నిన్ను ఎవరైనా ప్రేమిస్తే...
ABN, Publish Date - Oct 28 , 2024 | 06:00 AM
ఎట్లా లేచావు ఉదయం! రాత్రంతా, ఎవరో వెన్నెలని తైలంగా మార్చి నిన్నో వొత్తిని చేసి వెలిగించినట్లు, మరి నీ ముఖంలో, ఊరకనే నవ్వు! మెరుస్తోంది...
ఎట్లా లేచావు ఉదయం! రాత్రంతా, ఎవరో
వెన్నెలని తైలంగా మార్చి
నిన్నో వొత్తిని చేసి వెలిగించినట్లు, మరి
నీ ముఖంలో, ఊరకనే నవ్వు! మెరుస్తోంది
నీ శరీరం, బంతిపూవులాగా!
నీలో మట్టిపై చిందే చినుకుల సువాసన!
ఊరకనే, శిశువులు నవ్వినట్టు నవ్వుతావు -
శృతి చేసినట్టు, సర్వాన్నీ ఇక
బిడ్డని తాకినట్టు తాకి, ఎత్తుకుంటావు -
‘‘ఎందుకిలా అయ్యారు, మీరు?’’ అని అడిగి
Diaper మార్చినట్టు, వాళ్ళల్లో
పేరుకున్న పరాయితనాన్ని తీసివేస్తావు -
నీ ఎదురుగా అక్టోబర్ నెల చంద్రుడు. చెప్పు
ఎవరి ముఖం అది? మంచులో
తడిచీ, రాత్రిలో గాలికి ఊగే గడ్డి పూవులు,
ఎవరి మాటలు, అవి? కూర్చుని ఉన్నా, మరి
లేచినా, నువ్వేం చేసినా కూడా,
నిన్ను వానగా మార్చిన ఆ రూపం ఎవరిది?
అన్నం తిన్నావా? అని అడుగుతావు? జాగ్రత్త
అని చెబుతావు. క్షణానికోసారి
Msg చేసి, ఏం చేస్తున్నావు అనడుగుతావు!
అబ్బా అని వాళ్ళు విసుకున్నా సరే, తల్లి కోడి
వెనుకే తిరిగే, పిల్లవి నువ్వు -
వస్తున్నావా అనీ, జాగ్రత్త అనీ, ఎక్కడ అనీ!
ఎట్లా పడుకున్నావు నువ్వు! నీలో నువ్వు చేరి
దగ్గరగా ముడుచుకుని -
చీకట్లో దీపం వెలిగించినట్లు నీ పెదాలపై
చిరునవ్వు. ఎవరో, దుప్పటి కప్పి వెళ్లినట్లుగా
అంత నిద్రలోనూ నీకు
తెలిసినట్లు, ఒక తేలికైన ఆనందం. ఇష్టం
తాకకుండానే స్పర్శ తెలిసినట్లుగా, ఊరకనే
నిజంగా మరి బ్రతికి
ఉండటం బావుంటుంది అని తెలిసీ, నీలో
నువ్వే వెలిగీ, గాలై వీచీ, వాళ్ళే నువ్వైపోయి!
శ్రీకాంత్
Updated Date - Oct 28 , 2024 | 06:00 AM