‘మహా’ ఫలితాల మతలబు ఏమిటి?
ABN, Publish Date - Nov 27 , 2024 | 04:14 AM
ప్రజల సమస్యలు, సానుభూతి పవనాలు, తీవ్రమైన ప్రభుత్వ వ్యతిరేకత, భావోద్వేగపరమైన అంశాలు ఆధారంగా ఎన్నికల్లో విజయం సాధించడం భారతదేశంలో సర్వసాధారణం. 1998లో ఢిల్లీలో ఉల్లిగడ్డల....
ప్రజల సమస్యలు, సానుభూతి పవనాలు, తీవ్రమైన ప్రభుత్వ వ్యతిరేకత, భావోద్వేగపరమైన అంశాలు ఆధారంగా ఎన్నికల్లో విజయం సాధించడం భారతదేశంలో సర్వసాధారణం. 1998లో ఢిల్లీలో ఉల్లిగడ్డల ధరలు విపరీతంగా పెరిగినందుకు బీజేపీ ప్రభుత్వం పరాజయం పాలయింది. ‘పేదలు ఉల్లిగడ్డలు ఎప్పుడూ తినరు.. కేవలం పై వర్గాలే ఉల్లిగడ్డలు తింటాయి’ అని వ్యాఖ్యానించి ప్రజల ఆగ్రహాన్ని ఎదుర్కొన్నందుకు బీజేపీ అధిష్ఠానం సాహెబ్‌సింగ్ వర్మతో రాజీనామా చేయించి సుష్మా స్వరాజ్‌ను ముఖ్యమంత్రిగా నియమించింది. తొలి కేబినెట్ సమావేశంలోనే ఉల్లిగడ్డల ధరలను తగ్గించేందుకు సుష్మా స్వరాజ్ నిర్ణయం తీసుకున్నారు. కాని అప్పటికే బీజేపీ సర్కార్ పట్ల ప్రజా వ్యతిరేకత ప్రబలడంతో ఓటమిపాలై షీలా దీక్షిత్ నేతృత్వంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. 2013లో షీలాదీక్షిత్ సర్కార్ ఓడిపోవడానికి కూడా ఉల్లిగడ్డల ధరల పెరుగుదల ఒక కారణమవడం విశేషం.
అధిక ధరలు, నిరుద్యోగం, రైతాంగ సమస్యలు, గిట్టుబాటు ధరలు లేకపోవడం, కుంభకోణాలు, అత్యాచారాలు విద్యుత్ ఛార్జీల పెరుగుదల వంటివి అనేక సందర్భాల్లో దేశంలో ఎన్నికల ఫలితాలను నిర్ణయించిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు అలాంటి వాటి వల్ల ప్రభుత్వాలు ఓడిపోయాయని ఎవరైనా చెప్పగలరా? దేశంలో అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్ పట్ల వ్యతిరేకత వల్ల ప్రాంతీయ పార్టీలు అధికారంలోకి వచ్చాయి. తెలుగుదేశం, బిజూ జనతాదళ్ లాంటి పార్టీలు అలా అధికారంలోకి వచ్చినవే. జాతీయ స్థాయిలో ఎమర్జెన్సీ, ఇందిరాగాంధీ మరణం కూడా ఎన్నికల ఫలితాలను నిర్దేశించాయి. యూపీఏ హయాంలో కుంభకోణాలు, అవినీతి వల్ల 2014లో నరేంద్రమోదీ ఆధ్వర్యంలో బీజేపీ ప్రభంజనం వీచిందనడంలో సందేహం లేదు. మతపరమైన భావోద్వేగాలను బీజేపీ ఎన్నికలకు ఉపయోగించుకోవడం కూడా ఎవరూ కాదనలేని విషయం. కర్ణాటకలో యడ్యూరప్ప హయాంలో అవినీతి, అక్రమాలు, తెలంగాణలో కేసీఆర్ పదేళ్ల పాలన, వ్యవహారశైలి పట్ల వ్యతిరేకత, ఆంధ్రప్రదేశ్‌లో జగన్ అరాచక పాలన కూడా ఎన్నికల ఫలితాలను నిర్దేశించిన విషయం అందరికీ తెలుసు.
