తరం మార్పులో తిరస్కృతుడైన నెహ్రూవాది
ABN, Publish Date - Aug 14 , 2024 | 03:40 AM
ఆకులు పండిపోయి నేలరాలడం, చెట్లు మళ్లీ చిగురించి నవ నవోన్మేషంగా మారడం ప్రకృతికి ఎంత సహజమో, మానవ సమాజానికి కూడా అంతే సహజం. మూడు రోజుల క్రితం మరణించిన 95 సంవత్సరాల మాజీ విదేశాంగ మంత్రి నట్వర్‌సింగ్...
ఆకులు పండిపోయి నేలరాలడం, చెట్లు మళ్లీ చిగురించి నవ నవోన్మేషంగా మారడం ప్రకృతికి ఎంత సహజమో, మానవ సమాజానికి కూడా అంతే సహజం. మూడు రోజుల క్రితం మరణించిన 95 సంవత్సరాల మాజీ విదేశాంగ మంత్రి నట్వర్‌సింగ్ కొన్ని దశాబ్దాల కాంగ్రెస్ చరిత్ర, సంస్కృతికి ప్రతీకగా నిలిచారు. ఆయన మరణంతో కాంగ్రెస్‌ను పెనవేసుకున్న ఒక రాజకీయ సంస్కృతి కూడా అదృశ్యమైందని చెప్పవచ్చు. నిజానికి నట్వర్‌సింగ్‌తో కాంగ్రెస్ భవబంధం దాదాపు దశాబ్దంన్నర క్రితమే సమసిపోయింది. ఎన్‌డి తివారి, ఫోతేదార్, శివశంకర్, కోట్ల విజయ భాస్కరరెడ్డి, పి.వి.నరసింహారావు, ప్రణబ్ ముఖర్జీ, మోతీలాల్ వోరా, అర్జున్‌సింగ్, గాడ్గిల్ తదితరులతో పాటు నట్వర్‌సింగ్ కూడా చివరకు కాలగమనంలో కలిసిపోయారు. నిజానికి ఈ నేతల్లో చాలా మంది కంటే నట్వర్‌సింగ్ జూనియర్. రాచకుటుంబంలో పుట్టి, నెహ్రూ హయాంలో విదేశాంగ సర్వీసులో చేరి ఆయన చెల్లెలు కృష్ణహతీ సింగ్ పిల్లలతో పాటు కలిసి చదువుకున్నందువల్ల గాంధీ కుటుంబ కోటరీలో చేరగలిగిన నట్వర్‌సింగ్ పలువురు కాంగ్రెస్ నేతల మాదిరే ఆ కుటుంబ ఆంతరంగిక సభ్యులుగా మెలిగారు. ఇందిర మరణానంతరం రాజీవ్ గాంధీ హయాంలో రాజకీయాల్లో ప్రవేశించి పార్లమెంట్ సభ్యుడుగా తొలిసారి గెలిచిన నట్వర్‌సింగ్ నెహ్రూవియన్ ఆలోచనా విధానానికి చెందినవారు. ఇందిర హయాంలో విదేశాంగశాఖ అధికారిగా ఉండగానే ఆయన పద్మభూషణ్ పురస్కారాన్ని పొందారు. రాజీవ్ హయాంలో విదేశాంగ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. కాని నట్వర్‌సింగ్ ఆ సమయంలో విదేశాంగ విధానంలో జరిగిన తప్పులను నివారించలేకపోయారు. ఎంత మేధావి అయినా అధికారంలో ఉన్నవారికి సమీపంలో ఉండాలని నిర్ణయించుకున్న వారికి తమ అధినేతలు చేసే తప్పులను ఆ సమయంలో ప్రశ్నించే ధైర్యం ఉండదు. తమ అధినేతల కటాక్ష వీక్షణాలకు దూరమైన తర్వాత వారు చేసిన తప్పులను విమర్శిస్తే మాత్రం ప్రయోజనం ఏముంటుంది?
