ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కాంగ్రెస్‌కు జనబలం ఎప్పుడు లభించేను?

ABN, Publish Date - Dec 04 , 2024 | 01:54 AM

ఎన్ని గట్టి ప్రయత్నాలు చేసినా, ఎంత విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లినా భారతీయ జనతా పార్టీ విస్తృతి, ఉధృతిని ఎందుకు అడ్డుకోలేకపోతున్నాం? గెలిచిన రాష్ట్రాల్లోనే బీజేపీ మరీ మరీ ఎందుకు గెలుస్తోంది? గతంలో కంటే ఎక్కువ ఓట్లు....

ఎన్ని గట్టి ప్రయత్నాలు చేసినా, ఎంత విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లినా భారతీయ జనతా పార్టీ విస్తృతి, ఉధృతిని ఎందుకు అడ్డుకోలేకపోతున్నాం? గెలిచిన రాష్ట్రాల్లోనే బీజేపీ మరీ మరీ ఎందుకు గెలుస్తోంది? గతంలో కంటే ఎక్కువ ఓట్లు ఎలా సాధిస్తోంది? అసలు ఎక్కడ పొరపాటు జరుగుతోంది? సమీప భవిష్యత్తులో కాంగ్రెస్ అధికారం చేజిక్కించుకోగలదా? అన్న ప్రశ్నలు గత వారం జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశానికి హాజరైన ప్రతి ఒక్కరి మనసుల్లో మెదిలాయి. ఎవరి ముఖాల్లోనూ చిరునవ్వు ఏ కోశానా కనపడలేదు. వారు సాధారణ నేతలు కాదు. ఎన్నో యుద్ధాల్లో ఆరితేరినవారు. ఎంతో అనుభవం ఉన్నవారు. అయినా ఎంతగా తలలు బాదుకున్నా తమ వరుస ఓటములకు కారణాలేమిటో వారు నిర్దిష్టంగా చెప్పలేకపోయారు. నాలుగున్నర గంటల పాటు జరిగిన చర్చలో ఎంతసేపూ బీజేపీ మతపరమైన ఎజెండాను, మోదీ ఉపన్యాసాలను, ఈవీఎంలను నిందించినవారే ఎక్కువగా ఉన్నారు. కేవలం ఈవీఎంల వల్లే మనం ఓడిపోయామా? వేరే కారణాలు లేవా? అన్న ప్రశ్నలపై వర్కింగ్ కమిటీ సమావేశంలో పెద్దగా చర్చించినట్లు లేదు. చివరకు మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలపై మరో కమిటీని వేయాలని నిర్ణయించి చేతులు దులుపుకున్నారు. గతంలో రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌, హరియాణా ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు కూడా కాంగ్రెస్‌ పార్టీ ఇలాంటి అంతర్గత కమిటీలను నియమించింది. ఆ కమిటీలు ఏమి చెప్పాయో, వాటి ఆధారంగా ఏ నిర్ణయాలు తీసుకున్నారో ఎవరికీ తెలియదు. అయినా కమిటీల వల్ల ఏమి జరుగుతుంది?


తెలుగుదేశం అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇటీవల హిందూస్తాన్ టైమ్స్ లీడర్‌షిప్‌ సమ్మిట్‌లో బీజేపీ విజయ రహస్యం గురించి వెల్లడించారు : ‘ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎప్పుడూ ఎన్నికలకు తయారీగా ఉంటారు. రాబోయే సార్వత్రక ఎన్నికలకు కూడా ఆయన ఇప్పటికే సన్నాహాలు మొదలు పెట్టారు’ అని చంద్రబాబు నవ్వుతూ అన్నారు. మహారాష్ట్రలో బీజేపీ ఘన విజయం సాధించిన రోజే నరేంద్రమోదీ బీజేపీ పార్టీ కార్యాలయానికి వచ్చి వేలాది కార్యకర్తలనుద్దేశించి ప్రసంగించారు. మోదీ, మోదీ అన్న నినాదాలు మిన్నంటుతుండగా ‘హమ్ ఏక్ హై తో సేఫ్ హై’ (మనం ఒకటిగా ఉంటే సురక్షితంగా ఉంటాం) అని మోదీ మరోసారి ప్రకటించారు. మహారాష్ట్ర ప్రయోగాన్ని దేశమంతటా అమలు చేసేందుకు బీజేపీ ఇప్పటి నుంచే సిద్ధమవుతోంది. ‘మనం కనీసం ఒక ఏడాది ముందైనా ఎన్నికలకు సంసిద్ధం కావాలని అర్థం అవుతోంది’ అని ఖర్గే వర్కింగ్ కమిటీ సమావేశంలో అన్నారు. మోదీ ఒక ఎన్నికల ఫలితాలు రాకముందే మరో ఎన్నికలకు సిద్ధమయి ఉంటారని కాంగ్రెస్ నేతలు ఇంకా గ్రహించలేదన్న విషయం స్పష్టమవుతోంది.


