ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మెస్‌ చార్జీల పెంపు ఓ సామాజిక విప్లవం

ABN, Publish Date - Nov 05 , 2024 | 03:20 AM

సాంఘిక సంక్షేమ వసతి గృహాలలో విద్యార్థులకు మెస్ చార్జీలు, కాస్మొటిక్ చార్జీలు పెంచడం ఒక సాధారణ అంశం కాదు. విద్యార్థులకు డైట్ చార్జీలు పెంచాలన్న డిమాండ్ పెద్దగా లేకున్నా రాష్ట్రంలో...

సాంఘిక సంక్షేమ వసతి గృహాలలో విద్యార్థులకు మెస్ చార్జీలు, కాస్మొటిక్ చార్జీలు పెంచడం ఒక సాధారణ అంశం కాదు. విద్యార్థులకు డైట్ చార్జీలు పెంచాలన్న డిమాండ్ పెద్దగా లేకున్నా రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి అంత పటిష్ఠంగా లేకున్నా కూడా అధికారుల సిఫారసులను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎలాంటి చర్చ లేకుండా దాదాపు 40 శాతానికి పైగా పెంపుదల చేశారు. సాంఘిక సంక్షేమ హాస్టల్స్‌లో చదువుకుంటున్న విద్యార్థుల భవిష్యత్ గురించి ముఖ్యమంత్రి లోతుగా ఆలోచించి తీసుకున్న నిర్ణయం ఇది. దీన్ని ఒక సాధారణ అంశంగా పరిగణించలేము. ఆయా వర్గాల విద్యార్థుల భవిష్యత్ కోసం తీసుకున్న ఒక ముందు చూపు నిర్ణయం. సామాజిక విప్లవం దిశగా ఒక ముందడుగు.

7 లక్షల మంది పేద దళిత, గిరిజన, ఆదివాసీ బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు ఈ నిర్ణయం ఒక అద్భుతమైన వరం. సమాజంలో అనేక రకాల వస్తువుల ధరలు అడ్డగోలుగా పెరిగాయి కానీ విద్యార్థుల భవిష్యత్‌ను నిర్ణయించే ఇలాంటి అంశంలో మాత్రం గత సర్కారు దయచూపలేదు. విద్యా రంగానికి చేసే వ్యయం ఒక ఖర్చులాగా కాకుండా భావి తరాల నిర్మాణానికి పెట్టే పెట్టుబడిగా సీఎం రేవంత్‌రెడ్డి ఆలోచించడం గొప్ప పరిణామం. ఒకవైపు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆలోచన మరోవైపు ఉప ముఖ్యమంత్రి ఆర్థికశాఖ మంత్రి భట్టి విక్రమార్క అమలు చేస్తున్న తీరు రాష్ట్ర బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు ఎంతో మేలు చేస్తుంది. అభివృద్ధి, సంక్షేమం రెండింటినీ సమానంగా పరుగులు తీయిస్తున్నారు. తెలంగాణ జోడెడ్ల మాదిరిగా అభివృద్ధిని సంక్షేమాన్ని సమానంగా పరుగులు పెట్టిస్తున్నారు. ఏడేళ్లుగా డైట్ చార్జీలు 16 ఏళ్లుగా కాస్మొటిక్ చార్జీలు పెంచలేదు అంటే గత ప్రభుత్వానికి పేద విద్యార్థుల పట్ల ఎంత చిన్న చూపు ఉందో అర్ధం చేసుకోవచ్చు.


ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటినుంచి విద్యారంగం పట్ల ప్రత్యేక శ్రద్ధతో పనిచేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల మరమ్మతులు చేసి వాటికి కనీస సౌకర్యాలు కల్పించేందుకు నిధులు మంజూరు చేశారు. ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులకు ఎంతో కాలంగా పెండింగ్ ఉన్న పదోన్నతులను వెంటనే చేపట్టారు. అలాగే బదిలీలు చేపట్టి వేలాది ఉపాధ్యాయులకు వారు కోరుకున్న ప్రాంతాలకు బదిలీ చేసి అనుకూల నిర్ణయాలు తీసుకున్నారు. 11063 ఉపాధ్యాయ పోస్ట్‌లు డీఎస్సీ ద్వారా భర్తీ చేసి ప్రభుత్వ పాఠశాలలను పటిష్ఠం చేసి విద్య పట్ల తనకున్న సానుకూలతను చేతల్లో చూపారు. అలాగే నియోజకవర్గానికి ఒక ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ కళాశాల ఏర్పాటుకై ఒక పకడ్బందీ ప్రణాళిక తయారు చేసి ఇటీవల 26 నియోజకవర్గాలలో శంకుస్థాపన కార్యక్రమాలను కూడా చేపట్టారు.


ఐటీఐలను ఒక్కతాటిపైకి తెచ్చి ఉద్యోగ ఉపాధి రంగాలలో మెరుగైన అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకున్నారు. అలాగే స్కిల్ యూనివర్శిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీలను ఏర్పాటు చేసి విద్యార్థులకు మంచి భవిష్యత్ కోసం ఒక మంచి ప్రణాళికతో ముందుకు పోతున్నారు. డ్రగ్ ఫ్రీ తెలంగాణ లక్ష్యంగా ముఖ్యమంత్రి అనేక చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా విద్య పట్ల ఆయన లోతైన చర్యలు చేపట్టారు. చిన్నతనం నుంచి చదువు పట్ల ఆసక్తి ఉంటే విద్యార్థులు వ్యసనాల జోలికి పోరు అని అలాగే విద్య తర్వాత క్రీడలు చాలా ముఖ్యమని రేవంత్‌రెడ్డి భావించారు. అందుకోసమే క్రీడలకు పెద్దఎత్తున సౌకర్యాలు కల్పిస్తున్నారు. యువత మంచి దారిలో నడవడం, ఆరోగ్యంతో ఉండడానికి క్రీడలను అద్భుతమైన అవకాశంగా సీఎం రేవంత్‌రెడ్డి భావిస్తున్నారు.

దళిత, గిరిజన, బడుగు, బలహీన, మైనారిటీ వర్గాల విద్యార్థుల అభ్యున్నతికి గొప్ప అవకాశంగా చూడాలి. బలహీన వర్గాలు చదువులో బలవంతులు కావడానికి గొప్ప జీవితానికి ఒక మంచి పునాది కావడానికి ఇదో మంచి అడుగుగా భావించాలి. ఈ అంశంపై రాజకీయాలకు అతీతంగా అందరూ సంపూర్ణంగా సహకారం అందించాలి.

మల్లు రవి

ఎంపీ, నాగర్ కర్నూల్

టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు

Updated Date - Nov 05 , 2024 | 03:20 AM