచ్చకపోతే పుస్తకాన్ని చింపేసే (నిజ్జంగా) కోపం ఉండేది. ఇప్పుడు రచన కన్నా ముందు ఆ రచయిత సామాజిక/ ఆర్థిక/ రాజకీయ పరిస్థితుల్ని ముందు గ్రహించి, ఆ రచన సృజించబడ్డ కాలమాన పరిస్థితుల్ని గమనింపులో పెట్టుకుని పూర్తిగా అతని/ ఆమె షూస్ లోనికి నన్ను నేను ట్రాన్స్‌పోస్‌ చేసుకున్నాకే చదవడం మొదలు పెడుతున్నాను.

ఒకప్పుడు బాగా నచ్చి ఇప్పుడు అంతగా నచ్చని రచన/ రచయిత?

మీరు అడిగినదానికి పూర్తి వ్యతిరేకంగా జరిగింది. ఒకప్పుడు అస్సలు నచ్చని ‘అసమర్థుని జీవయాత్ర’ తరువాత కాలంలో నచ్చింది.

మీ ఆలోచనల్ని బాగా ప్రభావితం చేసిన పుస్తకం?

రావణాసురుడి దృష్టికోణంలో ఆనంద్ నీలకంఠన్ రాసిన ‘అసుర’. అప్పటివరకు రావణుడ్ని విలన్‌గా ఏళ్ళ తరబడి బలపరచిన దృక్పథానికి ఒక కొత్త కన్విన్సింగ్ భాష్యం ఆ పుస్తకం.


ఏ గత కాలం రచయితనైనా కలిసి మాట్లాడగలిగితే ఎవరితో, ఏం మాట్లాడతారు?

ఏ గతకాలపు రచయిత తోనూ కలిసి మాట్లాడాలన్న ఫ్యాంటసీ నాకు లేదు. కానీ తమిళ రచయిత సుజాత రంగరాజన్ ఈవీయంలు తయారుచేసే ఇంజినీరింగ్ ప్రోజెక్ట్ డైరెక్టర్‌గా ఉంటూ, ఓ చేత్తో సినిమాలకు స్క్రీన్ ప్లేలు రాసి ఇంకో చేత్తో నవలలు/ కథలు/ నాటికలు రాయగలిగేంత నిబద్ధతతో ఒకే జీవిత కాలంలో రెండు జన్మలు బ్రతికారు. ఆయనతో మాట్లాడకుండా ఒక రోజంతా అతని దినచర్యని గమనించాలని ఒకప్పుడు ఉండేది.

(రిషి శ్రీనివాస్‌ కథా రచయిత)

Updated Date - Nov 18 , 2024 | 05:47 AM