భారతీయ జనతా పార్టీ ఎజెండా, ప్రణాళికకు సంబంధించి ఎవరికీ పెద్ద అనుమానాల్లేవు. మతపరమైన భావోద్వేగాలు, దేశ భక్తిని రంగరిస్తూనే క్రింది స్థాయి నుంచి పార్టీని నిర్మించి ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు సమాయత్తమవుతూనే ఉంటుంది. ప్రత్యర్థి పార్టీలను బలహీనపరిచేందుకు వ్యూహాలను నిరంతరం అమలు చేస్తూనే ఉంటుంది. పార్టీకి చెందిన వివిధ అనుబంధ సంస్థలు, సంఘ్ పరివార్ సంస్థలు ఎప్పుడూ సమావేశాలను, సదస్సులను నిర్వహిస్తూ ప్రజలను తమకు అనుకూలంగా తిప్పుకునేందుకు ప్రయత్నిస్తూనే ఉంటాయి. అధికారంలో లేని రాష్ట్రాల్లో కూడా బీజేపీ, సంఘ్ పరివార్ సంస్థలు విస్తృతంగా పనిచేస్తుంటాయి. పోలింగ్‌ బూత్‌ స్థాయి నుంచి సూక్ష్మ వ్యూహాలు సిద్ధం చేస్తాయి. వీటన్నిటికి తోడు దేశంలో కనీవినీ ఎరుగని స్థాయిలో అభివృద్ధి జరుగుతోందని, ప్రపంచ దేశాల్లో భారత్‌ అగ్రరాజ్యంగా మారడం ఖాయమని వివిధ స్థాయిల్లో ఢంకా బజాయిస్తూనే ఉంటారు. వికసిత్ భారత్, స్వచ్ఛ భారత్ వంటి నినాదాలు మారుమ్రోగుతూనే ఉంటాయి. సరే, ఆ పార్టీకి నిధుల కొరత ఏ మాత్రం ఉండదు కదా.

గెలిచిన రాష్ట్రాల్లో మళ్లీ గెలిచేందుకు, ప్రతిపక్షంగా మారిన రాష్ట్రంలో మళ్లీ అధికారం చేజిక్కించుకునేందుకు బీజేపీ కసిగా పనిచేస్తుంది. ఓడినా, గెలిచినా తమ ఓటు శాతం తగ్గకుండా చూసుకుంటుంది. అదే కాంగ్రెస్ వరుసగా ఓడిపోయిన సందర్భాలు ఉన్నాయి కాని వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చిన సందర్భాలు ఇటీవలి కాలంలో లేవు. 2014లో కాంగ్రెస్ హరియాణలో గెలిచినప్పటికీ 2019 నుంచి ఓడిపోతూనే వస్తోంది. పంజాబ్‌లో అయిదేళ్లు పాలించి ఆప్‌కు అధికారాన్ని అప్పగించింది. అదే బీజేపీ గుజరాత్, హరియాణాలో వరుసగా మూడుసార్లు గెలిస్తే, అస్సాం, త్రిపుర, గోవా, మణిపూర్, యూపీ, ఉత్తరాఖండ్, మేఘాలయ, నాగాలాండ్, సిక్కింలలో వరుసగా రెండుసార్లు గెలిచింది. అంటే కనీసం డజన్ రాష్ట్రాల్లో బీజేపీ మిత్రపక్షాలు ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమిస్తున్నాయన్నమాట. కాంగ్రెస్‌తో పోలిస్తే తృణమూల్ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, జేఎంఎం వంటి ప్రాంతీయ పార్టీలు వరుస విజయాలు సాధించాయి. తెలుగుదేశం ఒకసారి ఓడినా మరోసారి వీరోచితంగా పోరాడి అధికారంలోకి రాగలిగింది. కాంగ్రెస్‌లో ఆ కసి ఎందుకు కనపడడం లేదు?


