న్యాయ నిర్ణయాలలో ఆ స్వతంత్రత ఏదీ?
ABN, Publish Date - Oct 30 , 2024 | 05:24 AM
అయోధ్యలో బాబ్రీ మసీదు తాళాలు తెరిచి, రామ్ లల్లా విగ్రహాన్ని భక్తుల సందర్శనానికి వీలు కల్పించేలా 1986లో ఫైజాబాద్ జిల్లా మెజిస్ట్రేట్ కెఎం పాండే ఆదేశాలు జారీ చేశారు. ‘ఆ రోజు విచారణ జరుగుతున్నంత సేపు ఒక నల్లటి కోతి...
అయోధ్యలో బాబ్రీ మసీదు తాళాలు తెరిచి, రామ్ లల్లా విగ్రహాన్ని భక్తుల సందర్శనానికి వీలు కల్పించేలా 1986లో ఫైజాబాద్ జిల్లా మెజిస్ట్రేట్ కెఎం పాండే ఆదేశాలు జారీ చేశారు. ‘ఆ రోజు విచారణ జరుగుతున్నంత సేపు ఒక నల్లటి కోతి కోర్టు గది కప్పుపై కూర్చుని ఉండేది. తుది తీర్పు వినేందుకు వచ్చిన వేలాది ప్రజలు ఆ కోతికి పళ్లు, ఇతర ఆహార పదార్థాలు ఇచ్చినప్పటికీ అది ఏ మాత్రం వాటిని ముట్టుకునేది కాదు. చివరకు మసీదు తాళాలు తెరవాలని సాయంత్రం 4.40 గంటలకు తీర్పు ఇచ్చిన వెంటనే ఆ కోతి అక్కడి నుంచి మాయమైపోయింది. తీర్పు ఇచ్చిన తర్వాత నేను అక్కడి నుంచి బంగళాకు చేరుకునే సరికే ఆ కోతి ఆశ్చర్యకరంగా వరండాలో కనిపించింది. ఇది దైవిక శక్తి కాకపోతే మరేమిటి?’ అని పాండే తన ఆత్మకథ ‘వాయిస్ ఆఫ్ కాన్సియస్’ (అంతరాత్మ స్వరం)లో పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ కూడా అన్నీ దైవ సంకల్పితాలని నమ్మేవారిలో ఒకరు. అయోధ్యలో వివాదాస్పద భూమిని రామమందిర నిర్మాణానికి అప్పగించి, మసీదుకోసం వేరే స్థలం కేటాయించాలన్న సుప్రీంకోర్టు తుది తీర్పు కూడా దైవ ఘటనే అని ఆయన విశ్వసించారు! అయోధ్య సమస్యకు పరిష్కారం చూపాలని తాను ఇంట్లో దేవుడి విగ్రహం ముందు కూర్చుని ప్రార్థించానని జస్టిస్ చంద్రచూడ్ కొద్ది రోజుల క్రితం మహారాష్ట్రలో ఒక సమావేశంలో వెల్లడించారు. భారతదేశంలో విశ్వాసాల విషయంలో ఒక జిల్లా మెజిస్ట్రేట్‌కూ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికీ పెద్ద తేడా లేదని ఈ ఉదంతాలు నిరూపిస్తాయి.