రాజీవ్ మరణానంతరం అర్జున్‌సింగ్‌తో పాటు ప్రధానమంత్రి కావాలని ఆశించిన వారిలో నట్వర్‌సింగ్ ఒకరు. కాని ఆ అవకాశం పి.వి.కి దక్కడంతో అసమ్మతివాదులుగా మారిపోయారు. అర్జున్, తివారీ, షీలాదీక్షిత్‌లతో కలిసి సూరజ్‌కుండ్ ఏఐసిసి సదస్సులో నిరసన తెలిపారు. పి.వి.కి అడుగడుగునా కష్టాలు సృష్టించారు. ‘మేము ఎన్ని కష్టాలు సృష్టించినా పి.వి. ప్రభుత్వం చెక్కుచెదరలేదు. అయిదు సంవత్సరాలు నిబ్బరంగా మైనారిటీ ప్రభుత్వాన్ని నిర్వహించారు. మా అందరికంటే ఆయనే తెలివైన నాయకుడని నిరూపించుకున్నారు’ అని నట్వర్‌సింగ్ తన ఆత్మకథలో వాపోయారు. తర్వాత మరోసారి యూపీఏ హయాంలో కూడా విదేశాంగ మంత్రిగా అవకాశం వచ్చినప్పటికీ అప్పటికే విదేశాంగ విధానం అలీన లక్షణాలను కోల్పోయి, ఆర్థిక విధానాల ఆధిపత్యానికి లోనయ్యే క్రమం వేగవంతమైంది. ఆ క్రమంలోనే ఆయన నిష్క్రమణకు రంగం సిద్ధమైంది. ఇరాక్ నుంచి చమురు దిగుమతి చేసుకుని ఆహార సరఫరాలు చేసే పథకానికి సంబంధించి నట్వర్ సింగ్, ఆయన కుమారుడు లబ్ధిదారులు అన్న ఆరోపణలు రావడంతో 2006లో కాంగ్రెస్ ఆయనను బహిష్కరించింది. ఆ సమయంలో ఆయన మౌనంగా ఉండి, సోనియా శరణు వేడినా తర్వాతి కాలంలో కాంగ్రెస్ చేరదీసి ఉండేదేమో? కాని నెహ్రూ కుటుంబానికి, కాంగ్రెస్‌కు అంకితభావంతో సేవ చేసిన తనకు పార్టీ అండగా నిలబడకపోవడంతో ఆయన మనసు గాయపడి కాంగ్రెస్‌ను ధిక్కరించారు. ఆయన కుమారుడు బీజేపీలో చేరాడు. నట్వర్ సైతం తన చరమదశలో నరేంద్రమోదీని కలిసి ప్రశంసల వర్షం కురిపించడం ఆయన వ్యక్తిత్వాన్ని మరింత పలచన చేసింది. చివరకు పూర్తిగా విస్మరణకు గురై, పలకరించేవారు కరువైన పరిస్థితుల్లో నట్వర్ దివంగతులయ్యారు. రాజారావు, నిరాద్ చౌదురి, ఆర్ కేనారాయణ్, తక్కజి శివశంకర పిళ్లై లాంటి ఎందరో రచయితలతో సన్నిహిత సంబంధాలుండి, సాహిత్యంలో మంచి అభినివేశం ఉన్న నట్వర్‌సింగ్ మారుతున్న కాలానికి అనుగుణంగా తనను తాను మార్చుకోలేక నిష్క్రమించిన అనేకమంది కాంగ్రెస్ నేతల్లో ఒకరని చెప్పక తప్పదు.
నట్వర్‌సింగ్ లాంటి వారిని వదుల్చుకోవడమే కాంగ్రెస్‌లో కాల పరిణామంలో వస్తున్న మార్పులకు నిదర్శనం అని భావించాల్సి ఉంటుంది. తనను తాను నెహ్రూవాదిగా చెప్పుకున్నప్పటికీ పీవీకి తాను ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణలకూ నెహ్రూ విధానాలకు పొంతనలేదన్న విషయం తెలియనిది కాదు. ఆలోచనా విధానానికి వయసుకూ సంబంధం ఉండదని నిరూపించిన కొద్ది మంది నేతల్లో పీవీ ఒకరు. అందుకే తాను చేయదలుచుకున్న మార్పుల చట్రానికి అనుగుణంగా లేని వ్యక్తులను వయసుతో నిమిత్తం లేకుండా ఆయన వదుల్చుకున్నారు. వారు గాంధీ కుటుంబ విధేయులన్న విషయాన్ని కూడా ఆయన పట్టించుకోలేదు.
