ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

ఈ మార్పు ప్రజలు ఆశించిందేనా?

ABN, Publish Date - Jun 12 , 2024 | 03:10 AM

‘ఒక అమ్మాయి తన తల్లిదండ్రుల వద్ద ఉన్నంత కాలం స్వేచ్ఛగా, పెద్దగా బరువు బాధ్యతలు లేకుండా ఉంటుంది. అయితే వివాహం చేసుకుని మరో ఇంట్లో అడుగు పెట్టాక అక్కడి పరిస్థితులకు అనుగుణంగా ఉండవలసి వస్తుంది. అన్నింటినీ ఆకళింపు చేసుకుని...

‘ఒక అమ్మాయి తన తల్లిదండ్రుల వద్ద ఉన్నంత కాలం స్వేచ్ఛగా, పెద్దగా బరువు బాధ్యతలు లేకుండా ఉంటుంది. అయితే వివాహం చేసుకుని మరో ఇంట్లో అడుగు పెట్టాక అక్కడి పరిస్థితులకు అనుగుణంగా ఉండవలసి వస్తుంది. అన్నింటినీ ఆకళింపు చేసుకుని తన బాధ్యతలేమిటో అర్థం చేసుకోవల్సి ఉంటుంది. మన వెంకయ్యనాయుడు కూడా ఇప్పటి వరకూ పార్లమెంట్ సభ్యుడుగా, కేంద్రమంత్రిగా అనేక పదవులు నిర్వహించారు. ఉభయ సభల్లోనూ, ఇతర సమావేశాల్లోనూ అనర్గళంగా మాట్లాడారు. కాని ఇప్పుడు ఆయన ఉపరాష్ట్రపతి. అది ఒక రాజ్యాంగ హోదా. రాజ్యసభ చైర్మన్‌గా కూడా ఆయన బాధ్యతలు నిర్వహించాల్సి ఉంటుంది. కనుక ఆయన కూడా పుట్టింటి నుంచి మెట్టినింటికి వచ్చినట్లు కొత్త పరిస్థితులకు అనుగుణంగా మారవలసి ఉంటుంది. అది ఆయనకు తెలుసు’ అని 2017 ఆగస్టు మొదటి వారంలో ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన వెంకయ్యనాయుడును పార్టీ ఎంపీల సమావేశంలో అభినందిస్తూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నప్పుడు హాజరైనవారందరూ నవ్వుల వర్షం కురిపించారు. ‘మోదీ ఎంత సహజమైన ఉదాహరణనిచ్చారు!’ అని ఒకరిద్దరు వ్యాఖ్యానించారు.


2001 నుంచి 2014 వరకు గుజరాత్ ముఖ్యమంత్రిగా, 2014 నుంచి ఇప్పటి వరకూ ప్రధానమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న నరేంద్రమోదీ కూడా ఇప్పుడు ఒక కొత్త వాతావరణంలోకి అడుగుపెట్టారు. ఇప్పటి వరకూ ఆయన సారథ్యంలో బీజేపీ ఎన్నిసార్లు పోటీ చేసినా అన్నిసార్లు అత్యధిక మెజారిటీ సాధించింది. 13 సంవత్సరాలు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నా, 10 సంవత్సరాలు దేశ ప్రధానమంత్రిగా ఉన్నా ఎప్పుడూ ఇతర పార్టీల బలంపై ఆధారపడవలసిన అవసరం ఆయనకు రాలేదు. ఈ ఎన్నికల్లో ఎన్డీఏకు పూర్తి మెజారిటీ వచ్చినా, ఆయన స్వంత పార్టీ బీజేపీకి పూర్తి సంఖ్యాబలం రాలేదు. ఎన్నికలకు ముందే ఒక కూటమిగా ఏర్పడిన ఎన్డీఏకు సారథిగా కూడా మోదీయే ఉన్నందువల్ల ఆయన నాయకత్వానికి వచ్చిన ఢోకా ఏమీ లేదు కాని ఒక రకంగా గత 23 సంవత్సరాల ఆయన అనుభవంతో పోలిస్తే ఇప్పుడు ఆయన నిర్వహించేది కొత్త సంసారమే అని చెప్పక తప్పదు. ఎందుకంటే గతంలో మోదీ ఎప్పుడూ సంకీర్ణ ప్రభుత్వాన్ని నిర్వహించలేదు.