ఎవరు అవునన్నా, కాదన్నా, రాజ్యాంగం, రూల్ ఆఫ్ లా, చట్టాలతో పాటు మన దేశంలో మనిషి భక్తి విశ్వాసాలు, నమ్మకాలు కూడా కీలకమైన పదవుల్లో ఉన్న వారి నిర్ణయాలను ప్రభావితం చేయకతప్పదు. చాలా అరుదైన వ్యక్తులు మాత్రమే తమ వ్యక్తిగత విశ్వాసాలను, నమ్మకాలను పక్కన పెట్టి తాము తీసుకున్న నిర్ణయాలు ఈ రాజ్యాంగం ప్రకారం, దేశ చట్టాల ప్రకారం సరైనవా కాదా అని మాత్రమే చూస్తారు. వచ్చే వారం పదవీవిరమణ చేయనున్న జస్టిస్ చంద్రచూడ్ రెండేళ్ల పనితీరును అంచనా వేయాలంటే ఆయన ఈ రెండేళ్లలో ఇచ్చిన తీర్పులు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఆయన వ్యవహరించిన తీరును పరిశీలించాల్సి ఉంటుంది. ‘ప్రజాస్వామ్య వ్యవస్థలో మాకు మా విధుల గురించి బాగా తెలుసు. రాజకీయ కార్యనిర్వాహక వర్గానికీ వారి విధుల గురించి తెలుసు. ఏ న్యాయమూర్తీ న్యాయవ్యవస్థ స్వతంత్రతకు ముప్పు రానివ్వరు.’ అని జస్టిస్ చంద్రచూడ్ ఇటీవల ముంబైలో లోక్‌సత్తా నిర్వహించిన సదస్సులో మాట్లాడుతూ అన్నారు. వినాయక చవితి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ తన నివాసానికి వచ్చి పూజలు చేసిన విషయం వివాదాస్పదం కావడం గురించి మాట్లాడుతూ ఆయన ఈ వివరణ ఇచ్చారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే జస్టిస్ చంద్రచూడ్ ఈ వ్యాఖ్య ద్వారా ప్రభుత్వం తరఫున కూడా వివరణ ఇచ్చారు. న్యాయమూర్తి తనకు తన విధుల గురించి తెలుసని చెప్పుకోగలరు కాని ఇతరులకు కూడా తమ విధుల గురించి తెలుసని ఎలా చెప్పగలరు?
రాజ్యాంగాన్ని సుప్రీంకోర్టు పరిరక్షిస్తుందని మన రాజ్యాంగవేత్తలు, న్యాయనిపుణులు భావిస్తారు. సుప్రీంకోర్టు తొలి దశకంలో (1950–60) కనియా, పతంజలి శాస్త్రి, మెహర్‌చంద్ మహాజన్, ముఖర్జీ, ఎస్ఆర్ దాస్ వంటి ప్రముఖుల నాయకత్వంలో రాజ్యాంగంలోని మూడు విభాగాల మధ్య ఖచ్చితమైన సమతుల్యం ఏర్పడేలా చూశారు. ఆ తర్వాతి దశకంలో (1960–70) నెహ్రూ మరణానంతరం ఏర్పడిన రాజకీయ అస్థిరత, ఆర్థిక అస్థిరత్వం అవినీతి పెచ్చరిల్లడం తదితర పరిస్థితుల్లో సుప్రీం తన భూమికను తాను నిర్వచించుకుంది. ఈ కొత్త మార్పుకు తెలుగువాడైన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కోకా సుబ్బారావు సారథ్యం వహించారు. గోలక్‌నాథ్ కేసు, ప్రీవీ పర్సు కేసు, బ్యాంకు జాతీయీకరణ కేసులపై చరిత్రాత్మక తీర్పులు ఇదే కాలంలో వచ్చాయి. రాజకీయ గుత్తాధిపత్యానికి ఈ తీర్పులు అడ్డుకట్ట వేసి ప్రాథమిక హక్కులకు పెద్దపీట వేశాయి. ఈ కేసులను చెల్లకుండా చేసేందుకు 1971 తర్వాత పార్లమెంట్ రాజ్యాంగ సవరణలు చేసింది. ఈ కాలంలో కూడా కోర్టులు ప్రభుత్వాన్ని ప్రతిఘటించాయి. కేశవానంద భారతి కేసులో ప్రాథమిక హక్కులతో పాటు రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చే అధికారం పార్లమెంట్‌కు లేదని స్పష్టం చేసింది. ఈ తీర్పు తర్వాత ఈ దేశంలో సర్వోన్నత న్యాయస్థానం అధికారాలను తగ్గించేందుకు ప్రయత్నాలు జరిగినప్పటికీ కోర్టు తట్టుకుని నిలబడింది.