అసలు దేశ అభివృద్ధి నమూనా విషయంలో కాంగ్రెస్ విధానాలకూ, బీజేపీ విధానాలకూ తేడా ఏమైనా ఉన్నదా? ‘అదానీ, కులగణన, రాజ్యాంగాన్ని కాలరాయడం ప్రజా సమస్యలు కావా? వాటికి అనుకూలంగా ప్రజలు ఎందుకు స్పందించడం లేదు?’ అని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వర్కింగ్ కమిటీ సమావేశంలో ప్రశ్నించినట్లు తెలిసింది. అదానీని విమర్శించినంత మాత్రాన కాంగ్రెస్ కార్పొరేటీకరణను వ్యతిరేకిస్తుందని ఎవరైనా అనుకుంటారా? అదానీపై మిత్రపక్షాలలో కూడా ఏకాభిప్రాయం లేదు. కులగణన గురించి ప్రస్తావించినంత మాత్రాన సామాజిక న్యాయం కోసమే కాంగ్రెస్ జన్మించిందని జనం అనుకునే అవకాశాలున్నాయా? ఏ విషయంలో కాంగ్రెస్ తాను బీజేపీ కంటే భిన్నమైన సైద్ధాంతిక సంస్థ అని నిరూపించుకోగలదు? కాంగ్రెస్ పార్టీ రకరకాల సిద్ధాంతాలు ఉన్న పంచకూళ కషాయంలా ఉంటుంది. బీజేపీ దశాబ్దాలుగా ఒకే సిద్ధాంతం ఆధారంగా పనిచేస్తే కాంగ్రెస్ ఒక నిర్దిష్ట సిద్ధాంతాన్ని దీర్ఘకాలం కొనసాగించలేకపోతోంది. మహావికాస్ అగాధీకి మహారాష్ట్రలో కేవలం ముస్లిం ఓట్లే అధికంగా వచ్చాయని, మహాయుతికి ఓబీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, ఇతర అణగారిన వర్గాల ఓట్లు పెరిగాయని గణాంక వివరాలు చెబుతున్నాయి. మహిళలు, యువకులు మహాయుతివైపు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. అలా ఎందుకు జరిగింది?

2024 ఎన్నికలకు రెండేళ్ల ముందు పార్టీ ముందున్న సవాళ్లను నిర్ణయించి వాటిని అధిగమించేందుకు కురువృద్ధులైన నేతలతో సోనియా ఒక సాధికార బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ బృందం ఏమి చెప్పిందో, చెప్పిన వాటిని అమలు చేశారో, లేదో తెలియదు కాని ఇటీవలి సార్వత్రక ఎన్నికల్లో అనుకున్నంత మేరకు ఫలితాలను సాధించలేకపోయారు. సమకాలీన అంశాలపై చర్చించి పార్టీ దృక్పథాన్ని రూపొందించేందుకు నియమితులయిన సభ్యులు కూడా పార్టీకి నిర్దిష్టమైన సైద్ధాంతిక స్వరూపాన్ని రూపొందించలేకపోయారు. సంస్థాగతంగా చేయాల్సిన పెను మార్పులను సూచించేందుకు గతంలో ఆంటోనీ, అహ్మద్ పటేల్ లాంటి వారితో కమిటీలు వేసినా వారి సూచనలు అమలు అయిన దాఖలాలు లేవు. ఏ పెను మార్పులూ జరగలేదు. నిరంతర ఉద్యమాలు చేసే విషయంపై నిర్ణయించేందుకు, పార్టీని ఆధునికీకరించేందుకు ఏర్పర్చిన కమిటీలు ఏం చెప్పాయో కూడా ఎవరికీ తెలియదు. బహుశా ఈ కమిటీ నివేదికలు ఏఐసీసీ లైబ్రరీలో దుమ్ము కొట్టుకుపోతూ ఉంటాయి! ఇక ‘కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలి’ అని ఖర్గే అన్నప్పటికీ ఆ నిర్ణయాలు ఎప్పుడు తీసుకుంటారో చెప్పలేము. ముఠాతత్వం, కుమ్ములాటలు కూడా ఒక కారణమని చెప్పిన ఖర్గే పార్టీ అధ్యక్ష స్థానంలో ఉండి వాటిని ఎందుకు అరికట్టలేకపోతున్నారో ఎవరు చెప్పగలరు? ‘ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలే అన్ని నిర్ణయాలు తీసుకున్నాయి’ అని ఖర్గే సమావేశంలో వాపోవడం గమనార్హం.