అయితే 1999–2004 మధ్య అటల్ బిహారీ వాజపేయి నేతృత్వంలో బీజేపీ ఏర్పర్చిన సంకీర్ణ ప్రభుత్వానికీ, ఇప్పుడు మోదీ నాయకత్వంలో ఏర్పాటు చేసిన సంకీర్ణ ప్రభుత్వానికీ కొన్ని పోలికలు ఉన్నాయి. నిజానికి అప్పుడు ఎన్డీఏ ఇప్పటి ఎన్డీఏ కంటే ఆరు సీట్లు ఎక్కువ సాధించింది. కాంగ్రెస్ ప్రధానుల తర్వాత అయిదేళ్లు పాలించిన తొలి కాంగ్రెసేతర ప్రధానిగా గుర్తింపు పొందిన వాజపేయి సారథ్యంలో నాడు ఎన్డీఏకు 299 సీట్లు రాగా ఇప్పుడు మోదీ సారథ్యంలోని ఎన్డీఏకు 293 సీట్లు లభించాయి. నాడు కూడా కాంగ్రెస్ కేవలం 112 సీట్లతో చాలా బలహీనంగా ఉండేది. 1999లో కాంగ్రెస్, దాని మిత్రపక్షాల సంఖ్యాబలం 134 మాత్రమే. ఇప్పుడు 232 సీట్లు సాధించిన ఇండియా కూటమి కంటే ఈ బలం ఎంతో తక్కువ. బీజేపీకి రెండుసార్లు మెజారిటీ సాధించి పెట్టి పదేళ్లు ప్రభుత్వాన్ని తిరుగులేకుండా నిర్వహించిన మోదీ ఇప్పటికే చరిత్రలో నిలిచిపోయారు. అయితే ఒక సంకీర్ణ ప్రభుత్వానికి సారథిగా అయిదేళ్లు పాలనను నిర్వహించిన పీవీ, వాజపేయి, పదేళ్ల పాటు యూపీఏ ప్రభుత్వాన్ని నిర్వహించిన మన్మోహన్ సింగ్ కూడా చరిత్రలో నిలిచిపోయిన నాయకులే. జాతీయ స్థాయిలో మెజారిటీ సంఖ్యాబలంతో ప్రభుత్వాన్ని పదేళ్లు నిర్వహించిన వ్యక్తే సంకీర్ణ ప్రభుత్వాన్ని నిర్వహించవలసి వచ్చిన ఉదంతాలు భారతదేశంలో లేవు. అయినప్పటికీ మోదీ ఈ బాధ్యతను అవలీలగా నిర్వహిస్తారన్న విషయంలో అనుమానాలు అక్కరలేదు. అందుకు అనేక కారణాలున్నాయి.


ఒకటి, ఎన్డీఏలో బీజేపీ ఇప్పుడు 240 సీట్లు సాధించిన బలమైన పక్షం. కేవలం 32 సీట్లు అదనంగా ఉంటే చాలు ఆయన మెజారిటీకీ ఢోకా ఉండదు. పైపెచ్చు వాజపేయి లాగా ఆయనకు ఎన్డీఏలో బలమైన మద్దతు ఉన్నది. అప్పుడు 29 సీట్లతో మెజారిటీ మిత్రపక్షంగా తెలుగుదేశం, ఆ తర్వాత 20 సీట్లతో జేడీ (యు), డీఎంకే వంటి ఇతర పార్టీలు మద్దతు నిచ్చినందువల్ల వాజపేయి అయిదేళ్లు తనదైన శైలిలో పాలనను నిర్వహించారు. ఇప్పుడు కూడా తెలుగుదేశం, జనతాదళ్ (యు)తో పాటు ఇతర పార్టీలు మోదీకి ఎన్నికల ముందే మద్దతు ప్రకటించి, బీజేపీతో పాటు మెజారిటీ సీట్లు గెలుచుకున్నాయి. అంతేకాక, ఇండియా కూటమికి 232 సీట్లు లభించినప్పటికీ అది పలు పార్టీల సముదాయం. అది ఏ కోశానా ఈ అయిదేళ్లలో మోదీ ప్రభుత్వానికి ఢోకా కల్పించే అవకాశాలు లేవు. ఒకసారి 145, రెండోసారి 206 సీట్లు సాధించిన కాంగ్రెసే పదేళ్లు పరిపాలన నిర్వహించగలిగినప్పుడు 240 సీట్లు సాధించిన మోదీ ఎందుకు సమర్థంగా పరిపాలన నిర్వహించలేరు?