స్థూలంగా చూస్తే రాజకీయ పార్టీల తలరాతలు ప్రజా వ్యతిరేక, ప్రజా అనుకూల తరంగాల ఆధారంగా నిర్ధారితమవుతాయి. కొన్నిసార్లు అంతర్గతంగా ప్రజా వ్యతిరేకత చాప క్రింద నీరులాగా ప్రవేశిస్తుంది. కాని ఇది కూడా కనిపెట్టలేనిది కాదు. స్థానికంగా పర్యటించినప్పుడు, ప్రజలతో మాట్లాడినప్పుడు అర్థం అవుతుంది. ‘నేను మా ఊళ్లో అడుగుపెట్టినప్పుడు నన్నెప్పుడూ బిడ్డా అని పలకరించే ఒక వృద్ధురాలు ఈ సారి నన్ను చూడగానే ముఖం తిప్పుకుంది. ఆమె నాకు ఏమీ చెప్పలేదు కాని నాకు ఓడిపోతానన్న విషయం మాత్రం అర్థమైంది’ అని దివంగత కాంగ్రెస్ నేత జైపాల్‌రెడ్డి ఒకసారి మాటల సందర్భంలో చెప్పారు. అందువల్ల నేతలు తమ గెలుపోటముల గురించి లీలగానైనా అంచనా వేయగలరనడంలో అతిశయోక్తి లేదు. ఇటీవల జరిగిన సార్వత్రక ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం వీస్తుందని కొన్ని సంస్థలు తేల్చినా అది 240 సీట్లకే పరిమితమవుతుందని అంచనా వేసిన వారు కూడా లేకపోలేదు. ప్రజలకు ఒక పార్టీ పట్ల మోజు తగ్గినా, ప్రతిపక్ష పార్టీ పట్ల కూడా సానుకూలత లేనప్పుడు సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడతాయని 2024లోనే కాదు, అంతకు ముందు కూడా రుజువైంది. ప్రభంజనం ఉన్నదా లేదా, పైకి కనపడని ప్రజా వ్యతిరేకత ఉన్నదా లాంటి అంశాలు ఎన్నికల ప్రచార సమయంలోనూ, పోలింగ్ రోజు, పోలింగ్ శాతంలోనూ కూడా వ్యక్తమవుతాయి. అదే సమయంలో పూర్తి ఎన్నికల నిర్వహణ, పోలింగ్ బూత్‌ల స్థాయి వ్యూహరచన, ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులను తమ వైపునకు తిప్పుకోవడం, భారీ ఎత్తున డబ్బులు పంచిపెట్టడం వల్ల ఎన్నికల ఫలితాలు తారుమారు అవుతాయని చెప్పడానికి వీల్లేదు. అలా చేయగలిగిన శక్తి ఉన్నప్పటికీ అధికార పార్టీలు పరాజయం చెందిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.