సోనియాగాంధీకి కూడా గత కాలపు అవశేషాల పట్ల అంత ఆసక్తి లేదు. పీవీకి వ్యతిరేకంగా తివారీ, అర్జున్ సింగ్, ఫోతేదార్, నట్వర్‌సింగ్ తదితరులు అసమ్మతి శిబిరం నడుపుతున్నప్పటికీ ఆమె తన ప్రయోజనాల రీత్యా వారిని వారించలేదు కాని వారిని పూర్తిగా చేరదీయలేదు కూడా. తనకు ప్రధాని పదవి వచ్చే అవకాశాలు లేవని తెలిసినప్పుడు మన్మోహన్‌సింగ్ లాంటి వారికి అవకాశం కల్పించారు కాని విధేయులను పక్కన పెట్టారు. కాకపోతే మంత్రి పదవులో, గవర్నర్ పదవులో ఇచ్చి బుజ్జగించారు. నట్వర్‌సింగ్ లాంటివారిపై జైరాం రమేశ్ లాంటి తర్వాతి తరం నేతలు జోకులు విసురుతుంటే సోనియా నవ్వుతూ ఉండేవారని నట్వర్ రాసిన ఆత్మకథ చదివినప్పుడు అర్థమవుతోంది.
నట్వర్ మాత్రమే కాదు, క్రమక్రమంగా ఇందిర, రాజీవ్, సంజయ్ హయాం కాలపు నేతలందరూ కనుమరుగయ్యారు. ఒకప్పుడు సంజయ్‌గాంధీ మిత్రగణంలో చలాకీగా ఉన్న అంబికా సోనీ నిన్నమొన్నటి వరకూ రాజ్యసభ సభ్యురాలిగా ఉండి ఇప్పుడు 8 పదులు దాటిన వయసులో కాలక్షేపం చేస్తున్నారు. మరణించేంత వరకూ మోతీలాల్ వోరాను కోశాధికారిగా కొనసాగించి, రాజ్యసభలో నిద్రపోతున్నా కాంగ్రెస్ ఆయనను ఓపికగా భరించి గౌరవంగా నిష్క్రమించేందుకు వీలు కల్పించింది. సంజయ్ మిత్రుడైన గులాంనబీ ఆజాద్ లాంటి అనేక మంది తమ దారి తాము చూసుకుంటే దిగ్విజయ్‌సింగ్, కమలనాథ్ లాంటి నేతలు సహజంగా నిష్క్రమించే తరుణం ఆసన్నమైందని చెప్పకతప్పదు.
ఎకె ఆంటోనీ, మన్మోహన్‌సింగ్, మీరాకుమార్ తదితరులు ఇప్పటికే క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్నారు. 77 సంవత్సరాల సోనియాగాంధీ తనకు తాను ప్రత్యక్ష ఎన్నికలకు దూరమై రాజ్యసభను ఎంచుకున్నారు. అనేకమంది సీనియర్ నేతల సంతానం రాజకీయాల్లో ఇప్పటికే ప్రవేశించారు. మళ్లీ 2029లో లోక్‌సభ ఎన్నికలు జరిగే నాటికి ఇప్పుడున్న వారిలో అనేకమంది మనకు రంగంలో కనపడకపోవచ్చు.