అతి కష్టమ్మీద వంద సీట్లు సాధించిన కాంగ్రెస్ పార్టీ మరో 30, 40 సీట్లను అదనంగా సాధించి ఉంటే పరిస్థితులు వేరుగా ఉండేవి. కాని ప్రజలు భిన్నంగా తీర్పునిచ్చారు. ప్రతిపక్షాలను బలంగా ఏకం చేయగలిగిన జయప్రకాశ్ నారాయణ్, సూర్జిత్ వంటి నేతలు లేనందువల్ల అది కలిసికట్టుగా పోటీ చేయలేకపోయింది. నాయకత్వ లోపం స్పష్టంగా కనిపించినప్పటికీ కాంగ్రెస్, ఇతర పక్షాలు సామాజిక సమీకరణలు తమకు అనుకూలంగా మారేందుకు గట్టిగానే కృషి చేశాయని చెప్పవచ్చు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలిచిన వందకు పైగా ఎంపీల్లో 37 మంది ఎస్‌సీ, ఎస్టీ వర్గాలకు చెందినవారు కావడం గమనార్హం. వీరిలో అత్యధికులు 50 శాతం పైగా ఓట్లను సాధించారు. ఆశ్చర్యకరమేమంటే 5 జనరల్ సీట్లలో ఈ వర్గాలు గెలిచాయి. క్రమంగా కాంగ్రెస్ తన మూలాల్లోకి ప్రవేశిస్తున్నదనడానికి ఇది ఉదాహరణ. ఇక గత లోక్‌సభ ఎన్నికల్లో కేవలం అయిదు సీట్లు సాధించిన సమాజ్‌వాదీ పార్టీ ఈ సారి 37 సీట్లు సాధించడానికి ప్రధాన కారణం పెద్ద సంఖ్యలో దళితులు కూడా బీఎస్‌పీని వదిలి ఎస్‌పీ వైపు మొగ్గుచూపడం. యూపీలో ఇండియా కూటమికి యాదవ, ముస్లిం ఓట్లు సంఘటితం కావడం మాత్రమే కాక దళితులు కూడా అధిక సంఖ్యలో మద్దతునీయడం బీజేపీ విస్మరించదగిన పరిణామం కాదు. బీజేపీ గతంలో 224 సీట్లలో 50 శాతం పైగా ఓట్లను సాధిస్తే ఈ సారి కేవలం 156 సీట్లలోనే 50 శాతం పైగా ఓట్లు సాధించడం కూడా పరిగణనలోకి తీసుకోవాల్సిన విషయమే. బిహార్‌లో నితీశ్, చిరాగ్ పశ్వాన్, జితన్ రాంమాంఝీ వంటి సామాజిక శక్తులు లేకపోతే ఇవాళ ఆ రాష్ట్రంలో ఎన్డీఏ మెజారిటీ సీట్లు సాధించగలిగేది కాదనేది స్పష్టం. బహుశా ఈ విషయం గమనించినందువల్లే మోదీ యూపీ, బిహార్‌కు కేంద్ర కేబినెట్‌లో అత్యధిక మంత్రి పదవులు కల్పించి ఉండవచ్చు.