ఎమర్జెన్సీ అనంతరం 1977లో జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 1978లో మనేకా గాంధీ కేసులో కోర్టు వ్యక్తిగత స్వేచ్ఛను హరించే హక్కు ప్రభుత్వానికి లేదని స్పష్టం చేసింది. మినర్వా మిల్, వామనరావు కేసుల్లోనూ రాజ్యాంగంలోని మౌలిక స్వరూపానికి కోర్టు రక్షణలు కల్పించింది. 1980 తర్వాత కోర్టులు పేదలు, నిస్సహాయులు, అణగారిన వర్గాల తరఫున నిలబడేందుకు, ఖైదీల ప్రయోజనాలు కాపాడేందుకు, రూల్ ఆఫ్ లాను కాపాడేందుకు ప్రాధాన్యతనిచ్చాయి. ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)కు ఇదే కాలంలో ప్రాచుర్యం లభించింది. భగవతి, కృష్ణయ్యర్, దేశాయి, చిన్నప్పరెడ్డి, జస్టిస్ థాకర్ లాంటి వారు ఒక టీమ్‌గా పనిచేసి సుప్రీంకోర్టు ఔన్నత్యాన్ని పెంచారు. 1990వ దశకంలో కూడా ఇందిరా సహానీ, ఎస్ఆర్ బొమ్మై, విశాఖ, సమతా, మోహినీ జైన్ తదితర కేసుల్లో కీలకమైన తీర్పులు వచ్చాయి. రిజర్వేషన్లు కల్పించడం, రాష్ట్రపతి పాలనను దుర్వినియోగం చేయడం, పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులు అరికట్టడం, ఆదివాసీ ప్రాంతాలను మైనింగ్ దోపిడీ నుంచి పరిరక్షించడం, చదువుకునే హక్కును జీవించే హక్కుగా మార్చడం మొదలైన అంశాలపై అనేక కీలక తీర్పులు వెలువడ్డాయి.
సంస్కరణల అనంతరం కోర్టు తీర్పుల స్వరూప, స్వభావాలు మారినప్పటికీ ప్రైవసీ, మానవ హక్కులు, భావ ప్రకటనా స్వేచ్ఛ వంటి అంశాలపై కీలకమైన తీర్పులు వెలువడ్డాయి. జస్టిస్ వెంకటాచలయ్య లాంటి ప్రధాన న్యాయమూర్తులు ప్రధానమంత్రులను సుప్రీంకోర్టుకు ఆమడ దూరంలో ఉంచారు. ఆయన తర్వాత జస్టిస్ జెఎస్ వర్మ, జస్టిస్ దీపక్ మిశ్రా వంటి వారు కీలకమైన తీర్పులను వెలువరించారు. మూక ఊచకోత లాంటి వాటిని తీవ్రంగా గర్హించడంతో పాటు స్త్రీలు, గే ల విషయంలో చెప్పుకోదగ్గ తీర్పులు ఇచ్చిన జస్టిస్ దీపక్ మిశ్రాను విలేఖరుల సమావేశంలో విమర్శించిన జస్టిస్ గొగోయ్ తర్వాతి కాలంలో వివాదాస్పదుడై పదవీ విరమణ అనంతరం రాజ్యసభ సభ్యత్వాన్ని పొందారు.
నిజానికి తెలుగువాడైన జస్టిస్ రమణ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదవీబాధ్యతలు చేపట్టే నాటికి ఆయనకు ముందున్న ముగ్గురు సిజెలు సుప్రీంకోర్టు ప్రమాణాలను తగ్గించారనే విమర్శలు ఉండేవి. ఆ ప్రమాణాలను నిలబెట్టడమే ఆయనకు తలకు మించిన పని అయింది. జస్టిస్ రమణ సుప్రీం న్యాయమూర్తిగా ఉన్న కాలంలోనే మహారాష్ట్రలో రాత్రికి రాత్రి ప్రభుత్వాన్ని పడగొట్టడాన్ని వ్యతిరేకించి తక్షణం సభలో విశ్వాస పరీక్షకు ఆదేశించడంతో ఉద్దవ్ థాకరే ప్రభుత్వం మళ్లీ కొనసాగగలిగింది. రమణ సిజె అయిన తర్వాత కూడా ఇచ్చిన తీర్పుల ప్రాముఖ్యత ఎంతో ఉన్నది. అనురాధా బాసిన్ కేసులో ఇంటర్నెట్‌ను ప్రాథమిక హక్కుగా పరిగణిస్తూ కశ్మీర్‌లో ఇంటర్నెట్ పునరుద్ధరించడం, లఖీంపూర్ ఖేరీ హత్యాకాండపై విచారణకు ఆదేశించడం, బెయిల్ వచ్చిన వెంటనే ఖైదీలు విడుదలయ్యేందుకు ఫాస్టర్ వ్యవస్థను ప్రవేశపెట్టడం, కేరళ జర్నలిస్టు సిద్దిఖీ కప్పన్‌కు తక్షణ వైద్య సహాయం అందేలా చూడడం, ట్రిబ్యునల్స్‌కు వెంటనే చైర్మన్లను నియమించాలనడం వీటిలో ఉన్నాయి.