నృత్యం చేయలేని నర్తకి నాట్యవేదికను నిందించినట్లు సాధారణంగా ఓడిపోయిన పార్టీలు ఈవీఎంలను మేనేజ్ చేశారనో, రిగ్గింగ్ జరిగిందనో నిందలు వేస్తాయి. అయితే కొన్ని ఫలితాలు అనూహ్యంగా వచ్చినప్పుడు అందుకు కారణాల గురించి లోతుగా చర్చించడం అనావశ్యకం మాత్రం కాదు. హరియాణా, మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు ఇలాంటి చర్చలకే దారి తీస్తున్నాయి. ఢిల్లీలో ఉల్లిగడ్డల ధరలు ఒకప్పుడు ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసినట్లు హరియాణా, మహారాష్ట్ర ఎన్నికలకు సంబంధించి ప్రభావితం చేయగలిగిన సమస్యలు ఎన్నో ఉన్నాయి. పదేళ్ల ప్రజా వ్యతిరేకత, భారీ ఎత్తున నిరుద్యోగం, కనీస మద్దతు ధర వంటి రైతాంగ సమస్యలు, పట్టణ ఓటర్ల అసంతృప్తి, మహిళా మల్లయోధుల నిరసనలు, పూర్తి చేయని ఎన్నో హామీల వల్ల పదేళ్ల తర్వాత హరియాణాలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రానున్నదని, ఇండియా టుడేతో పాటు పలు పత్రికలు, సర్వే సంస్థలు కూడా అంచనా వేశాయి. కాని ఫలితాలు అందుకు భిన్నంగా వచ్చాయి. ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా హరియాణా ఎన్నికల ఫలితాలు వచ్చాయని కాంగ్రెస్ తీవ్రంగా ఆరోపించింది. కాని ఈ ఆరోపణలపై అంతగా చర్చ జరగలేదు. ఇవి మచ్చలేని ఎన్నికలు అని ఎన్నికల కమిషన్ అభివర్ణించింది.
తాజాగా మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు అనేక మందిని మరింత ఆశ్చర్యపరిచాయి. మహారాష్ట్రలో బీజేపీ, దాని మిత్రపక్షాలు ఇంత భారీ ఎత్తున విజయం సాధిస్తాయని ఎవరూ ఊహించలేదు. ముఖాముఖి ఎన్నికల్లో బీజేపీని కాంగ్రెస్ గట్టిగా ఢీకొనలేకపోతోందని హరియాణా ఎన్నికల తర్వాత విమర్శలు వచ్చినప్పటికీ 1962 తర్వాత మొదటిసారి కనీవినీ ఎరగని రీతిలో ఘోరపరాజయం చెందుతుందని, 101 సీట్లకు పోటీ చేసి కేవలం 15 సీట్లు మాత్రమే దక్కించుకుంటుందని ఎవరూ అంచనా వేయలేదు. అయిదునెలల క్రితం జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో 48 సీట్లకు గాను 13 సీట్లు దక్కించుకుని ఏకైక పెద్ద పార్టీగా అవతరించిన కాంగ్రెస్ ఇంత ఘోరంగా ఓడిపోతుందని ఎవరు ఊహించగలరు? ఇదే షాక్‌కు శివసేన వ్యవస్థాపకుడు బాల్‌ఠాక్రే కుమారుడు ఉద్దవ్‌ఠాక్రే శివసేన కూడా గురయ్యారు. పోటీ చేసిన 95 సీట్లలో 20 సీట్లు మాత్రమే దక్కుతాయని, తన పార్టీని చీల్చిన ఏక్‌నాథ్ శిందే వర్గం చేతుల్లోనే 36 సీట్లలో ఓడిపోతామని ఆయన కలలో కూడా ఊహించి ఉండరు. ఇక శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్‌సీపీ పరిస్థితి దయనీయంగా మారింది. తన గురువు వసంత దాదా పాటిల్‌పై తిరుగుబాటు చేసి 38 సంవత్సరాల వయస్సులో ముఖ్యమంత్రి అయిన శరద్ పవార్ రాజీవ్ మరణానంతరం ప్రధానమంత్రి పదవి ఆశించి భంగపడ్డారు. దాదాపు నాలుగు దశాబ్దాలుగా మహారాష్ట్ర రాజకీయాలను శాసించిన పవార్ ఎంవీఏ కూటమి నేర్పాటు చేసి బీజేపీ పన్నిన అన్ని ఎత్తుగడలనూ భగ్నం చేశారు. అలాంటి పవార్ 83 ఏళ్ల వయస్సులో చివరకు మోదీ, అమిత్ షా వ్యూహరచనకు చిత్తు అయిపోయారు. లోక్‌సభలో 10 సీట్లకు 8 సీట్లు గెలుచుకున్న పవార్ పార్టీ ఇప్పుడు 86 సీట్లకు పోటీ చేసి కేవలం 10 సీట్లు గెలుచుకుంది. ఆయన ఆధిపత్యం అత్యంత బలంగా ఉన్న చక్కెర బెల్టులో కూడా అత్యధిక సీట్లు కోల్పోయారు. ఇప్పుడు ఆయన పార్టీ దేశంలో అనేక అంతరించిన పార్టీల జాబితాలో చేరే ప్రమాదాన్ని ఎదుర్కొంటోంది.