కాంగ్రెస్‌లో యథాతథ పరిస్థితిని ఆకాంక్షించేవారే ఎక్కువ ఉండడం, సమూలంగా మార్పులు చేసేందుకు పార్టీ అగ్రనేతలు సాహసించకపోవడం వల్ల ఆ పార్టీ బీజేపీని ఢీకొనగల నవనవోన్మేషమైన శక్తిగా ఆవిర్భవించగలదన్న నమ్మకాలు కలగడం లేదు. అందుకు ప్రధాన కారణం వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న పార్టీలో తుక్కూ, తుప్పూ బాగా పేరుకుపోయి ఉండడం. కార్పొరేటర్ స్థానాన్ని కూడా గెలవలేని ఏడు పదులు దాటిన సీనియర్ నేతలు తమ గుర్తింపు కోసం తరుచూ విలేఖరుల సమావేశాలు నిర్వహించడం, ఎవరూ పట్టించుకోకపోయినా తమ అమూల్యమైన అభిప్రాయాలు వ్యక్తం చేయడం కాంగ్రెస్‌లోనే ఎక్కువ కనపడుతుంది. రాహుల్ గాంధీతో పాటు కొందరు నేతలు జనంలోకి వెళుతూ, ప్రజా సమస్యలపై మాట్లాడుతూ, కార్మికులు, యువతతో సంభాషిస్తూ కనపడుతున్నారు. కానీ ఎంతో కష్టపడి కాంగ్రెస్ తమకు అనుకూల వాతావరణాన్ని సృష్టించుకున్నా ఆ వాతావరణం ఓట్లుగా మారేందుకు తగిన పరిస్థితులను కల్పించుకోలేకపోతోంది. ‘సానుకూల వాతావరణం ఉంటే చాలదు దాని వల్ల విజయాలు రావు. అను దినమూ ఇరవై నాలుగు గంటలూ పనిచేయాలి’ అని ఖర్గే వర్కింగ్ కమిటీ సమావేశంలో సరిగానే అన్నారు.

అంతే కాదు, ఎన్నికలు లేనప్పుడు కాంగ్రెస్ పార్టీ యంత్రాంగం చాలా స్తబ్దంగా ఉంటుంది. ఆ సమయాన్ని నిర్మాణాత్మకంగా ఉపయోగించుకున్న దాఖలాలు లేవు. ఎన్నికలప్పుడే కాంగ్రెస్‌ నేతలు జనంలో కనపడతారు. ఎన్నికల ప్రక్రియలో అవకతవకలు జరిగాయన్న విషయంలో కాంగ్రెస్ చూపే అధారాలను ప్రజలు విశ్వసించేలా చేయనంతవరకూ ఈవీఎంలపై ఎన్ని ఆరోపణలు చేసినా ఫలితం ఉండదు. పోలింగ్‌ బూత్‌ స్థాయి ఓటర్ల జాబితాపై దృష్టి సారించాలి అని ఖర్గే ఆలస్యంగానైనా గ్రహించారు. బీజేపీ సిద్ధాంతం మంచిదా కాదా అన్నది వేరే చర్చ. ఆ పార్టీ తన సొంత ఓటు బ్యాంకు నిర్మించుకుంటూ, పెంచుకుంటూ పోతోంది. కాంగ్రెస్ పూర్తిగా బీజేపీ వ్యతిరేక ఓటు బ్యాంకుపై ఆధారపడుతోంది. తన ఓటు బ్యాంకును తానే స్వంతంగా నిర్మించుకోనంతవరకూ కాంగ్రెస్‌కు భవిష్యత్తు అగమ్యగోచరంగానే ఉంటుంది

ఎ. కృష్ణారావు

(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)

Updated Date - Dec 04 , 2024 | 03:37 AM