అయితే కాంగ్రెస్ విజయంతో ఆ పార్టీ నేతలు ఉబ్బితబ్బిబ్బు కానక్కర్లేదు. 2019లో కంటే అది కేవలం రెండున్నరశాతం ఓట్లను అధికంగా సాధిస్తే, బీజేపీ ఒక శాతం కంటే తక్కువ ఓట్లను కోల్పోయింది. సామాజిక న్యాయ ఎజెండాతో ఎన్నికల్లో ప్రవేశించిన ఇండియా కూటమి ఈ ఎజెండాను అన్ని చోట్లా ప్రజల్లోకి తీసుకువెళ్లలేకపోయినందువల్ల అనుకున్న ఫలితాలను సాధించలేకపోయింది. తెలంగాణలాంటి చోట్ల బీజేపీ ఉధృతిని అరికట్టలేకపోయింది. దాదాపు 40 శాతం మేరకు దళితులు, ఆదివాసీలు ఉన్న ఒడిషాలో బిజూజనతాదళ్‌కు ప్రత్యామ్నాయంగా బీజేపీని ఆదరిస్తున్న విషయం తెలిసినప్పటికీ కాంగ్రెస్ ప్రేక్షక పాత్ర పోషించింది. 35 శాతం దళితులు, ఆదివాసీలు ఉన్న మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోతున్నా, ఆపగలిగే నేతలు ఆ పార్టీలో లేరు. ఛింద్వారా వంటి కాంగ్రెస్ కంచుకోటలో కూడా బీజేపీ విజయం సాధించింది.


సామాజిక పరిస్థితులు పూర్తిగా పరిపక్వం కాకుండా సమాజంలో ఏ మార్పూ సంభవం కాదని. మార్పుకు దోహదం చేసే శక్తులు ఇంకా బలహీనంగా ఉన్నాయని ఈ ఎన్నికలు నిరూపించాయి. అందువల్లే బహుశా భారత ప్రజలు మోదీని పూర్తిగా తిరస్కరించాలని అనుకోలేదని రుజువయింది. మోదీ ఆకర్షణ, ఆయన భావజాలం, ఆయన హావభావాలు, విన్యాసాలు ఆయన పట్ల ప్రజల్లో పూర్తిగా వికర్షణ కల్పించలేకపోయాయి. అయితే ఈ ఎన్నికల ఫలితాలు ఆయనకు కూడా ఒక సందేశాన్ని ఇచ్చాయనడంలో అతిశయోక్తి లేదు. ఈ ప్రజాస్వామిక పోరు పూర్తిగా మోదీ పేరుపైనే జరిగినందువల్ల ఎన్నికల ఫలితాలు కూడా ప్రజలు మోదీని దృష్టిలో ఉంచుకున్నవే అని చెప్పక తప్పదు. ఆ విషయం గ్రహించినందువల్లే మోదీ ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచీ పూర్తిగా మారిపోయినట్లు వ్యవహరిస్తున్నారు. బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం ఏర్పాటు చేయడానికి బదులు నేరుగా ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశం ఏర్పాటు చేశారు. ప్రధానమంత్రి తన నివాసంలోనూ, సెంట్రల్ హాలులోను చంద్రబాబు పక్కన కూర్చుని చెణుకులు విసురుతూ, నవ్వుతూ వ్యవహరించిన తీరు, మిత్రపక్షాల పట్ల ప్రదర్శించిన స్నేహశీలత విస్మరించదగిన దృశ్యాలు కావు. ఎన్డీయే భారతీయ ఆత్మ అని ప్రకటించిన మోదీ, జాతీయ ప్రయోజనాలతో ప్రాంతీయ ఆకాంక్షలు ముఖ్యమని చెప్పిన చంద్రబాబు అభివృద్ధి ఎజెండాలు పరస్పరం భిన్నమైనవి కావు. వారిద్దరి ఎజెండా ప్రపంచంలో అనేక అభివృద్ధి చెందిన దేశాలు అనుసరిస్తున్న ఎజెండాకు భిన్నంగా ఏమీ లేదు. అందుకు ప్రత్యామ్నాయ ఎజెండా ఎక్కడా విజయవంతమైన దాఖలాలు లేవు. ప్రజల తీర్పుకు అనుగుణంగా వ్యవహరించడం మంచిదని గ్రహించినందువల్లనేమో ఎన్డీఏ నేతల మధ్య సఖ్యత చాలా సహజంగా కనిపిస్తోంది.

ఎ. కృష్ణారావు

(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)

Updated Date - Jun 12 , 2024 | 03:10 AM

Advertising
Advertising