నిజానికి నరేంద్ర మోదీ పాలించిన గత పదేళ్ల కాలంలో చాలా మంది నాయకులు తెరమరుగయ్యారు. మోదీ అధికారంలోకి రాగానే ఒక వ్యూహం ప్రకారం ఆడ్వాణీ, మురళీ మనోహర్ జోషీ వంటి వృద్ధులను మాత్రమే కాదు, పాత తరానికి సన్నిహితంగా ఉన్నవారందరినీ క్రమక్రమంగా బీజేపీలో నిర్ణయాధికారం నుంచి దూరం చేసే ప్రక్రియ ప్రారంభిస్తే కాంగ్రెస్‌లో సహజంగా ఈ మార్పులు జరిగాయని చెప్పక తప్పదు. కాంగ్రెస్ వయసును రాజకీయాల్లో ఒక కొలమానంగా పెట్టుకోకపోయినా తరం మార్పు ఆ పార్టీలో కూడా జరిగింది. సోనియాగాంధీ నెహ్రూ, ఇందిర, రాజీవ్ కాలం నుంచి ఉన్నవారందరినీ కొంతకాలం భరించారు. రాహుల్ కూడా మొదట్లో పాతతరం వారిని భరించక తప్పలేదు. కాని క్రమంగా కాంగ్రెస్ నాయకత్వం వ్యూహాత్మకంగా పార్టీలో సంస్థాగతంగా బాధ్యతలు కొత్త వారికి అప్పజెప్పడం ప్రారంభించింది. గత ఏడాది ఉదయపూర్‌లో జరిగిన ఏఐసీసీ సదస్సులో 50 శాతం నేతలను 50 సంవత్సరాల లోపు వారికి అప్పగించాలని నిర్ణయం తీసుకున్నది. దాన్ని పూర్తిగా అమలు చేయలేకపోయినా తమ నాయకత్వం వయసును తగ్గించుకునే ఆలోచనలో కాంగ్రెస్ ఉందనడంలో సందేహం లేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శుల్లో అందరూ 70 ఏళ్ల లోపు ఉన్నవారే. వీరిలో జైరాం రమేశ్ ఒక్కరే అందరికన్నా సీనియర్. రాహుల్ గాంధీ, ప్రియాంకాగాంధీ, సచిన్ పైలట్, గౌరవ్ గొగోయ్, దీపేందర్ హూడా, రేవంత్‌రెడ్డి, మీనాక్షి నటరాజన్, ప్రణీతీ షిండే, సుప్రియా శ్రీనాటే, బి.వి. శ్రీనివాస్, ఫులోదేవి నేతమ్, గుర్దీప్ సప్పల్, కన్హయ్యకుమార్, నీరజ్ కుందన్ తదితర యువ నేతలదే కాంగ్రెస్ రాజకీయాల్లో భవిష్యత్ అని చెప్పక తప్పదు. ఇతర పార్టీల్లో కూడా అలాంటి యువనేతలు ఎందరో ఉన్నారు.
కాని ప్రపంచ దేశాల్లో వస్తున్న మార్పులు, ఆధునిక, సాంకేతిక పరిజ్ఞానంలో రోజురోజుకూ మారిపోతున్న పరిణామాలు, భాషలోనూ, భావాల వ్యక్తీకరణలోనూ కనపడుతున్న కొత్తదనం, సమాజానికి అవసరమైన ప్రమాణాలు, నైపుణ్యాలు, నాణ్యత గల సేవలు, పెరుగుతున్న భవిష్యత్ తరాలను దృష్టిలో ఉంచుకుని నిర్మించాల్సిన మౌలిక సదుపాయాలు, సంపద కేంద్రీకృతం కాకుండా అందరికీ అందుబాటులోకి రావాల్సిన మార్గాల గురించి ఆలోచించని రాజకీయతరం లేకపోతే ఏమి ప్రయోజనం ఉంటుంది? గడచిన అయిదు సంవత్సరాల కాలంలో ఆంధ్రప్రదేశ్‌లో ఒక యువనేతకు పూర్తి మెజారిటీ ఇచ్చి అధికారం చలాయించే అవకాశం ప్రజలు కల్పించినప్పటికీ నిధులను పూర్తి దుర్వినియోగం చేసి రాష్ట్రం కొన్ని దశాబ్దాలు వెనుకకు పయనించేందుకు వీలు కల్పించారు. అదే సమయంలో నేటి వాట్సాప్‌లో గతం గురించి గొప్పలు చెప్పుకుంటూ ఆధునిక భావజాలాన్ని, హేతుబద్దతను, వివేచనను అవహేళన చేసే వారిని చూస్తుంటే ఆవేదన కలుగుతుంది. ‘కొంతమంది కుర్రవాళ్లు పుట్టుకతో వృద్ధులు, తాతగారి, బామ్మగారి భావాలకు దాసులు, నేటి నిజం చూడలేని కీటక సన్యాసులు’ అని ఇలాంటి వారిని చూసే మహాకవి శ్రీశ్రీ రాసి ఉంటారు. వీరికన్నా తమ అనుభవాన్ని జరిగిన తప్పులను సవరించుకునేందుకు ఉపయోగించుకుని ప్రజల భవిష్యత్‌ను తీర్చిదిద్దేందుకు ఒక లక్ష్యంతో చర్యలు చేపట్టే వారికి వయసుతో నిమిత్తం ఏముంటుంది?
ఎ. కృష్ణారావు
(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)
Updated Date - Aug 14 , 2024 | 03:40 AM