నేను మీకు తర్వాత కాల్ చేస్తాను
ABN, Publish Date - Dec 09 , 2024 | 01:04 AM
సరే తర్వాతే మాట్లాడుకుందాం ఈ క్షణం నిర్జీవమైందే చేతులు ఖాళీగా ఉండి ఉండవు చుట్టూ జతగాళ్ళు మూగి ఉంటారు...
సరే
తర్వాతే మాట్లాడుకుందాం
ఈ క్షణం నిర్జీవమైందే
చేతులు ఖాళీగా ఉండి ఉండవు
చుట్టూ జతగాళ్ళు మూగి ఉంటారు
రెండుకాళ్ళపై నిలబెట్టే పని
జీవితాన్నంతా నంజుకు తినేస్తూంటుంది
ఆకలి–
రోజూ టైముకు రాని రైలు బండి
నిద్ర–
నీటిలో కన్నార్పని చేపపిల్ల
ఆశల బహు సుందరమైన దినచర్య–
పులి నోట్లో మెలిపడ్డ బెదురుజింక
చవిచూసేందుకో
రవ్వంత బ్రతుకుతీపి కావాలిప్పుడు
నిజమే
అస్సలు తీరిక లేదు
ఇనుప చువ్వలపై పాకే మనీ ప్లాంట్ తీగ
నాజూగ్గా అల్లుకుంటున్న పక్షుల తావు
ఎప్పటిదో చాలా పాత ఉత్తరం
ఇవన్నీ పేరు చెప్పలేని ప్రేమ పాశాలు
ఎన్నో ఊర్లు తిరిగొచ్చాక తీరే
ఇంటి బెంగ వర్ణించేది కాదు
ఊసుల్ని దోసిలి పట్టలేం
మొబైల్ నంబర్లో అంకెలన్నింటికీ
ఎదురుచూపు అలసట తెలుసు
ఉండబట్టలేకే అవి
మళ్ళీ మళ్ళీ గుండె సవ్వళ్ళై
మోగుతాయి
పోనీలే ఏం ఫర్వాలేదు
కలబోసుకుంటే కడుపు నిండుతుంది
కన్నీళ్ళలోంచి ఒంటరితనం ఒడ్డున పడుతుంది
ఉప్పుసముద్రం రుచిదేలి
ఇసుకలోని గవ్వలన్నీ
పలుకు నేర్చిన చిలుకలవుతాయి
కలవడం–-విడిపోవడం
బొమ్మాబొరుసులయ్యాక
ఆదుర్దానే అసలు దిగులు
మాటలు చాలని మాటలుండిపోతాయ్
అక్కరపడి మాట్లాడ్డమే అబ్బురపు పని
వశపడది గానీ,
జర అయినంకే, మనసు కొమ్మకు
తంగేడు పువ్వుల ముడుపు గట్టు
అంతే, అంతకు మించింకేం లేదు
శ్రీరామ్ పుప్పాల
99634 82597
Updated Date - Dec 09 , 2024 | 01:04 AM