విచిత్రమేమంటే అయిదు సంస్థలు కాంగ్రెస్ కూటమి అధికారంలోకి వస్తుందని అంచనా వేస్తే బీజేపీ నేతృత్వంలోని మహాయుతి అధికారంలోకి వచ్చినా 160 సీట్లు దాటకపోవచ్చునని మరో అయిదు సంస్థలు అంచనాలు వేశాయి. బీజేపీ కూటమి 180 సీట్లు గెలుచుకుంటుందని అంచనా వేసిన ఒకే ఒక ఎగ్జిట్‌పోల్ ఏజెన్సీ చేసిన అంచనాలను కూడా అధిగమించి బీజేపీ కూటమి 230 సీట్లు సాధించింది. ఎమ్మెల్యేలను తరలించేందుకు అధికార కూటమి అనేక ఛార్టర్డ్ విమానాలను సిద్ధం చేసినట్లు, మరోవైపు ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ శిందే, కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు నానా పటోలే పరస్పరం సంప్రదించుకున్నట్లు, విమానాశ్రయం వద్ద ఒక ఫైవ్‌స్టార్ హోటల్‌ను బుక్ చేసినట్లు కూడా వార్తలు రావడంతో ఏ పార్టీ కూడా ఈ స్థాయిలో మహాయుతి గెలుపును ఊహించలేదని అర్థమవుతోంది. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ, షిండే శివసేన, అజిత్ పవార్ ఎన్‌సీపీని తిరస్కరించిన ప్రజలు కేవలం అయిదు నెలల్లోనే ఎలా మారిపోయారు? సార్వత్రక ఎన్నికల్లో పనిచేయని మోదీ ప్రచారం ఇప్పుడు పనిచేసేంత అద్భుత మార్పు ఏమి వచ్చింది?
‘నాకు చాలా తికమకగా ఉన్నది. ఈ అయిదు నెలల్లో ఏం మార్పు వచ్చిందో అర్థం కావడం లేదు. లడ్కీ బహిన్ యోజనా పథకం ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసిందంటే నేను నమ్మలేను. ఇలాంటి పథకాలు గతంలో ఎన్నడూ ఎన్నికల ఫలితాలను మార్చిన సందర్భాలు లేవు. మార్కెట్లు మాత్రం సంతోషంగా ఉన్నాయి’ అని ప్రముఖ రాజకీయ ఆర్థిక విశ్లేషకుడు స్వామినాథన్ అంకిలేశ్వర్ అయ్యర్ అన్నారు. రైతుల ఆత్మహత్యలు, సోయాబీన్ ధరలు పడిపోవడం, నిరుద్యోగం, ఓబీసీల నిరసన వంటి అనేక సమస్యలు మాత్రం ఎందుకు ప్రభావం చూపలేదో అని అయోమయం ప్రకటిస్తున్నవారు కూడా ఉన్నారు. భారతదేశంలో ప్రజాస్వామ్యం పట్ల ఆందోళన ప్రకటిస్తున్నవారు ఎన్నికల ఫలితాల గురించి శాస్త్రీయంగా అధ్యయనం చేసి ప్రజాచైతన్యం కల్పించాల్సిన అవసరం ఉన్నది.
ఎ. కృష్ణారావు
(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)
Updated Date - Nov 27 , 2024 | 04:14 AM