జస్టిస్ రమణ తర్వాత సిజె అయిన ఉదయ్ ఉమేష్ లలిత్ ఎక్కువ కాలం ఉండలేదు. కాని జస్టిస్ చంద్రచూడ్‌కు ఎక్కువకాలం ఉండే అవకాశం వచ్చింది. ఆయన ప్రైవసీ హక్కు, ఢిల్లీలో అక్రమంగా కట్టిన సూపర్ టెక్ ట్విన్ టవర్స్‌ను కూలగొట్టడం, అబార్షన్ హక్కులను అవివాహితలకు కూడా కల్పించడం, అడల్ట్రీని నేరం కాదని చెప్పడం, సేమ్ సెక్స్ సంబంధాలను ఆమోదించండం వంటి చెప్పుకోదగ్గ తీర్పులు ఇచ్చారు. ముఖ్యంగా అంతర్జాతీయంగా తన పేరు చర్చకు వచ్చే కేసులపై ఆయన ప్రధానంగా దృష్టి సారించారు. కాని ఆయన హయాంలో ఎలెక్టోరల్ బాండ్ల విషయంలో కీలక తీర్పు వెలువడింది. అయితే జరిగిందేమిటి? ఎలెక్టొరల్ బాండ్లు అక్రమం అని సిజె ప్రకటించినప్పటికీ ఈ అక్రమానికి కారకులైన వారిపై చర్యలు ఎందుకు తీసుకోలేదు? చండీఘడ్ ఎన్నికల్లో బ్యాలెట్ పత్రాలను చెల్లకుండా చేసిన ఎన్నికల అధికారిని క్రిమినల్‌గా అభివర్ణించారు కాని ఆయనపై కూడా ఎలాంటి చర్యా లేదు. మహారాష్ట్రలో ఏర్పడ్డ షిండే, ఫడ్నవీస్, అజిత్ పవార్ ప్రభుత్వాన్ని అక్రమమని ప్రకటించారు కాని అదే ప్రభుత్వం కొనసాగడానికి వీలు కల్పించారు. మణిపూర్ హింసాకాండపై కానీ, సాయిబాబా బెయిల్ ఆగమేఘాలపై రద్దు చేయడంలో కానీ సిజెగా ఆయన కలుగచేసుకోలేదనే ఆరోపణలు ఉన్నాయి. జస్టిస్ రమణ హయాంలో బినామీ వ్యవహారాల నిషేధ చట్టం, 2016ను గతంలో ఎప్పుడో జరిగిన వ్యవహారాలకు అన్వయించడం సరి కాదని, చట్టం ఆమోదించిన నాటి నుంచీ అన్వయించాలని తీర్పు నిచ్చారు. కాని జస్టిస్ చంద్రచూడ్ ఈ తీర్పును రద్దు చేశారు. రాజకీయ ప్రత్యర్థులను వేధించేందుకే ఈ తీర్పును రద్దు చేయించారన్న ఆరోపణలు వస్తున్నాయి.
న్యాయమూర్తుల నియామకంలో ప్రభుత్వ నియంత్రణకు అనుమతించారన్న విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వ ప్రతి నిర్ణయాన్ని న్యాయవ్యవస్థ వ్యతిరేకించాలని ఎక్కడా లేదు. అయితే ప్రభుత్వమూ, న్యాయవ్యవస్థల మధ్య పరిధులు చెరిగిపోతున్నాయని, ప్రభుత్వ అభిప్రాయాలు, భావజాలానికి న్యాయవ్యవస్థ అనుగుణంగా నడుస్తోందని, సంపన్నులు, పలుకుబడి గల వారికే న్యాయం జరుగుతోందనే అభిప్రాయం ఏర్పడడం ప్రజాస్వామ్యానికి ఆరోగ్యకరం కాదు.
ఎ. కృష్ణారావు
(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)
Updated Date - Oct 30 , 2024 | 05:24 AM